30, డిసెంబర్ 2012, ఆదివారం

దుర్మార్గాలకు వ్యతిరేకంగా యువతను సంఘటితం చేసిన "నిర్భయ" మరణం


పాశవికంగా అ(హ)త్యాచారానికి గురైన నిర్భయ మృతి దేశాన్ని కలవరపెట్టినప్పటికి,ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా  
యువతను ఐక్యంగానిలపడంలో దోహదపడింది. నిందితులను ఉరి తీయాలని చాలా మంది అభిప్రాయం .    దానికి 
బదులుగా,వారు బతికుండగానే వారి శరీర అవయవాలు సేకరించి అవసరమైన వారికి అంద చేయడం ద్వారా ఆ దోషులు మృతి చెందితే, వారి తప్పులకు కొంత వరకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. 

 

26, డిసెంబర్ 2012, బుధవారం

రాష్ట్రంలో అసమర్ధ పాలన

రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తున్దనేది సామెత. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత (ఈయన నిజాయితీ పరుడు ఔనో కాదో అన్న చర్చ వదిలేసి - కేవలం ఆయన సమర్ధత మీద మాత్రమె వ్యాఖ్యానిద్దాము) చిన్న- చితక ; ముసలి-ముతక లీడర్లు తెరమీదకు వచ్చి రెచ్చిపోతున్నారు. ఒక ప్రాంతం వాడు రైలు పట్టాలు పీకి మెళ్ళో వేసుకుంటా అంటాడు, ఇంకొకడు భాగో జాగో , పేడ -పెంట అని అంటాడు.  రాజశేఖర రెడ్డి జీవించి వుండగా కలుగులో  దూరిన వాళ్ళు ఇప్పుడు
హీరోలుగా  వెలుగొందుతున్నారు.      భావ స్వాతంత్ర్యం
హద్దులు దాటుతున్నది.  ప్రాంతాలని విడదీయటం ఒకింత సులభం కానీ మనుషులను విడదీసి తద్వారా  ప్రాంతాలని విడదీయాలి అని అనుకోవడం జరగని పని.
 
 
సి పి ఐ నారాయణ గారిని ఆంద్ర ప్రదేశ్ లో ఎవ్వరు అడ్డుకోరు, అలాగే మన వెంకయ్య నాయుడిని, దత్తన్న ని, కిషన్ రెడ్డి గారిని కూడా. అదే రకమైన భావ ప్రకటనా స్వేచ్చ తెలంగాణలో ఎందుకు లేదు. ఉదాహరణకి జయ ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ, పరకాల ప్రభాకర్ మొదలైన వారు సమైక్య వాదాన్ని వినిపిస్తుంటే వాళ్ళని వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి? దాడులు ప్రతి దాడులతో నష్టం ఎవరికీ? రాజకీయ నాయకులకా? వాళ్ళచే రెచ్చకొట్టబడిన అమాయకులకా? జగన్ వరంగల్లు వస్తే యువకులను రెచ్చగొట్టి రాళ్ళు వేయించారు. జగన్ కు కనీసం జ్వరం కూడా రాలేదు. కానీ ఆ సంఘటనలో దెబ్బలు తిన్న అమాయకులు ఎందఱో వున్నారు. క చ రా కుటుంబానికి కూడా జ్వరం రాలేదు. నిజంగా విడిపోదలచుకుంటే, క చ రా గారు మిగిలిన కుటుంబ సభ్యులు కనీసం 3 నెలల పాటు తీర సీమంధ్రలో పర్యటించి, ప్రజలను సమాయత్తం చెయ్యాలి. ఎవ్వరు ఆయన్ని అడ్డుకోరు.
విడిపోదాము అనుకున్న సముదాయం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి అక్కడి ప్రజల మద్దతు కోరవచ్చు. తద్వారా ఆయన అనుకున్న లక్ష్యం చేరడానికి ఏంతో కాలం పట్టదు. అవసరం అనుకుంటే, ఒక మెట్టు దిగి ఏకాభిప్రాయం లేని విషయాల మీద మేధో మధనం జరిపి పరిష్కారం కనుగొనడం ద్వారా విజయం సాధించవచ్చు. అంతే గానీ రైలు పట్టాల క్లిప్పులు తీయడం ద్వారా, జాషువా, అన్నమయ్య మొదలైన వారి విగ్రహాలను పడగొట్టడం ద్వారా, కేబుళ్ళు తగల పెట్టడం ద్వారా, ఒకర్ని ఒకరు తిట్టడం ద్వారా ప్రయోజనం శూన్యం.

 
 
నిత్య అశాంతితో కొంత కాలానికి ప్రజలు అలవాటు పడి, రాజకీయ నాయకులను పట్టించుకోని రోజు వస్తుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు అన్ని ప్రాంతాల వారు, నిజాయితీ పరుడు కాకపోయినా ఫరవా లేదు, సమర్ధుడైన నాయకుడి కోసం చూస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్తితి. అయినా తప్పేటట్లు లేదు.
 

 

24, డిసెంబర్ 2012, సోమవారం

ఆంధ్రుల ముద్దు బిడ్డ కీ||శే పి వి నరసింహరావు గారు

బహు భాషా కోవిదుడు, రచయిత, స్థితప్రజ్గ్నడు, భారతదేశాన్ని అగ్ర దేశాల సరసన నిలబెట్టిన మన పి వి గారు స్వర్గస్తులై నిన్నటికి 8 సంవత్సరాలు నిండింది. ఒక్క దినపత్రిక కూడా ఆయనని గుర్తుపెట్టుకోలేదు. చాలా బాధాకరం. ఇవ్వాళ మనం అనుభవిస్తున్న ఎన్నో సదుపాయాలకు  ఆయన శ్రీకారం చుట్టిన ఆర్ధిక సంస్కరణలే కారణం.
 
 
నంద్యాల ప్రజలు ఒక తెలంగాణా వ్యక్తిని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రికార్డు స్థాయి ఆధిక్యంతో పార్లమెంటుకు పంపి తమ ప్రేమను చాటుకున్నారు. పార్టీ పరంగా తెలుగు దేశం కాంగ్రెస్కు వ్యతిరేకమైనా, యెన్ టి ఆర్ గారు తమ అభ్యర్ధిని నిలబెట్టకుండా సాటి తెలుగువాడి ఉన్నతిని కాంక్షించిన ఘనత దక్కించుకున్నారు అన్నగారు. కానీ మన విభజన వాదులు, భా జ పా అభ్యర్ధిగా లక్ష్మణ్ గారిని నిలబెట్టి పరువు తీసారు.
 
 
తెలంగాణాకు చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది  ముఖ్యమంత్రులైనారు అని గొంతు చించుకొనే వాళ్లకి సమాధానంగా నంద్యాల ప్రజలు ఏకంగా ప్రధాన మంత్రి అభ్యర్ధినే ఎన్నుకున్నారు. మీరు హన్మకొండలో ఓడించిన ఓరుగల్లు ముద్దు బిడ్డని గుండెల్లో పెట్టుకున్నారు.   5 లక్షల ఓట్ల ఆధిక్యంతో "గిన్నీసు రికార్డులలో" నిలిచిన పెద్దమనిషి మరణాంతరం ఆయన సేవ చేసిన పార్టీ వారే చిన్న చూపు చూశారు. సమైక్య - వేర్పాటు హోరులో, భిన్నత్వంలో ఏకత్వం చాటిచెప్పిన పి వి గారిని స్మరించుకోవడం మరిచాము.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష - ఇది ఉస్మానియా ఉపాధ్యాయుల పరిస్తితి


ఉస్మానియా యూనివర్సిటి లో కొందరు విద్యార్ధులు ఉపాధ్యాయుల్ని దండిన్చినట్లుగా వార్తలు వచ్చాయి. దండం దశగుణం భవేత్ అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయ్. డిగ్రీ చదువుకునే యువకుల లో సహజంగానే ఉడుకు రక్తం వుంటిది. ఆ ఉద్రేకాలని చల్లార్చి సక్రమమైన దారిలో పెట్టవలసిన బాధ్యత ఉపాధ్యులది. అలాంటి మహా మహోపాధ్యాలే చదువు చెప్పడం పక్కన పెట్టి పిల్లలను రెచ్చగొట్టే పనిలో (పిల్లలంటే ఆయన సొంత పిల్లలని బ్రమ పడేరు, నేను చెప్పేది ఊళ్ళో వాళ్ళ పిల్లగురించి - ఆయన పిల్లలు అమెరికాలో హాయిగా ఉన్నారు) నిమగ్నమై ఉన్నారు. కొందరు ఉపాధ్యాయులు పిల్లలని రెచ్చగొట్టి వాళ్ళు పోలీసులపై రాళ్ళు వేస్తుంటే రాళ్ళను అందించి (అదేదో తాజ్మాహాలు కట్టడానికి రాల్లందించిన కూలీల్లాగా) , సహకరిస్తే ఏమవుతుంది? ఇవే కాకుండా మన పరీక్షా పత్రాలు మన ప్రాంతం వాళ్ళే దిద్దాలి. అప్పుడే న్యాయం జరిగేది, మన ప్రాంతం ఉద్యోగులపైకి అవినీతి అధికారుల దాడి ఎక్కువైంది, అది ఆపాలి, ఇవండీ భావి భారత పౌరులకి మనమిచ్చే నినాదాలు.
 
విద్యార్ధులు, ఉపాధ్యాలు చక్కగా స్నేహితుల్లాగా అరె తురె అనుకుంటూ కలిసి మెలిసి ఉద్యమాల్లో అలయ్ భలయ్ చేసుకుంటూ విప్లవ గీతాలు పాడుకుంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఎంపీలు ఎం ఎల్ ఎ లు కలిసి ఉపన్యాసాలు ఇస్తుంటే ఊరుకున్న యూనివర్సిటి అధికారులు ఇప్పుడేమీ చెయ్యగలరు - చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా. మరి మన ఒస్మానియా విద్యార్ధులు - కుర్రాళ్ళు, ఉడుకు రక్తం సరదాగా పంతుళ్ళని ఒక మొట్టికాయ్ వేస్తారు దాన్ని కూడా తప్పంటే ఎలా ? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా (అమ్మయ్య టైటిల్కి కూడా న్యాయం జరిగింది).

21, డిసెంబర్ 2012, శుక్రవారం

గుజరాత్లో మోడీ - హిమాచల్లో కాంగ్రెస్ గెలుపుఅదేంటి గుజరాత్ లో భా జ పా గెలుపు అని రాయలేదు అంటారా! అది అంతే, మోడీ లేని గుజరాత్ ని ఊహించడం కష్టం. పేరుకి మాత్రమె కొన్ని  జాతీయ పార్టీలు కాని రాష్ట్రాలలో కేవలం నాయకుల పేరులే పార్టీ పేరుకన్నా ఎక్కువ ఖ్యాతి తెస్తుంది ఉదాహరణకి - ఆంద్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్, కర్ణాటకలో యడ్యూరప్ప, గుజరాత్లో మోడీ,  బెంగాల్ లో బసు ఈ కోవలోకే వస్తారు   ఈ కారణంగానే, ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ మరణం తరువాత కాంగ్రెస్, బసు మరణం తరువాత కమునిస్టులు కోలుకోలేని దెబ్బ తిన్నారు.   మోడీ స్థానంలో ఎవరు భా జ పా అభ్యర్ది ఐనా గుజరాత్ లో ఫలితాలు తారు మారుగా వుంటాయి.  యడ్యూరప్ప లేని కర్నాటక భా జ పా పరిస్తితి అయోమయంలో 
పడింది. ఆయన ఎలాంటివాడు అనే చర్చను పక్కనపెడితే, ఆయనలా పార్టీని
సమర్ధవంతంగా నడిపే నాయకుడు అక్కడ లేడు. 
   
 
మన దురదృష్టం -
 
ప్రస్తుత మన రాజకీయాలలో  సమర్ధుడైనవాడు నిజాయితీ కలవాడు కాదు,  నిజాయతీ  కలవాడు సమర్ధుడు కాడు.   సమర్ధుడు మరియు నిజాయితీ 
కలవాడు రాజకీయాలలోకి రావాలని ఆశిద్దాం.        

20, డిసెంబర్ 2012, గురువారం

బ్లేడ్ బాబ్జీ రానాయణ - ఒక ఫాక్షన్ జీరో కధ

హెచ్చరిక : ఢిల్లీ విజ్ఞాన్ భవన్ పరిసర ప్రాంతాలలో షుమారు 60 సంవత్సరాల యువకుడు బ్లేడ్ ఝుళిపిస్తూ రెండు నాలుకలు వున్న వాళ్లకి ఒక నాలుక కోసి కాకులకు గద్దలకు (కోళ్ళకు మాత్రం కాదు) వేస్తునట్లుగా సమాచారం. కాబట్టి నగర పౌరులు అలాంటి అనుమానస్పద వ్యక్తీ కనిపిస్తే వెంటనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాము.
 
ఆనవాళ్ళు: ఎప్పుడు ఎర్ర చొక్కా వేసుకొని ఉంటాడు. నోరు అదుపులో వుండదు. యమ ధర్మరాజు చేతిలో గద, యమ పాశం లాగా ఈయన చేతిలో బ్లేడ్, ఉరితాడు ఎప్పుడు వుంటుంది. ఎక్కువగా చికెన్ దుకాణాల దగ్గర మాటు వేసే అవకాశం వుంది.
 
విశాలాంధ్ర (పేరు చూసి మోసపోకండి అది వాస్తవానికి విభాజనాంధ్ర ) దిన పత్రిక వారన్నా రానాయణ పేరు, ఫోటో వేస్తారో లేదో కానీ మిగిలిన అన్ని దిన పత్రికలలో ఈయన గారి పేరు, ఫోటో ఒక సంచలనాత్మక టైటిల్ ప్రతి నిత్యం తప్పని సరి. అసలే ధిల్లీ చలికి ఒకటికి రెండు రజాయిలు కప్పుకున్నా తట్టుకోలేక అక్కడి స్థానికులే చస్తుంటే, మన కామ్రేడ్ మాత్రం బ్లేడ్ పట్టుకొని ధిల్లీ వీధుల్లో స్వైర విహారం చేస్తా అంటున్నాడు. డబ్బులు కట్టనోడు ముందుగానే పడవెక్కి దర్జాగా కూర్చుంటాడు అనేది నానుడి. ఒక మండల ప్రెసిడెంటుగా కూడా సొంతంగా గెలవడానికి దిక్కులేదు కానీ, బ్లేడ్ పట్టుకొని అఖిల పక్షానికి వెళ్లి నాలుకలు కోసేస్తాడట. ఎప్పుడూ తిన్నగా మాట్లాడాడు. అన్ని తింగర మాటలే.
పాపం ఈయన పాపులారిటీ తెలియని తెలంగాణా వాళ్ళు "విభజనకు సై అన్న రానాయణ, తీర సీమంద్రాలలో తిరుగుతున్నా అక్కడి వాళ్ళు అడ్డుకోరు" కాబట్టి అక్కడి ప్రజలందరూ విభజనకి సై అంటారు అని సంబర పడి పోతారు. అసలు ఈయనకి సొంత మండలంలోనే అంత సీన్ లేదు, తగుదునమ్మా అని మొత్తం రాష్ట్రాని కే అంట కడతారు. తీర సీమాన్ధ్రలో ఇలాంటి కాయితం పులి ఇంకొకటుంది, ఆయనను కూడా ఎవరు పట్టించుకోరు. కేవలం మైకుల ముందు లుంగీ కట్టుకొని నిలబడి ప్రాస నియమాలు మాత్రమె పాటిస్తాడు, అసలు సరుకు తక్కువ. అక్కడ చెల్లని వాళ్ళందరూ తెలంగాణలో హీరోలైపోయారు విచిత్రంగా! మన రానాయణ ఆంధ్రుల నా అభిమాన "హాస్య"  నటుడు, ఆంజనేయస్వామి భక్తుడు ఐన నక్సలైటు రానాయణ మూర్తి కలిసి తిన్నగా రోడ్డు వెంట అమీరుపేటలో పగలు పూట నడిచినా ఎవరు పట్టించుకోరు, ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు ?కాకపొతే, ఎప్పుడూ పత్రికలలో బొమ్మల పెట్టలో కనపడాలనే ఒక తుత్తి!

19, డిసెంబర్ 2012, బుధవారం

ఓటు బదిలీ పధకాలు

 
ఒకప్పుడు తమిళనాడులో ఎం జి ఆర్ మొదలు పెట్టిన రూపాయికి కిలో బియ్యం పధకం, తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు రకరకాల రూపాంతరాలు చెంది పేద వాడిని సోమరిపోతుగా, తెలివి తేటలని వుపయోగిన్చుకోనివ్వకుండా తయారు చేస్తున్నై. ఎందుకంటే సగటు మనిషి తెలివి తేటలు పెరిగితే, వాళ్లకి , రాజకీయ నాయకుల నిజ స్వరూపం తెలుస్తుంది కనుక. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ పధకానికి కొనసాగింపుగా, నెల వారి సరుకులతో పాటు, టి వి, కేబుల్ కనేక్షున్ కూడా కల్పించింది. అంటే, ఓ మనిషీ, నువ్వు ఆలోచించడం కష్ట పడడం మానేయ్. మేము ఇచ్చే పప్పు, ఉప్పు, సాంబారు పొడి, బియ్యం తింటూ, టి వి లో 24 గంటలు వార్తలు, సినిమాలు, కుళ్ళు జోకులు చూస్తూ మేం కట్టిచ్చిన 50 గజాల స్థలంలో వుంటూ మేము చెప్పినప్ప్డు చెప్పిన గుర్తుకు ఓటెయ్యి అని అర్ధం.అంతేగానీ,పేదవాడిని చైతన్య పరచే వాళ్లకు ఏమిచేస్తే భవిష్యత్లో ఒకరిపై ఆధారపడకుండా జీవిస్తారు అని ఆలోచించే వారు రాజకీయాల్లో లేరు. ఉదాహరణకి వరి ధాన్యం పండించాలంటే భూమి కావాలి, పనిముట్లు కావాలి, ఎరువులు కావాలి, గిడ్డంగులు కావలి, సరిఐన కిట్టుబాటు ధర కావాలి. ఒక పార్టీ నాయకుడు నేను వడ్లు కిలో రూపాయికి ఇస్తానంటాడు, ఇంకొక పార్టీ వాడు వాటిని మిల్లు ఆడించి అదే ధరకి బియ్యం ఇస్తానంటాడు. ఇంకొకాయన, ఇంకొక అడుగు ముందుకేసి నేనే వండి పెట్టి మిమ్మల్ని ఓదారుస్తూ గోరుముద్దలు తినిపిస్తా అంటాడు ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ వాళ్ళు, మీ అకౌంట్ నంబరు ఇవ్వండి మీకు డబ్బులు పంపిస్తాము. బియ్యం ఇస్తే మీరు అన్నం మాత్రం మాత్రమె తినచ్చు కాని డబ్బులిస్తే ఎంచక్కా దానితోబాటు మందు కూడా కొనుక్కోవచ్చు అని కొత్త ఓట్ల బదిలీ పధకం ప్రవేశ పెట్టింది. ఈ మధ్యనే క చ రా గారు మాట్లాడుతూ, మనది మనకు వచ్చినతరువాత 400 గజాల స్థాలమిస్తా ఫాం హౌసు లాంటి ఇల్లు కట్టుకొని గులాబి పూల మొక్కలు  కూడా పెట్టుకోండి అని సెలవిచ్చారు.
 

పేద వాడు కష్ట పడి పనిచేయడానికి సిద్ధంగా వున్నాడు. వాళ్లకు కావలసింది గౌరవ ప్రదమైన జీవితం, ఒకళ్ళ మీద ఆధార పడటం కాదు. భూమి ఇవ్వండి, నీరు ఇవ్వండి, సరైన కిట్టుబాటు ధర ఇవ్వండి చాలు, మీరిచ్చే ముష్టి వాళ్లకు అవసరం లేదు. వాళ్ళ పిల్లలకు ఉన్నతమైన విద్య, చక్కటి వసతి, సుచికరమైన భోజనం ఇవ్వండి చాలు. కాకపొతే, వాళ్ళు విద్యావంతులైతే మీకు మాత్రం ఓట్లు వెయ్యరు, వాళ్ళే పాలకులు అవుతారు, దానికి మీరు సిద్ధమేనా?

18, డిసెంబర్ 2012, మంగళవారం

తెలంగాణలో పట్టు కోల్పోతున్న క చ రా?

ఇంద్రకరణ్ రెడ్డి, జిట్టా మొదలైన తెలంగాణా నాయకుల చేరిక ద్వారా, వై యస్ ఆర్ సి పి తెలంగాణాలో పట్టు బిగిస్తున్నది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ తరహా చేరికలు మరింత ఎక్కువై, తె రా స - తె దే పా లు రెండో స్థానానికి పోటీ పడినా ఆశ్చర్యం లేదు. బహుశా రాబోయే కొద్ది నెలల్లో కుల తత్త్వం, ప్రాంతీయ తత్వాన్ని పూర్తిగా అదుపులో ఉంచగలిగే స్థితికి చేరుకోవచ్చు. ఒక పక్క చంద్ర బాబు బూట్లు అరిగేలా తిరుగుతుంటే మరోపక్క జగన్ తల్లి గారు స్వపక్షం, విపక్షం, బంతిలో బలపక్షం అనే తేడా లేకుండా ఎం ఎల్ ఏ లకు మాజీ లకు తమ పార్టీ తీర్ధం ఇచ్చేస్తున్నారు . అదును కోసం ఎదురు చూస్తున్న నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల ప్రముఖ కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా, ఉప ప్రాంతీయ పార్టీకి అరికాళ్ళ కింద భూమి కదిలే అవకాశాలు మెండుగా వున్నాయి.
 
ప్రస్తుతం తె రాస పరిస్తితి చూస్తె ఓనిడా టి వి వారి వ్యాపార ప్రకటన "ఓనర్సు ప్రైడ్ నైబర్స్ ఎన్వీ" గుర్తు రాక మానదు. ఎంతసేపటికి, ఆంద్ర నాయకులు వస్తే రాళ్ళేయండి, చొక్కా పట్టుకోండి అని ఉద్యానవనాలలో సేద తీరుతూ తన సొంత బాకా ద్వారా చెప్పడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. పైపెచ్చు వాళ్ళని ఉద్రేక పరచి కోర్టుల చుట్టూ తిప్పించడం తప్ప. ఇక తమపార్టీ ప్రచారమంటారా -ఆ నలుగురూఅని రాజేంద్ర ప్రసాద్ సినిమా పాట పాడుకున్నట్లు - అబ్బ కొడుకు, కూతురు మరియు మేనల్లుడు మాత్రమె క్లోస్ అప్ షాట్లో వుంటారు, మిగిలిన వాళ్ళందరూ సినిమాలో ఒక క్షణం మాత్రమే కనిపించే పోస్ట్ మాన్ పాత్రధారులు. ఆడినా, పాడినా, తిట్టినా "ఆ నలుగురికి" మాత్రమె హక్కు. మేము ప్రజలలోకి వెళ్ళము , మేము చెప్పిన మాట వినని వాళ్ళేవరైనా వస్తే అడ్డుకొంటాము అనే ఒకే ఒక స్లోగన్ ద్వారా ఎన్ని రోజులు నెట్టుకొని రాగలుగుతారో కాలమే నిర్ణయిస్తుంది.

17, డిసెంబర్ 2012, సోమవారం

కేసులున్నది ఎత్తివేయడానికే కదా!

 
అప్పుడెప్పుడో అక్కినేని గారి పాట విన్నాం. "ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అని దాని సారంశం. 
 

న్యాయ విద్య అత్యంత పవిత్రమైనది. మన రాజ్యంగా నిర్మాత డా|| అంబేడ్కర్ ఒక న్యాయ శాస్త్ర కోవిదుడు. అలాగే మన జాతి పిత మహాత్మా గాంధి దగ్గరనుంచి, స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రు, ప్రధమ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు, భూర్గుల వారు, ఆ తరువాత మన రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఎంతో  మంది మరియు మన ప్రస్తుత ముఖ్య మంత్రి కూడా న్యాయ శాస్త్ర పట్టభాద్రుడే . ఇలాంటి పవిత్రమైన వృత్తిలో వున్న న్యాయ వాదులు, విచక్షణ మరిచి కోర్టులలో గలభా సృష్టిస్తూ, విధులను అడ్డుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో "తొండ ముదిరి ఊసరవెల్లైన" ఒక నాయకుడి హత్య తరువాత జరిగిన హింసాకాండలో దోషులపై కేసులు ఎత్తివేయడం దగ్గరనుంచి మొదైలైన ఈ ప్రహసనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పడు హత్యా నేరంలో జైలులో శిక్షను ఎదుర్కొంటున్న గౌరు చరిత భర్తను విడుదుల చేసే వరకు చట్టంలోని అవకాశాలను అధికార బలంతో ఉపయోగించుకోవటం రాజకీయ పార్టీలకు పరిపాటైంది. ఇలాంటి చర్యలకు కొనసాగింపుగా ఈ మధ్య టోకుగా కేసులను ఎత్తివేయడం ఒక రివాజైపోయింది. బస్సులు తగలపెట్టేవాళ్ళు, విధి నిర్వహణలో వున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించే శాసన సభ సభ్యులు, రైళ్ళను ఆపే వాళ్ళు, రైళ్ళ పట్టాల క్లిప్పులను తీసేవాళ్ళు, దొమ్మీలకు దిగే వాళ్ళు, మత కలహాలను ప్రోత్సహించే వాళ్లకి బొత్తిగా భయం లేకుండా పోతున్నది. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్లైనా చట్టం ముందు సమానమే కదా? న్యాయవాదులకు ఈ విషయంలో ప్రత్యేకత ఎందుకు చూపించాలి?  చట్టం  గురించి సామన్యుడికన్నా వారికే ఎక్కువ తెలిసుండాలి కదా? 
 
ఎన్ని ఉద్యమాలైనా చేయవచ్చు కాని ప్రజల ఆస్తులకు, భద్రతకు ఏ మాత్రం నష్టం కలగ కూడదు. విచిత్రం ఏంటంటే, ఆ పార్టీ ఈ పార్టీ -  ఆ ప్రాంతం ఈ ప్రాంతం - అని బేధం లేకుండా కేసుల ఎత్తివేత విషయంలో అందరూ ఒకటౌవుతారు.
 
ఇలా కేసులను ఎత్తివేసే విధానాన్ని మార్చి ఈ అంశం కేవలం కోర్టుపరిధిలోకి తేవడం  జాతికి శ్రేయస్కరం.

13, డిసెంబర్ 2012, గురువారం

హిందూ దేవుళ్ళ రూపాల దురుపయోగం

 
 మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినోడు కూడా అదే అంటాడు అనేది సామెత. అందులో ఆశ్చర్యం లేదు. విదేశీయులు చెప్పులపై, లోదుస్తులపై హిందూ దేవుళ్ళ చిత్రాలను ముద్రించారని తెలిసి మనం తెగ బాధపడి పోయాము. ఖుష్బూ అనేవీర వనిత తన చీరపై రకరకాల దేవుడి బొమ్మలని ముద్రించికుని ప్రదర్శించింది. అరవ వాళ్ళు, ఈ అహంకారిని దేవతగా కొలుస్తూ ఆరాధిస్తారు. ఆవిడ నటనకి అంగాంగ ప్రదర్సానకి ముఘులైన అభిమానులు ఆవిడగారికి తమిళనాడులో గుడి కూడా కట్టించి ధూప దీప నైవేద్యాలతో నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. మరి, నిన్న హేమ మాలిని గారి అమ్మాయి సాక్షాతూ కలియుగ దైవం  సన్నిధిలో   తను ఎంతో భక్తితో వీపుపై వేయించుకున్న"గాయత్రీ మంత్రం" పచ్చబొట్టు ప్రదర్శించింది.
 
పచ్చబొట్టు వీపు మీద వేయించుకున్న ఉద్దేశం ఫది మందికి కనపడాలనే కదా? ఆ తలంపులో భాగంగా ఆవిడ పెద్ద పెద్ద కిటికీలున్న దుస్తులు ధరించాల్సిన అవసరం వుంది. ఈ విధంగా పాపం స్వామీ కార్యం స్వకార్యం నేరవేరినట్లయింది. ఎవరైనా హిందూ సంఘాలు నిరసన తెలియచేస్తే, అక్కడనుంచి మొదలవుతారు కుహనా లౌకిక వాదులు, అతి ప్రజాస్వామిక వాదులు వ్యక్తి స్వేచ్ఛకు అడ్డం వస్తున్నారని. హిందూ దేవుళ్ళ రూపాలని అవమానించే ఇలాంటి సౌందర్య ప్రదర్సనలని నిషేదించాల్సిన అవసరం ఎంతైనా వుంది. 
 
    
చరిత్రలో హిందువులు పొరుగు దేశాలమీద దండయాత్ర చేసినట్లుగాని, వాళ్ళ మత చిహ్నాలు కూల్చినట్లు గాని లేదు. ఎందుకంటే మనకు పరమత సహనం ఎక్కువ. కానీ మన మతస్తులే అడ్డూ ఆపు లేకుండా హిందూ మతం పరువు ప్రతిష్టలని బజారుకు ఈడుస్తుంటే  వీళ్ళని ఏమనాలి?? ఆలోచించండి.

12, డిసెంబర్ 2012, బుధవారం

హావేరి కావేరి నడుమ భా జ పా

 
అప్పుడెప్పుడో వచ్చిన మన బాలకృష్ణ గారి సినిమా టైటిల్ "నారీ నారీ నడుమ మురారీ" చూసి ఉత్తేజితుడనై  ఈ శీర్షికకు ఆ పేరు పెట్టాను.
 
ఈ మధ్య యడ్యూరప్ప గారు హావేరి అనే పట్టణంలో విజయవంతంగా తన సొంత పార్టీ కర్ణాటక జనత పక్ష (hereinafter called as క జ ప) అనే కుంపటి వెలిగించేసారు. ఈ కుంపటి సెగ భా జ పా కర్నాటక కొంప "కావేరి" అవడానికి సరిగ్గా సరిపోతుంది. అసలే కావేరి నదీ జలాల విడుదుల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానామ్ వారి మొట్టికాయలు, జయలలిత గారి చీత్కారాలు, స్థానికంగా వుండే రైతు, కన్నడ సంఘాల ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ షెట్టర్ గారికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు యడ్యూరప్ప గారు.   కర్ణాటకలో ప్రస్తుతంవున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో యడ్యూరప్ప నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదుగుతారు అని చెప్పడంలో సందేహం లేదు. తమాషా ఏంటంటే, తమిళ్ నాడు భా జ పా వారు కావేరి నీటిని విడుదల చెయ్యాలని ధర్నా చేస్తుంటే, కర్నాటక భా జ పా వారు నీళ్ళు ఇవ్వకూడదని గొడవ చేస్తున్నారు. ఎంతైనా జాతీయ పార్టీ కదా, ఆ మాత్రం విభేదాలు ఉండడంలో తప్పు లేదు.
 
భా జ పా జాతీయ అధ్యక్షుల వారు   వేల కోట్లు మెక్కారని దేశమంతా కోడై కూస్తుంటే అందులో ఫదోవంతు ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పని మాత్రం పదవినుంచి తొలగించటం ఏమి సబబు చెప్పండి. రెడ్డీ బ్రదర్స్ బాగా బతికిన రోజుల్లో "కర్ణాటక ఆడపడచు" క్రమం తప్పకుండా దేశ రాజధాని నుంచి అన్ని పండుగలకు పబ్బాలకు వచ్చేవారు. వీరు జైలుకు వెళ్ళాక, అచ్చం జగన్ గారి లానే ఆవిడకూడా నాకు బళ్ళారి  ఎక్కడో తెలీదు అనేశారు. అందుకే అంటారు బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి అని. పాడి కుండ లాంటి రెడ్డి బ్రదర్స్, మాస్ లీడర్ లాంటి యడ్డి గారు లేకుండా, కర్ణాటకలో భా జ పా కి "అశుభం" కార్డు త్వరలో పడబోతోంది.


 

11, డిసెంబర్ 2012, మంగళవారం

కావూరి స్వరం మారింది !నిన్న తిరుపతిలో జరిగిన సభలో కావూరి సాంబశివ రావు గారు కాస్త స్వరం పెంచి కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. బహుశా, వెంకన్న పాదాల సాక్షిగా ఆయన అడుగులు ప్రాంతీయ పార్టీల వైపు పడుతున్నై అన్నది నిష్ఠుర సత్యం? ఇదే అదునుగా ఆయన సమైక్య వాదాన్ని పదునుగా వినిపించారు. 
 
పందులులా మెక్కవచ్చనే తెలంగాణా నాయకులు విభజన కోరుతున్నరన్నారు. పదవి వచ్చిన తరువాత చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని ఏమి చేసారో గుర్తు చేసారు. పదవి వచ్చిన తరువాత అద్వానీ గారు ఆలె నరేందర్ గారికి రాసిన ఉత్తరాన్ని ఉటంకించారు. అవునండి కావూరి గారు, మొన్న మీకు మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లయితే మీరు తిరుపతిలో ఈ సభ పెట్టేవారా? పోనీలెండి సారూ, ఎవరు తింటే ఏముంది, ఎటొచ్చి ప్రజల సొమ్మే కదా? ఇంతకీ నేను చెప్పోచ్చేదేంటంటే - అందరు రాజకీయ నాయకులు అవకాశవాదులే అన్న నగ్న సత్యం. ప్రాంతాలను బట్టి బుద్ధులు వుండవు. దీని పర్యవసానంగా, ఆయన పాల్గొన్న ఈ సభతో, ఇరు ప్రాంతాల పత్రికలకు, ఛానళ్ళకు మంచి కాలక్షేపం. బహుశా రేపటికల్లా నమస్తే తెలంగాణా సహాయ సహకారాలతో, ఈ వాక్యాన్ని మార్చేసి తెలంగాణా వాళ్ళని పందులతో పోల్చిన "ఖండ" కావూరి అనే శీర్షికతో వార్త వస్తుంది. అంతే, కొంతమంది కష్టపడి చదువుకొనే విద్యార్ధులు అనబడే ఉద్యమకారులు ఆంద్ర న్యాయవాదుల వలన మా ప్రాక్టీసుకి అన్యాయం జరిగింది అని ఆక్రోశించే తెలంగాణా న్యాయవాదులు కావూరి ఇంటి దగ్గర "శాంతియుతంగా" పూల కుండీల దగ్గర ధర్నా చేసే అవకాశo వుంది. క చ రా గారో, దిలీపు గారో, హరీష్ సారో, క తా రా గారో తెలంగాణలో వున్న ఆంధ్రోల్లకి హెచ్చరిక జారీ చేసే ప్రమాదం వుంది - కావూరీ నువ్వు నోరుమూసుకోకుంటే ఆంధ్రోల్లని భాగో అనాల్సి వస్తుందని. ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే ఇదే కాబోలు.

10, డిసెంబర్ 2012, సోమవారం

మళ్ళీ మొదలైన బూతు పురాణం- బెదిరింపులుఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తని చూడండి:
............................................................................................................................................................

లగడపాటీ.. నోర్మూసుకో!: దిలీప్‌కుమార్


హైదరాబాద్, డిసెంబర్ 9: అసందర్భ ప్రేలాపనలు మానుకోకపోతే హైదరాబాద్ గడ్డనుంచి లగడపాటి రాజ్‌గోపాల్‌ను పరిగెత్తిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సెక్రటరి జనరల్ కపిలవాయి దిలీప్‌కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఉన్న 10 శాతం సెటిలర్లు సురక్షితంగా, వారి ఆస్తులు భద్రంగా ఉండాలంటే లగడపాటి పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. 'డిసెంబర్ 9' మోసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి దళ్(టీఆర్‌వీడీ) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని 65 శాతం ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారన్న లగడపాటి ప్రచారంలో వాస్తవంలేదని, అందులో 50 శాతం పైగా మహిళలు తెలంగాణకోసం నినదిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా లగడపాటి నోరుమూసుకోకపోతే మరోసారి తెలంగాణ ప్రజల చేతుల్లో పరాభావం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ వచ్చేస్తుందని కొందరు చేస్తున్న ప్రకటనలు పలు ప్రమాదాలకు దారితీసే అవకాశమున్నదని 'టఫ్' చైౖర్మన్ కేశవరావు జాదవ్ అన్నారు.
.......................................................................................................................................................
 
పైన పేర్కొన్న విషయం చదువుతుంటే, మా నాన్న చెప్పే ఒక కధ గుర్తొచ్చి, మీ అందరితో పంచుకుందామనుకుంటున్నా--
 
ఒక రోజు ఒక పూజారి తన రోజువారి కార్యక్రమంలో భాగంగా గుడికి వెళ్లి తలుపు తీశాడు.   అప్పటికే ఒక సాయబు గారు ఆ గ్రామ దేవత నెత్తిన కాలు బెట్టి వికటాట్టహాసం చేస్తున్నాడు పాత సినిమాలో ఎస్ వీ రంగారావు లాగా.   పూజారిని చూడగానే, గ్రామ దేవత కళ్ళెర్ర చేసి, ఈ ధూర్తుడు నా  శిరస్సుపై పాదం మోపాడు, వాడికి గట్టిగా బుద్ధి చెప్పి వెంటనే తీయించు అని కళ్ళెర్ర చేసింది.   అందుకు ఆ పూజారి, అమ్మా, ఇంత శక్తిశాలివైన నువ్వే వాడి చేత ఆ పని చేయించలేకపోతే, నేనెలా చేయించగలను అంటూ గుడ్లనీళ్ళు గుడ్ల కుక్కుకున్నాడు.  
 
లగడపాటి గారు ఏదో మాట్లడడమేమిటి,  ఆయన నోరు ముయ్యకపోతే, హైదరాబాదులోని సేటిలర్లను దిలీపుగారు 
ఒక పట్టు పడతామనాడ మేమిటి?

ఇలాంటి అభద్రతా భావనలను నిత్యం జనబాహుళ్యంలోకి చొప్పించి మీరు బావుకునేదేమిటి?     సమాజానికి, చట్టానికి సవాలు చేసే ఇలాంటివాళ్ళకి బుద్ధి చెప్పే నాయకుడు ఆంధ్రప్రదేశ్కి సత్వరం కావాలి.
 

9, డిసెంబర్ 2012, ఆదివారం

నష్టపోకుండా విడిపోతే తప్పేంటి?


శుక్రవారం ఆంధ్రజ్యోతిలో గౌరవనీయులైనలవణం గారు రాష్ట్ర విభజన జరిగితే మంచిదే అని వ్రాసారు. పాక్షికంగా వారితో ఏకీభవిస్తున్నాను. వారు స్ప్రుశిoసించని కొన్ని ముఖ్యమైనప్రాధాన్యతా అంశాలను మీదృష్టికి తేదలచుకున్నాను.విడిపోదలచుకున్నవాళ్ళు సఖ్యతతోవిడిపోవాలని ప్రయత్నిస్తారు.కానీ దాడులుచేసి,బెదిరించి, వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేసి, హింసనిప్రోత్సహించి భాగోజాగో అంటూకారుకూతలు కూసిభయ భ్రాoతులకి గురి చేస్తే,రాష్త్రం ఎలావిడిపోతుంది.

01) ఆంద్రరాష్ట్రానికి జరిగినఅన్యాయంలో సింహభాగం,మహాత్మా గాంధీగారి వియ్యంకులైనరాజా(జీ)అనబడే పెద్దమనిషిద్వారా జరిగింది.తెలుగువాడికి తెలుగువాడేశత్రువు. నిస్వార్ధపరుడు, దేశంకోసంతన సొంతఆస్తిని త్యాగంచేసిన మేరునగధీరుడుటంగుటూరి ప్రకాశంపంతులు గారిపైచందాలు వసూలుచేసి సొంతానికివాడుకున్నాడని గాంధిగారికి పితూరీలుచెప్పింది మనతెలుగు ప్రముఖులే?ఎక్స్చెంజ్ ఆఫర్లోతిరుపతి మనకిచ్చి,మద్రాసుని వారికిచ్చేలాగాచేసి ప్రకాశంగారి మాటనుతృణీకరించిన దళారులలోతెలుగు వారున్నారన్నదిఅక్షర సత్యం.

02) నదులకుకిందభాగానవున్న వారిహక్కులు (ripartarian రైట్స్) దేశంలోఎంతవరకు కాపాడబడుతున్నై.ఇవ్వాళ కావేరిజలాల పంపకంలోసుప్రీమ్ కోర్టునికర్ణాటక దిక్కరించలేదా?ట్రిబ్యునల్స్ అధికారాలనుఎన్ని రాష్ట్ర్రాలుధిక్కరించడం లేదు.తమిళులపై కన్నడిగులు,కన్నడిగులపై తమిళులుదాడులకు దిగడంలేదా? రేపురాయలసీమ నుంచిదిగువకు వారునీరుని (వరదలోచ్చినప్పుడుతప్ప) వదలుతారనిఎవరు హామీఇవ్వగలరు? అదేవిధంగాగోదావరి కృష్ణనీరు దిగువకువదులుతారని ఎవరుహామీ ఇవ్వగలరు?విభజన జరిగితే,ఇరుపక్షాలు నీళ్ళకోసందాడులు జరుపుకోవా?

03) బాబ్లీపై ఆనకట్టఅక్రంగా కట్టిఇప్పుడు సుప్రీమ్కోర్టులో వ్యాజ్యంనడుస్తున్నది నిజాంకాదా?

04) ప్రస్తుతమన పాలకప్రతిపక్షాలు అధికారంలోవున్న కర్నాటక,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలోఎన్నో తెలుగుప్రాంతాలు వున్నాయి.రాష్ట్రాo విభజనచెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నమన వెంకయ్యనాయుడు (కర్నాటకరాష్ట్రంనుంచి రాజ్యసభకుప్రాతినిధ్యం హిస్తున్నారు)గారు, గృహశాఖామాత్య్లులు మాన్యశ్రీచిదంబరం గారుపెద్దమనసు వహించి,కర్ణాటకలోని తెలుగుప్రాంతాలని,తమిళనాడులోని తెలుగుప్రాంతాలని ఆంధ్రాలోకలిపేసే ప్రతిపాదనచేసి (స్వాతంత్ర్యానంతరస్థితి కొనసాగించడానికి)వారు పెద్దమనసుతోప్రయత్నం చేస్తేబాగుంటుంది కదా?
విడిపోవడం చాలా చాలా మంచిదే,కానీ రాజధానివిషయం నదీజలాల పంపిణీవిషయం పరిష్కరించి,ఇప్పటికి పెండింగ్వున్న ఇరుపక్షాల ప్రజాహిత నీటిపారుదల ప్రాజక్తులకు డబ్బులు, అనుమతులు ఇచ్చిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలి. లేనిపక్షంలో,మన తెలుగుజాతి విభేదాలతోసర్వనాశనం అయ్యేప్రమాదం వుంది.
శివసేన నాయకులు బొంబాయిలో ఇతర రాష్ట్రాల వారిమీద దాష్టీకం చేసినపుడు ప్రతి రాజకీయ పార్టీ కేవలం ఒక పత్రికా ప్రకటనతో ఖండించి చేతులు దులుపుకున్న సందర్భాలు కోకొల్లలు. భవిష్యత్లో హైదరాబాద్ మరో బొంబాయి కాదని, తె రా స మరో శివసేన కాదని నమ్మకం ఏమిటి. సామాన్య సీమ తీరాంధ్ర వాసుది మస్తిష్కంలో తొలిచే సాధారణ ప్రశ్నలు ఇవి. ఈ అనుమాలకు తావిచ్చిన్దికూడా తె రా స నాయకులే.


 

6, డిసెంబర్ 2012, గురువారం

డిసెంబర్ 28న ఏమి జరగవచ్చు??

127 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా సమస్యను పరిష్కరించడం ఒక పెద్ద విషయం కాదు. అసలు తెలంగాణా సమస్య సృష్టికర్తే కాంగ్రెస్స్ పార్టీ? మలిదశ తెలంగాణా ఉద్యమం ప్రారంభమయినదే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం. జగను కి వస్తున్న ప్రజా మద్దతు చూసి, అతని మొండితనం చూసి భయం వేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే క చ రా గారిని పురికొల్పడం జరిగిందంటే నమ్మక తప్పదు. కానీ, ఉద్యమం ఎప్పుడైతే విద్యార్ధుల చేతిలో పడిందో, రాజకీయ పార్టీల నోట్లో పచ్చి వేలకాయ పడ్డట్లు అయింది. ఈ పరిణామం పాపం క చ రా గారు కూడా ఊహించి వుండరు. అయితే, ఆ సమస్యను పరిష్కరించడం కూడా వారికి తెలుసు. నిన్నటి అఖిల పక్ష సమావేశ ప్రకటన అలాంటి ఎత్తుగడలో భాగమే. గుత్తా, మందా, రాజయ్య, యాస్కీ, వినోద్ ఇత్యాది ఎం పీ లు ఎవరిదారి వారు వెతుకుకుంటున్నారని తెలిసి, అఖిల పక్షం ప్రకటన చేసారు. ప్రస్తుతానికి డిసెంబర్ 28 వరకు ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. ఇది తె రా సా కు సుతరాము ఇష్టం లేదు. వారికి కావలసింది అన్ని పార్టీల నుంచి వలసలు, వోట్లు నోట్లు సీట్లు? ఈ నెల 28 వరకు వలసలు ఉండటానికి ఆస్కారమే లేదు. దీని వలన ఎఫ్ డి ఐ వోటింగులో ఎం పి లలో చీలికను నివారించ గలిగింది.
 
డిసెంబరు 28న జరిగే అఖిల పక్ష మీటింగులో మనకు ఈ దిగువ పొంద పరచబడిన సూత్రాలలో ఏదో ఒకటి అనుకరించే అవకాశo వుంది.
 
అ) మీటింగుకి తెరాసా, తెదేపా, వైఎసార్ పార్టీలు ఒక షరతు విధించే అవకాశం వుంది. అన్ని పార్టీల అధ్యక్షులు ఈ అఖిల పక్షంలో పాల్గొనాలి అని. దానితో ఈ మీటింగ్ చాయ్ బిస్కెట్ మీటింగు గా చరిత్రలో చిరస్థాయిగా నిలిపోయే అవకాశం వుంది.
 
ఆ) ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు వేరు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వేరు. ఇట్లాంటి కిట్టీ పార్టీలలో పాల్గొనే స్థాయి కాంగ్రెస్స్ పార్టీ అఖిల భారత అధ్యక్షులది కాదు. ఆమె పాల్గొనక పొతే ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు దానిని సాకుగా తీసుకొని వారు పాల్గొనక పోవచ్చు. ఒక వేళ పాల్గొన్నా, ఈ సమస్యను సృష్టించినది మీరు కాబట్టి, మీరే పరిష్కరించండి అంటారు.
 
ఇ) ఒక్కొక పార్టీ నుంచి ముగ్గిరికి మించకుండా ప్రతినిధులు పాల్గొనవచ్చు అని చెప్పొచ్చు. ఈ వెసులు బాటు వలన 3 ప్రాంతాలలో ముగ్గురు పోటీదారులు కలివిడిగా విడి విడిగా వారి వారి వాదనలు వారి వారి ప్రాంత "మనోబావాలను"  ప్రకటించి కలిసి మెలిసి ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చి  విడి విడిగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టొచ్చు.
 
ఈ)అఖిల పక్షం సమావేశం అన్నారు గాని, కేవలం ఆంద్ర ప్రదేశ్ కి సంబంధిచిన అఖిల పక్షం అనలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ, యు పి ఎ భాగ  స్వామ్య పక్షాలన్నిటిని ఆహ్వానించి "తూచ్" వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని చెప్పించవచ్చు.
 
ఉ) స్వర్గీయ జస్పాల్ భట్టీ గారి డ్రామాలలో చెప్పినట్టు, ఈ మీటింగ్ లో వచ్చే సమావేశం జరిగే తారీకు ఖరారు చెయ్యవచ్చు. 
 
ఊ) దేశం మొత్తం " రాష్ట్రాల పునర్ విభజన కమిటి" పేరుతొ ఒక  కాల యాపన కమిటీ వెయ్యొచ్చు.
 
ఋ) తెదేపా, వై ఎస్ ఆర్ పార్టీలు - మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పొచ్చు.
 
ఋ) తె రా కి "పేకేజీ" ఇవ్వొచ్చు.
 
లు) హైదరాబాద్ ని రెండవ దేశ రాజధానిగా ప్రకటించి డా.అంబేద్కర్ గారి కలలని నిజం చెయ్యొచ్చు.
 
 
లూ  ) మన గవర్నర్ గారు చెప్పినట్లుగా డిసెంబర్ 28 తరువాత  డిసెంబర్ 29 రావొచ్చు.
 
అసలే బాబు గారు నడవలేక పోతున్నారు. ఇవ్వాల్టి నుంచి ఆయన తొందరగా ఎక్కువ దూరం నడిచి బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటినట్లు, తెలంగాణా గండంనుంచి బయటపడి తీర ఆంధ్ర ప్రాంతం చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
 

4, డిసెంబర్ 2012, మంగళవారం

స్వయంకృతాపరాధం

రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొన్ని నెలలకు కే కే గారు తిరుపతి వెళ్ళారు. విలేకరులు సదరు కే కే గారిని జగన్ గురించి అడిగారు. జగనా, ఎవరాయన, ఓ రాజశేఖర్ కొడుకా! అని అసలు జగన్ మోహన్ రెడ్డి గురించి తెలియనట్లు మాట్లాడాడు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ నాయకులు, మరి ముఖ్యంగా తెలంగాణా సీనియర్లు అని పిలిపించుకోబడే వి హెచ్ గారు, పాల్వాయి గారు, శంకర్ రావు గారు ఒంటి కాలు మీద లేచారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఏమిటి. అదేదో పాట గుర్తొస్తుంది .. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. కాంగ్రెస్స్ పరిస్తితి ఎంత దయనీయంగా వుందంటే, ఒకప్పుడు వర్కింగ్ కమిటీలో సభ్యులైన వారే కాంగ్రెస్స్ పార్లమెంటు సభ్యులకు తె రా స కు మధ్యవర్తిత్వం నడుపుతున్నారు.

ప్రతిరోజూ విలేకరుల సమావేశం పెట్టేది ముఖ్యమంత్రిని తిట్టేది. పాపం కాంగ్రెస్స్ వారు అధికారంలో వుంటే ప్రతిపక్షానికి అసలు పనే వుండదు. రాను రాను ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువై ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్స్ పరిస్తితి తమిళ్ నాడు స్థాయికి దిగాజారినా పెద్ద ఆశ్చర్యం లేదు.
 

కొసమెరుపేందంటే , కాంగ్రెస్స్ పార్టీలో నాయకత్వాన్ని బండ బూతులు తిట్టి బయటకు వచ్చి మళ్ళీ గెలిచి లోపలినుంచో బయటనుంచో కాంగ్రెస్స్కు మద్దతుయిచ్చి వున్నత స్థానాల్లో వున్నవాళ్ళు బోలెడు మంది వున్నారు అదే జరిగితే, మరి ఈ కే కే లు, కా కా ల పని గోవిందా. అందుకే అంటారు, రాజకీయాలలో పూర్తి కాలపు మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని.

3, డిసెంబర్ 2012, సోమవారం

ఉద్రేకాలని రెచ్చకొడుతున్న వార్తా ఛానళ్ళు

మన పత్రికలకు ఛానళ్ళకు ఒక జబ్బు వుంది. అదేమిటంటే, మానిన గాయాన్ని రేపడం. పాపం క చ రా గారు ఈ మధ్య అమాకయులైన పిల్లల్ని రెచ్చగొట్టే పనులేమి చేయకుండా తన మానాన తను అతిధి గృహంలో శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతున్నారు. అంతే , వెంటనే మన చానళ్ళ వాళ్ళు గొట్టాలు పట్టుకెళ్ళి, ఏమండి మీరు ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు మళ్ళీ ప్రజల్ని ఎప్పుడు రెచ్చ కొడతారు అని గుచ్చి గుచ్చి అడుగుతారు. అప్పుడెప్పుడో ఇక్షావకులకాలంనాడు పాపం భా జ పా వారు గుడి కడతాం ఒట్లేయండి అని దేబిరిస్తే, వెర్రి బ్లాగుల్లాగా నమ్మి ఓట్లు వేసాము.   ఆ విషయం భా జ పా తో సహా దేశం మొత్తం ఆ విషయం మర్చిపోయింది. కానీ చానలు వాళ్ళు మర్చిపోలా. ఏవండి ఈ సారి మీరు ఏమి పడగొట్టి ఏమి కట్టబోతున్నారు తొందరగా సమయం, తారీకు వేదిక చెప్పండి అని ప్రాణం తీస్తారు. ఏవండీ, వీరు గుడి కట్టి అందులో రాముడిని ప్రతిష్టించితేనే మనం రామున్ని పూజిస్తామా, ఏం భద్రాచలంలో రాముడు దేవుడు కాదా? ప్రజలు కట్టిన పన్నులతో భక్త రామదాసు (కంచర్ల గోపన్న)రాములోరి గుడి కట్టిచ్చి తానీష గారి ఆగ్రహానికి గురై జైలు కెళ్ళితే, మన భా జ పా వారి కారణంగా కట్టని గుడి కోసం ఎంతమంది అమాయకులు బలైపోయారో. రాముడు ఎవరి ప్రాణాలని ఫణంగా పెట్టి తనకు గుడి కట్ట మనలేదు. మళ్ళీ భా జ పా వారి నోళ్ళల్లో నోరు పెట్టి (మైకు పెట్టి అని చదువుకోండి) గుడి ఎందుకు కట్ట లేదు మళ్ళీ జనాలని ఎప్పుడు రెచ్చగొడతారు అని ప్రశ్నించవద్దు. ఈ మధ్యనే ఏంటో మౌనంగా ముని లాగా వున్నా మన లగడపాటిని ఒక ఛానల్ ఆయన "తెలంగాణా ఎప్పుడు వస్తుందంటారు" అని గోకాడు. ఇంకేముంది, ఆయన రెచ్చిపోయి ఇంకెక్కడి తెలంగాణా? అని అడిగాడు. అదే విలేఖరి, అదే గొట్టం పట్టుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ తెలంగాణా ఆయన నోట్లో పెట్టాడు. అంటే ఒక రోజుకు సరిపడా వార్తలు దొరికినై. ఇది ఇట్లా వుంటే, మోహన్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులకు పిండ ప్రదానం ఘనంగా జరిపించారు బ్రాహ్మణులు. ఆ వార్త చూపించక పోయినా కొంపలంటుకు పోయింది లేదు. కాని ఆ పిండాలు ఎంత సైజులో వున్నాయి వాటిని ఏ పదార్ధాలతో ఎంత వ్యాసార్ధంలో చేసారో చెప్పి అరంగ ఆరంగా రోజుకు 30 సార్లు చూపెట్టారు. అసలే కోతి , పైపెచ్చు కల్లు తాగింది. పర్యవసానం కేసులు, కోర్టులు, ఆసుపత్రులు, కావాల్సినంత ప్రచారం సినిమాకి.

 
ఇవన్నీ చూస్తుంటే అహనా పెళ్ళoటలో నూతన్ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగే సన్నివేశం గుర్తొస్తుంది. నువ్వోకటేసుకుంటే నీను రెండేసుకుంటానని , కోపంతో ఇంట్లో సామాన్లన్నీ పగల కొడతారు. గత కొంత కాలంనుంచి మన రాష్ట్రంలో జరుగుతున్నా తంతు కూడా సరిగ్గా ఇలానే వుంది.
ఈ చానళ్ళ వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్న అనిశ్చితి వలన ఎంత మంది పిల్లలు  మద్రాస్ వెళ్లి డొనేషన్ కట్టి మరీ (మెరిట్ వున్నా కూడా) ఇంజనీరింగ్ కాలేజీల్లో (మన రాష్ట్రంలో కాంపస్ ఎంపికలు తగ్గి)  చేరారు?     ఎంతమంది తెలంగాణాకి చెందిన ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లు తీరాంధ్ర ప్రాంతంలో చదువులకోసం తల్లిదండ్రులకు దూరంగా వుంటున్నారు? ఎందుకు వుంటున్నారు అని ఒక సామాజిక ప్రయోజనాన్ని కలిగించే ఆలోచన రేకెత్తించే కార్యక్రమం చెయ్యరు. కారణం సంపాదనే ప్రధాన ధ్యేయంగా వున్న వార్తా మాధ్యమాలు వాటిని నడుపుతున్న రాజకీయ నాయకులు. త్వరలో కమునిస్తులకు కూడా ఒక చానల్ వస్తోంది. ఒక్క లోక్సత్తాకు టి వి వస్తే మన రాష్ట్రంలో కూడా తమిళుల లాగా ప్రతి పార్టీకి ఒక చానల్ వున్నట్లు అవుతుంది.


కానీ ఒక్క విషయం గమనించారా ? ఎప్పుడో మరుగున పడి పోయిన వివిధ భారతి, ఎఫ్ ఎం రేడియోలు ప్రస్తుతం ఒకింత ప్రజాదరణకి నోచుకుంటున్నై. కారణం టి వి లలో ప్రసారమౌతున్న చెత్త వార్తలు, సంవత్సరాల పాటు జీళ్ళ పాకం లాగా సాగే అత్తా కోడళ్ళ సీరియల్స్. 30 సంవత్సరాల క్రితంలాగా సంక్షిప్త శబ్ద చిత్రాలు, 6.45కి ప్రాంతాల వార్తలు (క్షమించాలి ప్రాంతీయ వార్తలు ) 7 గంటలకు ధిల్లీ నుంచి కంచు కంఠంతో వినిపించే వార్తలు, నాటికలు, హరికథలు ఇత్యాది కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలోని తెలుగువారికి కేవలం వినటానికి మాత్రమె అందుబాటులో వుండే విధంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

  

1, డిసెంబర్ 2012, శనివారం

అతి సర్వత్ర వర్జయేత్

ఒక సముద్రం ఒడ్డున ఒక పెద్ద మనిషి భార్య పిల్లలతో కాపురం ఉంటున్నాడు. ప్రతి నిత్యం సముద్రంలో దొరికే జీవరాసులని పట్టుకొని వాటినే ఆహారంగా తింటూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఏ బాదర బందీ లేదు. రేపటి సంగతి ఏంటి అనే చింత లేకుండా గడుపుతున్నాడు. ఒక నాడు ఒక పర్యాటకుడు సముద్రం దగ్గర సేద తీరుదామని వచ్చాడు. హాయిగా బొజ్జ మీద టవల్ వేసుకొని పడుకొన్న ఈ పెద్దమనిషిని గమనిస్తాడు. అతనిదగ్గరికి వెళ్లి ఏమండి మీరేమి చేస్తుంటారు అని అడుగుతాడు. నిద్రపోతున్నానండి అని ఛలోక్తి విసురుతాడు ఆ పెద్ద మనిషి. అది కాదండి జీవించడానికి ఏమి చేస్తారండి అని అడుగుతాడు. దానికి ఆ పెద్దమనిషి సముద్రంలో దొరికే చిన్న చిన్న జీవరాసులని పట్టి వాటిని వండుకొని ముప్పోద్దుల సేవిస్తు ఉంటాము అంటాడు. ఏమండి మీరు ఖాళీగా వున్నారు కదా - పగలు చేపలు పట్టి సాయంత్రానికి వాటిని మార్కెట్లో అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది అని చెప్తాడు. అయిష్టంగానే ఆ పెద్దమనిషి ఇతని మాటని విని మరుసటి రోజునుంచి చేపలు పట్టి మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. మరి కొన్ని రోజుల తర్వాత ఆ పర్యాటకుడు వచ్చి పెద్దమనిషిని మెచ్చుకొని ఎన్నాళ్ళని ఈ చిన్న తెప్ప మీద సముద్రంలోకి వెళ్తావు హాయిగా ఒక మర బోటు కొనుకుంటే ఎంచక్కా శ్రమ తక్కువతో బోలెడు చేపలు పట్టి ఎక్కువ డబ్బు గడించవచ్చు అని చెప్తాడు. తను దాచుకున్న డబ్బుతో మర పడవ కొనుక్కొని ఎక్కువ చేపలు పట్టి మార్కెట్లో అమ్ముతూ 24 గంటలు కస్టపడి ఎక్కువ డబ్బులు గడిస్తాడు. మళ్ళీ ఈ మిత్రుడు వస్తాడు. ఓరి పెద్దమనిషి ఎన్నాళ్ళని పక్కన ఊళ్ళోని మార్కెటుకు వెళ్లి చేపలు అమ్ముతావు? హాయిగా విదేశాలకు ఎగుమతి చేసి డాలర్లు సంపాదించుకో అని చెప్తాడు.
  
కానీ ఈ సారి మన పెద్ద మనిషి అతని మాట వినల. తన దగ్గర వున్న వలలు, మర పడవలు అమ్మేస్తాడు. తనకి కావాల్సిన రోజువారి ఆహారానికి మాత్రం చేపలు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటాడు. ఇది ఇలా వుండగా ఆ పర్యాటకుడు మళ్ళీ వస్తాడు. ప్రశాంతంగా సముద్రం ఒడ్డున సేద తీరుతున్న ఆ పెద్దమనిషితో - ఇదిగో పెద్దమనిషి నేను చూడు రాబోయే వృద్ధాప్యం గురించి ఇప్పటినుంచి కష్టపడుతుంటే నువ్వేంది ఇలా వ్యాపారాలన్నీ మూసేసావ్ అంటాడు. హాయిగా సంపాదించి వృద్ధాప్యంలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోక ఎందుకయ్యా సంపాదన ఆపివేసావు అంటాడు. అందుకా పెద్దమనిషి ఓరి వెర్రిబాగులోడ నువ్వెప్పుడో రాబోయే వృద్ధాప్యం గురించి ఆ తరువాత రాబోయే "హాయి" గురించి మాట్లాడుతున్నావు నువ్వు పరిచయం కాక ముందు నేనే ఎంతో హాయిగా జీవిస్తున్నాను. నీ వెధవ ఐడియా నా జీవితాన్ని మార్చింది, ఇలాంటి వెధవ సలహాలు ఇహ ముందు ఇవ్వద్దు అని చెప్తాడు.
 
ఈ కధలో నీతి ఏంటంటే - డబ్బు అవసరం ప్రతి వాడికి వుంది. కానీ దానికీ ఒక మితం వుంది. కోట్లు దోచుకుంటున్న రాజకీయ నాయకులకు కంటి మీద కునుకుండదు, ఎప్పుడు సి బి ఐ లక్ష్మీ నారాయణ వచ్చి అరెస్టు చేస్తాడో నని. కేవలం సంపాదనే పరమావధిగా ఇల్లాలికి పిల్లలకి సమయం కేటాయించకుండా , వేల్టికి సరిఐన తిండి లేక చక్కర వ్యాధి, రక్తపోటు, తింటే అరగదు, తినకపోతే నీరసంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్న పెద్ద మనుషులు ఈ దేశంలో ఏంతో మంది వున్నారు. ఉదా: మన గాలి గారినే తీసుకోండి, రత్నఖచిత సిమ్హాసానాలు హంస తూలికా తల్పాలు, పట్టు పరుపులు, చివరకు తను వాడే స్నానపు గది లోని పరికరాలు కూడా బంగారమే. కానీ ఈ మితిమీరిన ధనాశ చివరకు భార్యా బిడ్డలను దూరంచేసింది, 10 బై 10 జైలు గది మాత్రం మిగిలింది.
 
మితిమీరిన సంపాదన అనే కాంక్ష అది మనిషి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కాని మన కధలోని పెద్దమనిషి హాయిగా ఇలాంటి భయాలేమి లేకుండా బోర మీద తడి తువ్వాలు వేసుకొని మధ్యానం ఓ గంట కునుకు తీస్తాడు. వాడికి ఏ రోగం లేదు, ఆదాయ పన్ను, అమ్మకపు పన్ను గొడవ లేదు. ఎందుకో ఈ విషయం కోట్లు వున్నా ఇంకా అక్రమంగా సంపాదించాలనే వారికి అర్ధం కాదు.
 

28, నవంబర్ 2012, బుధవారం

ప్రపంచ తెలుగు మహాసభలకు "టేల్గులో" ఆహ్వానం

ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో డిసెంబర్ మాసంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో హడావుడి మొదలయింది. వాయువేగంతో తెలుగు గురించి విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టారు పాలకులు. ఇవ్వాళ మన రాష్ట్రంలోని నాయకులలో ముఖ్యంగా దృశ్య శ్రవణ యంత్రాలలో చర్చల్లో పాల్గోనే ప్రముఖుల్లో తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడే వారే చాలా మంది వున్నారు. ఎంత ఎక్కువగా ఆంగ్ల పదాలు కలిపితే అంత బాగా మాట్లాడినట్లు లెక్క. వీరికితోడు మన దృశ్య శ్రవణ యంత్రాల కార్యక్రమ నిర్వాహకులు "dont గో ఎనీవేర్, just వన్ సెకండ్లో వి విల్ బి విత్ u, అప్పటి దాకా వన్ స్మాల్ బ్రేక్" అంటారు. ఈ వాక్యంలో మనం ఒక గంట కూర్చొని తెలుగు పదాలు వెదికితే ఒకటో ఆరో దొరకకపోదు. ఇది మొత్తం తెలుగు కార్యక్రమం. అంతదాకా ఎందుకు, మన ముఖ్య మంత్రిగారికే తెలుగు సరిగా రాదు. ఆయన సభాధ్యక్షులుగా వున్నప్పుడు వారి ఊత పదాలు మనకు తెలియనివి కావు. దయచేసి మీ కుర్చీలు మీరు తీసుకొని వెళ్ళండి. (ప్లీజ్ టేక్ యువర్ సీట్స్). రాజకీయ నాయకుల పిల్లలే కాదు మన పిల్లల్లో ఎంత మంది (తెలుగు మాధ్యమంలో చదవడం వదిలేయండి) కనీసం తెలుగు రెండవ భాషగా నేర్చుకోవడానికి ఇస్టపడుతున్నారు? వాళ్ళు నేర్చుకున్టామన్నా తల్లితండ్రులము మనం ఒప్పుకోము, ఎందుకంటే, ఎక్కువ మార్కులు కావాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు, తెలుగు రాదు గాని, నూటికి 95 మార్కులు అప్పటికి అప్పుడు సంస్కృతం రెండవ భాషగా తీసుకుంటే (చెప్పే వాడికి రాదు, వినేవాడికి రాదు, దిద్దేవాడికి అంతకన్నా రాదు) మార్కులు తప్పకుండా వస్తాయని నమ్మకం. అది నిజం కూడా! 
   

ఎంతసేపటికి మనం పక్కనవున్న తమిళనాడుతో పోల్చుకొని వాళ్ళెంత భాషాదురభిమానులో మనం పొగుడుతాం. కానీ ఆ రాష్ట్రం భారతదేశానికి ఒక అంచున వుంది. తమిళనాడు పొరుగు రాష్ట్రాలన్నీ దక్షిణాది రాష్ట్రాలే. కాని మన దురదృష్టం మన చుట్టుపక్కల ఒడిష, చత్తీస్గడ్, మహారాష్ట్ర ఒక వైపు ఇంకొకవైపు తమిళనాడు కర్నాటక రాష్ట్రాలు వున్నాయి. ఈ ప్రత్యెక భౌగోళిక పరిస్తులవలన , దేశంలోనే హిందీ తర్వాత మాట్లాడే అతిపెద్ద భాష ఐన తెలుగు ప్రమాదంలో పడింది. ఈ భౌగోళిక పరిస్తితులవలననే మన రాష్ట్రంనుండి గెలిచిన పార్లమెంట్ సభ్యులలో ఒరియా, కన్నడ మరాఠీ మూలాలు కల వాళ్ళు  కూడా వున్నారన్నది  అక్షర సత్యం.
 

మరొక విషయం - నామఫలకాలను తెలుగులో రాస్తేనో, సినిమాలకు తెలుగు పేరు పెట్టినంత మాత్రాన భాషాభివృద్ధి జరగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటినుండి త్రిభాషా సూత్రాన్ని(తెలుగు, ఉర్దూ మరియు హిందీ ) పాటిస్తుంది. కానీ తమిళనాడు వారు తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమె వారు ఆమోదించారు. మనమేమో ప్రాంతాలవారీగా కొట్టుకొని చస్తున్నాము. తెలుగులో ఆదికవి నన్నయ్యా లేక పాల్కురికి సోమనాదుడా అనే అప్రస్తుత వాగ్వివాదాలతో నిత్యం కొట్టుకుంటున్నాం. ఇది కేవలం దిన పత్రికల పుటలు నిన్డటానికి ఉపయోగ పాడుతుండే కానీ, భాషాభివృద్ధికి తోడ్పదు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం ఒకరు ఔనన్నది ఇంకొకరు కాదనడం. కాని ప్రక్క రాష్ట్రాలవారు పారిశ్రామిక అభివృద్ధితో ముందంజలో వున్నారు. ఇది కూడా మన భాష దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం. మన పిల్లలు ఇక్కడి కాలేజీల్లో తాంత్రిక విద్య (టెక్నికల్ కోర్సు) చదివితే ప్రాంగణ ఉద్యోగాలు చాలా తక్కువ. అదే తమిల్నాడులోకానీ కర్ణాటకాలో గాని చదివితే - BHEL-రెండు యూనిట్లు, తోళ్ళ పరిశ్రమలు, లోదుస్తుల పరిశ్రమలు, ఆటోమొబైల్ రంగంలో హ్యుండై, టఫే, లే లాండు, ఫోర్డ్, నిస్సాన్, టి వి ఎస్, కోనే, జాన్సున్ లిఫ్ట్లు .... లిస్టు రాయాలంటే చేయ్యినోప్పి పుడుతుంది. ప్రతి జిల్లా ఒక పారిశ్రామిక వాడా. ఇక కర్నాటక రాష్ట్రానికి వస్తే, టయోట, వోల్వో, అన్ని ప్రముఖ సాఫ్టువేరు కంపనీలు, బస్ బాడీ తయారీ, ఓటిస్ లిఫ్ట్లు, ఎ పి సి, కొత్తగా హీరో హోండా ఇంకా అనేక పరిశ్రమలు ఇక్కడే. ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ రెండవ తరం పిల్లలు చాలామంది ప్రక్క రాష్ట్రాల్లో స్థిరపడి ఆ రాష్ట్రంలోని వాడుక భాషను, బ్రతుకు తెరువుకోసం మరియు మనుగడ కోసం నేర్చుకుంటున్నారు. అక్కడి పాటశాలల్లో చేరే ఈ రెండో తరం పిల్లలు వేరే దారి లేక ఇతర భాషలను రెండవ మూడవ భాషలుగా నేర్చుకోవడం మూలాన మన భాష అంతరించి పోతుంది.
 

కాబట్టి, రాష్ట్రం రాజకీయంగా స్థిరత్వం లేకుండా ఆర్ధికాభివృద్ధి సాధించలేదు. చైనా వాడికి ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే ఇంగ్లీష్తో పనిలేదు. ఏం వాళ్ళు అభివృద్ధి సాధించట్లా? తమిళనాడులో ఏ రాజకీయ పక్షం అధికారంలో వున్నా స్వాతంత్ర్యానంతరం గణనీయమైన పారిశ్రామికాభివృద్దికి బాటలు వేసింది. ఈ కారణంగానే వాళ్ళల్లో వలసలు తక్కువ. పారిశ్రామిక, వ్యవసాయ పురోభివ్రుది లేకుండా, అన్నిరంగాలలో వలసలు అరికట్టకుండా మన భాషకు మనుగడ లేదు.

27, నవంబర్ 2012, మంగళవారం

బాబోయ్ డిసెంబర్ వస్తోంది

డిసెంబర్ వస్తుందంటేనే  భయం వేస్తుంది. చలి పులి భయపెడుందని కాదండి. అంత తీవ్రమైన చలిలో కూడా  వేడి వేడి పకోడీ లాంటి  విషయాలు ఉంటాయ్. ప్రతి సంవత్సరం ఐతే, డిసెంబర్ 6న మసీదును కూలగొట్టారాని ఒక వర్గం వాళ్ళు అక్రోసిస్తే ఇంకొక వర్గం వాళ్ళు మేము పడగొట్టామని పండుగ చేసుకుంటారు. ఇలాంటి ప్రోటీన్ (అదేనండి రొటీన్) విషయాలతోపాటు, డిసెంబర్ 9 2009న చిదంబరం గారు లుంగీ కట్టుకొని మరీ అర్ధరాత్రి ప్రకటించిన స్వాతంత్రం. దాన్ని తూచ్ అంటూ ఇంటూ కొట్టి మళ్ళీ లుంగీ కట్టుకొనే డిసెంబర్ 23 పగలు పూట చేసిన ప్రకటన. డిసెంబర్ 9ని రాష్ట్రంలోని కొంతమంది విజయ దివాస్గా జరుపుకుంటే మరి కొంతమంది డిసెంబర్ 23ను విజయోత్సవాల పేరిట పండుగ చేసుకుంటారు. దీనికి తోడూ ఇటీవల తెలంగాణా కాంగ్రెస్ (4గురు) పార్లమెంట్ సభ్యులు పెట్టిన చివరాఖరి  గీత (అదేనండి డెడ్ లైన్) కూడా డిసెంబర్ తొమ్మిదే . ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికి తలకు ఒక్కింటికి షుమారుగా రూ 1.50 ఖర్చు పెట్టి డిసెంబర్ 27-29 తారీఖులలో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఏ మేరకు విజయవంతం అవుతాయోనన్న భయం సర్కారును పట్టి పీడిస్తోంది.

 
ఇవి చాలవన్నట్లు మన పొరుగు రాష్ట్రంలో డిసెంబర్ 8న యడురప్ప గారి క జ పా (కర్ణాటక జనత పార్టీ) ఆవిర్భావం కాబోతోంది. డిసెంబర్ 9వ తారీఖు నుండి కర్ణాటక విధాన సభ సమావేశాలు జరగబోతున్నాయ్. ఈ సమావేశాలు జరుగుతాయా లేదా అసెంబ్లీ రద్దు అవుతుందా అనేది యడురప్ప గారి మీద ఆధార పడివుంటుంది. మరి ఇది కూడా కమలనాధులకు పెద్ద విషయమే కదా?? 
 
టి వి చానళ్ళకు, పత్రికలకు మాత్రం పండగే, పండగ.
 

23, నవంబర్ 2012, శుక్రవారం

కేకే తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు

తా చెడ్డ కోతి వనమెల్లా చెడిపిందట !! ఆయనే ఇంతవరకు ఏ ప్రత్యక్ష ఎన్నికలలో కూడా కనీసం వార్డు సభ్యునిగా కూడా ఎన్నిక కాలేదు, ఇప్పుడేమో ఎవరిదారి వారు చూసుకున్దామనుకుంటున్న కొద్దిమంది తెలంగాణా పార్లమెంటు సభ్యులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు. 
     

ఏ రాజకీయ నాయకుడైనా తన భవిషత్తు గురించి తోలి ప్రాధాన్యం ఇస్తాడు కాని పార్టీ గురించి ప్రజల గురించి ఆలోచించడు. పాపం మందా గారు, గుత్తా గారు అంతకు మునుపు తే దే పా తరఫున పార్లమెంట్ సభ్యులు. వారికి తెలుసు, 2009లో కాంగ్రెస్ మాత్రమె గెలుస్తుందని. తక్షణం జంప్ కొట్టారు. ఇప్పుడు అంతో ఇంతో గెలుపు అవకాశాలు వున్న పార్టీలు తెలంగాణలో రెండే రెండు. కాని కేకే గారి ప్రకారం వీరంతా తె రా సా లో మాత్రమె చేరాలి. లేదంటే ఉద్యమ కారులు వీళ్ళని వదలరు . 
    
ఇవ్వాళ కాకపొతే రేపైనా వై.కా.పా కొంగ్రేస్స్లో కలవాల్సిన పార్టీ. కాబట్టి అందులో చేరితే అంతో ఇంతో పార్లమెంటు సభ్యులకు లాభం కాని, తే రా సా లో లాభం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేటు కంపెనీ లాంటిది. ప్రైవేటు కంపనీలో ఎ ఉద్యోగి ఐనా మేము ఉద్యోగం వదిలేస్తాం అంటే, వద్దులే బాబు, వేరే కంపనీలో నీకు ఎంత వస్తుందో చెప్పు అంతా మేమే ఇస్తాం అంటారు. కాదు కూడదు అంటే, ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తినిఇంకొంచం ఎక్కువ ఇచ్చి స్వగృహ ప్రవేశం జరిపించి "పునరాగమనాయచ" ని మంత్రం చెప్తారు. అలాగే, చిదంబరం మొదలుకొని, అంటోని , ప్రణబ్ ముఖేర్జి, శరద్ పవార్ వరకు ఎంతో మంది సొంత కుంపట్లు వెలిగించి అవి సరిగ్గా మండక సగంలో ఆపేసిన వాళ్ళే .   మళ్ళీ కాంగ్రేస్స్లో కలిసినవారే. వారంతా ఇప్పుడు మంచి మంచి పదవులు అనుభవిస్తున్నారా లేదా? తెలివంటే అది. 
 
కాబట్టి,తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ లు చక్కగా వై పాలో చేరిపోయి మళ్ళీ ఎన్నుకోబడి మంత్రులవడం మంచిది. నా ఉచిత సలహా తప్పక పాటిస్తారని భావిస్తూ...

21, నవంబర్ 2012, బుధవారం

మోటారు వాహన చట్ట సవరణలు అవసరంమనకు స్వాతంత్రం సిద్ధించి 60 సంవత్సరాలు  దాటినా,  కొన్ని చట్టాలు ఇంకా బ్రిటిష్ వారు రూపొందించినవే అనుసరిస్తున్నాం.     ఉదాహరణకు - మోటార్ వెహికల్ ఆక్ట్ - రోజు  పాటశాలల్లో  పాఠాలు ప్రారంభించే ముందర మనం ఒక స్తోత్రం పఠిస్తాం.   భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు అని..   ఎక్కడండి ఆచరణలో ??  పంజాబ్ నుంచి బయలుదేరిన లారీ 3 అంతరాష్ట్ర చెక్కు పోస్టుల పోస్టుల దగ్గర మూడు చెరువల నీళ్ళు తాగి, 3000 లంచం ఇచ్చి వచ్చీ రానీ  భాషలో మాట్లా డాలి.    ఎందుకీ ఖర్మ?    ఈ దేశంలో నమోదైన  వాహనం ఏ  రాష్ట్రానికైనా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఎందుకు లేదు.  ఇలాంటి చట్ట సవరణలు ఎవరు చేస్తారు?   మన పార్లమెంట్ సభ్యులు కాదా?     ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజే అని గొంతు చించుకునే భా జ పా వారు చెయ్యలేదు.    స్వాతంత్ర్యానంతరం ఎక్కువ రోజులు మనల్ని పరిపాలించిన కొంగ్రేస్స్ వారు చెయ్యలేదు. 

మన సొంత ద్విచక్ర వాహనం కాని కారు గాని ప్రక్క రాష్ట్రంలో దొంగల్లాగా వాడుకోవాలి.   మనం రోడ్ టాక్స్ చేల్లిన్చాము కదా అంటే, మీరు చెల్లించింది మీ రాష్ట్రంలో మా రాష్ట్రంలో కాదు.    పోనీ రిజిస్ట్రేషన్ మార్చుకున్దామా అంటే మళ్ళీ మనం ఇక్కడ పన్ను చెల్లించి, ఎక్కడైతే మొదలుగా రిజిస్ట్రేషన్ ఐనదో వారినుంచి మనమే డబ్బులు వాపసు తీసుకోవాలి.   ఇది జరిగే పనేనా.      పక్క రాష్ట్రం వాహనం ఎప్పుడు వస్తుందా వాణ్ని పట్టుకొని అదిరించి బెదిరింఛి  ఒందో రెండువందలో  లాగుదామని ట్రాఫిక్కు సైతం గాలికి వదిలేసి వాహనదారుల మీదికి అమాంతం దూకే బడుగు పోలీసులు.     ఏంటి ఇదంతా?      

చెక్ పోస్టుల దగ్గర వసూలు చేసే డబ్బులు నెలవారీ మామూళ్ళ రూపంలో సంభందిత మంత్రి గారి వరకు వెళ్తాయి  అనడంలో సందేహం లేదు.    అందుకే ఇలాంటి అర్ధం పర్ధం లేని చట్టాల్ని మార్చడానికి మన పార్లమెంటు సభ్యులకు పాపం  తీరిక లేదు.         అదే వారి జీత భత్యాల విషయంలో ఆఘ మేఘాల మీద సవరణలు చేస్తారు.       దీనికి చిన్న చట్ట సవరణ అవసరం వుంది.    అన్ని రాష్ట్రాలలో రోడ్డు పన్ను ఒకే విధంగా ఉండేలా చూడడం.    అలా రాష్ట్రాలో వసూలైన డబ్బు మొత్తం కేంద్ర ఖాతాలోకి జమ చేయబడాలి.      కేంద్రం దామాషా పద్ధతిలో ఆ పన్ను మొత్తాన్ని రాష్ట్రాలకు పంచాలి.      ఎవరైనా సొంత ఉపయోగం కోసం వాహనాన్ని పొరుగు రాష్ట్రాలకు తీసుకొని పొడలచుకుంటే కేవలం (NOC) నిరభ్యంతర పత్రం, అది కూడా అంతర్జాలంద్వారా, తీసుకొని దగ్గర వుంచుకోవాలి.     

కనీసం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలనాటికైన (2047) ఈ చట్టం అమలులోకి వస్తుందని ఆశిస్తూ.