29, జూన్ 2013, శనివారం

14 అడుగుల నాగు పామును (కింగ్ కోబ్రా) పట్టేశాడుఅత్యంత విషపూరితమైన 14 అడుగుల పొడుగుల  నాగరాజును అత్యంత చాకచక్యంగా పట్టేశాడు 'స్నేక్ కిరణ్'.    అతని సాహసం అభినందనీయం. 


డెక్కన్ హెరాల్డ్‌లో వచ్చిన ఫోటో ఆధారంగా 

అతి త్వరలో భాజపా లోకి తిరిగి రానున్న యడ్యూరప్ప!


దక్షిణాదిన మొట్ట మొదటి సారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత బి ఎస్ యద్యూరప్పకే దక్కుతుంది.    అదే విధంగా భాజపాని ఇటీవలి ఎన్నికలలో మూడవ స్థానానికి దిగజార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.    

ఆయన లేని భాజపా కర్ణాటకలో బోసిపోతోంది.    మోడీ గారు ప్రధాని కావాలంటే కర్నాటక అత్యంత కీలకం.   మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడిన బోహరియా అనే మంత్రివర్యులు గుజరాత్లో అధికారం అనుభవిస్తుండంగా లేనిది, కేవలం 6 వారాలు మాత్రమే జైలులో వున్న యడ్యూరప్ప భాజపాలో వుంటే తప్పేంటి?   అధికారంలోకి రావడం అవసరం గానీ, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చూసి చూడనట్లు పోవాల్సిందే.   యడ్యూరప్ప గారిని పదవీత్చుడ్ని చేయడంలో కీలక పాత్ర వహించిన అద్వానీకి శత్రువైన మోడీకి అత్యంత  ఆప్తుడైన యడ్డీ సహజంగానే మిత్రుడవుతాడు.      అతి త్వరలో ఈ ఘట్టం కూడా మనం చూడబోతున్నాం.     


ఆలోచనలు ప్రాంతీయం - దృష్టి జాతీయం


ఎప్పుడెప్పుడు ప్రధాని పదవి చేపడదామా అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న మోడీ గారు, ఉత్తరాఖండ్ వరదలోచ్చేప్పటికి, కేవలం తన రాష్ట్ర యాత్రీకులు మాత్రమే మనుషుల్లా కనిపించారు.     గుజరాతీలను మాత్రమే గుట్టు చప్పుడు కాకుండా వరద ప్రాంతాలనుంచి తరలించారు.    తనను తాన అత్యంత సమర్దునిగా వర్ణించుకునే వ్యక్తీ,   తన రాష్ట్రానికి చెందిన కార్పోరెట్ల నుంచి సహాయం సేకరించి బాధితులకు అందించాల్సింది.  


సువిశాల భారత దేశ ప్రధానిగా తనను తాను అభివర్ణించుకుంటున్న మోడీ సారు, నిత్య ప్రచార పటాటోపానికి కొన్ని విదేశీ కంసల్టింగ్ సంస్థలను కూడా ఏర్పరచుకున్నారట.     దేశ ప్రధాని అంటే కేవలం డిజైనర్ డ్రెస్, మత ఛాందస వాదం, నిత్య ప్రచార కార్యక్రమాలు  కాదు కావలసింది.    అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుపోయే జాతీయ సెక్యులర్ దృక్పధం అవసరం. అలాంటి గొప్ప వారిలో పూర్వ ప్రధాని,  కాశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చి, ఆదర్శ వివాహం చేసుకున్న మన ఇందిరా గాంధీ .     ఒక సారి చిక్క మగళూరు నుంచి, ఇంకో సారి మెదక్, మరోసారి రాయ్ బరేలి నుంచి గెలిచి దేశ రాజకీయాలకు దిశా దశ నిర్దేశం చేసింది.    ఇదే కోవలోకి వస్తాడు మన పి వి.    బహు భాషా కోవిదుడు, నిరాడంబరుడు, విద్యాధికుడు.    వాజపేయి కూడా ఇదే కోవకు చెందుతారు.   ఇంత గొప్ప వారి సరసన  మోడీని ప్రధానిగా  ఊహించుకోవడం కష్టం.    


26, జూన్ 2013, బుధవారం

గంగా నదీ తీరాన రాజకీయ వరదలు


ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట ముట్టిచ్చుకున్నాట్ట  వెనకటికెవడో, అట్లుంది మన రాష్ట్ర అధికార - ప్రతిపక్ష నాయకుల తీరు.     ఇవ్వాళ డెహరాడూన్ విమానాశ్రయంలో జరిగిన ఈ బూతులాట పంచాంగానికి ససాక్షంగా నిలిచిన ఈ వీడియోలు చూడండి  : 

http://www.youtube.com/watch?v=vhFQfWzNZu8     తెలుగు మీడియా 
http://www.youtube.com/watch?v=ZYKsJeg4h8w      హిందీ మీడియా ఎల్ బి నగర్ కూడలిలో ఉదయాన్నే 5 గంటలకు ఊర్ల నుంచి వచ్చే బస్సులు ఆగినప్పుడు, మన ప్రమేయం లేకుండానే ఆటో వాళ్ళు సంచిని మనతో సహా ఒక్క ఊపున కిందకు దించుతారు చూడండి, సరిగ్గా డూన్ విమానాశ్రయంలో వి హనుమంత రావు గారు జనాల్ని కాంగ్రెస్ విమానం ఎక్కిస్తే, రాథోడ్ గారు కొంత మంది జనాల్ని తెదాపా విమానం ఎక్కించి టిక్కెట్లు కొట్టి కూర్చో పెట్టి బెల్టు కూడా కట్టారు.   ఇంతలో కాంగ్రెస్ పెద్దాయన ఒకాయన, మా విమానంలో దారిలో తినడానికి అదిరిపోయే ఫుడ్ అరేంజ్ చేశాం అని కేకాసారు.     ఆప్తులను వదిలి 10 రోజుల పైగా నరకం అనుభవిస్తున్న బాధితులు విస్తుపోగా, డూన్ విమానాశ్రయ ప్రయాణీకులు, సెక్యూరిటి సిబ్బంది నవ్వుకున్నారు. 


బాధితులను ఆదుకొనే సదుద్దేశంతో మొట్టమొదట చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గార్లు ఎ పి భవన్ కు చేరుకున్నారు.    అయితే, మొదటి రెండు రోజులు వరదల తీవ్రత, ప్రాణ నష్టం అంచనా వేయడంలో కొంత వరకు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.     పార్టీల వారీగా వున్న తెలుగు మీడియా ఎప్పుడైతే, కొండలు గుట్టలు పాకడం మొదలు పెట్టిందో, ప్రభుత్వానికి వరదల నష్టం అర్ధమైంది.     బాబు గారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.    బట్టలు డబ్బులు విరాళంగా అందించారు.   ఎ పి భవన్ రెసిడెంట్ కమీషనర్ గోయల్‌పై విరుచుకు పడ్డారు.  ఇంతవరకు అభినందించ తగ్గ విషయం.


అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రిని ఇంగ్లీష్, తింగ్లీశ్ లో కేక లేశారు.  పుండు మీద కారం చల్లినట్లు,  మెడికల్ టీమ్స్ పేరుతో ఎ పి భవన్లో తాత్కాలిక పార్టీ ఆఫీస్ పెట్టారు.    నిజంగా రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతె, డాక్టర్ల జేబులకు తెదేపా బాడ్జ్ లు, టేబుళ్ళకు  బాబు గారి ఫోటో వున్న బ్యానర్లు ఎందుకండి.   మోడీని ఆదర్శంగా తీసుకుని బాబు గారు కూడా (రాయల సీమ నుంచి తెప్పించారేమో) ఒక 30 తెల్ల సుమోలు, విమానాలు, హెలికాప్టర్లు, కేసినేని వారి సౌజన్యంతో బస్సులు (బస్సు ముందు భాగంలో తెదేపా బ్యానర్లు మర్చిపోలేదు సుమా) ఏర్పాటు చేశారు.      తెదేపా చర్యలవల్ల ప్రభుత్వంలో కదలిక ఒచ్చిన మాట వాస్తవం.    కానీ మీడియా సాక్షిగా జరుగుతున్న ఈ కార్యక్రమం మాత్రం బాగా లేదు.    


ఇది నిజంగా రాజకీయం కాకపొతే, ఒట్టేసి చెప్పమనండి, వచ్చే ఎన్నికలలో మోడీ, తెదాపా మరియు ఇతర పక్షాలు  ఈ విషయాల్ని  ప్రస్తావించనని?  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.   ఎన్నికలప్పుడు ఈ విషయాన్ని తన పరిపాలనా నైపుణ్యంతో ముడిపెట్టి వోట్లు అడిగేది అడిగేదే.  

కెమారాకే కాదు, ఏనుగుకి కూడా చిక్కాడుఈ మధ్య  వార్తలలో తరచూ మనం వింటున్నాం, ఏనుగులు, పులులు జనారణ్యంలోకి వస్తున్నాయని.    వాస్తవానికి మనమే జంతువుల  ఆవాసాలైన అడవులను నరికి, ఎక్కడపడితే అక్కడ చెరువులు, కుంటలు ఆక్రమిస్తూ, వాటి అరణ్యాలను మనమే హరిస్తూ ప్రకృతినే సవాలు చెస్తున్నాము.      ఏనుగులు కానీ, పులులు కానీ అడవి వదలి బయటకు రావాలని కోరుకోవు.   పులులైతే, వయసు మళ్ళిన తరువాత దానికి చెందిన అటవీ ప్రాంతంలోకి వయసులో వున్న వేరే  పులి ప్రవేసించి ఆక్రమణకు ప్రయత్నిస్తే (TERROTORIAL ఫైట్) వృద్ధ వ్యాగ్రాలు లేదా ఓడిపోయిన జంతువు తన టెరిటరీ కోల్పోయి బయటకు వస్తుంది.     అలాగే ఏనుగులకు ఒక   కారిడార్ వుంటుంది.    ఏనుగుల మంద ఎన్ని సార్లు ప్రయాణం చేసినా అదే దారులలో నడుస్తుంది.     దాని మల మూత్ర విసర్జన ద్వారా వచ్చే రసాయనాల వాసన వలన ఏనుగులు   దారి తప్ప కుండా వాటిన గమ్యం చేరుతాయి.    అడవుల నరికివేత ద్వారా ఆహారం, నీరు కోల్పోయిన జంతువులు జనావాసాల మీద పడుతున్నాయి.   


రెండు రోజుల క్రితం బెంగళూరు సిటీ నుంచి కేవలం 45 కిలో మీటర్ల దూరంలో మాలుర్ అటవీ ప్రాంతంలో (ఇక్కడకీ అతి సమీపంలో కొత్తగా పెద్ద పారిశ్రామిక వాడ వెలిసింది) పెద్ద ఏనుగుల మంద వచ్చింది.     ఏనుగు, చిన్న శబ్దం వచ్చినా పసికడుతుంది మరియు ఎక్కువ శబ్దం దానికి చికాకు కలిగిస్తుంది.   వాటి మానాన వాటిని వదిలి పెట్టకుండా మునిరాజు అనే వ్యక్త్రి కేవలం 30 అడుగుల దూరం నుంచి చూడడానికి ప్రయత్నం చేశాడు.   దురద్రష్ట వశాత్తు అదే సమయంలో అతని జేబులోని చరవాణి (సెల్ ఫోన్) మోగడంతో, ఒక పెద్ద ఏనుగు అతనిని వెంబడించి   తొండంతో చుట్టి కాలుకింద పడేసి తొక్కే సమయంలో సమీపంలో నిలబడి చూస్తున్న వారు చేసిన హంగామాకు భయపడి దూరంగా వెళ్ళింది.   ఈ ఘటనలో మునిరాజు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.       అక్కడకు దగ్గరలోనే వున్న విజయ కర్నాటక పత్రిక ఫోటో జర్నలిస్టు తను పరుగెడుతూ కూడా ఈ దురదృష్ట సంఘటనను తన కేమారాతో చిత్రాలు తీశాడు.  


జంతువులు మన జోలికి రావు, అలా అని వాటి జోలికి మనం వెళితే విషాదమే మిగులుతుంది.     


ఫోటో సౌజన్యం : విజయ కర్నాటక 

24, జూన్ 2013, సోమవారం

నమస్తే తెలంగాణా రధం, అనవసర ప్రయత్నం


నమస్తే తెలంగాణా పత్రిక అధిపతి, గుత్తేదారు అయిన రాజాం గారు తెలంగాణా రధం పేరిట ఒక వాహనాన్ని కృష్ణా జిల్లాకు పంపారు.   దీని ఉద్దేశం,  తీర ప్రాంత ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణాకు అనుగుణంగా వారి మద్దతు కూడగట్టడం.    ఇది నిజంగా హర్షించదగ్గ చర్య.     అయితే, ఇదే రాజాం గారు తన పత్రిక ద్వారా, అను నిత్యం ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.    వారి అంతర్జాల ఎడిషన్ లో వార్తా కధనాలకు పాఠ కులనుండి వచ్చే 'రీడర్స్ కామెంట్స్' ని మోడరేట్ చేసి ప్రచురిస్తారు.    వారు మోడరేట్ చేసిన వ్యాఖ్యానాలు చూస్తె అర్ధమౌతుంది వారికి మిగిలిన ప్రాంత ప్రజల మీద వున్న అభిమానం.    వాటి నిండా పచ్చి బూతులు.   సభ్య సమాజం తలదించుకునేలా వుండే అసభ్యకర రాతలు.   


ప్రెస్ క్లబ్ లో వేరే ప్రాంతం వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేసి, దానినే ఒక పెద్ద విజయంగా నమస్తే తెలంగాణా పత్రికలో ప్రచురించినప్పుడు వేరే ప్రాంత ప్రజలు గుర్తుకు  రాలేదా!   తెలంగాణా ప్రాంతంలో వేరే ప్రాంత ప్రజలు ఉండటానికి వీలు లేదని మీ పత్రిక ద్వారా అనేక సందర్భాలలో ప్రచురించారు.    అప్పుడు తీర ప్రాంత ప్రజలు గుర్తుకు రాలేదా?   పత్రికా స్వేచ్చ ముసుగులో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు లేని పెద్దరికం, ఇప్పుడు ఎక్కడ నించి వచ్చింది.     సింగిడి కవులు పేరుతొ పచ్చి బూతులు రాసినపుడు గర్హించని మీ గురువింద నీతిని ఏమనాలి?  


ఏ పత్రిక కూడా ఒకే ప్రాంతానికి పరిమితమై తన మనుగడ సాధించలేదు.    కేవలం సర్కులేషన్ పెంచుకునేందుకు మీరు చేస్తున్న నాటకంలో భాగంగానే మీ దండ యాత్రగా భావించాల్సి వుంటుంది.   

20, జూన్ 2013, గురువారం

దీని భావమేమి తిరుమలేశా!


మన భాషలో వున్న చమత్కారం, తెలుగు వాళ్ళలో వున్న చతురత, భాషపై అన్ని వర్గాల ప్రజలకు వున్న అభిమానం, పట్టు ఇలాంటి పద్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.   


బావ, మరదలిని తమలపాకులలోకి సున్నం కావాలని, ఒక బావ, తన మరదలితో ఎంత చమత్కారంగా అడుగుతున్నాడో చూడండి.    


పర్వత శ్రేష్ఠ  పుత్రికా పతి విరోధి 
యన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి 
పేర్మిమీరిన ముద్దలా పెద్ద బిడ్డ!
సున్నమించుక తే(గదే సుందరాంగి!


పర్వత శ్రేష్ఠ  పుత్రిక = పర్వత శ్రేష్టుడు అంటే హిమవన్తుదు.   ఆయన పుత్రిక పార్వతీ దేవి.   ఆమె భర్త శివుడు, ఆయనకు విరోధి మన్మధుడు - ఆయన అన్న బ్రహ్మ దేవుడు - బ్రహ్మ దేవుని భార్య సరస్వతి - సరస్వతీ దేవి అత్త గారు లక్ష్మీ దేవి - ఆమె తండ్రి సముద్రుడు = సముద్రిని పెద్ద కూతురు పెద్దమ్మ ( నీకేమైనా దరిద్ర  పెద్దమ్మ నెత్తినెక్కిన్దా అని పెద్ద వాళ్ళు అంటారు కదా, ఆమె ఈ పెద్దమ్మ)  - స్థూలంగా ఈ పద్యం అర్ధ్యం ఏంటంటే, ఓసి పెద్దమ్మా సున్నం తీసుకురా అని చమత్కారం. 


ఆయన మరదలు కూడా బావ గారికి చమత్కార పద్యంతో పాటు సున్నం కూడా ఇచ్చింది. 

శతపత్రంబుల మిత్రుని 
సుతు(జంపిన వాని బావ సూనుని మామన్ 
సతతము( దాల్చెడు నాతని 
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో !

శతపత్రాలు అంటే తామరాకులు ; వాటికి మిత్రుడు సూర్యుడు; 
సూర్యుని పుత్రుడు కర్ణుడు; ఆయనను చంపినవాడు అర్జునుడు ; అర్జునుని బావ కృష్ణుడు ; కృష్ణుని సూనుడు 
మన్మధుడు;  ఆయన మామ చంద్రుడు;  సతతము అంటే ఎప్పుడూ/ నిరంతరం ; చంద్రుడ్ని ఎప్పుడు తలమీద  ధరించేవాడు  శివుడు ; శివుని కుమారుడు గణపతి ; గణపతి వాహనం మూషికం ; ఎలుకకు విరోధి పిల్లి; పిల్లికి విరోధి కుక్క; 

ఈ పద్యం ద్వారా మరదలు " ఒరే కుక్కా సున్నమిదిగో" అని తనను దరిద్రపు గోట్టుతో పోల్చిన బావకు పెట్టిన సున్నం. 


గమనిక :  ఇలాంటి పద్యాలు మీ దగ్గర ఉన్నట్లయితే, నాకు పంపించండి - మిగిలన  తెలుగు వారితో పంచుకోండి.   మీ పిల్లలకు ఆటవిడుపుగా చెప్తే, వారికి మన భాషపై అభిమానం పెరుగుతుంది.  

18, జూన్ 2013, మంగళవారం

ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

పాపం కేకే!   ఎట్లుండే మనిషి ఎలా ఐపోయాడో చూడండి.    తెలుగులో సరిగా మాట్లాడ లేకపోయినా, ఆంగ్లం మరియు హిందీలలో అనర్గళంగా అర్ధంకాకుండా మాట్లాడే మన కేకే ఇప్పుడు ఒక ఉప ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి.     పేరు వినడానికి మాత్రం చాలా బాగుంది, అదేదో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ లాగా.      నావ లాంటి కారు నడిపే మన సరంగు కచరా గారు ఆయన్ని ఈ పదవి ద్వారా బోడి మల్లయ్యను చేసేశాడు.     ఇద్దరు ఎంపీలను తెరాసాలో చేర్పించిన మన కేకే  ఇప్పుడు జాతీయ స్థాయి పదవికి ప్రమోట్ అయ్యాడు.        


ఒకప్పటి పి సి సి అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు, మాజీ మంత్రి, బెంగాల్ ఎన్నికల ఇంచార్జ్ కి పట్టిన గతి ఇది.     మన కారు సారధి ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి మైండు బ్లాకు అయివుంటుంది పాపం.     

మంత్రి వర్గంలో ఆంద్ర ప్రదెశ్ కు న్యాయం


సార్వత్రిక ఎన్నికలకు కేవలం 10 మాసాల గడువు ఉన్నపట్టికి, 29 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపి యు పి ఎ ప్రభుత్వ మనుగడకు ఆధారమైన కాంగ్రెస్ సభ్యులను పార్లమెంటుకు పంపిన ఆంద్ర ప్రదెశ్కు  ఎట్టకేలకు సముచిత గౌరవం దక్కింది.   


తెరాసా నాయకుడు హరీష్ మాత్రం, మంత్రి వర్గ విస్తరణలో కూడా తెలంగాణాకు అన్యాయం జరిగిందని వాపోయారు. 


రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ప్రతిధ్వని అనే సినిమాలో బలగం పొట్టి సీతయ్య అనే ఒక కారెక్టర్ వుంది.   అందులో పరుచూరి గోపాల కృష్ణకు సహాయకుడిగా ఒక విలేఖరి (అల్లు?) ఉంటాడు.    ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాడు బలగం పొట్టి సీతయ్య అనే ప్రతి పక్ష నాయకుడు.    ముఖ్యమంత్రి గారి భార్య ఆసుపత్రిలో వుంది అని విలేఖరి చెప్తాడు.    అయితే రెండు స్టే ట్ మెంటులు రాస్కో, ఒకవేళ ముఖ్యమంత్రి గారు భార్యను చూడడానికి వెళితే, ఇక్కడ రాష్ట్రం అగ్గి మీద గుగ్గిలంలా వుంటే, ప్రజల్ని వాళ్ళ కర్మకు వదిలేసి భార్య కోసం మద్రాసు వెళతాడా అని రాస్కోండి.     ఒక వేళ భార్యను చూడడానికి వెళ్ళాక పొతే, కట్టుకున్న భార్య మీదే ప్రేమ లేని వాడికి ప్రజల మీద ఈయనకేం ప్రేమ వుంటుంది అనేది రెండో స్టేట్మెంట్.      


మొన్నటి దాకా, ఇక్కడి పిల్లలు వేల సంఖ్యలో పిట్టల్లా రాలిపోతూ ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే, తెలంగాణా ప్రాంతం నుంచి ఎవరు పదవుల కోసం పాకులాడినా, మంత్రివర్గంలో చేరినా వాళ్ళంతా తెలంగాణా ద్రోహులే అని చెప్పారు.     ఇప్పుడేమో  మంత్రి వర్గంలో  తెలంగాణాకు అన్యాయం జరిగిందని  అంటారు.  మొట్టమొదటగా మంత్రివర్గంలో చోటు దక్కింది జైపాల్ రెడ్డి గారికి ఆ తరువాత సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ గార్లకు.      చివరకు ఇంకా 10 నెలలు మాత్రమె ఉందనగా ఇప్పుడు మరో ఇద్దరికీ దక్కింది.    


కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది తెలంగాణా ఏమ్పీలలో ఇద్దరు తెరాస కండువా కప్పుకున్నారు.   పాపం రాజయ్యకు అనుకున్నది దక్కక కారు దిగాడు.   ముగ్గురు ఎం పీ లు ఇప్పటికే మంత్రులు కాగా మిగిలింది ఐదుగురు మాత్రమే.     ఈ ఐదుగురిలో ఒకాయన తెలుగు దేశం నుంచి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన జైపాల్ రెడ్డి బంధువు కాగా,  అదే జిల్లాకు చెందినా ఇంకొక వ్యక్త్రి ఎన్నికలలోపు జగన్ దగ్గరికో, తెరాసా దగ్గరికో వెళ్ళే ఆలోచనలో వున్న ఇంకో పెద్ద మనిషి.       ఒక్క సురేష్ శేట్కర్ తక్క మిగిలిన ఇద్దరు (పొన్నం, మధు  యాష్కీ)    వీలున్నప్పుడల్లా ముఖ్యమంత్రిని విమర్శిస్తారు.      మరి మంత్రి వర్గంలో చోటు ఎలా దక్కుతుంది చెప్పండి హరీష్ గారు?తెలంగాణా నుంచి మంత్రి పదవికి ఎక్కువ అర్హత కలిగిన ఎంపీలు ఎవరైనా వున్నారా అంటే, అది కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు మాత్రమే.    ఆయన మంత్రివర్గంలో చేరి వారి ప్రాంతాంకి కావలసిన నిధులు తెచ్చుకుంటే తప్పేంది?   తెలంగాణాను ఉద్ధరిస్తే తప్పేంటి?   ఆలోచించండి సారూ. 


భాజపా కు అచ్చిరాని సంఖ్య 2


1984 ఎన్నికలలో దాదాపు దేశంలోనే మొట్టమొదట వెల్లడించిన ఫలితం హనంకొండ పార్లమెంటు స్థానం.    గెలిచిన చందుపట్ల జంగా రెడ్డి స్వర్గీయ పి వి నరసింహా రావు పై విజయం సాధించారు.    ఈ స్థానం కాకుండా భాజపా మరో అభ్యర్ధి పటేల్ అహ్మదాబాద్ నుంచి గెలుపొందారు.    అప్పట్లో రేడియోలు తప్ప టి వి లు పెద్దగా అందుబాటులో లేని రొజులు.     ఎంత సేపు రేడియో విన్నా, ఈ ఇద్దరు తప్ప భాజపా తరఫున మూడో అభ్యర్దే గెలవ లేదు.      కుటుంబ నియంత్రణ లాగా ఇద్దరితో ఆగిపోయింది.    


2004లో దాదాపు 15 పార్టీలు వున్న ఎన్ డి ఎ కూటమి, మంచం కోళ్ళ లెక్కలాగా కేవలం శివసేన, అకాలీ దళ్ అనే రెండు పార్టీల మద్దతుకు పడిపోయింది.    అలాగే, ఆ పార్టీలో అంతకుముందు వరకు రెండవ స్థానంలో వున్న అద్వానీ గారిని పక్కకు పెట్టడమే కాదు, ఆయన ఇంటిపై మోడీ వర్గం వారు రాళ్ళు వేసేవరకు వచ్చారు.    


ఇవన్నీ చూస్తుంటే, భాజపాకు సంఖ్యా శాస్త్రం ప్రకారం రెండు అనే సంఖ్య అంతగా అచ్చొచినట్లు కనపడడం లేదు.   

10, జూన్ 2013, సోమవారం

భాజపాలో ముసలం : పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా


భాజపా కురువృద్ధుడు, తనను అంపశయ్యపై వున్న భీష్ముడితో పోల్చుకున్న లాల్ కృష్ణ అద్వానీ గారు ఎన్ డి ఎ అధ్యక్ష పదవికి, పార్లమెంటు పార్టీ నాయకుడి పదవికి తప్ప పార్టీ లోని పార్లమెంటు  బోర్డుకు, ఎన్నికల కమిటీకి మరియు జాతీయ ఎగ్సికుటివ్ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.    తన ప్రత్యెక దూత దీపక్ చోప్రా ద్వారా పార్టీ అధ్యక్షుని రాజీనామా లేఖ పంపించారు.    దీంతో, అద్వానీ గారి అనారోగ్య  కారణం వెనుక వున్న అసలు మతలబు బయట పడింది.    ఈ  హటాత్పరిణామంతో ఖంగు తిన్న పార్టీ అగ్ర నాయకత్వం అద్వానీని బుజ్జగించే పనిలో పడింది. 


బహుశా ఒకటి రెండు రోజులలో మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా శరద్ యాదవ్ నాయకత్వంలోని జనతా దళ్ (u ) కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించి ఎన్ డి ఎ నుంచి బయట పడే అవకాశం వుంది.     మరోసారి మమతా బెనర్జీ కూడా యు పి ఎ కు మద్దతు ఇచ్చే అవకాశం  వుంది.    2014 బెంగాల్   ఎన్నికలలో అటు ఎన్ డి ఎ కు మద్దతు ఇస్తే, మైనార్టీ వోట్లు పడవు.    ధర్డ్ ప్రంట్లో కమ్యునిస్టులు వుంటారు కాబట్టి, యు పి ఎ మినహా మమతకు వేరే దారే లేదు.      ఇదే పరిస్తితి ఎన్ సి పి కి, బిజు జనతా దళ్ కు కూడా వర్తిస్తుంది.    


మోడీ ని భావి ప్రధాని అభ్యర్ధిగా చెప్పడం ద్వారా, భాజపా అంతర్గత కలహాలు ఎటు దారి తీస్తాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

మోడీ వెలిగిపోతున్నాడా!


ప్రమోద్ మహాజన్ గారు జీవించి వున్న కాలంలో 2004 ఎన్నికలప్పుడు ఇండియా షైనింగ్ పేరిట హంగామా చేసి బాక్సాఫీసు ముందు బొక్క బోర్లా పడింది భాజపా .      ప్రస్తుతం న. మో జపంతో గుజరాత్ షైనింగ్ కాబట్టి భారత్ కూడా తప్పకుండా వెలుగొందుతుంది.   నమో గారిని ప్రధానిగా ఎన్నుకోండి, గుజరాత్లో తను చేసిన పనులే మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేస్తాడు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది భాజపా.   


సువిశాల భారతావనికి ప్రధాని కావలసిన అర్హతలు మోడీకి ఉన్నాయా లేవా అనేది అనవసరం.    ఆయన ఆధ్వర్యంలో జరిగినట్లుగా ఆరోపణలు వున్న గుజరాత్ నరమేధం గురించి మర్చిపోదాం.    ప్రపంచ దేశాలలో ఆయనపై వున్న అభిప్రాయం మనకు అవసరం.    ఆయనకు వున్న విద్యార్హతలు, విదేశాంగ వ్యవహారాలపై  వున్న అవగాహన మనకు అవసరం.      మనది లౌకిక వాద దేశం.   దేశ జనాభాలో 75% మంది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు వున్నారు.   భాజపా గురించి గానీ, మోడీ గురించి గానీ  ఈ దేశ జనాభాలో 75 శాతం మందికి అవగాహన లేదు.    


గుజరాత్ లో తాము ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాము అని గర్వంగా చెప్పుకొనే భాజపా నేతలు, ఆ రహస్యాన్ని చిన్న రాష్ట్రమైన చత్తీస్గడ్ (అక్కడ వుంది కూడా భాజపా ప్రభుత్వమే) పాలకులకు తెలిపితే వారు కూడా ఆ మార్గాన్ని అనుసరించి ఉగ్రవాదాన్ని అణచివేస్తారు కదా ! మరి ఆపని ఎందుకు చెయ్యరు.   


చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పే భాజపా, 17 కోట్ల ప్రజానీకం వున్న ఉత్తర ప్రదేశ్ ను విభజించడానికి ఎందుకు ఒప్పుకోదు?   ఎప్పుడో తీర్మానించిన ప్రత్యేక విదర్భ గురించి ఎందుకు ప్రస్తావించదు.    రాజధాని వున్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోకూడదు అన్న అద్వానీ అభిమతాన్ని వ్యతిరేకిస్తారా?     ఒకే చట్టం, ఒకే ప్రజ, ఒకే న్యాయం అనే మీ సిద్ధాంతాన్ని మీరు అధికారంలో వున్నపుడు ఎందుకు అమలు చెయ్యలేదు?  


ఎన్నికలప్పుడు, తాము గతంలో చేసిన కార్యక్రమాలు, రాబోయే ఐదు సంవత్సరాలలో చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పాలి గాని కేవలం మోడీ గురించి చెప్పి వోట్లు కొల్లకోడతాం అని విర్ర వీగడం ప్రజలను వంచించడమే.    ఒక సందర్భంలో రామ జన్మభూమిని అడ్డుపెట్టుకుని ఎన్నికలలో నెగ్గారు.   ఈ సారి మోడీ హిందుత్వ అవతారికను అడ్డం పెట్టుకొని నేట్టుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు.     ఇలాంటి ప్రయత్నాలు సఫలం అయితే, రాబోయే కాలంలో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకోవడం ఖాయం.  

9, జూన్ 2013, ఆదివారం

ఎ పి పి ఎస్ సి ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూ అవసరమా


రాజకీయ నిరుద్యోగులకు ఎ పి పి ఎస్ సి ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇటీవల పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి.   కేంద్ర సర్వీసులలో గుమస్తా, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీసర్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ గత కొన్ని దశాబ్దాలుగా నియామకాలను చేపడుతోంది.    ఈ పరీక్ష కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నల ఆధారంగా మాత్రమె దేశవ్యాప్తంగా నాలుగు జోన్ల ద్వారా నిర్వహించబడుతుంది.   పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఉద్యోగుల నియామకం జరుగుతుంది.    ఈ విధానం పారదర్శకంగా జరుగుతుంది.     


ఎ పి పి ఎస్ సి ఇచ్చే చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూ పేరుతో డబ్బులు దండుకొనే విధానానికి ఇక నుండైనా స్వస్తి చెప్పాలి.      బోర్డు సభ్యులను కూడా కేవలం పదవీ విరమణ చేసి నిజాయతీతో పేరుతెచ్చుకున్న IAS అధికారులను మాత్రమె నియమించాలి.     ఎట్టి పరిస్తితులలో రాజకీయ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వకూడదు.    ఈ సంస్థ సభ్యులను నియమించే అధికారం కేవలం గవర్నర్ పర్యవేక్షణలో జరగాలి.    


ఇలాంటి తక్షణ చర్యల ద్వారా మాత్రమే ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట కల్పించ గలదు. 

ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలి


మన రాష్ట్రం గత మూడు సంవత్సరాలలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.    అందులో ముఖ్యమైనవి - ముగ్గురు ముఖ్య మంత్రులు మారడం, ఆహార దీక్ష,  సకల జనుల సమ్మె పేరిట సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం,  భూకంపాలు సృష్టించడం, గుఱ్ఱం జాషువా మొదలు, శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాల వరకు నేలపాలు చెయ్యడం, కేబుళ్ళు తగల పెట్టడం,  18 సార్లు ఉప ఎన్నికలు రావడం, అసంఖ్యాకంగా ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ మరియు పార్లమెంటు సభ్యులు పార్టీలు మారడం, ఒక ఎంపీ, ఒక ఎం ఎల్ ఎ జైలు లో వుండటం మొ॥ 


ఈ రికార్డులన్నిటితోపాటు, నిన్న సభాపతి గారి  తీర్పు ద్వారా సభ్యత్వం కోల్పోయిన మరో 15 మంది మాజీలు అయ్యారు.   రాజకీయ పార్టీల స్వార్ధానికి ప్రజలపై మరోసారి భారం పడాల్సిన అగత్యం నుంచి దాదాపు తప్పించుకున్నట్లే.   ఐదు సంవత్సారాలు తమ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఎన్నుకున్న ప్రజలను మధ్యలోనే ముంచేసి, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేశారు. 


ఈ ప్రమాదకరమైన పరిస్తితి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సమయం ఆసన్నమైంది.    ప్రజా ప్రతినిధులు రాజానామా చేసి పార్టీ మారదలచుకుంటే, ఆ ప్రతినిధి కనీసం మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికలలో పోటీ చెయ్యకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చెయ్యాలి.   నియోజకవర్గ ప్రజల మనోభావాలు పేరుతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉప ఎన్నికలు తెస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నాయకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం వుంది.   

7, జూన్ 2013, శుక్రవారం

సి బి ఐ జాయంట్ డైరెక్టర్ బదిలీ


గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదింపుతూ సి బి ఐ జాయంట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ బదిలీని సి బి ఐ డైరెక్టర్ నిర్ధారించారు .    అత్యంత సమర్ధుడుగా, నిజాయితీ పరుడుగా ఎన్నో క్లిష్టమైన, కీలకమైన కేసులను ఛేదించిన ఘనత  ఆయనకు దక్కుతుంది.    కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి న్యాయ, పోలీసు వ్యవస్థపై సామాన్య ప్రజలలో నమ్మకాని ఇనుమడింప చేసిన  హీరో లక్ష్మీనారాయణ.    


పత్రికా స్వాతంత్ర్యం మాటున అను నిత్యం తన గురించి ఒక పత్రికలో విమర్శలు గుప్పిస్తున్నా ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా, మొక్కవోని ధైర్యంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ధీరుడాయన.    చిన్న చిన్న పట్టణాలలో కూడా ఆయన కటౌట్లు పెట్టి సినిమా హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఇచ్చారంటేనే ఆయన ఖ్యాతి తెలుస్తుంది. 


ఆయన మహారాష్ట్రకు వెళ్ళినా, దిల్లీకి వెళ్ళినా, ఒక నిజాయతీ కల అధికారి ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో ఆయన పేరు చెప్తేనే స్ఫురణకు రావడం ఖాయం.    శ్రీ లక్ష్మీనారాయణ తెలుగువాడైనందుకు  గర్వపడదాం  

5, జూన్ 2013, బుధవారం

బిల్డర్ల మోసాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి


అరచేతిలో తీర్ధం పోసి మోచేత్తో నాకిస్తారు అనే పాతకాలం సామెత బిల్డర్లకు బాగా వర్తిస్తుంది.   కేంద్ర ప్రభుత్వం బిల్డర్ల మోసాలపై ఎట్టకేలకు కొన్ని కఠిన చర్యలను ప్రతిపాదించ దలచుకోవడం ఆహ్వానించతగ్గ పరిణామం.   స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత మధ్య తరగతి ప్రజల పక్షాన నిలబడదలచుకోవడం సంతోషం. 

సాధారణంగా బిల్డర్లు చేసే మోసాలు : 

1) బ్రోచర్లో చూపించే విషయాలకు వాస్తవానికి పొంతన లేక పోవడం 
2) కామన్ ఏరియా పేరిట 25-30 శాతం వరకు అదనంగా వసూలు చెయ్యడం 
3) ప్రభుత్వ అనుమతి పొందిన ప్లానుకు, తను కట్టిన ఇంటి ప్లానుకు తేడా వుండటం 
4) బాంకులతో కుమ్మక్కై వినియోగదారుడి మీద ఒత్తిడి పెంచి పూర్తైన పనికన్నా ఎక్కువ డబ్బులు తీసుకొని 
    వడ్డీల దెబ్బతో పీడించడం 
5) లిఫ్ట్, జనరేటర్, విద్యుత్ సామాగ్రి, సానిటరీ సామాన్ల బ్రాండ్ ల గురించి చెప్పింది చెయ్యక పోవడం లేదా 
    నాణ్యత తక్కువ వున్నా వస్తువులను అమర్చడం 
6) అమ్మకం పన్నును 8 శాతం కొనుగోలుదారుడి నుంచి వసూలు చేసి, ప్రభుత్వానికి జమ చెయ్యక పోవడం 
7) ఆస్తి పత్రాలకు సంబంధించిన లోపాలు 
8) అనుకున్న సమయానికి కట్టడాన్ని అందివ్వక పోవడం 
9) ఆస్తిని అమ్మిన తరువాత దానిలో వచ్చే లోపాలకు బాధ్యత వహించక పోవడం 
10) వాహన పార్కింగు స్థలం ఏ ప్రాతిపదికన చేస్తారో చెప్పాలి 
వీటన్నిటికీ పరిష్కారం - అంబుడ్స్‌మెన్ 

- బీమా కంపెనీల తరహాలో ఒక అంబుడ్స్‌మెన్ ను ప్రభుత్వం నియమించాలి 
- బిల్డర్ వివరాలను అంతర్జాలంలో వుంచి, ఆ కంపనీ గతంలో చేపట్టిన బిల్డింగ్స్ తాలూకు వివరాలు ఉంచాలి 
- ప్రతి ఖాతాదారుడి నుంచి తనకు సకాలంలో, అందించిన వివరాల మేరకు ఫ్లాట్ ను ఎలాంటి ఇబ్బంది లేకుండా 
   ఇచ్చినట్లు బిల్డర్ సర్టిఫికేట్ తీసుకోవాలి 
- కట్టుబడిలో లోపాలు వున్నట్లు భవిష్యత్‌లో నిర్ధారణైతె,  బిల్డర్‌ను బాధ్యుడని చెయ్యాలి 
- నిభందనలకు వ్యతిరేకంగా కట్టే నిర్మాణాలకు భవిష్యత్‌లో జరిగే నష్టాన్ని బిల్డర్ భరించాలి 

ధరలు కొంచెం పెరిగినా, కఠినమైన నిబంధనల ద్వారా  అక్రమ మార్గాల ద్వారా గొప్ప వాళ్ళు కావాలనుకొనే బిల్డర్లకు గుణపాఠం కావాలి. 


4, జూన్ 2013, మంగళవారం

రాజకీయ పార్టీలు - సమాచార చట్టం


సమాచార హక్కు చట్టంకు సంబంధించిన బిల్లును  2005 మే 11న లోక్ సభ ఆమోదించడం ద్వారా పౌర సమాజానికి నిజామైన స్వాతత్ర్యం లభించినట్లైంది.    జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశమంతటా వర్తించే ఈ చట్టం అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంలో కొంత వరకు సఫలీకృతమైంది అని చెప్పక తప్పదు. 


కేంద్ర సమాచార కమీషన్ కొత్తగా రాజకీయ పార్టీలను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోనికి తేవడానికి ప్రయత్నాలు చెయ్యడం ఆహ్వానించతగ్గ పరిణామం.   సహ చట్ట పరిధిలోకి రాజకీయ పార్టీలను తెచ్చినప్పటికీ, దాని నియంత్రణ,  ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.     ఏ రాజకీయ పక్షమైనా తమకు చెక్కుల రూపంలో వచ్చిన డబ్బుకు  మాత్రమె లెక్కలు చూపిస్తూ, తాము సభలకు - సమావేశాలకు, ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును తక్కువచేసి చూపిస్తూ 'బాలెన్స్' చేసుకుంటూ వుంటాయి.    ఇలాంటి వెసులుబాటు ఉన్నంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చు.   


అన్ని పెద్ద రాజకీయ పక్షాలకు ఇలాంటి చట్టం చికాకు కలిగించే విషయం కాబట్టి, అందరూ కలిసి మహిళా బిల్లును అడ్డుకున్నట్లే దీనిని కూడా అడ్డుకొనే అవకాశం వుంది.  

3, జూన్ 2013, సోమవారం

అంకెలు కూడా రాని వరుడ్ని తిరస్కరించిన పెళ్లి కుమార్తె


పాట్నాకు సుమారు 100 కి మీ దూరంలోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన సంఘటన ఇది.   పెళ్ళికి కొద్ది గంటలు సమయం ఉందనగా పెళ్లి కుమారుడు ఊరేగింపుగా భాజా భజంత్రీలతో అందంగా అలంకరించిన పెళ్లి మండపానికి విచ్చేశాడు.   పెళ్ళి కూతురు కూడా ముస్తాబై  పెళ్ళికి రెడీ అయింది.    పెళ్లి తంతు మొదలు పెట్టడానికి ముందుగా ఆనవాయితీ ప్రకారం పెళ్లి కొడుకు రూ. 101 పురోహితుడికి ఇవ్వాల్సి వుంటుంది.     చిల్లరగా వున్న నోట్లను లెక్కించడంలో పెళ్ళికొడుకు ఇబ్బందిని గమనించిన పెళ్లి కూతురు చిన్న మొత్తంలో వున్న డబ్బును కూడా లెక్కించడం రాణి పెళ్లి కొడుకును భాగస్వామిగా చేసుకోవడానికి  ససేమిరా  అనడంతో, విస్తు పోవడం పెళ్లి  పెద్దల వంతైంది.   విచిత్రమేమిటంటే, పెళ్ళికొడుకు ఊరి పేరు ఇంగ్లీష్ పురా.   అమ్మాయి కూడా ఏమంత చదువుకుంది కాదు.     కనీసం మెట్రిక్ కూడా చదవని ఆ అమ్మాయి తన భర్త మాత్రం కాస్తో కూస్తో చదువుకున్నవాడై వుండాలని కోరుకుంది.   


భోజ్పూర్జి జిల్లాలో  ఇలా పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోవడం ఈ మధ్య కాలంలో ఇది  నాల్గవ సంఘటన.   మే 26 న ఒక పెళ్లి కూతురుకు తన కాబోయే వాడి విద్యార్హత మీద అనుమానంతో ఒక తెల్ల కాగితం ఇచ్చి తను పనిచేస్తున్న కంపనీ చిరునామా రాయాల్సిందిగా కోరింది.   అప్పటిదాకా తనొక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంటు మానేజరుగా  పనిచేస్తున్నాను అని డంబాలు పోయిన పెళ్లి కొడుకు పాపం బ్రహ్మచారిగానే మిగిలిపోవాల్సి వచ్చింది. 


ఇంకొక సంఘటనలో, కాబోయే భర్త తెలివి తేటలు (IQ LEVEL) తక్కువగా ఉన్నాయన్న కారణంగా చివరి నిమిషములో పెళ్లి రద్దైంది.   


అదే జిల్లాలో మరొక విచిత్ర సంఘటన జరిగింది.    పీటల మీద పెళ్ళికొడుకు బాసేమ్పెట్లు వేసుకొని కూర్చోలేక పోవడంతో, అంగ వికలత్వంగా భావించి పెళ్లి కూతురు పెళ్లి రద్దుచేసుకుంది. 
డెక్కన్ హెరాల్డ్ వార్త ఆధారంగా  

1, జూన్ 2013, శనివారం

అదిరిందయ్యా కిరణూ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ధిల్లీ వెళ్ళినా పత్రికలు, వార్తా ప్రసార మాధ్యమాలన్నీ,   మంత్రివర్గ విస్తరణ అనుమతి కోసం అంటూ ఊదరకోట్టేస్తాయి.    కానీ జరిగిన పరిణామం ఇంకోలా వుంది.    మంత్రి వర్గంలో చేరింది మొదలు డి ఎల్ రవీంద్రా రెడ్డి పార్టీకి ఏదో ఒక రకంగా నష్టం చేస్తూనే వున్నారు.   ఇటీవల ప్రవేశ పెట్టిన "బంగారు తల్లి" పధకంపై రెచ్చిపోయి మాట్లాడిన రవీంద్రా రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చెయ్యడం ఆహ్వానించతగ్గ పరిణామం.    ఈ పరిణామంతో  అసమ్మతిపై కఠిన వైఖరి అవలంబించిన కాంగ్రెస్ పార్టీ, అదే కడప  జిల్లాకు చెందిన మరో మంత్రి రామచంద్రయ్య, మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్య మంత్రికి కూడా  ఒక హెచ్చరిక జారీ చేసినట్లైంది.     


పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్న రవీంద్రా రెడ్డి లాంటి వ్యక్తులపై చర్యలు కొంత ఆలస్యమైనా, సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో తన పట్టు బిగించారని చెప్పక తప్పదు. 

నా బ్లాగ్ పేరు మారిందికొంత మంది మిత్రుల సూచనల మేరకు గతంలో వున్న క చడా రాజకీయం అనే బ్లాగును వృత్తాంతి అని నామకరణం చేసాను.  

ఎప్పటిలాగే మీరు నా బ్లాగును సందర్శించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. 

నమస్కారములతో