27, ఏప్రిల్ 2013, శనివారం

సి బి ఐ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ఒప్పుకోండి


సాక్షి పత్రిక చదవాలంటే భయం.   ఏ వార్త చదివినా మనసులో ఒక రకమైన నెగటివ్ ధోరణి బయలు దేరుతుంది.    సిబిఐ,  బొగ్గు కుంభకోణం విషయంలో  న్యాయస్థానంలో దాఖలు చేసిన  ఒక అఫిడవిట్లో, న్యాయ శాఖామంత్రి మరియు ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు కొంతమంది తాము తయారు చేసిన ముసాయిదా  నివేదికను ముందుగానే చూశారని వాగ్మూలం ఇచ్చింది.      ఈ వార్తను పట్టుకుని సిబిఐకి దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేసింది సాక్షి పత్రిక.   సిబిఐ అధికార పక్షానికి కొమ్ము కాస్తుందని, జగనన్నును కూడా అలానే జైలులో పెట్టారని చెప్పే ప్రయత్నం చేసింది.   


సిబిఐ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తుంది అన్న ఆరోపణ నిజమైతే, వారు దాఖలు చేసిన అఫిడవిట్లో, తాము ఆ నివేదికను ఎవరికీ చూపలేదనే చిన్న అబద్ధం చెప్పి కాంగ్రెస్ పార్టీని కష్టాలనుంచి బయట పడేసేది.   పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక నిజాన్ని బట్ట బయలు చేసి ధైర్యంగా ముందుకొచ్చిన సిబిఐ ను అభినందించాల్సిందే.        


నిజాయతీ పరుడు, విద్యాధికుడు ఐన లక్ష్మీనారాయణ లాంటి అధికారులు ఈ దేశంలో ఇంకా వున్నారు కాబట్టే, ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన కొంత మందైనా కారాగారాల్లో చిప్ప కూడు తింటూ  మగ్గుతున్నారు .   అపర శ్రీ కృష్ణ దేవరాయలుగా తనను తానూ అభివర్ణించుకున్న గాలి సోదరులను అక్కడి ప్రజలు పూర్తిగా మర్చిపోయి స్వేచ్చా వాయువులు పీలుస్తున్నారు.     నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు పోయింది అన్న నానుడి మన రాష్ట్రంలో కూడా నిజమవ్వడానికి ఎంతో దూరం లేదు.    

తెరాస ఒంటరి పోరు తెలంగాణాను తెస్తుందా!


తెరాసా అధినేత చంద్ర శేఖర్ రావు, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 100 శాసన సభ, 15 పార్లమెంటు స్థానాలు తమ పార్టీకి దక్కుతాయని ఆశించడంలో ఏ  మాత్రం తప్పులేదు.     అయితే అన్ని సీట్లు వస్తాయో రావో కాలం నిర్ణయించాల్సి వుంది.    1969 సంవత్సరంలో జరిగిన ఉద్యమంతో పోలిస్తే, గత 3 సంవత్సరాలుగా జరుగు తున్న ఉద్యమం అంత గొప్పగా లేదనేది నిర్వివాదాంశం.   1971లో జరిగిన ఎన్నికలలో చెన్న రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణా ప్రజా సమితి 14 స్థానాలలో 10 స్థానాలు దక్కించుకుంది.  హైదరాబాద్ స్థానంలో కూడా తెప్రసనే గెలిచింది.    ఆ కాలంలో, కేవలం 3 పార్టీలు మాత్రమె ఎన్నికలలో ఉన్నాయి.    కాంగ్రెస్, కమూనిస్ట్ మరియు తెప్రస.  ఈ మూడు పార్టీలలో కేవలం తెప్రస మాత్రమె ప్రత్యెక రాష్ట్రం కోరుకుంటే, ఉభయ కమునిస్టులు, కాంగ్రెస్ విశాలాంధ్ర వాదంతో ఎన్నికలలో పోటీ చేశాయి.     కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వున్న ప్రముఖ నాయకులంతా ఆనాడు తెప్రస నుంచి పోటీ చేసి గెలిచినా వారే.   ప్రస్తుత పరిస్తితి అందుకు భిన్నంగా వుంది.     తెరాసాతో పాటు, కాంగ్రెస్ (తెలంగాణా ప్రాంతంలో), తెదేపా, సిపిఐ, భాజపా    ప్రత్యేక వాదాన్ని మోస్తున్నాయి.  నిర్ణయం ఇదమిద్ధంగా చెప్పని  చెప్పని వైకాపాకు కూడా అంతో ఇంతో వోటు బాంకు వుంది.    ఇలాంటి పరిస్తితులలో తెరాసా ఒంటరి పోరుకు సిద్ధం అవడం సాహసోపేత నిర్ణయం.  ఉత్తర తెలంగాణలో తెరాసాకు గట్టి పట్టున్న మాట వాస్తవం.   నగర ప్రాంతాలు, వాటి శివారు ప్రాంతాలలో ఉన్న స్థానికేతరులు తెరాస ను ఆదరించక పోవచ్చు.    మొదటి నుంచి తెలంగాణా కోసం చిత్తసుద్ధితో  ఉద్యమిస్తున్న వారిలో భాజపా, భాకపా కూడా  ప్రధమ వరసలో వుంటాయి.   ఈ పార్టీలు కేవలం ఉద్యమాలలో మాత్రమే పాల్గొంటాం, ఎన్నికలలో పోటీ చేయకుండా మడి కట్టుకుంటాం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.  ఇప్పటికి కూడా అంతో ఇంతో గ్రామ స్థాయిలో కార్యకర్తలున్న పార్టీ తెదేపా. కాంగ్రెస్కు వుండే  సామ్ప్రదాయక వోట్లు వేరే ఖాతాలోకి మళ్లే అవకాశం లేదు.     ఈ కారణాల దృష్ట్యా, మొత్తం సీట్లు మనకే వస్తాయి అనుకోవడం ఆత్మహత్యా సద్రుశం.  


చంద్ర శేఖర్ రావు తెలంగాణాని ఫణంగా పెట్టి ఒంటరి పోరులోకి దిగితే, తను ఆశించినట్లు వోట్లు సీట్లు రాకపోతే, ప్రత్యేక రాష్ట్రం అనే అంశం శాశ్వతంగా  తెరమరుగయ్యే ప్రమాదం వుంది.   ఒక వేళ తను ఆశించినట్లు సీట్లు వచ్చినా, ఆ సీట్ల అవసరం ఎన్దిఎ కి గానీ యుపిఎ కి గానీ ప్రభుత్వ ఏర్పాటులో అవసరం లేకపోతే, తెరాస లక్ష్యం నెరవేరక పోవచ్చు.   


చరిత్ర సృష్టించిన చంద్ర బాబు


63 సంవరాల వయసు, 86 శాసన సభ నియోజక వర్గాలు, 16 జిల్లాలు, 162  మండలాలు , 2817 కిలో మీటర్లు, 208 రోజులు, 2 లక్షల కోట్ల హామీలు......   ఇదీ స్థూలంగా చంద్ర బాబు వస్తున్నా మీకోసం లెక్కలు. 


మొండి పట్టుదలకు మారుపేరైన చంద్ర బాబు, వయసుతో వచ్చే సమస్యలను కూడా  లెక్క చేయకుండా, సుమారు 7 నెలలపాటు హిందూపురం నుంచి విశాఖ పట్నం దాకా కాలి నడకన ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.     తన పాద యాత్ర ఓట్ల జైత్ర యాత్రగా మలుస్తుందో లేదో ఇదమిద్ధంగా ఇప్పుడే చెప్పలేము కానీ,  నిస్త్రాణంగా వున్న కార్యకర్తలను తట్టి లేపింది అనడంలో  ఏ మాత్రం అతిశయోక్తి లేదు .   చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్నపుడు తన పార్టీ కార్యకర్తలను పట్టించుకోక పోవడం, అభివృద్ధిని కేవలం హైదరాబాదుకు పరిమితం చేయడం, కరువు పరిస్తితులు, చిరంజీవి ప్రజారాజ్యం చీల్చిన కొన్ని సామాజిక వర్గాల వోట్లు, రాజశేఖర్ రెడ్డి చరిష్మా, ఇత్యాది అంశాల వలన అధికారం కోల్పోయిన ఆయనకు,  ఈ పాద యాత్ర పునర్జీవనం ఇచ్చింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 


పులి మీద పుట్రలా,  గత 3 సంవత్సరాలలో జరిగిన ప్రాంతీయ ఉద్యమాలు, ఉద్రిక్తతలు, తెదేపా తీసుకున్న నిర్ణయాలు ఇరు ప్రాంతాలలోని ప్రజలనూ ఆకట్టుకోలేక పోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం గడువు ఉన్న  తరుణంలో సాగించిన ఈ పాద యాత్ర తెలుగు దేశంకు ఎంతో కొంత  మేలు చేస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  
23, ఏప్రిల్ 2013, మంగళవారం

కారెక్కే చీడ పురుగు ఎవరు?


గత కొన్ని సంవత్సరాలనుంచి తెలుగు ప్రజానీకానికి తెరాస వారు బాగా పరిచయం చేసిన  పురుగులు కేవలం బొంత పురుగు, గొంగళి పురుగు మాత్రమే.   ఈ రెండు రకాల పురుగులు తెరాసా పేటెంట్ చేసుకున్న పురుగులైతే, తెదేపాలో కొన్ని కొత్త పురుగులున్నాయి అని వాటి పేరు చీడ పురుగులని అవి తొందరలో తెరాసా లోకి వెళ్తాయని తేల్చి చెప్పారు నరసిహ్ములు గారు.     ఇందుకు ప్రతిస్పందనగా కడియం శ్రీహరి గారు, బుజాలు తవుడుకున్నారు.     


ఇంకొక్క నెల రోజులలో, కారెక్కే ఆ చీడ పురుగులు ఎవరు అనేది మనలాంటి నేలబారు ప్రజానీకానికి తెలుస్తుంది.   

18, ఏప్రిల్ 2013, గురువారం

బయ్యారంపై అనవసర రాద్ధాంతం


ముఖ్యమంత్రి గారి కార్యాలయం బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) కు లీజుకు ఇస్తున్నట్లు, ఇందుకు ప్రతిగా గనులకు దగ్గరలో ఖమ్మం జిల్లాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్లు ప్రకటించింది.   ఇది సంతోషించాల్సిన విషయం.     మనరాష్ట్రంలో కొన్ని విచిత్రమైన మనస్తత్వాలు, పార్టీలు దురదృష్ట వశాత్తు మనుగడలో వున్నాయి.      ఇవ్వాళ ఏ వార్తా ఛానల్ చూసినా, ఏ నాయకుడు మాట్లాడేది విన్నా, విషయం అర్ధం కాదు.    


ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు, ఏదో ఒక వాదం ముసుగులో వోట్ల వేటలో వున్నారు.    ఈ నాయకుల డిమాండు ఏమిటి - ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి, అక్కడ దొరికె ముడి ఖనిజాన్ని వినియోగించాలి, తద్వారా, స్థానికంగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించాలి.        ముఖ్యమంత్రి గారి ప్రకటన చెప్పింది కూడా అదే కదా!    


గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గనులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో వుంటే, వార్తా పత్రికలూ కధనాలు ప్రచురించే వరకు, ఒక్క పార్టీ వాడు నోరెత్త లెదు.     కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యంత పారదర్సకంగా, ఈ గనులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు కట్టబెడుతుంటే, ఒకడేమో కరీంనగర్లో ఉక్కు కర్మాగారం కావాలంటాడు, ఇంకొకడు వరంగల్, మరొక పార్టీ వాడు వరంగల్-ఖమ్మం సరిహద్దుల్లో, ఇంకొక నాయకుడు ఈ కంపనీ పేరులో వైజాగ్ అని వుంది కాబట్టి ఇది ఆంద్రోళ్ళ కంపనీ అంటాడు .   ఒకడేమో, తెలంగాణలో దొరికే ఖనిజం ఇక్కడే ఉండాలంటాడు.    స్టీలు తయారు చెయ్యాలంటే, బయ్యారం ఖనిజం కావాలి, సింగరేణి బొగ్గు కావాలి, కర్నూల్లో దొరికే సున్నపు రాయి కావాలి, నెల్లూరు జిల్లాలో దొరికే మాంగనీసు కావాలి.    తయారైన ఉక్కును విదేశాలకు తరలించాలంటే, ఆంద్ర ప్రాంతంలో వున్న నౌకా రవాణ మార్గాలు కావాలి.       


భారత దేశంలో ప్రస్తుతం స్టీలు కర్మాగారాలు పీకల లోతు కష్టాల్లో వున్నాయి.    డిమాండు కంటే సప్లై చాలా అధికంగా వుండటం వలన చాలా కంపనీలు దిక్కుతోచని స్తితిలో వున్నాయి.  ప్రస్తుతం ఆతోమోబైలు గ్రేడ్ స్టీలు కిలో ధర వుల్లిపాయల ధరతో సమానంగా వుంది.       ఇలాంటి పరిస్తితులలో ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన బహుశా -- బయ్యరంలో స్పాంజ్ ఐరన్, పెల్లటైజేషన్  వరకు తయారు చేసి, ఆ పెల్లెట్స్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో హాట్ రోలింగ్ చెయ్యడం. లేదా బెనేఫికేషన్ ప్లాంట్ ద్వారా ఓరును శుద్ది చేసి స్లర్రీని గొట్టపు మార్గం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తరలించడం.      దీనివలన, ఒక ప్రభుత్వ రంగ సంస్థ బాగు పడుతుంది.    ఖమ్మం జిల్లాలోని ఉక్కు కర్మాగారం వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.   వైజాగ్ స్టీలు ప్లాంటు లగడపాటిదో, టిఎసార్డో, మరో ప్రైవేటు వ్యక్తిదో కాదు.   ఇది ప్రభుత్వ రంగ సంస్థ.       


ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయి ఉక్కు కర్మాగారం స్తాపించాలంటే, కనీసం ఆరు  మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యానికి 30,000 కోట్లు అవసరం.    ప్రభుత్వ రంగంలో ఇప్పటికే వున్న వైజాగ్ స్టీల్ ప్లాంటును ఖాయిలా చేసి, ఇంకో 30,000 కోట్లు (అది జగన్, కచరా, వినోద్, నాగం మొ॥ సొమ్ము కాదు) పన్నులు కట్టే వారి డబ్బు వృధా చెయ్యాలా, ఇది సరైన వాదనేనా!

గో ముఖ వ్యాఘ్రమ్ భాజపా మాటలు నమ్మకండి


ఇటీవల నల్గొండలో జరిగిన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో తెలంగాణాను కమలం పువ్వులో పెట్టి  ఇస్తాం అని హామీ ఇచ్చారు.   అశ్వద్ధామ హతః ; కుంజరః అన్నట్లు, షరతులు ఏమిటి అనే విషయం మాత్రం పైకి ప్రస్తావించలేదు. ఆ షరతులు ఏమై ఉండవచ్చు -- 


అ) తెలంగాణలో మాకు కనీసం పది పార్లమెంటు స్థానాలు గెలిపించి ఇవ్వాలి 
ఆ) దేశంలో మాదే అతి పెద్ద పార్టీగా నెగ్గాలి 
ఇ)మిత్ర పక్షాలు (మూలాయాం మొదలు కొని నితీష్ వరకు - మళ్ళీ తెలుగు దేశం కూడా కావచ్చు) విభజన ప్రతిపాదనకు ఒప్పుకోవాలి
ఈ) చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం; కానీ ఈ నిబంధన దేశంలో అత్యంత పెద్ద  రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కి మాత్రం వర్తించదు. 


మీరు కారు/మోటార్ సైకిల్ పత్రికా ప్రకటన చూసే వుంటారు.    మా వాహనం లీటరుకు 80 కి మీ ఇస్తుంది * అని రాస్తారు.   ఎలాంటి పరిస్తితులలో ఇస్తుంది -- రోడ్డు మీద ఇతర వాహనం ఎదురు రాకూడదు; వేగ నిరోధకం వుండకూడదు; బండిని టెస్టు చేసేప్పుడు ఎవరూ అక్కడ వుండకూడదు; మా ఎక్స్పర్టు డ్రైవరు మాత్రమె నడపాలి మొ॥  


రామాలయం కడతాం అని చెప్పి, దేశ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ రాముడికి హారతి కర్పూరం కూడా వెలిగించని వీళ్ళకు తెలంగాణా పై మోసం చెయ్యడం ఒక పెద్ద లెక్కా !   తస్మాత్ జాగ్రత్త 

వాక్ స్వాతంత్ర్యం మీద దాడి


రాజ్యాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం మనకు కొన్ని రకాల హక్కులు సిద్ధించాయి, అందులో వాక్ స్వాతంత్ర్యం కూడా ఒకటి.     నిన్న ప్రెస్ క్లబ్బులో జరిగిన దాడికి లోగడ తస్లీమా నస్రీన్ మీద ముష్కర మూకలు జరిపిన దాడికి పెద్ద తేడా లేదు.    నిన్న విశాలాంధ్ర మీద జరిగిన దాడి కొంత మంది "జర్నలిస్టులు" అని పిలవబడే  అల్లరి మూకల పని.    దీనికి మన చదువుల తల్లి ఒడిలో ఏళ్ల తరబడి డిగ్రీలు చదివే విద్యార్ధులు తొడయ్యారు.    అత్యంత పవిత్రమైన న్యాయవాద వృత్తిలో వుండి చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు కూడా ఈ దాడిలో నల్ల కోట్లు వేసుకొని మరీ భాగస్వాములైనారు.    


ఎంతో బలంగా వున్న తెలంగాణా వాదం, విశాలాంధ్ర ప్రచురించిన పుస్తకంతో ఆవిరైపోతుందా!   వాళ్ళు చెప్పేవి అబద్దాలైతే, దానికి ప్రతిగా ఎక్కడ తప్పు రాశారో చెప్పాలి కానీ, బూతులు తిట్టడం, అద్దాలు పగల గొట్టడం సభ్య సమాజం క్షమించదు. 


ఇటీవలే ABN టి వి లో జరిగిన చర్చలో, ఉద్యోగ సంఘాల నాయకుడు విఠల్ మాట్లాడుతూ, పుస్తకాన్ని దిల్లీలో విడుదల చెయ్యడం సమంజసంగా లేదు, హైదరాబాదులో విడుదల చెయ్యొచ్చు, ఆ స్వేచ్చ ప్రభాకరకు వుంది అని సెలవిచ్చారు.     ఈ చర్చను http://www.youtube.com/watch?v=o_UBP_DJg-Y చూడండి.     


ఇలాంటి దాడులు తెలంగాణలో నివసించే లక్షలాది మంది ఇతర ప్రాంతాల వారి మీద ప్రభావాన్ని చూపించే అవకాశం వుంది, దీనివలన తెలంగాణా ఉద్యమానికి లాభం కంటే నష్టమే ఎక్కువ.    

వేసవి కాలం కాదు, వలసల కాలం


సాధారణంగా రోహిణీ కార్తెలలో రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయనేది నానుడి .     కానీ ఎన్నికల కాలంలోనే వలసలు ఉంటాయనేది న్యూనుడి .     ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వలస వెళ్ళటం సర్వ సాధారణం.    పార్టీలు మారకుండా రాజకీయ నాయకుడిగా ఎదగడం చాలా కష్టం.   


అయితే, తెరాసా నాయకత్వం చేస్తున్నది ఇందుకు భిన్నం.     ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న నియోజక వర్గాలైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ లలో ఏ ఉద్యమ కారుడైనా గెలుస్తాడు కదా!    అలాంటప్పుడు ఆ నియోజక వర్గాలలో వేటాడడం వలన తేరాసా ఉద్యమ కారులు అసంతృప్తికి లొనవవచ్చు.    వాస్తవానికి వలసలు ప్రోత్సహించాల్సింది తెరాసా బలహీనంగా వున్న ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మొదలైన ప్రాంతాలలో.    నాగర్ కర్నూల్ నుంచి గెలిచిన నాయకుడు తన సొంత బలం కన్నా పార్టీ ప్రభావం వలననే గట్టెక్కడం జరిగింది.   కాబట్టి ఆ వ్యక్తీ వలన ఎంతవరకు తెరాసాకు మేలు జరుగుతుందో వేచి చూడాలి .   ఇదే కోవకు చెందిన వ్యక్తీ మన కె కె .   జాతీయ పార్టీలో అత్యంత కీలక పదవులలో వుండి  ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవని వ్యక్తీ తెరాసా లోకి రావడం వలన తెరాసాకు వోనగూరే ప్రయోజనం ఏమీ లెదు.   అలాగే, అంత  పెద్ద వ్యక్తీ, ఒక ఉప ప్రాంతీయ పార్టీలో చేరడం ఆత్మా హత్యా సదృశ్యమే.   


పార్టీ మారినా, అది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వుంటే, ఉచ్ఛ స్థితికి చేరే అవకాసం వుంది.    ఉదా : ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, అంటోనీ, శరద్ పవార్, ఇటీవల చిరంజీవి వరకు   ...... లిస్టు చాలా పెద్దది.   వీళ్ళందరూ సొంత కుంపట్లు పెట్టుకొని చివరకు కాంగ్రెస్లో కలిసిన వాళ్ళే.  

9, ఏప్రిల్ 2013, మంగళవారం

"మేళ్ళ" తాలూకు చిక్కుల్లో చెల్లెమ్మ


దివంగత నేత, ప్రియతమ నాయకుడు, చేవెళ్ళ  చెల్లెమ్మగా భావించే మన రాష్ట్ర గృహ శాఖా మంత్రి గారు తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు.    పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టి, మేనల్లుడికి పరోక్షంగా "మేళ్ళు" చేయడం ద్వారా దేశ  అత్యున్నత దర్యాప్తు సంస్థ చేతికి చిక్కారు.  


ప్రియతమ నేత ఏ  శుభకార్యం తలపెట్టినా చేవెళ్ళ  నుంచే మొదలు పెట్టేవారు, కానీ ఈ ఆనవాయితీని కాదని సి బి ఐ వారు మాత్రం మోపిదేవితో మొదలు పెట్టి, వయా శ్రీకాకుళం,  చేవెళ్ళకు వచ్చారు.    ఆనవాయితీ ప్రకారం ప్రాసిక్యూషన్కు ముఖ్యమంత్రి గారు  అనుమతి ఇవ్వకపోయినా, రాజీనామాపై రాజీ పడ్డా, మన దేశంలోని న్యాయస్థానాలు చూస్తూ వూరుకొనే స్థితిలో మాత్రం లేవు.     


"దాల్ మియ్యా" ఇచ్చిన లంచాలు తాలూకు పాపం,  ఆ కంపనీ  యజమానిని వదిలేసి,   అందులో  పనిచేసే  అధికారుల ఖాతాలోకి వెయ్యడం మాత్రం గర్హనీయం.      ప్రైవేటు రంగ పరిశ్రమలో ఇలాంటి తప్పుడు  పనులన్నీ యజమానుల కనుసన్నలలో  మాత్రమె జరుగుతాయి.     కేవలం జీతం కోసం పనిచేసే ఉద్యోగులు వాళ్ళ యజమాని ధన దాహానికి మూల్యం చెల్లిస్తున్నారు.    


రాబోయే రోజుల్లో, ప్రియతమ నేత "మేళ్ళ" తాలూకు ఖాతాలో మరెంత మంది బలి కానున్నారో!

4, ఏప్రిల్ 2013, గురువారం

సంజయ్ దత్తుకు వత్తాసు పలుకుతున్న తారలు


మహారాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం సంజయ్ దత్తును అక్రమ ఆయుధాలు కలిగివున్న కేసులో  దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే, చిరంజీవి మొదలుకొని, బాలివుడ్డు తారల వరకు ఆయనకు క్షమా భిక్ష పెట్టాలని గొంతు చించు కున్నారు.      


మన దేశంలో అంతో ఇంతో నిక్కచ్చిగా వున్న వ్యవస్థ ఏదైనా వుందీ అంటే, అది కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.      సంజయ్ దత్ గొప్ప నటుడు, ఆయన తల్లి తండ్రులు కూడా గొప్ప నటులు, అంత మాత్రాన సంజయ్ దత్ చేసిన తప్పులు ఒప్పు కావు కదా!


బాంబు దాడి కేసులో ఉరి శిక్ష ఎదురుకుంటున్న ప్రొ ॥ భుల్లర్ కు క్షమా భిక్ష పెట్టాలని అకాలీ పార్టీలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు చెస్తున్నాయి.    మన దేశంపై దాడికి దిగిన కసాబ్,  నక్సల్ ముసుగులో వున్న పౌరహక్కుల సంఘాలకు పోరాట యోధుడుగా కనిపించాడు!  పార్లమెంటుపై దాడి కేసులో ఉరి తీయబడ్డ ఆఫ్జాల్ గురు మన పౌర హక్కుల నేతల దృష్టిలో మంచివాడు.     మన ప్రియతమ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి, పేదల పాలిట పెన్నిధి, అత్యంత నిజాయితీ పరుడైన రెడ్డి గారు, ఖూనీ కేసులో శిక్ష అనుభవిస్తున్న మఖ్బుల్ అనే ఉగ్రవాదిని సత్ప్రవర్తన కారణంగా 5 సంవత్సరాలకే వారిని వదిలేశారు.   ఇటీవల జరిగిన దిల్సుఖ్నగర్ పేలుళ్ళ వెనుక అతగాడి హస్తం వున్నట్లు NSA వారు అదుపులోకి తీసుకోవడం జరిగిన్ది.    అలానే, గౌరు చరిత గారి భర్తను కూడా సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం తగ్గించి వదిలేశారు.     ఫదుల సంఖ్యలో హత్యలు, దోపిడీలు చేసిన ఫూలన్ దేవిని దేశ అత్యున్నత  చట్ట సభకు పంపించిన ఘన చరిత్ర కలిగిన నేపధ్యం మన రాజకీయ పార్టీలకు వున్ది.  


న్యాయ స్థానాలు ఇచ్చే తీర్పులను అమలు పరచకపోవడం మొదటి తప్పు కాగా, తీర్పును తప్పు పట్టడం, శిక్షను  తగ్గించడం రెండవ తప్పు.       సంజయ్ దత్ తప్పు చేశాడని నమ్మిన న్యాయస్థానం అతనికి శిక్ష విధించింది, కాబట్టి అనుభవించాల్సిందే.      సత్ప్రవర్తన కారణంగా శిక్షను తగ్గించే అధికారం రాజకీయ నాయకులకు ఇవ్వకుండా చట్టంలో సరైన మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా వుంది .      
   

ఈలం పోరుకు భాజపా ఆజ్యం


తమిళ్ నాడులో జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుకు యశ్వంత్ సిన్హా భాజపా తరఫున ఆజ్యం పోశారు.       ప్రత్యేక ఈలం రాష్ట్రం ఏర్పాటుకు లంకలో జరుగుతున్న (ఆగిపోయిన) పోరుకు భాజపా తరఫున మద్దతు ప్రకటించారు.     


ప్రభాకరన్ కొడుకును దారుణంగా చంపడం గర్హనీయం .   కానీ, ప్రభాకర్ చేసిన దారుణాల వలన మరణించిన వారు, అంగవికలురు అయిన వారు శ్రీలంకలో వేల సంఖ్యలో వున్నారు.    యువకుడు, సమర్ధుడు అయిన మన దేశ ప్రధానిగా పని చేసిన రాజీవ్ గాంధీని పొట్టనపెట్టుకున్న రక్త పిపాసి, దుర్మార్గుడు ప్రభాకరన్.  యుద్ధం తరవాతే శాంతి స్థాపన జరుగుతుంది.    అది లంక కావచ్చు, ఆఫ్గనిస్తాన్ కావచ్చు పంజాబ్లోని స్వర్ణ దేవాలయం కావచ్చు.    


శ్రీలంక విషయంలో భారత దేశం అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.   మన చుట్టూ వున్నా దేశాలైన చైనా, పాక్, నేపాల్, బంగ్లాదేశ్లతో మన సంబంధాలు అంతంత మాత్రం గానే వున్నాయి.      ఇలాంటి పరిస్తితులలో, మన పొరుగు దేశాల అంతర్గత విషయాలలో అతిగా జోక్యం చేసుకోవడం అర్ధరహితం.    బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాల్సిన భాజపా కేవలం కొన్ని వోట్ల కోసమో, సీట్ల కోసమో రాజకీయం చెయ్యడం క్షమించరాని విషయం.   


ద్రావిడ పార్టీలు అతిగా స్పందించి క్రికెట్ ఆటగాళ్ళని తమిళనాడులో ఆడనీయమని మొండికేశారు.   శ్రీలంక అధ్యక్షులు రాజపక్షేకి, ఆ దేశ అంతర్గత భద్రత ముఖ్యం కానీ క్రికెట్ కాదు.   అదే లంక క్రికెటర్లు భాజపా పాలిత రాష్ట్రాలలో ఆడవచ్చు, ఎలాంటి అభ్యంతరము లెదు.   రాజకీయం అంటే ఇదే మరి.    భారత దేశంలో తమిళ్ నాడు ఒక అంతర్భాగం.    విదేశంలో మన పౌరుడు  కష్టంలో వుంటే, భారతీయుడు కష్టంలో వున్నట్లు కానీ, వాడు తమిళ్ నాడుకు చెందినా వాడా లేక గుజరాతుకు చెందిన వాడా అని చూడ వలసిన అవసరం లెదు.    క్రికెటర్లను బహిష్కరించడం ద్వారా నిరసన తెలియ చేయడం ఒక మార్గం అయితే, దేశం మొత్తంలో జరగాలి, అంతే కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూడకూడదు.    


మన దేశ ఆంతరంగిక విషయాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం కూడదు అని గట్టిగా కోరే మనం, ఒక స్వతంత్ర దేశమైన శ్రీలంక విషయంలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లెదు.      రాజేవ్ గాంధి ఐ పి కె ఎఫ్ ను లంకకు పంపించింది కూడా వారి కోరికమీద మాత్రమే కానీ, స్వతంత్ర నిర్ణయం కాదు.      


త్వరలో జరుగనున్న ఎన్నికలలో గెలుపు మాత్రమే ప్రాదిపదికగా మతాల ప్రాతిపదికిన, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలను విడదీసి,  భాజపా చెయ్యబోయే విన్యాసాలు నేలబారు మనిషికి రోతపుట్టే ప్రమాదం లేకపోలేదు.    

ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమా!


నిన్న కె సి ఆర్ గారు బోధన్ సభలో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని సెలవిచ్చారు.   వంద చంద్ర బాబులు వచ్చినా, ఇంకో వంద జగన్ లు వచ్చినా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అందులో తె రా స పాత్ర ఉత్క్రుష్టమైనదని ఆయన వక్కానించారు.    అలాగే, తెలంగాణా ఇవ్వని కాంగ్రెస్ ను బొంద పెట్టాలని, మత తత్వ శక్తులతో కలిసే ప్రసక్తే లేదని చెప్పారు.   

సగటు వోటరుకు అంతుబట్టని విషయం ఏమిటంటే - 

అ ) మత తత్వ పార్టీలతో జట్టు కట్టరు - అంటే భాజపాతో పొత్తు లేనట్లే 
ఆ ) బాబు తెలంగాణా ద్రోహి - జట్టు కట్టే అవకాశం లేనే లేదు 
ఇ ) వామ పక్షాలు, ఏ పక్షం కాని లోక్ సత్తాతో కలిసి సాధించేది సూన్యం 
ఈ ) కాంగ్రెస్ ని బొంద పెట్టాలి కాబట్టి , వారితో పొత్తు అసాధ్యం 
ఉ ) చివరకు మిగిలింది జగన్ బాబు - ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవరైనా ముందస్తు ఎన్నికలు కావాలి అని కోరుకొనే  పార్టీ అంటూ వుంటే అది కేవలం తెరాసా మరియు వైఎస్ఆర్ పార్టీలు మాత్రమే.    రాజశేఖర్ రెడ్డిని కానీ,       వారి పిల్లలను కాని అంత తీవ్రంగా విమర్సించిన్ దాఖలాలు తెరాసా కు లెవు.   ఎవరైనా గట్టిగా ఒత్తిడి పెడితే తమల పాకుతో.....  అప్పుడప్పుడు ఒక విమర్శ చేస్తారంతే.    

తీర, సీమాంధ్ర లో నాయకులు జగన్ పార్టీ వైపు అడుగులు వెయ్యడానికి ప్రధాన కారణం ఆ పార్టీ వారు ఎట్టి పరిస్తితులలో విభజనకు ఒప్పుకోరనే నమ్మకంతోనే, మరి అలాంటి పార్టీతో తెరాసా సంకీర్ణం ఎలా ఏర్పాటు చెయ్యగలుగు తుంది. 

గతంలో కూడా కెసిఆర్ గారు కోరుకున్నది ఒకటే, సీమాన్ధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తన పార్తీ.     మరో ముఖ్య విషయం - రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం అనుటున్నవారు, అదే సందర్భంలో తమతోనే ప్రత్యేక తెలంగాణా 2014లో వస్తుంది అంటారు .   ఈ రెండు విషయాలు పొంతన లేకుండా వున్నాయి.