28, ఫిబ్రవరి 2013, గురువారం

కిరణ్ కుమార్ సమర్దుడే!

మన ముఖ్య మంత్రి గారు రాజకీయాలలో తనదైన ముద్రని నిలుపుకోవడానికి మొదటినుంచి ప్రయతం చేస్తున్నాడు  మరియు విజయం సాధిస్తున్నారు.     మంత్రి వర్గానికి తన  జిల్లాకు చెందిన ప్రత్యర్ధి పెద్దిరెడ్డిని దూరం పెట్టడం ద్వారా ప్రారంభమైన ఈ విజయం శంకర్ రావు గారి దగ్గరే ఆగక పొవచ్చు.   ప్రతిరోజు విమర్శించే డి ఎల్ గారి అభ్యర్ధిని ఆప్కాబ్ ఎన్నికలలో ఓడించి అతన్ని పార్టీలో పలుచన చేసే విషయంలో క్రుతక్రుత్యులైనారు.    బహుశా ఎన్నికలలోపు కడప జిల్లా వరకు ఈ జైత్ర యాత్ర కొనసాగ వచ్చు.      అద్దంకి ఎం ఎల్ ఎ గొట్టిపాటి,  జగన్ కు సన్నిహితమౌతుండటం గమనించి ఆయన గ్రానైట్ గనుల మీద ప్రభుత్వ శాఖల దాడులు జరిగాయి.    శంకర్ రావు కేసులు కూడా దర్యాప్తు జరిగినాయ్.    నల్గొండ సోదరులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో  నోరు మెదపడం లేదు.   మద్దతు ఉపసంహరిస్తామన్న ఒవైసీ సోదరులు చిప్ప కూడు తినాల్సి వచ్చింది.  


మొత్తంగా చూస్తే కాబినెట్ మీద, పార్టీ మీద పట్టు సాధించినట్లే కనిపిస్తున్నది.    ఇంతవరకు ముఖ్యమంత్రి మీద నేరుగా ఎవరు అవినీతి ఆరోపణలు చేసిన దాఖలాలు లెవు.     ఉద్యమాల కాలంలో ఎక్కడ అనవసరంగా మాట తూలకుండా తన పని తాను చెసుకుపొయారు.    ఎన్నో ఉపద్రవాలను తట్టుకొని నిలబడగలిగారు.     పరిపాలనలో గతానుభవం లేకపోయినా, ప్రస్తుత పరిస్తితులలో ముఖ్యమంత్రి సమర్ధతను అభినందించ వలసిన విషయమే.  

హైదరాబాద్ ప్రత్యేకం పై తెదేపా సన్నాయి నొక్కులు


తెలంగాణలో వాతావరణం చల్లబడుతున్న కొద్దీ తెదేపా స్వరం మారుతున్నది.   కొద్ది రోజుల క్రితం సుదీర్ రాంభట్ల,  అంబేద్కర్ గారు చెప్పినట్లుగా హైదరాబాదును దేశ రెండవ  రాజధానిగా చెయ్యాలి అని శెలవిచ్చారు.    నిన్నటికి నిన్న నల్గొండకు చెందినా తెదేపా నేత మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింలు  గారు కూడా అదే మాట చెప్పారు. రాజమండ్రి నుంచి వచ్చిన కిరాయిదారుడికి హైదరాబాద్ మీద కేవలం "అద్దె హక్కులు" మాత్రమె వుంటాయి కానీ అసలు హక్కులు వుండవు అని ఒంటికాలి మీద లేచినవాళ్ళు ఎలా స్పందిస్తారో వేచి  చూడాలి. 


సమైక్య రాష్ట్ర పునాదులపై ఏర్పడ్డ పార్టీని ఓట్లకోసం విభజన వాదంవైపు మళ్ళించే ప్రక్రియలో తెదేపా అధినేత గత ఐదు సంవత్సరాలనుంచి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల ఫలితమే ఆ పార్టీకి ప్రజలలో విశ్వసనీయత లేకుండా పోవడానికి కారణం.    కొంత కాలం సమైక్యం, కొంతకాలం విభజన మరి కొంత కాలం ప్రత్యెక రాజధాని అని పొంతన లేని మాటలతో రెండు ప్రాంతాలలో తెదేపా నష్టపోవడం ఖాయం.         

శత్రువుకి శత్రువు మిత్రుడు అవచ్చు


జగన్ కొంప కొల్లేరు కావడానికి ముఖ్య కారకులు ఇద్దరు - మాజీ మంత్రి శ్రీ శంకర్ రావు మరియు రవీంద్రా రెడ్డి.    ఇద్దరు వైద్య శాస్త్రంలో పట్టభద్రులే.   శంకర రావు గారు కోర్టుకి లేఖ రాస్తే, రెడ్డి గారు ఇమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం వివరాలు బహిరంగ పరచారు.      ప్రస్తుతం ఇద్దరులో ఒకరిని ముఖ్యమంత్రి గారు మాజీని చేసేశారు.   రెడ్డి గారిని కూడా అదును చూసి మాజీని చేసే అవకాశం కోసం ఎదురు  చూస్తున్నారు.    


రెడ్డిగారు ఒంటరిగా కడపలో వుండి జగన్ను ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఎంచక్కా మైసూరా గారు, రవీందర్ గారు కలిస్తే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ముఖ్యమంత్రిని కడపలో దీటుగా ఎదురుకొవచ్చు.    శ్రీ రవీందర్ రెడ్డి గారు కూడా త్వరలో జగన్  "చంచల్" గూడాలో కలుస్తారని ఆశిస్తున్నాను. 


అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం/శత్రుత్వం ఉండదని.     మరి శంకర్ రావు గారు ఏం చేస్తారో త్వరలో తేలుతుంది. 

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

జైలు దారి పడుతున్న శాసన సభ సభ్యులు


ఏదైనా   మంచిపని చేయాలంటే ముందుగా మనం ఏ గుడికో, పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్లి ఆశీర్వాదం తీసుకొని, తలపెట్టిన కార్యక్రం నిర్విఘ్నంగా సాగాలని ఆశించడం సహజం.     గత సంవత్సర కాలంగా, పదవిలో మరో ఐదు సంవత్సరాలు కొనసాగాలని కోరుకొనే ప్రతి శాసన సభ సభ్యుడు, పదవిలోకి రావాలనుకొనే మాజీలు, నాయకులు చెంచల్ గూడాకు వెళ్లి  మొక్కు తీర్చుకుంటున్నారు.   


పెద్ద కారు, మందీ మార్బలం జైలు వైపు వెళ్తున్నారంటే, ఇంకో సభ్యుడు కాంగ్రెస్ నుంచో తెదేపా నుంచో జారినట్లు అర్ధం చెసుకొవాలి.   జైలులోని వ్యక్తీ అంత  సులభంగా బయటకు రాడు  అని తెలిసి కూడా ఏ నమ్మకంతో ఆయనతో చేయి కలుపుతున్నారో అంతు  పట్టని చిదంబర రహస్యం.   జైలులో ఆయనతో సమావేశమైన ప్రతి నాయకుడు బయటికివచ్చి రాజశేఖర్ రెడ్డి పధకాల గురించి, కిరణ్ కుమార్ గారి అసమర్ధత గురించి, బాబు గారి రెండు నాలుకల గురించి మూడు ముక్కలు చెప్పి ప్రశాంతంగా వెళ్లి ప్రస్తుతం తను వున్న పార్టీకి రాజీనామా చెస్తాడు.  


సాధారణంగా పత్రికా విలేఖరులు, ఓ బి వాహనాలు వారి హడావుడి అంతా  పార్టీ ప్రధాన కార్యాలయాల వద్దా, ముఖ్యమంత్రి నివాసం వద్దా వుండటం సహజం.    కానీ గత కొంత కాలంగా చంచల్ గూడా జైలు వద్ద కూడా ఈ హడావుడి ఎక్కువైన్ది.      ఈ జైలు వున్న  ప్రాంతానికి చెంచల్ అని పేరు ఎవరు పెట్టారో కానీ, ఆ పేరు అక్కడకు వస్తున్న నాయకుల మనస్తత్వానికి అద్దం పడుతోంది.  

బాలన్సు తప్పుతున్న బాబు


ఎక్కువ దూరం నడవడంలో గిన్నీసు పుస్తకం రికార్డు సాధించబోతున్న బాబు గారు ఆ మధ్య రెండు సార్లు బాలన్సు తప్పి వేదిక మీద నుంచి పడిపొయారు.     60 సంవత్సరాల వయసులో ఇంత దూరం ఎండనకా,  వాననకా నడవడం గొప్ప విషయమే!     వేదికలమీద బాలన్సు తప్పడం, తూలి పడిపోవడం జరిగితే, సామాన్య ప్రజలు, అయ్యో మన మాజీ ముఖ్యమంత్రి గారు తూలి పడిపోయారా అని నొచ్చుకొవచ్చు.     కానీ మాట తూలితే - ఆ పార్టీ వారు తప్పితే ఎవ్వరు మెచ్చుకొరు.     ఈ మధ్య రేపల్లె పర్యటనలో బాబు గారు "తూలారు".  కానీ ఈ సారి వేదికమీద అదుపుతప్పి తూలడం   కాదు.  కత్తులు, కొడవళ్ళు, నరకడం అంటూ మాట తూలారు.   బాబు గారు గొప్ప  పరిపాలనా దక్షుడు .    9 సంవత్సరాలు పదవి లేకుండా ఓపికపట్టిన వ్యక్తీ ఇలా సహనం కోల్పోతే ఎలా!


ఈ మధ్య మన రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు (లోక్ సత్తా తప్ప) నోటికొచ్చినట్లు దూషించడం, ఎవరైనా కేసు నమోదు చెయ్యాలి అంటే, దమ్ముంటే చెయ్యండి, అరెస్టు చేసే దమ్ముందా, అరెస్టు చేస్తే రక్త పాతం తప్పదు  అని ప్రతి సవాలు విసరడం సర్వ సాధారణమైనది.   


చట్టసభలలో చట్టాలు చెయ్యాల్సిన నాయకులు సామాన్య ప్రజలకు చట్టాలపై  చులకన భావం కలిగేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం.     

చావు తప్పి కన్ను లొట్టబోయింది


క తా రా గారు హరీష్ గారు ఎం ఎల్ సి ఎన్నికలలో గంపగుత్తగా తెలంగాణలో 3 స్థానాలు గెలిపించడం  ద్వారా తమ పార్టీపై,   తెలంగాణా రాష్ట్రంపై  ప్రజలు ఆకాంక్ష  వ్యక్తం చేస్తారు.  తెరాసా అన్ని స్థానాలు గెలిస్తే తెలంగాణా విభజనకు అంగీకరిస్తారా  అని   విసిరిన సవాలు తీర సీమాంధ్ర నాయకులు  ఎవ్వరూ స్వీకరించ లేదు.     ఇప్పుడు చూడండి ఏమైందో - నల్గొండ, ఖమ్మం ప్రాంత పట్టభద్రులు  తెరాసా ని తిరస్కరించారు. 


వాస్తవానికి, లోగడ జరిగిన సహకార ఎన్నికలు గానీ, నిన్న వెలువడ్డ ఎం ఎల్ సి ఎన్నికలు గానీ, నేలబారు వోటరు మనోగతాన్ని ప్రస్ఫుటించలేవు.    మే నెలలో జరగబోయే  స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదిక మీద జరిగితే వాటి వల్ల  వచ్చే ఫలితాలు,  తప్పక రాబోయే సాధారణ ఎన్నికలకు గీటురాయిగా  చెప్పవచ్చు. 


నిన్న వెలువడ్డ ఎం ఎల్ సి ఎన్నికల ఫలితాలు తెరాస నాయకత్వాన్ని, వారి కుటుంబానికున్న మితిమీరిన నమ్మకాన్ని మాత్రమె  వమ్ము చేశాయి.   
  


22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రాష్ట్ర బందుకు భాజపా పిలుపు సమంజసమా?

 
నిన్న హైదరాబాదులో జరిగిన ఉగ్రవాదుల దాడి తీవ్రంగా ఖండించ తగినదెఐనా, భాజపా వారు బందుకు పిలిపునివ్వడం అర్ధరహితం. ఈ రోజు శుక్రవారం ఒక వర్గం వారు ప్రార్ధనా స్థలాల దగ్గర పెద్ద సంఖ్యలో గుమికూడే అవకాశం వుంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని అసాంఘిక శక్తులు పెచ్చరిల్లే ప్రమాదం వుంది. ఉగ్రవాదుల కోసం జరిగే తనిఖీలలో, వి ఐ పి ల తాకిడితో వరస బందులతో పోలీసులు తలమునకలై వున్నారు.    ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది.     
 
 
వీరు తలపెట్టిన బందు ద్వారా కలిగే సామాజిక  ప్రజా ప్రయోజనం ఏమీ లేకపోయినా సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదురుకోవలసి వస్తుంది. విపత్కర పరిస్థితులలో రాజకీయాలను పక్కన పెట్టి సమస్య తీవ్రతను తగ్గించడం ద్వారా జాతికి ఉపకారం చేసిన వాళ్లవుతారు.


భాగ్యనగరంపై తీవ్రవాదుల పంజా


పులులు, సింహాలు ఒక సారి ఏదైనా జంతువును చంపితే పూర్తిగా ఆ జంతువును భక్షించవు.   కొన్ని అవశేషాలు కళేబరం దగ్గరే వదిలి మరుసటి రోజు వచ్చి మిగిలిన ఆహారాన్ని భుజిస్తాయి.   ఇది జంతువుల నైజమ్.    ఉగ్రవాదం ఈ జంతువుల కంటే హీనమైనది.     దిల్సుఖ్ నగర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు కబళించడం వరుసగా ఇది మూడవ సారి.    ఉగ్రవాదానికి మతం ఉండదు అనడానికి ఉదాహరణ ముగ్గురు ముస్లిం యువకుల మృతి.   


ఈ దాడిలో చనిపోయిన అమాయక ప్రజల  మృతికి ప్రఘాడ సంతాపం తెలియచెద్దామ్.  

21, ఫిబ్రవరి 2013, గురువారం

ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు


నేడు ప్రపంచ మాతృ భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషాభిమానులకు మనః పూర్వక శుభాకాంక్షలు.   


తెలుగు భాష మాట్లాడే వారు ప్రపంచ వ్యాప్తంగా షుమారు 18 కోట్ల మంది వున్నారంటే అతిశయోక్తి లేదు.    తమళనాడు జనాభాలో దాదాపుగా 42 శాతం మంది తెలుగు వారే.    మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదలు, నటుడు ప్రతిపక్ష నాయకుడు విజయకాంత్,  వైగో లాంటి ఎందరో రాజకీయ నాయకులు తెలుగు మూలాలు కలిగిన వారె.    అక్కడ నాయకర్ అని పిలవబడే వాళ్ళు, నాయుడు అనే పేరు ఉన్న జనాభా, రెడ్డి కులస్తులు కూడా తెలుగు వారె.    వీరిలో చాలామంది చెన్నపట్నం, మధురై, కొయమ్బత్తూర్, తిరువళ్లూర్, కాంచీపురం మొదలైన ప్రాంతాలలో కృష్ణదేవరాయ కాలంలో వలస వెళ్లి స్థిరపడినవాళ్ళె.   


ఇదేకాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల వేర్పాటులో మనం కోల్పోయిన హోసూర్, క్రిష్ణగిరి, గుమ్మిడిపూంది, కోలార్, బళ్లారి, ప్రాంతాలలో తెలుగు వాళ్ళు కోట్లల్లో వున్నారు.    ఒరిస్సా రాష్ట్రంలో కలపబడ్డ బెర్హంపురం సంగతి చెప్పనవసరం లెదు.   ఒక్క కర్నాటక రాష్ట్రంలోనే షుమారు 39 మంది శాసన సభ సభ్యులు తెలుగు మూలాలు కలిగిన వారు వున్నారు.   


11 నుంచి 13వ శతాబ్ద కాలంలో శైవ వైష్ణవ వర్గాల మధ్య గొడవలు మన సమాజంలో చిచ్చు పెడితే, ఇప్పుడు కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులవల్ల తెలుగు వాడి కీర్తి మసకబారుతోంది.    పరాయి దేశస్తుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ దొర గారు తెలుగు భాష అవసాన దశకు చేరుతున్న సమయంలో మన పురాణేతిహాసాలను సేకరించి తాటాకులకు గ్రంధ దర్పమిప్పించాడు.      


డా॥ గరికిపాటి వారి సాగారఘోషలో చెప్పినట్లు "ఇతరులెల్లరు మెచ్చు భాష, కాని నేడు మనకు మన పిల్లలకు పనికిరాని భాష ....      దయచేసి తెలుగు వారం మన కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడుదాం, తెలుగును బ్రతికించుకున్దామ్.   

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

సార్వత్రిక సమ్మె నష్టం అక్షరాలా రు॥ 20,000 కోట్లు ??


అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.    ఈ నెల 20 మరియు 21న జరప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఖరీదు షుమారు 20,000 కోట్ల  రూపాయలు.    ఆర్ధిక మాంద్యంతో దిక్కుతోచని స్థితిలో వున్న పరిశ్రమలకు ఈ సమ్మె గొడ్డలిపెట్టు లాంటిది అంటే అతిశయోక్తి కాదు.    అసలే ఈ నెలలో కేవలం 23 పనిదినాలు మాత్రమె ఉండగా పులిమీద పుట్రలా ఈ 48 గంటల సమ్మె పారిశ్రామిక రంగానికి  ఏ మాత్రం  ప్రయోజన కరంగా    లేదు.    ఈ నష్టాన్ని సామాన్య ప్రజలపైనే భారం మోపడం ఖాయం.  


భారత దేశ చరిత్రలో సార్వత్రిక సమ్మెల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచి ప్రభుత్వ నిర్ణయాలను ఉపసంహరించిన దాఖలాలు లేవు.    ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి నిరసనలు, ధర్నాలు, సత్యాగ్రహాలు లాంటి ఎన్నో మార్గాలు వున్నాయి.   ఈ సమ్మె కేవలం రానున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న సమ్మెగా చూడాల్సి వస్తుంది.  


ఉండవల్లి గారూ - న్యాయస్థానంలో హాజరు కండి


రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిపై  సుబెదారీ (వరంగల్) న్యాయస్థానం కేసు నమోదు చేసి ఆయన్ని న్యాయస్థానం  ఎదుట హాజారు పరచాలని రక్షకభటులని  ఆదేశించింది.    ఆయన ఇటీవల రాజమండ్రిలో చేసిన ప్రసంగంలో తెలంగాణా ప్రజలని రజాకార్లతో పోల్చారు అన్నది అభియోగం.     ఇది శుభపరిణామం.     ఆయన నిజంగా తెలంగాణా ప్రజలని రజాకార్లతో పోల్చారా లేదా అన్నది ప్రసంగ సి డిలు  న్యాయస్థానం పరిశీలించి తీర్పు ఇస్తుంది .    న్యాయస్థానాలు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలను రెచ్చగొట్టే విధంగా  ఉపన్యాసం చేసే రాజకీయ నాయకులు ఒళ్ళు  దగ్గర పెట్టుకొనే అవకాశం వుంది. ఇలా కేసులు నమోదు చెయ్యడం ఆహ్వానించదగ్గ పరిణామం.      అయితే, ఉండవల్లి గారి కేసులో ఆయన నిర్దోషిగా బయట పడతారని నాకు పూర్తీ విశ్వాసం వుంది.  కాబట్టి ఎలాంటి భేషజాలు లేకుండా  ఆయన తప్పకుండా న్యాయస్థానం ఎదుట హాజారు కావాలి.    

త్వరలో తేలనున్న తెలుగు ఓటరు మనోగతం

 
దేశ  అత్యున్నత న్యాయ స్థానం తీర్పు దరిమిలా, పంచాయతీలు, నగర పాలక సంస్థలకు జరగవలసిన ఎన్నికలకు మార్గం సుగమమైంది.
 
 
స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు రసాయన పరీక్ష లాంటిది.   ఈ ఎన్నికల ఫలితాలు 2014లో జరగబోయే సార్వత్రిక  ఎన్నికలకు  సూచిక లాంటిది.    స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాదిపదికపై జరుగుతాయి కనుక ఓటరు మనోగతాన్ని విశ్లేషించడానికి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం దొరుకుతుంది.   ఈ ఫలితాల ఆధారంగా, రాబోయే సాధారణ ఎన్నికలలో పెట్టుకోవలసిన పొత్తులు,సర్దుబాట్లు మరియు దిద్దుబాట్లు చేసుకొనే అవకాశం వుంది.     
 
 
ఇటీవల జరిగిని కేంద్ర సహకార బ్యాంకు మరియు మార్కెట్ సంఘాల ఎన్నికలకు, మే లో జరగబోయే  స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా వ్యత్యాసం వుంది.    ఈ ఎన్నికలు కాంగ్రెస్ తెదేపా కన్నా తెరాస మరియు వైఎసార్ పార్టీల మనుగడను నిర్ణయించే అవకాశాలు మెండుగా వున్నాయి. 

18, ఫిబ్రవరి 2013, సోమవారం

అఫ్జల్ గురు ఉరిపై అనవసర రాద్ధాంతం


దశాబ్ద కాలంపాటు సుదీర్ఘంగా నడిచిన ఈ కేసులో చివరికి బాధితులకు న్యాయం జరిగింది.    దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరిన ముష్కరుడు అఫ్జల్ గురుకి ఉరి శిక్ష సరైనదే.    విదేశీయుడైన కసాబ్ కేసులోనే తన తరఫున వాదించడానికి న్యాయవాదిని నియమించిన మన దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచానికి తలమానికం.  


అఫ్జల్ గురును ఉరి తీస్తే బాధపడిన వాళ్ళు ఎక్కువమంది తీవ్రవాద మనస్తత్వం కలిగిన వాళ్ళే!     పాకిస్తాన్ ఆశ్రయం పొందిన తీవ్ర వాదులు, నిషేధిత ఎల్ ఇ టి, జె ఎం ఎం,  జె కె ఎల్ ఎఫ్ నేతలతో పాటు మన రాష్ట్రం నుంచి పౌర హక్కులు కాపాడే నేతలు ఉన్నారు.      దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో జన్మించిన ఒకాయాన, ఏకంగా అఫ్జల్ గురును భగత్ సింగ్ తో పోల్చి తన తీవ్ర వాద భావజాలాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేశాడు.     వీళ్ళకు, ఆ దాడిలో చనిపోయిన అమాయక కుటుంబాల పట్ల కనీసం జాలికూడా లేదు.     


అఫ్జల్ ఉరి పట్ల కలత చెందిన వాళ్ళు కేవలం తీవ్రవాదులు, ఉగ్రవాదులు మరియు పౌర హక్కుల ముసుగులో వున్న కొద్దిమంది తీవ్ర వాద సానుభూతిపరులు మాత్రమే.    సగటు భారతీయ ముస్లిం సమాజం ఒక ఉగ్రవాది ఉరిని పట్టించుకోక పోవడం ఇక్కడ  గమనార్హం.     ఇంత కాలం తరువాత రాష్ట్రపతి భవన్లో ఒక నిఖార్సైన  అధ్యక్షుడుని భారత దేశం కలిగి వుంది అని గర్వంగా వుంది.  


ఈ ఉరి శిక్ష అమలు జరిగిన తరువాత  భాజపా వారు మిఠాయిలు పంచుకోవడం, నృత్యాలు గట్రా చేయడం చూస్తే అనవసరంగా గొడవలు సృష్టించడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది.       

నారాయణ - నారాయణ


భాకపా రాష్ట్ర నేత నారాయణ కాలికి బలపం కట్టుకుని తెలంగాణా కోసం తిరిగిన నాయకుడు.  భాకపా మద్దతు వుందని ఎంతో మురిసిపోయిన తెరాసకు నారాయణ గారి వైఖరి మింగుడు పడక పోవచ్చు.   చంద్ర బాబు మొదలుకొని రాఘవులు, కిరణ్ కుమార్ రెడ్డి,  సోనియా గాంధీ వరకు ఆయన చేత తిట్లు తినని వారు లేరు.   ప్రస్తుతం ఉద్యమకారుడు ఉద్యాన వనంలో సేద తీరుతుంటే నారాయణ గారికి మింగుడుపడం లేదు.   వారు మౌనం వ్యూహాత్మకం అని తెలిసికూడా, నారాయణ గారు తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.   ఎంత సేపు కచరా గారు ఓట్లు, సీట్లు అంటాడు, వాటితో తెలంగాణా రాదు అని సెలవిచ్చారు.      చూడండి నారాయణ గారు, మీకు 295 స్థానాలలో ధరావతు రాదని తెలిసి కూడా మీ పార్టీ వారు క్రమం తప్పకుండా పోటీ చేయ్యంగా లేనిది, తెరాస వారు ఓట్లు సీట్లు  గురించి ఆలోచిస్తే తప్పా?    కేవలం ఇది కామ్రేడ్ గారి ఓర్వలేనితనానికి నిదర్శనం.  

క చ రా గారు విజ్ఞులు, వారికి ప్రజల కష్ట సుఖాలు తెలుసు.   మార్చ్ నెల (చదువుకునే పిల్లలకు) జీవితంలో అత్యంత ప్రధానమైనది.   బాధ్యతగల పౌరునిగా ఆయన విద్యార్ధుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొంచెం వ్యూహాత్మక వెసులుబాటు కలిపిస్తే, నారాయణ గారేమో లేని పోని అభాండాలు వెయ్యడం ఎంతవరకు సమంజసం.     

క చ రా గారికి జన్మ దిన శుభాకాంక్షలు !


కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు తెలంగాణా ప్రాంత ప్రజలు జరుపుకోకపోయినా తీర ఆంద్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.   బహుశా దీనికి రెండు కారణములు ఉండవచ్చు -  ఒకటి వారి పూర్వీకులు తీర ప్రాంతం (ఉత్తరాంధ్ర) వారు కాబట్టి ; రెండు - ఈ మధ్య రాష్ట్రంలో  కొంచం పరిస్తితులు చక్కబడుతున్న కారణంగా వారికి కృతజ్యతా పూర్వకంగా వేడుకలు జరుపుకొని ఉండవచ్చు.      కానీ ఇందులో ఒక అపశ్రుతి దొర్లింది, అదేమిటంటే, కేకును ముక్కలుగా కోసి పంచుకోవడం.    శ్రీమతి సోనియా గాంధీ గారు తన పుట్టిన రోజున డిసెంబర్ 9 నాడు రెండుగా  కోసిన కేకు తాలూకు ముక్కలు ఇంకా అతుక్కొనే లేదు మళ్ళీ ఇప్పుడు క చ రా గారి పుట్టిన రోజు సందర్భంగా పాపం కుర్రాళ్ళు ఆలోచించకుండా కేకును 3 ముక్కలుగా కోశారు.    కేకు బొమ్మ దిన పత్రికలలో వచ్చింది కానీ, కేకు తల భాగం ఎటుపక్క ముక్కలో వుందో కనపడటం లేదు, విధి వైపరీత్యం అంటే ఇదే మరి.  

భాజపా ప్రభాకర్ గారి ప్రచార ఆర్భాటం


కాలం ఖర్మం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తున్దనేది సామెత.   భాజపా విషయంలో ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.   కర్నాటక భాజపా రెడ్డి గారు కడప యువ రెడ్డిగారిని కలిపి ఇటు ఆంద్ర ప్రదేశ్ లోనూ అటు కర్ణాటకలోను భాజపా నెట్టుకొని వద్దామని ప్రయత్నం చేసింది.    అది కాస్త బెడిసికొట్టడంతో మొదటినుంచి కడప యువ నేతను తమలపాకుతో కొడుతూ, విధిలేని పరిస్తితులలో బ్రదర్ అనిల్ మీద మీడియాకు ఎక్కారు. 
 
 
బ్రదర్ అనిల్ ఆస్తులు కూడబెట్టుకొని ఉండొచ్చు, అక్రమాలు చేసి ఉండచ్చు.   దీనిపై వార్తలు గతంలో పుంఖాను పుంఖాలుగా ఈనాడు మరియు జ్యోతిలోనూ ప్రచురించబడ్డాయి.     ఇప్పుడు ప్రభాకర్ గారు మీడియా ముందు ఘీంకరించే బదులు, తన దగ్గర వున్న సమాచారంతో, ప్రజా ప్రయోజనాల వ్యాద్యం వెయ్యొచ్చు కదా!   కానీ వెయ్యరు, ఎందుకంటే వారికి కావలసింది కేవెలం ప్రచారం మాత్రమే, దోషులు శిక్షించబడడం కాదు.    రాజకీయం అంటే ఇదే మరి.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

బ్రదర్ అనిల్ పై ఆరోపణలు కొత్తవా!


క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ గురించి, భాజపా ప్రభాకర్ గారు "సంచలనాత్మక" విషయాలు బయటపెట్టారు. ఇతనిగురించిన విషయాలు ఈనాడు, జ్యోతి పత్రికలు ఎప్పుడో బహిర్గతం చేశాయి. కానీ భాజపా వారు ఈ పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు బయట పెట్టడానికి కారణాలు చూద్దాము --

అ) జగన్ కాంగ్రెస్తో గొడవ పడుతూ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న
సందర్భంలో కర్ణాటకలోని తమ పార్టీకి చెందిన "ఘనులు" ద్వారా రెచ్చగొట్టి కాంగ్రెస్ను బలహీనం చేయడానికి ప్రయత్నించింది.   దీనికి భాజపా కేంద్ర  
నాయకత్వం కూడా సుముఖత చూపించింది. కానీ, అప్పటికే జగను పై పెరుగుతున్నఆరోపణల వల్ల భాజపా ఆంద్ర నాయకత్వం వ్యతిరేకించింది.
 
 
ఆ) ప్రస్తుతం అనిల్ గారి భార్య తెలంగాణలో యాత్ర చెయ్యడానికి సిద్ధమైంది. కేవలం ఒక ప్రాంతానికి మాత్రమె పరిమితమై ప్రజా సమస్యలపై పెద్దగా అవగాహన లేని భాజపాకు ఒక సంచలనాత్మక విషయం కావాలి,వార్తలలో
నానుతూ వుండాలి. అయాచితంగా అందివచ్చిన ఈ అవకాశం భాజపా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.


ఇ) తెలంగాణాపై పేటెంట్ హక్కుల విషయంలో జరుగుతున్న పోటీలో భాజపా తె రా సకు తోకగా మాత్రమె మిగిలింది. తెరాస "జాక్" దెబ్బకు పోటీలో భాజపా
బాగా వెనుకబడింది.  ఏదో ఒక విషయం మీద ప్రజలలో ఉండాలి అనే తపన.  


ఈ) ఇన్ని ఆధారాలు వున్నా భాజపా,  అనిల్ మీద కేసు పెట్టకుండా ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమే సి బి ఐ ని, కాంగ్రెస్ని డిమాండ్ చేస్తుంది.
కేవలం ప్రచారం కోసమే  ఈ తపనలా కనిపిస్తుంది.   


ఇంత అవినీతి చరిత్ర వున్న అనిల్ బావ మరిది పార్టీ మద్దతు, కర్ణాటకలో ఘనుల మద్దతు, జర్ఖండులో అవినీతి పరుల మద్దతు ఎట్టి పరిస్తితులలో తీసుకోబోమని భాజపా ప్రకటించ గలదా!
.

కర్ణాటకలో భాజపాకు త్వరలో ష(శే)ట్టర్

 
కొన్నిరాష్ట్రాలలో వ్యక్తులకున్న పలుకుబడి, ఆదరణ జాతీయ పార్టీలకు లేదు. నిజానికి దేశంలో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ జాతీయ పార్టీ ఏదైనా వుంది అంటే, కాస్తో కూస్తో కాంగ్రెస్ మాత్రమే. దక్షిణాది రాష్ట్రాలైన ఆంద్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచేరి మరియు కర్నాటక రాష్ట్రాలలో మొత్తం వున్న శాసన సభ స్థానాలు 930 కాగా అందులో కాంగ్రెస్కి 285 మంది సభ్యులు, భాజపాకు ఉన్న సభ్యుల సంఖ్య 99 మాత్రమే. అంటే సగటున కాంగ్రెస్ బలం 30 శాతం కాగా భాజపా బలం కేవలం 9.6 శాతం మాత్రమె. అన్ని దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉండగా, భాజపా కేవలం కర్నాటకలో మాత్రమే ఉంది. ఆంద్ర ప్రదేశ్లో భాజపా కేవలం ఒక ప్రాంతంలో కొన్ని పట్టణాలకు మాత్రమె పరిమితం.
 
భాజపాకు వున్న ఈ 10 శాతం కేవలం కర్నాటక రాష్ట్రం నుంచి దక్కినది. కర్ణాటకలో భాజపా పరిస్తితి అచ్చుగుద్దినట్లు ఆంద్ర ప్రదేశ్లో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్తితిని  తలపిస్తున్నది. కర్ణాటకలో ఈ సంవత్సరం ఏప్రిల్ తరువాత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం వుంది. అదే జరిగితే, దక్షిణాదిన భాజపా ప్రాబల్యం పూర్తిగే కోలోపోయినట్లే.కేసులు - అరెస్టులు

 
మన రాష్ట్రంలో ఈ మధ్య రాజకీయ నాయకులపై కేసులు, అరెస్టులు, జైలు జీవితాలు సర్వ సాధారణమైనాయి. ఈ మధ్య తె రా స అధినేత ఆధ్వర్యంలో జరిగిన బూతుల పంచాయతీలో పాల్గొన్న ప్రముఖ విద్యావేత్త ఆచార్య కో రా గారిపై కూడా వివిధ రక్షక భట నిలయాలలో కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదు చేసిన తర్వాత ఎవరూ వాటిని పెద్దగా పట్టిచ్చుకోరు. అక్బర్ ఒవైసీ గారి కేసు చూడండి, అప్పుడెప్పుడో కలెక్టర్ గారిని దుర్భాషలాడాడని కేసు నమోదు అయితే, 6 సంవత్సరాల తరువాత మొన్ననే కేసు తిరగతోడి సాంబారు అన్నం తినిపించారు.
 
 
మన శరీరంలో రక రకాల జబ్బులు ఉంటాయి.  కానీ మన వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, ఒక్కసారి మనల్ని చుట్టుముడతాయి. ఇది కూడా అంతే, కేసులు ప్రస్తుతానికి దస్త్రాలలో దుమ్ము కొట్టుకొని పోవచ్చు.
కర్మ కాలి 2014 ఎన్నికలలో ఓడిపోతే అప్పుడొచ్చే ముఖ్యమంత్రి గట్టి వాడయితే, దూల తీరటం ఖాయం. ప్రస్తుతం "దమ్ముంటే నన్ను అరెస్టు చెయ్యండి" అని విర్రవీగే వాళ్ల భవిష్యత్ లో కష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం తను అతిగా విశ్వసిస్తున్న వ్యక్తులు, పార్టీలు రేపు వీపు చూపించే అవకాశం మెండుగా వుంది.


2, ఫిబ్రవరి 2013, శనివారం

క చ రా గారి సుభాషితాలు


చంద్రశేఖర్ రావు గారి పాండిత్యం చూస్తే ఈర్ష్య కలగక మానదు.   ఆయనకున్న అవలక్షణాలను పక్కన పెడితే, నిస్సందేహంగా ఆయనకు పంచ కావ్యాల మీద, సుభాషితాల మీద, శతకాల మీద తప్పకుండా గట్టి పట్టు వుండే ఉండచ్చు.    ఇందిరా పార్కు ప్రసంగంలో ఆయన భర్తృ హరి సుభాషితాలలోని అత్యంత ప్రముఖమైన "ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాససంత్రస్తులై .... అన్న శార్దూల పద్యాన్ని శుద్ధంగా, శ్రావ్యంగా వినిపించారు.  ఈ మధ్య మొదలైన అశుద్ధ ప్రసంగాలు తప్ప, ఆయన గతంలో చాలా బాగా ఉపన్యాసం చేసేవాడు. 


ఇంత  విద్వత్ ఉన్న వ్యక్తికీ అదే భర్తృ హరి సుభాషితాలలోని ఈ క్రింది పద్యం వల్లే వేస్తె ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది :

ఉ ||  క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు,  ఙాతి హుతాశనుండు, మి 
       త్రము  దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్ , సువిద్య వి
       త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా
        ప్రముఖపదార్ధముల్ గలుగుపట్టున (దత్కవచాదు  లేటికిన్.

తాత్పర్యం:

ఓర్పు ఉంటే కవచం అక్కరలేదు.   క్రోధముంటే హాని కలిగించడానికి శత్రువుతో పనిలేదు.  దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు.   స్నేహితుడుంటే ఔషధం (అయ్యా ఇది "ఆ"  ఔషధం అనుకోవద్దు) అక్కరలేదు.  దుష్టులుంటే భయంకరమైన సర్పాలు అక్కరలేదు.  ఉదాత్తమైన కవిత్వం ఉంటె రాజ్యంతో పనిలేదు.   చక్కని విద్య ఉంటె సంపదతో ప్రయోజనం లేదు.   తగురీతిని సిగ్గు ఉంటె వేరే అలంకారం అక్కరలేదు.    ఈ ఓర్పు మొదలైన పదార్ధాలు ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటితో ప్రయోజనం లేదు. 
 
 
ఆయనకు కావసింది ఓర్పు, మంచి సలహాదారులు, క్రోధాన్ని అదుపులో ఉంచుకోవడం, నోరు పారేసుకోక పోవడం. ఆ పరమేశ్వరుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు ఋజు ప్రవర్తన కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 

తిట్ల దండకం వలన జరిగిన మేళ్ళు

మనకు తెలుగులోను సంస్కృతంలోను బోలెడు దండకాలు వున్నాయి. ఇవన్నీ భగవంతుణ్ణి కొలవడానికి వివిధ మార్గాలు. ఉదా|| కాళికా దేవి మీద మనకందరికీ తెలిసిన దండకం కుచోన్నతే కుంకుమ రాగ సొణె.... అలాగే పింగళి సూరన గారి కళా పూర్ణోదయంలో శ్రీకృష్ణుని  మీద శ్రీ కామినీ కామి తా కార సాకార కారుణ్య ధారా.....  ఈ కోవలోకి వస్తాయి 


ఇటీవల మన క చ రా గారు కూడా ఇందిరా పార్కులో చదివిన తిట్ల దండకం మాత్రం ఈ కోవకు చెందదు. నిజంగా భగవంతుడు తెలుగు ప్రజల మీద జాలి పడి ఉండచ్చు, అందుకే నన్నయ్య, కరుణశ్రీ లాంటి కవులను "సన్నాసులు" అనకుండా కచరా గారు పెద్ద మనసుతో క్షమించారు. ఈ ప్రమాదం ముందు ముందు లేకపోలేదు కానీ, ప్రస్తుతానికి తప్పించుకున్నట్లే.

కానీ వీరి దండకం వల్ల సమైక్య రాష్ట్రం కోరుకొనేవారికి పరోక్షంగా మేలు చేశారని చెప్పవచ్చు. మరి క చ రా గారికి కావాల్సినిది కూడా 2014 దాకా రాష్ట్రం సమైక్యంగా ఉంచడమే. ధర్మరాజు ఆస్తి మొత్తాన్ని ఫణంగా పెట్టి జూదం ఆడితే, మన తెలంగాణా అధర్మ రాజు తనపై విశ్వాసం ఉంచిన ప్రజల ఆశల్ని ఫణంగా పెట్టి 2014 దాకా వాయిదా వేసారు. రాజకీయాలలో పూర్తీ కాలం మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. జగన్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు (క్షమించాలి - కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీతో అని చదువుకోండి) కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తామని తే రా స ని తనలో ఐక్యం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే కనీసం ఒక సంవత్సరం పడుతుంది. 2014 ఎన్నికలలో ఎన్ డి ఎ తెలంగాణాని పువ్వులలో పెట్టి ఇస్తుంది అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కి జగన్తో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా చేసారు. జగన్తో కాంగ్రెస్ కలవడం ద్వారా తెలంగాణాకి ఎలా లాభం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. రాజకీయం అంటే అదే మరి. 
 
 
ఇవన్నీకాంగ్రెస్ పార్టీకి,సమైక్య వాదానికి కచరాగారు అయాచితంగా  కల్పించిన
కొన్ని మేళ్ళు.  

ఉద్యమాలు - ఉద్యోగాలు

క చ రా గారు మాటల యుద్ధం తరువాత తిరిగి ఫాం హౌసులో సేద తీరుతున్నారు. బహుశః ఇది కూడా వ్యూహాత్మక మౌనంలో భాగం కావచ్చును.
 
 
విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా ఫిబ్రవరి మొదలు ఏప్రిల్ నెల వరకు ఎలాంటి ఉద్యమాలు ఉండక పోవచ్చు. మళ్ళీ మే నుంచి మొదలయ్యే అవకాశం వుంది. తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని చెన్నై, బెంగళూరు, గుర్గామ్ ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారాంతాలలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువవడంతో రైళ్ళు, బస్ నిలయాలు, తెలుగు వారి ముచ్చట్లతో కళ కళలాడు తున్నాయి. బెంగళూరు నగరంలో చైతన్య విద్యా సంస్థలు దాదాపు 10 శాఖలు గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు.

 
ఈ లోపు జగన్ గారు కాంగ్రెస్కు జై అని పుణ్యం కట్టుకుంటే, కధ కంచికి చేరినట్లే.   ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఏది ఏమైనా, ఈ అనిశ్చితికి తెరపడడానికి మనందరం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే. ఈ సారి ఎన్నికలలో కూడా తె రా సాకి ఓటమి ఎదురైతే, పార్టీని అమ్మేయడం ఖాయం.