17, డిసెంబర్ 2012, సోమవారం

కేసులున్నది ఎత్తివేయడానికే కదా!

 
అప్పుడెప్పుడో అక్కినేని గారి పాట విన్నాం. "ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అని దాని సారంశం. 
 

న్యాయ విద్య అత్యంత పవిత్రమైనది. మన రాజ్యంగా నిర్మాత డా|| అంబేడ్కర్ ఒక న్యాయ శాస్త్ర కోవిదుడు. అలాగే మన జాతి పిత మహాత్మా గాంధి దగ్గరనుంచి, స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రు, ప్రధమ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు, భూర్గుల వారు, ఆ తరువాత మన రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఎంతో  మంది మరియు మన ప్రస్తుత ముఖ్య మంత్రి కూడా న్యాయ శాస్త్ర పట్టభాద్రుడే . ఇలాంటి పవిత్రమైన వృత్తిలో వున్న న్యాయ వాదులు, విచక్షణ మరిచి కోర్టులలో గలభా సృష్టిస్తూ, విధులను అడ్డుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో "తొండ ముదిరి ఊసరవెల్లైన" ఒక నాయకుడి హత్య తరువాత జరిగిన హింసాకాండలో దోషులపై కేసులు ఎత్తివేయడం దగ్గరనుంచి మొదైలైన ఈ ప్రహసనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పడు హత్యా నేరంలో జైలులో శిక్షను ఎదుర్కొంటున్న గౌరు చరిత భర్తను విడుదుల చేసే వరకు చట్టంలోని అవకాశాలను అధికార బలంతో ఉపయోగించుకోవటం రాజకీయ పార్టీలకు పరిపాటైంది. ఇలాంటి చర్యలకు కొనసాగింపుగా ఈ మధ్య టోకుగా కేసులను ఎత్తివేయడం ఒక రివాజైపోయింది. బస్సులు తగలపెట్టేవాళ్ళు, విధి నిర్వహణలో వున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించే శాసన సభ సభ్యులు, రైళ్ళను ఆపే వాళ్ళు, రైళ్ళ పట్టాల క్లిప్పులను తీసేవాళ్ళు, దొమ్మీలకు దిగే వాళ్ళు, మత కలహాలను ప్రోత్సహించే వాళ్లకి బొత్తిగా భయం లేకుండా పోతున్నది. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్లైనా చట్టం ముందు సమానమే కదా? న్యాయవాదులకు ఈ విషయంలో ప్రత్యేకత ఎందుకు చూపించాలి?  చట్టం  గురించి సామన్యుడికన్నా వారికే ఎక్కువ తెలిసుండాలి కదా? 
 
ఎన్ని ఉద్యమాలైనా చేయవచ్చు కాని ప్రజల ఆస్తులకు, భద్రతకు ఏ మాత్రం నష్టం కలగ కూడదు. విచిత్రం ఏంటంటే, ఆ పార్టీ ఈ పార్టీ -  ఆ ప్రాంతం ఈ ప్రాంతం - అని బేధం లేకుండా కేసుల ఎత్తివేత విషయంలో అందరూ ఒకటౌవుతారు.
 
ఇలా కేసులను ఎత్తివేసే విధానాన్ని మార్చి ఈ అంశం కేవలం కోర్టుపరిధిలోకి తేవడం  జాతికి శ్రేయస్కరం.

2 కామెంట్‌లు :