19, మార్చి 2014, బుధవారం

గెయిల్ ట్రేడ్వెల్ - హోలీ అండ్ హెల్


గెయిల్ అనే ఆస్ట్రేలియాకు చెందిన వనిత తను మాతా అమృతానందమయి (సుధామణీ)ఆశ్రమంలో ఎలా చేరింది, 20 సంవత్సరాల తరువాత ఎలా తప్పించుకుంది, అక్కడ ఆవిడ అనుభవించిన నరకం, 'అమ్మ' కొట్టిన దెబ్బల తిట్టిన తిట్ల  తాలూకు వివరాలు   తన డైరీలో రాసుకున్న సంఘటనల ఆధారంగా ఇటీవల విడుదలైన పుస్తకమే  "హోలీ హెల్".  


కేరళ ఆశ్రమంలో తాను పడ్డ కష్టాలు, అక్కడ జరిగే దోపిడి మొదలగు విషయాలు కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో వివరించింది.   ప్రస్తుతం మన దేశంలో వున్న బాబాలు వారి వికృత చేష్టలు చూసిన తరువాత గెయిల్ రాసిన దాంట్లో వాస్తవం వుందని నమ్మవలసి వస్తుంది.     


హిందూ మతంలోని బలహీనతలను ఆసరాగా చేసుకొని స్వామి నిత్యానంద, పిరమిడ్ పత్రీ , అమ్మా భగవాన్,  కర్నూల్ జూనియర్ బాబా, ఆసారాం బాపు, ఒంగోలు దగ్గరలో ఆశ్రమం కట్టుకున్న ఇంకో భూ కబ్జాదారుడు రామ అవధూత  లాంటి వారు భక్తి పేరిట కోట్లు గడిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.    పనిలో పనిగా సినిమా వాళ్ళు, ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ అధికారులు, రాజకీయ నాయకులు వీరిని దర్శనం చేసుకొని ఆ ఆశ్రమానికి లేని గుర్తింపు తెస్తారు.  


కొంత కాలం క్రితం ఒక ఛానల్ వారు అమ్మా భగవాన్ ఆశ్రమంలో జరిగే వికృత చేష్టలు రోజంతా పదే పదే చూపించారు.   తరువాత ఏమి జరిగిందో ఏమో, ప్రభుత్వమూ చర్య తీసుకోలేదు, టి వి వారు మర్చిపోయారు.  


ఈ పుస్తకంలో అక్కడక్కడ కొన్ని అభ్యంతరకరమైన, అసభ్య రాతలున్నప్పటికి, కేరళలోని ప్రముఖ ఆశ్రమం పుట్టుక దాని ఎదుగుదల ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి వుంటే చదవచ్చు. 

కాంగ్రెస్కు గ్రహణం తాత్కాలికమే


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి మెల్లిగా ఒక్కొక్కరే  తెదేపాలోకి చేరుకుంటున్నారు.   కారణం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని.   విభజించిన తీరును తప్ప పట్టవచ్చేమో గానీ, విభజనకు మొట్ట మొదటి నుండి ఒప్పుకున్న తెదేపా ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్య పార్టీ  ఎలా అయింది? అన్ని పార్టీలు రోజూ మైకుల ముందుకొచ్చి సమస్యను పరిష్కరించమన్నారు, కాంగ్రెస్ వారు వాళ్లకు తోచిన పరిష్కారం చేశారు.   కేంద్ర, రాష్ట్ర మంత్రులుచివరి నిమిషం దాకా మంత్రి పదవి వదులుకోవడానికి ఇష్ట పడకుండా, ఇంకా ఏదో అద్భుతం జరగబోతోందని భ్రమలు కల్పించారు. మరీ విచిత్రం ఎన్ టి ఆర్ గారి కూతురు భాజపాను సమైక్య పార్టీగా భావించడం.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తెలిశాక జెండా, అజెండా మార్చేశారు.   రేపు అధికారంలోకి వచ్చాక, బాబు గారు ఎంత చాణుక్యుడైనా, ఈ వలస పక్షుల దెబ్బకు భవిష్యత్లో విల విల్లాడాల్సిందే.   


ఒక పక్క తెలంగాణా పునర్నిర్మాణం మరో పక్క ఆంధ్రాను సింగపూరుగా మార్చడం మా వల్లే సాధ్యమౌతుందని అన్ని పార్టీల వారు వక్కాణిస్తున్నారు. అంటే గత 60 సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని ఒప్పుకుంటున్నారు.    2019 ఎన్నికల నాటికి ఎన్నో మార్పులు జరగ వచ్చు. నిజంగా ఆంధ్ర ప్రదేశ్ సింగపూరు లాంటి ప్రగతిని సాధిస్తే, ఆ క్రెడిట్ రాష్ట్రాన్ని విభజించి మంచి పని చేసిన కాంగ్రెస్కు దక్కాలి.   ఐదు  సంవత్సరాల తరువాత జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావచ్చు అని అనిపిస్తే, పోలో మంటూ ఇదే నాయకులు బాబును తిట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకో లేక ఇంకో నటుడు పెట్టబోయే పార్తీలోకో చేరడం ఖాయం.   అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని.  

18, మార్చి 2014, మంగళవారం

రాజకీయ పార్టీల గురివింద నీతులు

ఎన్నికలు వచ్చేప్పటికి అన్ని పార్టీలు సిద్ధాంతాలు గాలికి వదిలేస్తాయి.   దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు అప్పటిదాకా అవినీతి గురించి తెగ ఉపన్యాసాలు చెప్పీ పార్టీలు 'మేము గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం' అంటూ నిస్సిగ్గుగా ప్రకటిస్తాయి.   అవినీతి జరిగిందని ప్రాధమిక సాక్షాధారాలు ఉండి జైళ్లకు వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా యధేచ్చగా చట్ట సభలలో పోటీకి నిలబడుతున్నారు.    అలాంటి అభ్యర్ధులలో గెలిచిన వాళ్ళు విర్రవీగుతూ ఒక ప్రకటన చేస్తారు - మేం ప్రజా న్యాయస్థానంలో గెలిచాం, కోర్టు తీర్పు కన్నా ఇదే గొప్ప అన్నట్లు చెప్తారు.  

ఇలాంటి జాబితాలో పేర్లున్న (నాకు గుర్తున్న)  కొందరు -- 

1) బి ఎస్ యడ్యూరప్ప 
2) కనిమొళి 
3) రాజా 
4) రైల్ గేట్ బన్సాల్ 
5) జగన్ బాబు 
6) లాలు ప్రసాద్ యాదవ్ 
7) మోపిదేవి 
8) శ్రీరాములు 

అవినీతి కేసుల్లో శిక్షపడ్డ గుజరాత్ మంత్రులు భావి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.     ఈ సారి ఎన్నికలలో వారే మళ్ళీ పోటీ చేసే అవకాశం వుంది.  


ఎంతసేపు ఎన్నికల కమిషన్ ఇలాంటి వారి విషయంలో  కఠినంగా వ్యవహరించడం లేదు అని అంటాం కానీ, ఇలాంటి నాయకులకు ధరావతు కూడా దక్కకుండా ఓడించాలని ఓటరు అనుకోడు.   కులమో, మతమో లేక ప్రాంతమనో ఊబిలో చిక్కుకుంటాము.    ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ మొదలైంది.  తండ్రి జైలుకు వెళితే కొడుకో, కూతురో లేక ఆయన భార్య గాని ఆ నియోజక వర్గం నుంచి కర్చీఫ్ వేస్తారు.  ప్రజలకు వీళ్ళు తప్ప గతి లేదు.    ఈ పరిస్తితి మారాలంటే సమాజంలో మార్పు రావాలి.    విద్యావంతుల శాతం పెరగాలి.   8, మార్చి 2014, శనివారం

విజయ మాల్యా ఎక్కడో పోలీసులకు తెలియదట
వార్తల్లోని వ్యక్తీ, రాజ్యసభ సభ్యుడు, లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్య గారు పోలీసుకులకు గత సంవత్సరం నుండి కనపడలేదట.    ఆదాయపు పన్ను శాఖ వారు కోట్ల రూపాయల టి డి ఎస్ (Tax deducted at Source) పన్ను ఎగవేతకు కాను  ఆయన మీద  బెంగలూరులో ఆర్ధిక నేరాల  న్యాయస్థానంలో 2013 లో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.   గౌరవ న్యాయస్థానం వారు మాల్యాను హాజారు పరచాల్సిందిగా కబ్బన్ పార్క్ పోలీసులకు సమన్స్ పంపించింది.    2103 ఫిబ్రవరిలో జారీ అయిన సమన్స్ శాసన సభ ఎన్నికల ఒత్తిడి కారణంగా అందచేయలేక పోయామని పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది.    కోర్టు మళ్ళీ సమన్సు జారీ చేసింది.  కొంతకాలానికి పోలీసులు న్యాయస్థానానికి నివేదిక పంపుతూ తాము IPL క్రికెట్   ఆటల బందోబస్తుతో తలమునకలై ఉన్నామని అందుకే మాల్యాకు సమన్స్ అందజేయలేక పోయామని బాధ పడ్డారు.  


న్యాయమూర్తి గారికి కోపం వచ్చింది.   కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ నుండి కూత వేటు దూరంలో వున్న పంచ తార హోటలులో ఆయన గారు IPL వేలంలో పాల్గొన్నట్లు, IPL పోటీలు జరిగిన క్రీడా ప్రాంగణంలో మాల్య తాపీగా కూర్చిని తిలకించినట్లు వున్న వార్తా పత్రికల క్లిప్పింగులను పోలీసు వారికి ఇచ్చారు.    విధిలేక మరోసారి సమన్స్ జారీ చేసింది న్యాయస్థానం.  


ఈయన గారు మన గౌరవ పెద్దల సభలో పటిష్టమైన చట్టాలు చేసే సభ్యులు.   అందమైన అమ్మాయిలతో అసభ్యకరమైన కాలెండర్లు ముద్రించి ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పెద్ద మనుషులకు పంపిస్తుంటాడు.   ప్రభుత్వ రంగ బాంకుల నుంచి ఈయన గారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు  ఇప్పుడు నిరర్ధక ఆస్థులుగా మారాయి.  


రైతులు తీసుకున్న రుణాలు, గృహ రుణాలు, బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కట్టడంలో జాప్యమైతే, ప్రభుత్వ రంగ బాంకులు పత్రికలలో ప్రకటన యిచ్చి మరీ ఆస్తులను అమ్మేస్తారు.   కానీ మన చట్టం మల్యా లాంటి వారికి వర్తించదు.  

7, మార్చి 2014, శుక్రవారం

కేజ్రీవాల్ మోడీని అడగాలనుకుంటున్న కొన్ని ప్రశ్నలు


ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ప్రధాని అబ్యర్ధి నరేంద్ర మోదీని కలవాలని ప్రయత్నించారు.   అపాయింట్మెంట్ దొరక్క వెనకకు వచ్చాడు.   ఆయన మోడీని కొన్ని ప్రశ్నలు అడగాలని తలంచారు.   ఆ అడిగేదేదో ప్రజల సమక్షంలో ఒక వేదిక మీద ప్రసార మాధ్యమాల నడుమ జరిపితే ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా.    ఆయన అడగాలనుకున్న ప్రశ్నలలో కొన్ని మీ కోసం -- 

1)450 కోట్ల మత్య శాఖ కుంభకోణంలో శిక్షించబడిన పురుషోత్తం సోలంకిని మీ మంత్రివర్గంలో ఇంకా కాబినెట్ మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారు

2)గనుల కుంభకోణానికి సంబంధించి 3 సంవత్సరాల శిక్ష విధింపబడిన బాబు బోఖడియాను  (ప్రస్తుతం బెయిలులో వున్నాడు) ఇంకా మీ మంత్రివర్గం నుండి ఎందుకు తొలగించలేదు

3)సౌర శక్తిని ప్రైవేటు వ్యక్తుల నుండి యూనిట్కు 15 రూపాయలు చొప్పున మీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా మిగతా రాష్ట్రాల్లో యూనిట్ 8/- కు కొంటున్నారు.   దీని వెనుక వున్న రహస్యం ఏమిటి

4)పరిశ్రమల కోసం మీరు చేసిన భూ స్వాధీనంలో రైతులకు నష్ట పరిహారం ఎందుకు తక్కువగా ఇచ్చారు.

5)భూతల స్వర్గంగా మీరు ప్రచారం చేసుకుంటున్నగుజరాతులో  1500 ఖాళీలు గల చిన్న గుమాస్తా ఉద్యోగానికి  13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం కాదా  

6) అంబానీల కుటుంబానికి చెందినా సౌరబ్ పటేల్ మీ మంత్రివర్గంలో సహజ వాయువులు, పెట్రోలియం, శక్తి శాఖామాత్యులుగా వుండగా అంబాని కుటుంబ కంపెనీలతో ప్రభుత్వం జరిపే లావాదేవీలు పారదర్శమ్గా ఎలా వుంటాయి 

7) ఉన్నత విద్యావంతులను మీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి 5,300/- నెల జీతం ఇస్తున్నారు. ఈ జీతంతో కుటుంబం పోషణ వీలవుతుందా. 

8) అభివృద్ధి అంటే గుజరాత్ - గుజరాత్ అంటే అభివృద్ధి అనిచేప్పే మీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయ స్థితిలో వున్నాయి. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు  

ప్రశ్నలైతే బాగున్నాయి కానీ జవాబులు దొరుకుతాయా!

6, మార్చి 2014, గురువారం

బి ఎస్ ఆర్ సి పి - వై ఎస్ ఆర్ సి పి కొన్ని పోలికలు

మనిషిని పోలిన మనుషులు ఎక్కడో కోటికి ఒక్కరే ఉంటారని చెప్తారు.  కానీ, ఎంత యాదృశ్చికం! రెండు వేరు వేరు రాష్ట్రాలు.  రెండు వేరు వేరు భాషలు.   వేరు వేరు పార్టీలు, కానీ కవల పిల్లల్లాంటి పోలికలు.   పరికించండి --- 

*బడవర శ్రామికర రైతర కాంగ్రెస్ పార్టీ (బిఎస్ఆర్ కాంగ్రెస్) 

*యువక శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎసార్ కాంగ్రెస్) 

*రెండు పార్టీలది  పంఖా గుర్తే 

*ఇద్దరి పార్టీ పేరులో మనుషల పేర్లు దాగి వున్నాయి.  బళ్ళారి ఆయన పేరు బి శ్రీరాములు (బి ఎస్ ఆర్) జగన్ గారి  పార్టీ పేరు వైఎస్ఆర్ (దివంగత నేత, ప్రియతమ నాయకుడి పేరు) 

*ఇద్దరిపై ఆరోపణలకు కేంద్ర బిందువు - గనులు, గాలి(వీచేది కాదు), నీరు, డబ్బు, భూమి (పంచ భూతాలు)  

*ఇద్దరి పార్టీ జెండాల రంగులు చూడండి, చాలా దగ్గర పోలికలు వుంటాయి  

*రెండు పార్టీలలోని గుర్తులలో వున్న బొమ్మలను చూస్తే వైద్యం, విద్య, రక్షిత నీరు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  

*ఇద్దరికీ చెల్లి/అక్క వున్నారు.   వాళ్ళు ఇద్దరూ రాజకీయాలలో వున్నారు. 

*రెండు జెండాలలో ఆకుపచ్చ, బ్లూ కొట్టచ్చినట్లుగా ఒకే పాటేర్న్లో వుంటాయి.  

*ఇద్దరూ పాదయాత్ర/కారు యాత్ర చేసి వారి వారి రాష్ట్రాలు కలియ తిరిగారు 

*కొంత కాలం క్రితం వరకు ఒకరు ప్రతిపక్ష జాతీయ పార్టీలో వుండగా,       మరొకరు జాతీయ అధికార పక్షంలో సభ్యులు 

*రాష్ట్రాలు వేరైనా ఇద్దరి మాత్రు భాష ఒకటే 

*జగన్ గారికి కడపలో మంచి పట్టు వుండగా, శ్రీరాములు గారికి బళ్లారిలో తిరుగు లేదు 

* ఒకప్పుడు జగన్ కి గురివిణి సోనియా కాగా శ్రీరాములుకు సుష్మా మాత్రు సమానురాలు.  ఇద్దరూ  స్త్రీ మూర్తులే కదా.  

* తమ తమ పార్టీలతో విభేదాలు వచ్చి ఇద్దరూ పార్టీలు పెట్టుకున్నారు

* గాలంటే ఇద్దరికీ ప్రాణమే 

* రెండు పార్టీలు పుట్టిన సంవత్సరం 2011 

* విద్యార్హతలు  - ఇద్దరూ పట్టభద్రులే - ఒకరు బి ఎ మరొకరు బి కామ్ 

* ఆంగ్ల అక్షర క్రమంలో B రెండోది కాగా, Y చివరనుండి రెండోది. 


*శ్రీరాములు భాజపా నుంచి బయటకు వచ్చి ఎం ఎల్ ఎ గా పోటీ చేస్తే, భాజపా ధరావతు కోల్పోయింది .  జగన్ కూడా  కాంగ్రెస్ వదిలి సొంతంగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు ధరావతు దక్కలేదు 

ఇది ఇలా వుండగా, బి ఎస్ ఆర్ పార్టీ త్వరలో భాజపాలో కలవనుంది, మరి వై ఎస్ ఆర్ సి పి సంగతి ఏమవుతుందో చూద్దాం. 

5, మార్చి 2014, బుధవారం

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విలీనం


మేఘాలు చూసి ముంత ఒలకపోసిందిట వెనకటికి ఒకావిడ.   సోనియమ్మ కూడా తెరాసను చూసింది, యుద్ధ విమానంలో బిల్లు పంపించి ఒక ప్రాంత ప్రజలను శత్రువులుగా చూసింది.   నిన్న పండు గారు కొట్టిన దెబ్బకు  దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయింది.  ఫాం హౌస్లో పడుకుంటాడు అని ఎగతాళి చేసిన నాయకులకు ఆయన ఫాంలోకి వస్తే ఏం జరుగుతుందో సినిమా చూపించాడు.  తెలంగాణలో కచరాకు సరిసమానమైన జనాకర్షణ గల కాంగ్రెస్ నాయకుడు లేడు.    కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే విమర్శించ గల వాళ్ళు, పత్రికలకు టి.వి లకు స్టేట్ మెంట్స్ ఇచ్చే ముసలి ముతక   మాత్రమే కాంగ్రెస్లో వున్నారు. కాస్తో కూస్తో పేరు, చడువు, తెలివితేటలున్న జైపాల్ రెడ్డి గారు తెలంగాణా మొత్తం తిరగడం కష్టం.  అలాగే తీర సీమాన్ధ్రలో కూడా కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు మిగలలేదు.   చివరకు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తెరాసలో,  తీర సీమాంధ్రలో వైకాపాలో కలపాల్సిన పరిస్తితి.   తమిళ్ నాడు, ఆంద్ర, బెంగాల్, బీహార్, యు పి, ఎంపీ,  ధిల్లీ, ఒరిస్సా ---- హతవిధీ,  అన్నింటా మూడో స్థానంలోకి కాంగ్రెస్ దిగజారింది.  ఏ రాష్ట్రంలో కూడా సొంతంగా పోటీ చేసే పరిస్తితే లేదు.  కాంగ్రెస్ను ఆ దేవుడే కాపాడాలి.   

3, మార్చి 2014, సోమవారం

సినీ నటులు రాజకీయాల్లో అవసరమా


తెలంగాణా వారి అదృష్టం - ఆ ప్రాంతంలో సినీ నటులూ తక్కువే, వారిలో రాజకీయాలలో ప్రవేశించిన వారు తక్కువే. ఎన్నిచేప్పినా విజయశాంతి ఆంధ్ర ప్రాంతము నుండే వచ్చిందనేది నిర్వివాదం.   బాబు మోహన్ మాత్రం దండయాత్రలు చేస్తున్నాడు.   కానీ తీర ఆంధ్ర ప్రదేశ్లో వోటర్లపై వీరి ప్రభావము చాలా ఎక్కువ.   నాకు గుర్తున్నంతవరకు క్రింది జాబితాలో ఇచ్చిన నటులందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన వారే -- 

1) ఎన్ టి ఆర్ 
2) కృష్ణ 
3) కృష్ణం రాజు 
4) విజయ నిర్మల 
5) జమున 
6) ఎ వి ఎస్ 
7) ధర్మవరపు సుబ్రహ్మణ్యం 
8) జీవిత/రాజశేఖర్ 
9) చిరంజీవి 
10) టి సుబ్బి రామి రెడ్డి 
11) రామానాయుడు 
12) రోజా 
13) మోహన్ బాబు 
14) కోట శ్రీనివాస రావు 
15) రావు గోపాల రావు 
16) కొంగర జగ్గయ్య 
17) నాగభూషణం 
18) శివప్రసాద్(తిరుపతి)
19) గిరిబాబు 
20) శివకృష్ణ 
21) నరేష్ 
22) దాసరి నారాయణ రావ్ 
23) జయసుధ 
24) శారద 
25) విజయ్ చందర్ 
26) జయప్రద 
27) కవిత 
28) మురళీ మోహన్ 
29) సుమన్ 
30) శాయి కుమార్ 
31) హరికృష్ణ 
32) బాలకృష్ణ 
32) పవన్ కళ్యాణ్ 

(బ్లాగు చదివే వాళ్ళు ఇంకొన్ని పేర్లు సూచించ వచ్చు) 

సినిమా వారు రాజకీయాలలోకి రాకూడదని నా ఉద్దేశం కాదు.   ఉపాధ్యాయుడు తన బోధనా వృత్తి మాత్రం చేస్తే బాగుంటుంది కానీ, దానితో పాటు జీవిత భీమా ఏజెంట్గా కూడా పని చేస్తేనే సమస్య.  

ఒక్క రామారావు తప్ప మిగిలిన వారికి రాజకీయాలు ఫుల్ టైం కాదు.   తీర సీమాన్ధ్రలో మొదటి నుంచి సినిమాలు చూడడం, నటులపై అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం చాలా ఎక్కువ.   ఈ సినీ అభిమానమే వోట్లుగా రూపాంతరం చెందుతుంది.   

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది ఉన్నత  విద్యావంతులైన నాయకులు.   పదవిని ఒక భూషణంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూసే వ్యక్తులు.   ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకత్వంలో,  అయితే గుత్తేదారు లేదంటే సినీ రంగం వారు మాత్రమే ఎన్నికలలో ముందుకు వస్తున్నారు.    కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నత విద్యావంతులు, వ్యాపారాలు లేనివాళ్ళు, పదవిని సమాజ సేవకోసం మాత్రమే వినియోగించే వాళ్ళు అత్యవసరం.