28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చిన్న రాష్ట్రాల పేరిట రాజకీయ క్రీడ


ఒక కొత్త జిల్లా ఏర్పడితే కనీసం 10 మంది రాజకీయ నిరుద్యోగులకు పదవి దక్కుతుంది, అదే ఒక రాష్ట్రమే ఏర్పడితే వందలమంది రాజకీయ నిరుద్యోగులకు పదవి లభిస్తుంది.   ఈ సూత్రాన్ని బాగా వంటపట్టించుకున్న భాజపా ఈ ఊబిలోకి కాంగ్రెస్ పార్టీని కూడా లాగింది.   అవసరాన్ని బట్టి దీపాలు ఆర్పి, తలుపులు మూసేసి, ఎంపీలను కొట్టించైనా మూజువాణీ పెట్టేసి రాష్ట్రాల  విభజన  జరపవచ్చని ఇటీవలే రుజువైంది.  భాజపా అగ్ర నాయకత్వం పదే పదే, తాము 3 రాష్ట్రాలు వేర్పాటు చేస్తే, ఇరు రాష్ట్రాలు మిఠాయిలు పంచుకున్నారు అని చెప్తూ  "రాజధానితో పాటు రాష్ట్రం విడిపోలేదు"  అన్న నగ్న సత్యాన్ని దాచిబెడతారు.  60 సంవత్సరాలకు పైబడి ప్రత్యెక రాష్ట్ర  డిమాండ్ వున్న గూర్ఖాలాండ్లో తెలంగాణా విభజన తరువాత కదలిక మొదలైంది.    గూర్ఖాలాండ్ నాలుగు దేశాల అంతర్జాతీయ సరిహద్దు (నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్) వెంబడి వుంది. తెలంగాణాలో రాజకీయ నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఆత్మ హత్యలు జరిగితే, గూర్ఖాలాండు ప్రజలలో విద్యావంతులు తక్కువ.   వారాల తరబడి బందులు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు వున్నాయి.   భాజపా అగ్రనేత జస్వంత్ సింగ్ 2009లో డార్జీలింగ్ పార్లమెంటు స్థానం నుంచి గూర్ఖాలాండు జనముక్తి మోర్చా మద్దుతుతో గెలుపొందాడు.   తెలంగాణలో సోనియా గాంధీ కేవలం గులాబీ కండువా మాత్రమే కప్పుకుని 2009 లో ప్రచారం చేసింది.   ఇక్కడ జస్వంత్ గారు ఏకంగా ఒక వేర్పాటు వాద, విచ్ఛిన్నకర శక్తితో చేతులు కలిపి వారి మద్దుతుతో ఎంపీగా కొనసాగుతున్నారు.   తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత గూర్ఖాలాండు ఉద్యమకారులు దిల్లీలో జస్వంత్ సింగు గారికోసం తెగ వెదికారు.   ఆయన ధిల్లీ లోనూ, డార్జిలింగు ఆఫీసులోను లేకపోవడంతో సమీప పోలీసు స్టేషన్ లో కూడా 'మిస్సింగ్ కంప్లైంట్' ఇచ్చారు.    


సీట్ల కోసం, వోట్ల కోసం వెంపర్లాడే జాతీయ పార్టీలుగా చెప్పుకొనే ఈ పార్టీలు ఏదో ఒక రోజు ఈ దేశ విచ్చిన్నానికి పరోక్షంగా సహాయం చేస్తాయనడంలో ఆశ్చర్యం లెదు.  

కాంగ్రెసుతో పొత్తు తెరాసకు నష్టం


తిరునాళ్ళకో, జాతరకో వెళ్ళేటప్పుడు ఉన్నంత హుషారు తిరిగి ఇంటికి వచ్చేప్పుడు వుండదు.  ఇది చాలా సహజం. ఉద్యమకారునికిగా కచరా సంవత్సరం క్రితం కాంగ్రెసును దుమ్మెత్తి పోస్తూ "తెరాస ను కాంగ్రెస్లో విలీనం చేస్తే ప్రత్యెక రాష్ట్రం ఇస్తామంటున్నారుగా, ఎంతో కష్టపడి పెంచిన పార్టీని మీ బొంద మీద కలపడానికి సిద్ధం, ఇప్పుడైనా రాష్ట్రం ప్రకటించండి" అని తనకు ఇష్టం లేకపోయినా స్వరాష్ట్రం కొరకు పార్టీని త్యాగం చెయ్యడానికి ఆనాడు సిద్ధపడ్డారు. కానీ ఈ రోజు పరిస్థితులు వేరు.   రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రెండంకేలకే పరిమితమయ్యే పరిస్తితిలో వుంది.   అలాంటప్పుడు తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసి మరో (అ) చిరంజీవిగా మిగిలే బదులు, సొంతంగా 10-12 స్థానాలలో అభ్యర్ధులను గెలిపించుకొని రాబోయే భాజపా ప్రభుత్వానికి  మద్దతు ఇచ్చి తెలంగాణా రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకొనే వెసులుబాటు వుంటుంది.   తెలంగాణా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ, జనాన్ని ఆకట్టుకోగలిగిన కాంగ్రెస్ నాయకుడు ఎవరూ లేరు.   నిన్నటి దాకా సొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని తిట్టిన వి హెచ్, పాల్వాయ్, పొన్నం  లను చూసి వోట్లేసే వెర్రిబాగుల వాళ్ళు తెలంగాణలో లేరు.  


ప్రస్తుత లోకసభలో 18 మంది ఏమ్పీలున్న డి ఎం కె నాలుగు పదవులు పొందింది.  వాళ్లకు వాళ్ళ రాష్ట్రానికి "మేళ్ళు"  జరిగాయి.      భక్తవ శంకరుడి దర్శనం కావాలంటే ముందు నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి.   కాంగ్రెస్ పార్టీలో అమ్మగారిని కలవాలంటే ఇలాంటి నందులు వేరు వేరు పేర్లతో, రూపాలతో దిల్లీలో వుంటాయి.   ముందు వారిని ప్రసన్నం చేసుకోవాలి, వారు అనుమతిస్తే అమ్మగారిని కలవచ్చు.   ఈ కష్టాలకు బదులు సొంతంగా పార్టీని కొనసాగించి మనకు కావలసిన మేళ్ళు జరిపించుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే, ఆంధ్ర రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను, ప్రజలను  పెద్దగా తిట్టడానికి వుండదు.  దీని బదులు ఇంకో 10 సంవత్సారాలు తమ పార్టీ కొనసాగితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పక్క రాష్ట్ర ప్రజలను దూషించి వారు గతంలో చేసినట్లుగా చెబుతున్న దోపిడీని గుర్తుచేసి వోట్లు దండుకోవచ్చు.  తీర్దానికి తీర్ధం - ప్రసాదానికి ప్రసాదం.   

20, ఫిబ్రవరి 2014, గురువారం

అసలు క్విడ్ ప్రో కో అంటే ఇదే


మంగళవారం నుంచి నిరంతరాయంగా నడుస్తున్న ధారావాహికలో పెద్దమ్మ, చిన్నమ్మ, దద్దమ్మలు కలిసి  రాజ్యసభ అంకంతో  రక్తి  కట్టిస్తున్నారు. పెద్దమ్మ బిల్లు పెట్టింది, చిన్నమ్మ నోట్లో వేలేసుకొని తలాడించి  కాంగ్రెస్ ఎంపీల చేత కాళ్ళకు నమస్కారం పెట్టించుకుంది.   అంతా  అయిపోయిన తరువాత  మన మాట వంకర వెంకయ్య గారు సీమాన్ధ్రకు అన్యాయం జరగనివ్వం అనే పదాన్ని పది రూపాయల నోటు మీద ఎన్ని భాషలలో ముద్రించి వుంటుందో అన్ని భాషలలో మైకు ముందు చెప్పేస్తారు.   ఇహ నుంచి తెలంగాణా విమోచన ప్రదాత చిన్నమ్మ, సీమాన్ధ్ర కింగ్ మన వెంకయ్య. ఎన్నికలప్పుడు చిన్నమ్మ తెలంగాణలో ప్రచారం చేస్తారు, తీర సీమాన్ధ్రలో వెంకయ్య గారు జనాల్ని మభ్య పెడతారు.   వెంకయ్య గారు అంత్య ప్రాసలతో జనాల్ని ఓలలాడించినా ఆయనకు ఆంధ్ర నాయకులు అడ్డు చెప్పరు, కారణం ఆయన జనాభాలో ఐదు శాతం సామాజిక వర్గానికి ప్రతినిధి కాబట్టి.   


చిత్త సుద్ధి వుంటే, సుష్మా స్వరాజ్ లోక్ సభలో ఎందుకు బిల్లుకు సవరణలు పెట్టలేదు?  అంతా 23 నిమిషాలలో కానిచ్చి తెలంగాణా వారి ఓట్లను కొల్లగోడదామని కాదా?   ఇప్పుడు బిల్లును ఏదో విధంగా అడ్డుకున్నట్లు నటించి రాజ్యసభలో నాటకాన్ని రక్తి కట్టించి ఆంధ్రలో ఓట్లు దండుకుందామన్న దుర్బుద్ధి కాక మరేమిటి?   


ఇంతవరకూ వచ్చాక మళ్ళీ రాజ్యసభలో గొడవెందుకు.   అసలే బలహీన మనస్తత్వం వున్న ప్రజలున్న రాష్ట్రం మనది.   ఇప్పుడు బిల్లు ఆలస్యం అయితే, ఆత్మ హత్యలు జరగ వచ్చు.    లైట్లు ఆపేసి మేజువాణి పెట్టేస్తే సరి.  






19, ఫిబ్రవరి 2014, బుధవారం

కొత్త రాష్ట్రంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పించండి


రాష్ట్ర విభజన నేపధ్యంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాముఖ్యం ఇవ్వాలి.   ద్వి భాషా సూత్రం అమలు చేసినా తప్పులేదు.    తీర సీమాన్ధ్ర ప్రాంతంలో, తెలంగాణా రాష్ట్రం లాగా ఉర్దూకు అంత ఆదరణ, ప్రాముఖ్యం లేదు.   కాబట్టి తెలుగును నిర్భందంగా ఏడవ తరగతి వరకు, ఆ తరువాత కనీసం ఒక పాఠ్యాంశంగా చేర్చాలి.   తెలుగు భాషకు ఆయువు పట్టైనా తెలంగాణలో ఉర్దూ భాషకు రాజకీయ పరమైన, భౌగోళిక పరమైన మద్దతు లభించి తెలుగు కొంత నష్టపోయే అవకాశం వుంది.     ఆ రాష్ట్ర జనాభాలో కనీసం 10-12 శాతం మాత్రు భాషగా మాట్లాడే ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ వర్గం వారు సహించరు.   కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలోనైనా తెలుగు భాషను పరిరక్షించడం ద్వారా మాత్రు భాషకు మేలు చేసినట్లవుతుంది.  


18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు


తెలంగాణా ఇచ్చేశారు.  అది కూడా 'మేజువాణి' ఓటుతో ఇచ్చేశారు. తలుపులేసి, బయట ప్రపంచానికి తెలియకుండా ఇచ్చారు కాబట్టి ఇది మూజువాణి కాకుండా మేజువాణి అనడమే సమంజసం.  మరో వింతేమిటంటే, ముగ్గురు స్త్రీలు కలిసి ఈ బిల్లును ఒంటి చేత్తో పరిష్కరించారు.   కాకపొతే ఇందులో ఇద్దరు విద్యాధికులు కాగా  మరొకరిది  వానాకాలం చదువు.   

గత ఆరు నెలల నుంచి విభజన వాదులు సమైక్య వాదులుగా (కొద్ది మంది) సమైక్య వాదులు విభజన వాదులుగా మారారు. బయటికి చెప్పినా చెప్పక పోయినా, భాజపా సీమాంధ్ర ప్రాంత నాయకులు సమైక్యవాదులుగా, సత్తి బాబు & పార్టీ, మాన్యులు డొక్కా గారు, పనబాక గారు, బాల రాజు గారు, కొండ్రు గారు, పుట్టు తెలుగు వారు కాని కేంద్ర అమాత్యులు, రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి గారు  విభజన వాదులుగా మరారు.     సంతలో వింత ఏమిటంటే, హరీష్ రావు గారు, కె టి ఆర్ గారు  ఎప్పటిలా మాట్లాడే వారి మాట తీరుకు విరుద్ధంగా తెలంగాణాలోని   సీమాన్ధ్రాలకు అభయ హస్తం ఇస్తామనగా, పెప్పర్ రాజగోపాల్ గారు, చక్రవర్తి అశోక్ సామ్రాట్లాగా అస్త్ర సన్యాసం చేసి తెలుగు వారు విడిపోయినా ఐక్యంగా వుండాలని కాంక్షించారు. 

తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆంద్ర ప్రాంత ప్రజల పిల్లలు పది సంవత్సరాలు తెలంగాణా ప్రాంతంలో చదివితే సహజంగానే ఆ ప్రాంతంలో వున్న విద్య, ఉద్యోగాలకు అర్హత పొందుతారు.   2012 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు.   ఎన్ని సార్లు అబద్ధం చెప్పినా ఈ సంఖ్య 4.5 కోట్లు కాదు.   ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, జంట నగరాలు, మహబూబ్ నగర్, మెదక్, రంగా రెడ్డి ప్రాంతాలలో తీర సీమాన్ధ్రులు కొన్ని దశాబ్దాల క్రితమే స్థిరపడి కనీసం 30 నుంచి 40 శాసన సభ్యుల ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో వున్నారు.    దీనికి చిన్న ఉదాహరణ - మల్కాజ్గిరి పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటు స్థానాల గెలుపుపై వివిధ పార్టీలలో వున్నసీమాన్ధ్ర నేతల  విశ్వాసం.   గత పది సంవత్సరాల ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తే, తెలంగాణా ప్రాంతం నుంచి నోరు జారే నాయకులు ఎవరైనా వున్నారంటే, కేవలం 4 నుంచి 5 జిల్లాలకే పరిమితం.   గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్దగా నోరు జారడు, ఎందుకంటే నల్గొండ పార్లమెంటు పరిధిలో గణనీయంగా ఆంద్ర ప్రాంత ప్రజలు వున్నారు.  అలాగే ఖమ్మం, మల్కాజ్గిరి, సికిందరాబాద్ మొ॥     ఇహ, జంట నగరాలలో వున్న ఏ పరిశ్రమలోనైనా, కేవలం ప్రతిభ ఆధారంగా వుద్యోగం ఇస్తారు గానీ, వీడు మన జిల్లా వాడనో లేక ప్రాంతం వాడనో ఉద్యోగంలోకి తీసుకోరు.   138 పై చిలుకు కేంద్ర సంస్థలు హైదరాబాదులో వున్నాయి మరి వాటిలో ఉద్యోగాలు తీర సీమాన్ద్రులకు దక్కవా అంటే - ఇది కూడా అవాస్తవం.   అన్ని స్కిల్డ్ ఉద్యోగాలకు దేశవ్యాప్త పరీక్ష ద్వారా మాత్రమే నియామకాలు వుంటాయి.   కాబట్టి ఆందోళన అనవసరం. ఈ విభజన వలన తీవ్రమైన నీటి యుద్ధాలు, అంతర్ రాష్ట్ర పన్నులు ఇరు ప్రాంత ప్రజల మీద తీవ్రంగా పడే ప్రమాదం వుంది.     అత్యంత దుర్భిక్షంతో వున్న రాయల సీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం ఈ విభజన ఒక అశనిపాతం.   42 మంది సభ్యులతో కేంద్రాన్ని శాసించే స్థితిలో వున్న ఆంద్ర ప్రదేశ్, ఆ స్థానాన్ని కోల్పోయి పలుచన కావడం తధ్యమ్. 

దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలతో పోలిస్తే, హైదరాబాదులో నివాసం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.  సర్వ హంగులున్న ఈ పట్టణానికి, ధరలు పెరగక ముందే  తీర సీమాన్ధ్రులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్థిర  నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆంద్ర ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల గుప్పిటలో నలుగుతున్న రియల్ ఎస్టేట్ భూముల ధరలు ఆకాశాన్ని అంటుకున్న ఈ సందర్భంలో హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకోవడం ఉత్తమం . 

తీర సీమాన్ధ్రకు జరగబోయే అతి  పెద్ద నష్టం ఏదైనా వుంటే మొట్ట మొదటగా అది మత మార్పిడుల రూపంలో వుంటుంది. దేశ వ్యాప్తంగా క్రైస్తవంలోకి మార్పిడి జరిగేది తీర ప్రాంతాలలోనే.  ఈ విభజన వలన,  తిరుపతి ఏడు కొండలలో కొన్ని కొండలను దిగ మింగెయ్యాలని తలపెట్టిన ప్రియతమ నాయకుడి కొడుకు కాంగ్రెస్ సహకారంతో  అధికారం లోకి వచ్చే అవకాశం ఎక్కువ.   ఈ కుటుంబ ప్రాభవం పొందడానికి క్రైస్తవం లోకి బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది.     

ఏతా వాతా విభజన వలన జరిగే పెద్ద లాభాలు ఏమైనా ఉన్నాయంటే, అవి రెండు మంత్రి వర్గాలు, రెండు చోట్లా రియల్ ఎస్టేటు ముసుగులో ప్రజలను పీడించే బేనామీ రాజకీయ నాయకులు మాత్రమే.   ఈ విభజన ద్వారా కాంగ్రెస్ భాజపాలు కుట్ర పూరితంగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను దెబ్బ వెయ్యడం ద్వారా రాబోయే రోజులలో ప్రజలకు కేవలం తాము మాత్రమె దీక్కు అన్న సంకేతాన్ని సంయుక్తంగా పంపినట్లైంది. 

మరోసారి 29 వ రాష్ట్రం (అందునా తెలుగు రాష్ట్రం) తెలంగాణాకు శుభాకాంక్షలు!


14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఆప్(ప) సోపాలు


క్రేజీవాల్ - గత సంవత్సరం నుంచి రాజకీయ ముఖచిత్రం పై 'మార్పు' తీసుకొస్తానని ధిల్లీ వీధుల్లో బోల్తా పడ్డాడు.   ఈ మార్పు అనే పదం వాడిన రాజకీయ నాయకుడు ఎవ్వడూ ఎక్కువ కాలం పార్టీని నడపలా!    చిరు జీవి గెలిచిన ఐదు నెలలకు బోర్డు మార్చేస్తే, కేజ్రీవాల్ గారు యాభై రోజులలోనే మార్పు తెచ్చారు.   గెలిచిన 15 రోజులకే కాంగ్రెస్ కబంధ హస్తాలలో చిక్కుకొని ఆప సోపాలు పడి  ఐదు వారాలకే విల విల లాడుతున్నాడు.  బాబు గారి నోట్లో మట్టి కొట్టి  చిరంజీవి కూడా ఠాగూర్ (ఈ పేరు బాగా వత్తి పలకండి) పేరిట సినిమా తీసి, రిటైల్ స్థానాలు గెలిచి, హోల్ సేల్ గా అమ్మ గారి ముందు సాగిల పడ్డాడు. క్రేజీ వాల్  కూడా తన శక్తి వంచన లేకుండా భాజపా ను ఓడించి, కబంధ హస్తం సాయంతో ధిల్లీ పీఠాన్ని ఎక్కాడు.   హస్తం చేతికి చిక్కి, నోరు మూసుకొని వుండక లోక్ పాల్ బిల్లు, దీక్షిత్ పై విచారణ అంటూ విర్ర వీగితే కాంగ్రెస్ మార్షల్ లాంటి గవర్నర్ ఊరుకుంటాడా!  అప్పటి దాకా కాంగ్రెస్ ను నిందించి, అధికార వ్యామోహానికి లోనై పదవి అలంకరించిన రోజు నీ బుద్ధి ఏమైంది.  

క్రేజీ బాబు- బాగా వేగంగా పరుగెత్తే రైలు మార్గం వెయ్యాలంటే, ఉన్న మార్గాన్ని ముందు పీకేస్తే జనం ఊరుకోరు.   మన నేతి బీర కాయ ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు రావాలి. గవర్నర్లు, స్పీకర్లు, అధికార్లు  పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించటం మొదలు పోవాలి. అధికారంలోకి వచ్చిన సత్వరం తమ ఆస్తులను త్యజించాలి.  ఒక సారి ఎన్నికైన వాడు రెండో సారి పోటీ చెయ్య కూడదు.  అనువంశిక పాలన పోవాలి. దీనికి ఇంకో ఐదు దశాబ్దాలు పట్టవచ్చు.  అప్పటి దాకా సర్డుకుబోవటం నేర్చుకుంటే పది కాలాల పాటు అధికారంలో వుండి నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.     

లాంకో వారి "స్ప్రే" ఉత్పాదనలు


నిన్నటి నుంచి ప్రతి చానలు, ప్రతి పత్రికా పాపం లగడపాటి రాజగోపాల్ను మిరియాల పొడి ఉపయోగించాడని నిందిస్తున్నాయి.    ఇదే మిరియాల పొడి చారులో వేస్తే అబ్బా రుచి అమోఘంగా వుంది, జలుబు రొంప దెబ్బకు కొట్టుకు పోయిందని మనం లొట్టలు వేసుకొని వాడతాము. పాపం రాజగోపాల్ గారు కూడా అదే చెప్పదలుచుకున్నారు.    లాంకో బ్రాండ్ మిరియాలను 'కాషా'యంగాను, రొంప తగ్గించడానికి మరియు దుష్టులనుండి రక్షణ కొరకు ఎలా ఉపయోగ పడుతుందో ప్రయోగాత్మకంగా భారతీయులకు వివరించాడు. ఇదే విన్యాసం ప్రకటన రూపంలో వివిధ మాధ్యమాల ద్వారా జన బాహుళ్యానికి చేరువ అవడానికి కనీసం 10 కోట్లు ఖర్చు అవుతుంది.  ఈ ప్రయోగంతో మనకు తెలిసింది ఏమిటంటే, ఇది ఒక ఉత్తమమైన స్వీయ రక్షణ  ఆయుధం.   ఇక ముందు మాటల్లేవ్ - మాట్లాడుకోవటాల్లేవ్, కేవలం మిరియాల పొడి మాత్రమే, బస్తీ మే సవాల్.  పోలీసులు కూడా టియర్ గాస్ బదులు మిరియాల గాస్ వదలచ్చు.  ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ.   పై పెచ్చు, ఇది ఆయుర్వేద ఔషధం కూడాను.  రైతులు ఇక నుంచి మిరియాల సాగు ఎక్కువ చెయ్యవచ్చు.   చేనుకు చేవ రైతుకు రొక్కం.     

కాంగ్రెస్ మార్షల్స్ ఏమి చేసేది ముందుగా చెప్పలేదు, రాజగోపాల్ కూడా పెప్పర్ వాడతానని ముందుగా చెప్పలేదు, కాబట్టి చెల్లుకు చెల్లు.  ఈ విషయంలో మహా మేధావి, రాజీవ్ గాంధీని పబ్లిక్ గా ఉరి తీయాలని నొక్కి వక్కాణించిన ఉత్తమ పార్లమెన్టేరియన్ ను మాత్రం సలహా అడగ కండి, ఆయన దీనిని 'తొండి' అని చెప్పి సోనియా గాంధీ మెప్పు పొందుతాడు.   

నన్నడగితే, సోమవారం నుండి పార్లమెంటులో తాడాట (టగ్  ఆఫ్ వార్) పెట్టి ఎవరు గెలుస్తారో తేల్చాలండి.  కాకపోతే ఈ తాడును బాబు గారికి, కచరా గారికి, సోనియాకు  మెడకు చుట్టి క్షీర సాగర మధనమ్లా చేస్తే చూసే వాళ్లకు కూడా  వినోదం మీడియా వాళ్లకు రేటింగ్స్ బాగుంటాయి.   ఎందుకంటే, నామా నాగేశ్వర రావు గారు బయటికి వచ్చి  నేను నారాయణను, మొదుగులను కొట్టి మరీ బిల్లు పెట్టించాను అని చెప్పి బాబు గారితో పాటు అపోలోకు వెళ్లి నారాయణను పలకరించి వచ్చాడు. కొట్టింది కాంగ్రెస్, తెదేపా వాళ్ళు; తన్నులు తిన్నది తెదేపా, కాంగ్రెస్ వాళ్ళు; లాభం కచారాకు, బాబుకు, సోనియమ్మకు.  కాబట్టి   ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్న ఈ ముగ్గురు మూర్ఖులకు క్షీర సాగర మధనమో, కుంభీ పాకమో తప్పకుండా జరిపించాలండి.