15, అక్టోబర్ 2014, బుధవారం

ఆన్ లైన్ వ్యాపారం తప్పా!


ఇటీవల ఫ్లిప్ కార్ట్ అనే ఆన్ లైన్ సంస్థ బిలియన్ సెల్ పేరిట ఏకంగా 600 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒక్క రోజులో చేసింది.  ఇది తెలిసిన రిటైల్ వ్యాపారులు కేంద్ర ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేస్తూ, ఇలాంటి ఆన్ లైన్ వ్యాపారాలను ప్రభుత్వం నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.    

బిలియన్ సేల్ పేరిట జరిగిన అమ్మకంలో నేను కొన్ని ఎలాక్త్రోనిక్ వస్తువులు కొన్నాను.  అదే వస్తువులు బయట కొంటే కనీసం 20 శాతం ఎక్కువ ఖర్చు అయ్యేది.   వ్యాపారంలో పోటీ వుండాల్సిందే.   గతంలో మారుతీ కంపెనీ మాత్రమే కార్లు తయారు చేసేది, అది కూడా 800 రకం మాత్రమే.    తరువాతి కాలంలో హుందే, ఫోర్డు రావడంతో నెలకో రకం కారుతో మారుతీ వారు పోటీ పడుతున్నారు.    పరుగు పందెంలో ఒక్కడినే పరిగెత్తి నేనే విజేతనంటే కుదరదు కదా!

డెలివరీ బాయ్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, గోడౌన్ మేనేజ్మెంట్, సార్టింగ్, కొరియర్, బాక్ ఆఫీస్ మొదలైన్ రంగాలలో అత్యుత్తమ జీతాలతో ఆన్లైన్ సంస్థలు బోలెడు మందికి ఉపాధికి కల్పిస్తున్నాయి.   కొనుగోలుదారుడికి తక్కువ ధరకు కొన్ని రకాల వస్తువులు లభ్యమౌతున్నాయి.    ఆన్ లైన్ సంస్థలు తాము చట్ట పరంగా చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తున్నంత వరకు, వస్తువుల నాణ్యతకు చట్టపరంగా రక్షణ కల్పించినంత వరకూ  ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. 

ఈ ఆన్లైన్ సంస్థలు త్వరలో ఫార్మా రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆశిద్దాం.    దీని ద్వారా కనీసం మనం కొనే మందులపై 20 నుంచి 30 శాతం వరకు ఆదా చేసుకొనే అవకాశం వుంది.   ఉదా-  నేను మా కుటుంబం కోసం కనీసం నెలకు 1500/- విలువైన మందులు కొంటాం.    ఈ మందులు మీరు ఫార్మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనండి మీకు కనీసం 20 నుంచి 25 శాతం తక్కువకు వస్తుంది .   ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు.   హైదరాబాద్ లోని కోటీకి వెళ్ళండి, బోలెడు మంది దిస్త్రిబ్యుటర్లు వున్నారు. అంటే, డిస్ట్రిబ్యూటర్  మనకే 20-25 శాతం తగ్గించి ఇస్తుంటే, అతనికి కూడా కనీసం అంతే మొత్తంలో లాభం వస్తుండవచ్చు.    అలాగే మందులు తయారు చేసే కంపెనీలకు అంతకన్నా ఎక్కువ లాభం వస్తుంది.    దీనిని బట్టి చూస్తే, పది పైసలు తయారీ ఖర్చు అయ్యే మందు మనకు చేరేప్పటికి 100 పైసలు పడుతుంది.    ఎంత దారుణం!    జనరిక్ మందుల షాపుల పేరిట అక్కడక్కడా ఒకటి అరా దుకాణాలు వున్నా, వీటిపై అవగాహన లేదు. పూర్తి స్థాయిలో లభ్యతా లెదు.    కాబట్టి, ఈ రంగంలో కూడా పోటీ రావాల్సిన తక్షణ అవసరం వుంది. ఎంపిక చేసిన కొన్ని మందులు ఆన్ లైనులో మందుల చీటీ అప్ లోడ్ చెయ్యడం ద్వారా, సులభంగా చౌకలో ఇంటి దగ్గరే తెప్పించుకొనే   అవకాశం వుంది.    

తమ లాభాల్లో గండి పడుతుందనే భయంతో కొంత మంది దళారులు, తమకు ఇప్పటివరకూ వస్తున్న అధిక లాభాల్లో కోత పడుతున్నదన్న దుఘ్దతోనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఉండవచ్చు.    కావున, మధ్యాదాయ వర్గాలకు ఈ ఆన్లైన్ వ్యాపారం ద్వారా వస్తు కొనుగోళ్ళలో మంచి జరుగుతుందని ఆశిద్దాం.    

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాదుకా పట్టాభిషేకం


శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది -  రాముని అరణ్యవాసం , భరతుని పట్టాభిషేకం.   సీతా రాములిద్దరూ నార బట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికేగుతారు.  రాముని అరణ్య వాసం తరువాత భరతుడ్ని పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలనే కైకేయి కోరికకు భరతుడు తిరస్కరించి రాముడ్ని వెదుకుకుంటూ  అడవికి వెళ్ళి అన్నని  బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం మనకు తెలిసిందే.    తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరామ చంద్రుడు, అన్నపై అపారమైన వాత్సల్యం వున్న తమ్ముడుగా భరతుడు  మనకు ఆదర్శం.     

కానీ తమిళ రాజకీయాలలో అమ్మ కొత్త ఒరవడి సృష్టించింది.   పాపం పన్నీరు గారికి ఒక జత పాదుకలు కాదు 750 జతల పాడుకల్ని ఇచ్చింది.    నార బట్టల బదులు 1000  కంచి పట్టు చీరెలు ఇచ్చింది.   అలనాటి భరతుడికి మన పన్నీరుకు బోలెడు పోలికలు ఉన్నాయి.   శ్రీరామచంద్రుని అరణ్య వాసం ముగిసిన తక్షణమే భరతుడు అన్నకు రాజ్యాన్ని సంతోషంగా అప్పగించాడు. అమ్మ జైలు నుంచి వచ్చిన తక్షణమే పన్నీరు కూడా అదే చేస్తాడు.   రాముడు లేని అయోధ్య బోసిపోయింది.   అమ్మ లేని తమిళ్ నాడు కూడా అంతే.     దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకున్న పెద్ద సమస్య ఇదే.   కొడుకో, కూతురో, భార్యో, భర్తో వుంటే కొంతలో కొంత మేలు.    లాలు జైలుకేల్తూ వాళ్లావిడకి పట్టాభిషేకం చేసారు.    అదే ఒరిస్సా, బెంగాలు, తమిళ్ నాడులలో ఇలాంటి పరిస్తితి వస్తే  పన్నీరు లాంటి పాదుకల అవసరం పడుతుంది.    కానీ పన్నీర్ లాంటి మంచి పాదుకలు అన్నిపార్టీలలో అరుదుగా దొరుకుతారు.    ఇది అమ్మ అదృష్టం.  

శ్రీరాముడికి విప్లవ వనితకి ఒకటే తేడా - తండ్రి మాట సిరసావహించడం, నీతివంతమైన పాలన రాముడి సొంతం; కోటాను కోట్లు ప్రజా ధనం పోగేసుకోవడం అమ్మ నైజం. 


25, జూన్ 2014, బుధవారం

ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి


అయ్యలారా, 

ఇటీవలి ఎన్నికలలో మీరు ఘోర పరాజయం పొందిన పిమ్మట మీరందరూ కలసి కూర్చొని ఓటమికి గల కారణాలు విశ్లేషించారు.   ఇది ఒక రకంగా సంతాప సభలా జరిగింది.   ఇందులో వచ్చిన కొన్ని సూచనలలో ముఖ్యమైనవి అ) పార్టీకి ఒక టి వి మరియు పత్రిక కావాలని ఆ) పార్టీ అధ్యక్షురాలు మరియు యువ నేత ఆంధ్రాలో తరచూ పర్యటించాలని -- 


నిజంగా మీరు పార్టీ శ్రేయస్సు కోరుకొనే నాయకులైతే దయచేసి ఈ రెండు పనులు మాత్రం చెయ్యవద్దు.  పొరపాటున ప్రజలు మీ చానల్లో సోనియా గాంధీ బొమ్మ చూసారంటే,  వాళ్లకు గతంలో తెలుగు వారిని చీల్చి చెండాడుతూ  ఆమె జరిపిన దాడి (యుద్ధ విమానంలో బిల్లు పంపడం, పార్లమెంటులో దీపాలార్పడం) వగైరాలు గుర్తు వచ్చి మానుతున్న గాయాన్ని మళ్ళీ గెలికింది మీరే అని మిమ్మల్ని ఇంకా ఘోరంగా శిక్షించే  ప్రమాదం వుంది.   


పోనీ పాపం మీరు పత్రిక పెడితే, ఎవరిని విమర్శిస్తారు -- తెదేపాను విమర్శిస్తే, జగన్ బలం పెరుగుతుంది, జగన్ను విమర్శిస్తే తెదేపా బలం పెరుగుతుంది.   మిమ్మల్ని మీరు పోగుడుకునే దానికి అక్కడ ముడి సరుకు లేదు. కాబట్టి పరిస్తితులు కొంత అనుకూలించే వరకు పొరపాటున కూడా ఆ పని చెయ్యవద్దు.   


ఎన్నికల సమయంలో మీకు చేతై నంత వరకు మీరే ప్రచారం చేసుకోండి గానీ పొరపాటున కూడా ధిల్లీ నుంచి ఎవరినీ పిలవవద్దు.  సినిమా పిచ్చి కాస్త ఎక్కువగా వున్న ఆంధ్ర ప్రజలు కూడా చిరంజీవిని తిలకించడానికి ఇక ముందు సభలకు రారు.  కనీసం మీ అంతట మీరు ప్రచారం చేసుకుంటే, ఇద్దరికో మహా అయితే పది మందికో ధరావతు దక్కే అదృష్టం వుంది.   పై నుంచి మీ నాయకులు తరచూ వస్తే అది కూడా కష్టమే.   ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒకటో ఆరో సీట్లు రాక మానవు.  


ఇప్పటికీ ఏదో ఒక మూల కాంగ్రెస్పై కాస్తో కూస్తో అభిమానమున్న వాడిగా సిగ్గుతో ఈ సలహా ఇస్తున్నాను, తప్పక పాటించ గలరు.  

23, జూన్ 2014, సోమవారం

ఎవరు స్థానికులు?


వైద్య, తాంత్రిక మరియు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు దాదాపు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి.    తమిళనాడులో 8 నుంచి 12వ తరగతి వరకు ఆ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్ధైనా అక్కడి కాలేజీల్లో  స్తానికుడిగా గుర్తింపబడతాడు.     కర్ణాటకలో 1 నుండి 12 వ తరగతి లోపల ఏడు సంవత్సరాలపాటు (పి యు సి తప్పకుండా  కర్ణాటకలోనే చదవాలి) చదివితే వారు స్థానికులుగా గుర్తింపు పొందుతారు.   ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ సిస్టం ప్రకారం ఉండేది.    అందులోను స్థానికతను ఆనప కాయ-సొర కాయ, గోంగూర-కుంటికూర గుర్తింపులతో కాకుండా ఎక్కడ చదువుకున్నారనే వాస్తవాన్ని బట్టే ప్రవేశం వుండేది.


చిక్కల్లా, ప్రియతమ నాయకుడు దివంగత మేత ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్సుమెంటు పధకం వల్లనే వచ్చింది.   తెలంగాణాలోని ఇంజనీరింగు కాలేజీలలో మాత్రం 5-7 సంవత్సరాల స్థానికత ప్రకారం విద్యార్ధులు చేరవచ్చు. కానీ, ఫీజు రియంబర్సుమెంటు విషయంలో విద్యార్ధి తండ్రి తెలంగాణలో పుట్టి వుంటేనే ఈ సదుపాయం దక్కబోతోందని సమాచారం.   కాలేజీలో ప్రవేశానికి కూడా ఈ నిబంధన పెట్టినట్లయితే, సగానికి పైగా ఇంగాజీరింగు కళాశాలలు మూత పడతాయి.       


చట్ట సభలలో ఎంపీలుగా ఎం ఎల్ ఏ లు గా ఎన్నిక కాబడడానికి స్థానికత, వాళ్ళ నాన్న, తాత ఎక్కడ పుట్టింది అవసరం లేదు కానీ,  ఫీజు రియంబర్సుమెంటుకు మాత్రం కావాలి.    మరాఠీ, ఒరియా, కన్నడ మాతృభాషగా కలిగిన వ్యక్తులు 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్న వ్యక్తులు కూడా మన రాష్ట్రం నుండి శాసన సభకు గెలవ వచ్చు.   ఈ దేశంలో పుట్టని, ఈ దేశంతో సంబంధం లేని వారు కూడా ఈ దేశాన్ని వెనుక వుండి పరిపాలించ వచ్చు.


ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగిన పుల్లెల గోపీ చందు గారు తెలంగాణా బాడ్మింటన్ అసోసియేషన్కు నిన్ననే కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   మరి వారి స్థానికతకు కొలబద్ద ఏమిటో!   

గత మూడు సంవత్సరాలనుండి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని దిగ్విజయమైన బందుతో మొదలు పెట్టి  అదే రెచ్చగొట్టే విధానాల ద్వారా ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకోవాలనుకోవడం శోచనీయం.  


మోటార్ వాహనాన్ని అమ్మేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం మా కంపెనీ సలహా మీద కొన్ని మోటార్ బైకులు షోరూం వాళ్లకి ఇచ్చి కొత్త వాహనాలు తీసుకున్నాము.   ప్రతి షోరూంకు అనుబంధంగా కొంత మంది ఏజెంట్స్ వుంటారు.  మన పాత వాహనం వాళ్ళు తీసుకొని షో రూం వాడికి డబ్బు ఇస్తారు.    షోరూం వాడు మన దగ్గర ధరలో వ్యత్యాసాన్ని తీసుకొని మనకు కొత్త వాహనం ఇస్తాడు.     ఈ మొత్తం వ్యవహారం మనకి కొత్త వాహనం వచ్చిన సరదాలో మర్చిపోతాం.   

ఇటీవలే మా ఆఫీసుకు కోర్టు నుండి 'సమన్స్' వచ్చాయి.    దాని సారాంశం -- మీ పేరిట వున్న వాహనం ఒక రోడ్డు ప్రమాదంలో వుందని, ఎవరికైతే మీ వాహనం వలన గాయాలు తగిలాయో వారు మీ మీద మూడు లక్షలకు నష్ట పరిహారం వేసారని --  పాత కాయితాలు తిరగేస్తే, తెలిసినది ఏమిటంటే, మా పాత వాహనం కొనుగోలు చేసినవాడు దానిని తన పేరిట మార్చుకోలేదు.    వాహన బీమా కూడా మా కంపెనీ పేరిట వాడే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు.   షోరూము వాడు మా దగ్గర నుండి 10,000 నగదు (పాత వాహనం విలువ) గాను మిగిలినది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనూ ముట్టినట్లు కొత్త బండి తాలూకు బిల్లులలో చూపించాడు.      బండి కొనుగోలుదారుడు చేసిన తప్పులకు మేము న్యాయస్థానం చుట్టూ తిరగ వలసి వస్తున్నది.     

అందుకనే, ఏదైనా వాహనం అమ్మినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా న్యాయవాదిని సలహా అడిగితే, ఆయన చెప్పిన అంశాలు -- 

-- కొనుగోలు చేసిన వ్యక్తీ నుండి రశీదు తీసుకోవడం (Delivery నోట్) మరవద్దు
-- వాహనం అమ్మిన మరుసటి రోజే, సంబంధిత బీమా సంస్థకు మరియు ఎక్కడైతే వాహనం మొదట  నమోదు
    అయ్యిందో ఆ యొక్క R.T.A కార్యాలయానికి ఈ transaction తాలూకు వివరాలు డెలివరీ నోటు నకలుతో
    రిజిస్టర్డ్ పోస్టు చేసి దాని రశీదును భద్రపరచుకోవడం మంచిది.
-- వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి వారి లైసెన్స్ కాపీ ఉంచుకోవడం మంచిది.
-- వాహనం అమ్మిన నెల తరువాత  R.T.A వారి వెబ్ సైట్ లో వాహనం సంఖ్యతో దాని ఓనర్ పేరు తెలుసుకోవచ్చు
     దానిలో ఇంకా మీ పేరే వుంటే మీరు తక్షణం మేల్కొని R.T.A ను సంప్రదించండి

పైన తెల్పిన వివరాలు  చదవడానికి చాలా చిన్నవిగా వుంటాయి.  అనుభవించే వాడికి అసలు విషయం తెలుస్తుంది. బైకుకు ఏక్సిడెంట్ అయింది కాబట్టి ఏదో రకంగా రాజీకి వచ్చి డబ్బులిచ్చి వదిలించుకోవచ్చు.    అదే బైకు అసాంఘీక శక్తుల చేతులో పడితే అంతే సంగతులు.  


21, జూన్ 2014, శనివారం

హిందీ జాతీయ భాష కాదు

ఏదో ఒక సంచలన ప్రకటన చేసి అసలు విషయాలను పక్క దారి పట్టించడం పాలకులకు పరిపాటైంది.   రైల్వే చార్జీలు పెంచిన ప్రకటన వెలువడిన రోజే దేశంపై హిందీ భాష దాడి వార్తను కూడా వెలువరిస్తారు.   కరుణానిధి లాంటి వాళ్ళు రైల్వే చార్జీల పెంపు పక్కన పెట్టి హిందీ గురించి మాట్లాడతారు.   

హిందీ మన జాతీయ భాష కాదు అని ఇటీవలే గుజరాత్ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.  సురేష్ కచ్చాడియా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం, దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషగా హిందీ వుందని, దానిని జాతీయ భాషగా రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన లేదని తీర్పు ఇచ్చింది.  

అధికార భాషా చట్టం 1963 ప్రకారం పార్లమెంటు కార్య కలాపాలు హిందీలో మరియు ఆంగ్లంలో జరపవచ్చని పేర్కొంది.   పార్లమెంటు చేసే ప్రతి చట్టం హిందీ లోను  ఆంగ్లంలోను అందుబాటులో ఉండేలా నిర్దేశించింది.  

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.  అందులో సందేహం లేదు.   దానిని బలవంతంగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం లేదు.   ఉత్తరాది వారికి ఇప్పటికీ దక్షిణాది వారంటే చులకన.  దక్షిణాది వారి భాష, వేషం, ఆచార  వ్యవహారాలను వారు ఈసదించుకుంటారు.   

ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సమస్యల ముందు హిందీ భాష బలవంతంగా రుద్దడం అనేది ప్రాముఖ్యత లేని విషయం.   దేశం మొత్తం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి, ఎవరు ఏ భాషలో చడువుకోవాలి అనేది వారి వారి స్వంత నిర్ణయంగా వదిలి వెయ్యాలి.    కర్ణాటక రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక విద్యనూ కన్నడ మాధ్యమంలో చదివిన విద్యార్ధులకు వైద్య మరియు తాంత్రిక విద్యలో 5 శాతం రిజర్వేషన్ వుంది.   కన్నడ మాధ్యమం విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో చదివితే రిజర్వేషన్ మరింత ఎక్కువ.   వాళ్ళ భాషను ప్రోత్సహించే విధానం యిది. 

ఉద్యోగం కోసం ఆంగ్లం, దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి హిందీ ఆత్మ సంతృప్తికి అమ్మ భాష అవసరం. 

12, జూన్ 2014, గురువారం

తెలుగు నాడు లేక తెలుగు సీమ

నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఏ పేరు బాగుంటుంది అనే విషయంపై ప్రముఖ తెలుగు ఉపన్యాసకులు ఆచార్య ఆర్ వి సుందరం గారు తెలుగు తేజం పత్రికలో ఒక వ్యాసం రాశారు.   దాని పూర్తి పాఠాన్ని సంపాదకుని అనుమతితో బ్లాగులో వుంచుతున్నాను.