31, జులై 2013, బుధవారం

అంతర్ రాష్ట్ర సంబంధాలు - కొన్ని రక్షణలు


మంచి చెడులు ఆలోచించకుండా జరిగిన విభజన ఫలితాలు సామాన్యుడ్ని కోలోకోలేని దెబ్బ తీసే ప్రమాదం వుంది. చూడడానికి విషయాలు చిన్నవిగా కనిపించినా దాని దుష్పరిణామాలు అనంతం.    ఉదా : 


వాహనాల రిజిస్ట్రేషన్:   తెలంగాణా మరియు ఆంద్ర ప్రదేశ్ లోనే కాదు, ఒక రాష్ట్రంలో నమోదైన స్కూటర్ కూడా వేరే రాష్టంలోకి ప్రవేశిస్తే, పోలీస్  వెంటబడతాడు.   వాడిని తప్పించుకోవడాని పడే తిప్పలు వర్ణనాతీతం. దేశవ్యాప్తంగా వున్న ఈ చిన్న సమస్యను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. వాహన యజమాని కట్టే జీవితకాలపు పన్ను కేంద్ర ఖాతాలోకి తీసుకొని, జనాభా ప్రాతిపదికగా దామాషా పద్ధతిలో రాష్ట్రాలకు ఇవ్వాలి.   ఈ సవరణ కన్నా ముందు, అన్ని రాష్ట్రాలలో వున్న వాహన పన్నుల శాతాన్ని ఒకే రకంగా ఉండేట్లు చూడాలి.   గోవాలో రోడ్ టాక్స్ ఒక రకంగా వుంటే, పాండిచేరిలో మరో రకంగా వుంది.      


మొబైల్స్ : భౌగోళికంగా రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రోమింగుగా పరిగణించకుండా, దేశవ్యాప్తంగా రోమింగ్ చార్జీలను రద్దు చెయ్యాలి.  


నీటి ప్రాజెక్టులు : ఇప్పటికే కొంత మేర నిర్మాణం జరిగిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించాలి.   నీటి కేటాయింపులు, భవిష్యత్తులో ఎగువనున్న ప్రాంతంలో కట్టబోయే ప్రాజక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పూర్తి అనుమతితో మాత్రమే జరగాలి.   


ప్రాంతెతరులకు రక్షణ : 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు మాత్రమే (నాలుగున్నర కోట్ల అబద్ధాన్ని ఇప్పుడన్నా నిజం చెయ్యండి) .   ఇందులో కనీసం కోటి మంది వరకు తీర సీమాంధ్ర ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడిన వారు ఉండవచ్చు.   రాజధాని పూర్తిగా తరలించిన తరువాత ఈ కోటి మంది ప్రజలకు, వీరి ఆస్తులకు  ప్రమాదం ఏర్పడిన సందర్భంలో, హైదరాబాదును UT గా చేస్తామనే అంశం తప్పకుండా ప్రస్తావించాలి. ఎందుకంటే, ఒక ఉప ప్రాంతీయ పార్టీ గతంలో తెలంగాణా గ్రామ ప్రజలను మభ్య పెట్టి, రాష్ట్రం వస్తే ఆంధ్రోళ్ళ ఆస్తులు మనవే అయిపోతాయనే అపోహ కల్పించింది కాబట్టి.    ఇలాంటి సంఘటనలకు ససాక్షమైన ఉదాహరణ బాన్స్వాడ ఎం ఎల్ ఎ గా గెలిచినా పోచారం శ్రీనివాస్ ఆంధ్రా వాళ్ళు వోట్లు వెయ్యలేదు కాబట్టి తనకు తక్కువ మెజార్టీ వచ్చిందనీ, వాళ్ళ పని పడతామని బెదిరించడం .   


రాబోయే తెలంగాణా రాష్ట్రంలో కూడా, తీర సీమాన్ధ్రులు కనీసం 40 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలిగిన బలీయమైన వోటు బాంక్ ఉన్నదన్న సత్యాన్ని తెలంగాణా పాలకులు గుర్తుంచుకోవాలి.      

ఆంద్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలి


నష్టం జరిగిపోయింది.   దీనిని దిగమింగుకోవడానికి కనీసం రెండు దశాబ్దాలు పట్టవచ్చు.    ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలు ఈ చారిత్రాత్మక తప్పిదంలో భాగస్వాములే.   ఈ నిర్ణయం వెనుకకు తీసుకోవడం అసాధ్యం.  


తెలంగాణా ప్రజలు నాయకులను ఆటాడిస్తే, ఆంధ్రా నాయకులు ప్రజలను మభ్య పెట్టారు.   విచిత్రమేమిటంటే, ఇప్పటికీ, లగడపాటి వారు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని సెలవిస్తున్నారు.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తీవ్ర ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది.   ఇది అభినందించతగిన విషయం.  కేంద్రం నిర్ణయం తీసుకోదలచుకుంటే, ఆయన రాజీనామా చేసినా ఫలితం లేదు.     మోసపోయిన ప్రజలు, ఆవేశంలో ఆస్తులు ధ్వంసం చేసుకోవడం తగదు.   కనీసం కేంద్ర ప్రభుత్వానికి విధేయత చూపిస్తూ, నష్టపోయిన ప్రజలుగా ఎక్కువ మొత్తం నిధులకోసం, జల పంపిణీలో దిగువన వున్న రాష్ట్రాల హక్కుల  కోసం, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కోసం, కేంద్ర ఉన్నత విద్యా సంస్థల కోసం శ్రమించాలి.    
  

హైదరాబాదుపై  దృష్టి సారించి  అభివృద్ధి కేంద్రీకరణ జరిపిన పాలకులలో చంద్ర బాబు ముఖ్యుడు.   ఒక పెద్ద స్టేడియం కట్టినా, సమావేశ మందిరం కట్టినా అది హైదరాబాద్ లోనే కట్టారు.     తీర సీమాంధ్ర ప్రాంతంలో కనీసం కబడ్డీ ఆడుకొనే మైదానం కూడా నిర్మించ లేదు.   ఇది పాలకుల అనాలోచిత చర్య.     రాబోయే రాష్ట్రంలో అలా జరగకూడదు.   పరిపాలన వికేంద్రీకరణ జరిగాలి.  ఉన్నత న్యాయ స్థానం ఒకచోట వుంటే, దాని బెంచ్ ఇంకొక జిల్లాలో వుండాలి.  ఈ రకమైన వికేంద్రీకరణ వలన మరో విభజనకు తావులేదు.   


రాయలసీమలోని ఒక వర్గం వారు తీర సీమంధ్ర వాసులని దూషించడం మొదలు పెట్టారు.   కారణం, వాళ్లకు కూడా ప్రత్యెక రాష్ట్రం వస్తే, ఒక ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రి పదవులు వస్తాయని.   కానీ 4 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఏ రకంగా చూసినా నిలబడ లేదు.   ఈ విషయాన్ని నాయకులు తక్షణం చర్చించుకోవాలి.  లేదంటే మరో 610 జీ వో అని, మాది మాకు కావాలని అనవచ్చు.  లేదా   ఈ సారి రాహుల్ గాంధీ కొడుకో, కూతురో అధికారంలోకి రావడానికి లేదా వెంకయ్య నాయుడు మనమరాలు మంత్రి కావడానికో, నారాయణ లాంటి వారు ఒక గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు అయ్యేందుకో  మరో విభజనను ప్రోత్సహిస్తారు.   


విభజనను సాకుగా చూపించి జగన్ పార్టీని గెలిపిస్తే,  ఆంధ్రుల పరువు బజారున పడటం ఖాయం.   అసలే క్రైస్తవం అధికంగా వున్న తీర సీమాంధ్ర ప్రాంతంలో, జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది. ఉప ఎన్నికలలో గంప గుత్తగా ఆ పార్టీ వాళ్ళను గెలిపించడం వలననే, రాజకీయ పరమైన విభజనకు కారణమైంది.  దీనిని సాకుగా తీసుకొని భాజపా బలపడే ప్రమాదం కూడా వుంది.    హిందువులు ముస్లింల మధ్య వున్న ప్రేమ కొనసాగాలి.   


ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రిగా విద్యాధికుడు, అవసరమైతే సొంత ఆస్తిని కూడా దానం చేయగలిగి మరో ప్రకాశం పంతులు వారసుడు రావాలి.        
30, జులై 2013, మంగళవారం

తెలంగాణా గెలిచింది - తెలుగు జాతి వోడింది

తెలుగు జాతి దౌర్భాగ్యం
రగులుతున్న రావణ కాష్టం
వోట్లు, సీట్లు మాకే కావాలని
అన్ని పార్టీల పోరాటం
తెలుగు వాడి గుండె చీల్చే ఆరాటం

అరవోడు  పొమ్మన్నాడు
హైదరాబాదీ రమ్మన్నాడు
కర్నూలు వదులు కోమ్మన్నాడు
ఇప్పుడేమో తన్ని తరిమేస్తామంటున్నాడు

తెలుగు తల్లి విడివడుతోంది
ఇటలీ తల్లి వడివడిగా అడుగులేస్తోంది
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు
ఆ ఇటాలియన్ చేతిలో  బలైపోతున్నారు

అమాయకులను రెచ్చగొట్టి, అమరులని పేరు పెట్టి
పరులకు పుత్రశోకం మిగిల్చావు
నీ సంతానాన్ని నాయకులను  చేశావు
జాగో భాగో అంటూ  హా హా కారాలు చేశావు

ఉద్యమం ముసుగున
అరాచకం సృష్టించావు
ఎలక్షన్లు కలెక్షన్లకు  తెరలేపావు
బేర సారాలకు బరితెగించావు
అమాయక ప్రాణాలు బలిగొన్నావు

దొంగలన్నావు , దోపిడీ చేసారన్నావు
దోపిడీ దారుకు ప్రాంత విభేదాలు ఉండవని
అందుకు నువ్వే సాక్షమని రుజువు చేశావు
ఫాం హౌస్కు పరిమితమయ్యావు
గురివింద నలుపు సామెత గుర్తు చేశావు


చిన్న రాష్ట్రాలకి సై అంటారు
మూడు రాష్ట్రాలు మేమే చీల్చామంటారు
యు పి లో మాత్రం నై అంటారు
ఎ పి లో మాత్రం సై  అంటారు
ఇదే మా నైజం అని  చెప్పకనే చెప్తారు


రాయల సీమ బాబు గారు నింపాదిగా చూస్తున్నారు
బలి పీఠం ఎక్కుతున్న తెలుగుతల్లి వధను
తెలుగువాడు పడుతున్న వ్యధను
గుడ్లప్పగించి చూస్తున్నాడు, నాకు రెండు కళ్ళని
తన గుడ్లని తానే తినే పాముని గుర్తు చేస్తున్నాడు


సిక్కోలు సిన్నోడు
సారా పాటల రారాజు
అంతా అధిష్టానం అంటాడు
సొంత లాభం కొంత చూసుకొని
వి'భజన'కు  తోడ్పడతాడు


గోడ మీద పిల్లి, జైలులో పులి
ధనమే  సమస్తమని, అంతా నా ఇష్టమని
చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు
తండ్రి పేరు చెప్పి కాన్గిరేసును చీల్చావు
నిన్ను చీల్చి చెండాడుతారని మర్చిపోయావు
పిల్ల జగనుకేమి తెలుసు కాంగిరేసు  దెబ్బ


ఆంధ్రోడా భయపడద్దు  మేమున్నామంటారు
భయపడాలనే సంగతి మరి మరీ  గుర్తు చేస్తుంటారు
గాంధి గారి సాక్షిగా ఎమ్మెల్యేని కొట్టారు
టాంకు బ్యాండ్ మురికిలో వైతాళికులను ముంచారు
ప్రజల ఆకాంక్ష ఇదే అన్నారు
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని


నారాయణ వెంకయ్య సాంబశివ రావు
రావిపాటి, గరికిపాటి, లగడపాటి
పేర్లేమో భగవంతుడివి
దార్లేమో విభజనవి
వోట్ల కోసమొస్తే ఉప్పు పాతరేయ్
నోరులేస్తే,  టంగుటూరి ప్రకాశాన్ని గుర్తుచెయ్


తెలుగువాడా కళ్ళు తెరు
మోసపోవడం నీకు కొత్త కాదు
కష్ట పడటం తెలుసు నీకు
ధైర్యంగా అడుగేయ్
ఊరు  వాడ పునర్నిర్మాణం చెయ్
రాజకీయ భేతాళులని  పాతాళంలోకి తొక్కెయ్
తెలుగు తల్లి  మరోసారి తలెత్తుకోనేలా చెయ్
29, జులై 2013, సోమవారం

బాబు గారి ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది


చంద్ర బాబు నాయుడు గారి ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది.    రాష్ట్రమంతా గత నెల రోజులుగా టి వి లకు అతుక్కుపోయి కూర్చొనుంటే, ఈయన గారేమో అవేమీ తనకు పట్టనట్లు, రాష్ట్రంలో వున్న అతివృష్టి గురించి, పంచాయితీ ఎన్నికల గురించి అందులో జరిగిన అవకతవకల గురించి, పారిశుధ్యం గురించి, మురుగునీటి పారుదల గురించి  అనర్గళంగా పత్రికా సమావేశంలో వివరించారు.    


ఈయన ధైర్యం చూస్తుంటే, నాకు కాంగ్రెస్ పార్టీ మీద అనుమానమోస్తుంది.   ఉమ్మడి శత్రువైన వైకాపాను తెలంగాణా లో గంట కొట్టించారు.   తెలంగాణలో తెరాస ను రెండు జిల్లాలకు పరిమితం చేసారు.     రాయల తెలంగాణా పేరుతొ భాజపా ను అటకేక్కించారు.    ప్రస్తుతానికి ఇరు ప్రాంతాలలో బరిలో వున్నది కాంగ్రెస్ మరియు తెదేపా మాత్రమె.     


బహుశా రేపు జరగబోయే మీటింగ్లలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లుపెట్టాలని నిర్ణయం తీసుకొని శీతాకాల సమావేశాల దాకా నెట్టుకొచ్చి, ఎన్నికలకు పోవచ్చు.    ఎన్నికలలో ఈ ప్రాంతంలో వచ్చే గెలుపు వోటమిలను ఆధారంగా చేసుకొని తుది నిర్ణయం తీసుకోవచ్చు.       

     

27, జులై 2013, శనివారం

విభజనను అడ్డుకునే శక్తి వైకాపాకు మాత్రమే వుంది


నిజంగా తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా వుంచాలానే ప్రఘాడ వాంఛ  వైఎసార్ పార్టీకి వుంటే, రాజీనామా డ్రామాలు కట్టిపెట్టి, విజయమ్మ గారు స్వయంగా సోనియాగాంధీ గారిని కలిసి తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రతిపాదించాలి.    దీనివల్ల స్వామి కార్యం స్వకార్యం నెరవేరుతుంది.    కేవలం సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజనను ప్రతిపాదిస్తున్నది నిజమైతే, ఈ కలయిక వలన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది.   విజయమ్మ గారికి, షర్మిల గారికి కాళ్ళు నెప్పులు కూడా తగ్గుతాయి.   ఈ ప్రతిపాదన తక్షణం చెయ్యకపోతే, రాయల తెలంగాణా జైలులో జగన్ నానా కష్టాలు పడే ప్రమాదం వుంది.   నిజంగా జగన్ బాబు మీద ప్రేమ వుంటే, విజయమ్మ గారు తక్షణం తమ శాసన సభ్యులతో ధిల్లీకి ప్రయాణం కావాలి.    ఎలాగు కాంగ్రెస్లో చేరదామనుకుంటున్న ప్రముఖ తెలంగాణా నాయకులకు కూడా ఈ నిర్ణయం ఊరట కలిగించవచ్చు. 

ఆప్షన్ 2 

ఒకవేళ సోనియా గాంధీ కాదు, కూడదు అంటే, తక్షణం నరేంద్ర మోడీని కలిసి, మా మద్దతు మీకే అని చెప్తే చాలు, తక్షణం సీన్ రివర్స్ అయిపోతుంది.    

ఆలస్యం అమృతం - ఆంధ్రా విభజనం 

ఉద్యమం వలన జరిగిన మేళ్ళు


రాష్ట్ర  సమస్య పరిష్కరించబడినా, పడకపోయినా, లాభపడింది కేవలం 15 పై చిలుకు అందుబాటులో వున్న ప్రసార మాధ్యమాలు మరియు విమానయాన సంస్థలు మరియు నాబోటిగాళ్ళు  మాత్రమే.   టివి చర్చల్లో, పత్రికా వ్యాసాల్లో తెలుగు ప్రజలు ఒకరినొకరు విపరీతంగా దూషించుకుంటున్నారు.    చివరకు, నన్నయ్యను విశ్వనాథ వారిని కూడా వదిలిపెట్టడం లేదు.   అయితే, పత్రికా పఠనం వలన ఎన్నో 'నిఘూడ రహస్యాలు' తెలుసుకోవడానికి అవకాశం కలిగింది.   


తెలింగానము అంటే అర్ధం ఏమిటో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వరంగల్ జిల్లా పరకాల ముద్దుబిడ్డ, ఆంద్ర ప్రాంతానికి బ్రిటీష్ వారిచే 'నియోగి'న్చబడ్డ పరకాల వంశానికి చెందిన ప్రభాకర్ గారి ద్వారా తెలుసుకున్నా.  


టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర చదివి  ప్రేమ వివాహం, అందులోనూ భాషాంతర, కులాంతర వివాహం ద్వారా రాజాజీ గారు  గాంధీ గారిని మెప్పించి తమిళనాడుకు చేసిన మేలును అర్ధం చేసుకున్నాను. 


తెదేపా నాయకుల పుణ్యమా అని, చంద్ర శేఖర్ రావ్ గారు విజయనగరం నుండి బహు భాషా కోవిదుడు కె కె గారు రాజమహేంద్రవరము నుండి నిజాం రాష్ట్రానికి వలస వచ్చారని తెలుసుకున్నా. 


ఉండవల్లి గారి దయవల్ల తెలగాణ్య బ్రాహ్మణులు తెలంగాణా ప్రాంతం నుంచి వలస వచ్చారని, వీరిలో విశాఖ ఉక్కు కోసం నినదించిన వ్యక్తీ ప్రముఖుడనీ తెలుసుకున్నా. 
  

కంచె ఐలయ్య గారు తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ధైర్యంగా చెప్పగలిగిన మనిషి.   తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడితే సామాన్య ప్రజలను దొరలు, భూస్వాములు అణచివేస్తారని,   అణగారిన వర్గాల పిల్లలు ఆంగ్లము చదవడం ద్వారా మిగిలిన విద్యార్ధులతో పోటీ పడవచ్చని తెలుసుకున్నా.  


రెండు రోజుల క్రితం హటాత్తుగా మళ్ళీ తెరమీదకొచ్చి ఐతరేయ బ్రాహ్మణీయమ్ గురించి, ఆంద్ర అనే పదం గురించి అసలు ఆంద్ర ప్రదేశ్ పేరు పెట్టకపోతే ఈ గొడవ వుండేది కాదని వక్కాణించారు.     మరో పత్రికలో వ్యాసం రాసిన ఒక మహిళామణి, ఆంద్ర భాష వేరు, తెలుగు వేరు అని, యునెస్కో లెక్కల ప్రకారం ఆంద్ర భాష వచ్చే 50 సంవత్సరాలలో అంతరించిపోతుందని ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు.   ఆవిడ గారి ప్రకారం, తీర సీమాన్ద్రులంతా ఆర్యులని, వీరు ముని శాపం వలన కుక్క మాంసం తినే వాళ్ళని వ్రాశారు.    
   

మీరేమో తెలుగునాడు అంటారు.    తెలుగు బతకాలంటే 12 జిల్లాల తెలుగునాడు కావాలంటారు.   ఇంకొక తెలంగాణ కవయిత్రి తెలుగు వేరు ఆంధ్రం వేరు అంటుంది.    మీరు మాట్లాడే భాష నాకు నూటికి 99.99 శాతం అర్ధమౌతుంది.    బొత్స సత్యనారాయణ గారి మాట సోనియాజీకి అర్ధమైనప్పుడు మీ భాష మాకెందుకు అర్ధం కాదండి.    సి నారాయణ రెడ్డి గారి మీద ఆన - ఆయనను అడగండి చెప్తాడు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని.     సంస్కృత సమాసాలు, సంధులు దట్టించి రాసే కవి పుంగవులు మన ముద్దుల మేనల్లుడు నాయకత్వం వహించే మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఉన్నంత మంది, మిగిలిన తెలుగు ప్రాంతాలలో లేరన్న నిజాన్ని తెలుసుకున్నా .     


ఐలయ్య గారూ - మీరు పదే పదే ప్రస్తావించే మనుశాస్త్రం గురించి ప్రస్తుతమున్న  ఏ బ్రాహ్మణ కుటుంబంలోని వాళ్లకు పరిచయం ఉంటుందని అనుకోవడం లేదు.    ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మను ధర్మ శాస్త్రం ఆచరణ సాధ్యం కాదు.    కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాసిన పుస్తకాన్ని, అలాంటి పుస్తకం ఒకటుందని తెలీని నా బోటిగాళ్ళకు మీరు అనవసరంగా పరిచయం చేస్తున్నారు.  రాష్ట్ర జనాభాలో కనీసం 5 శాతం కూడా లేని కులాన్ని మీరు పదే పదే టార్గెట్ చేస్తుంటారు.     అల్లసాని పెద్దన విరచిత   స్వారోచిష మనుసంభవం మరియు మీరు పదే పదే హెచ్చరించే మనుశాస్త్రం ఒకటేనా అని సందేహం వుండేది.    మనుచరిత్ర చదివిన తరువాత ఇందులో కుల ప్రస్తావన లేదే, బహుశా అది ఇదీ వేరే అని అర్ధమైంది.   


ఈ ఉద్యమం వలన మీకు కూడా మంచే జరిగిందని నా ఉద్దేశం.     మీరు ఐతరేయ బ్రాహ్మనీయం, ఉపనిషత్తులు, ఋగ్వేదంలోని కొన్ని పనసలన్నా నేర్చుకొని వుంటారు.    వాదనకు పనికివచ్చే విషయాలకోసం, మీరు  ఇన్ని సార్లు  వేదాధ్యయనం చేయడం వలన మాకన్నా మీకే ఎక్కువ మంచి జరుగుతుంది.   


ఆంధ్రము, ఆంధ్రోళ్లు పేరుతొ మీరు రెచ్చగొట్టడం నాబోటిగాళ్ళకు ఒకరకంగా మంచే జరిగింది. ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం చచ్చీ చెడీ చదివాను.   ఆరుద్ర గొప్పతనం గురించి తెలిసింది.    ఎంత పరిశోధన చేశాడు.  కనిమళ్ళ శాసనం దగ్గరనుంచి అద్దంకి తరువోజ ఛందస్సులోని పండరంగడి శాసనం దాకా  ప్రస్తావించాడు.     


బహుశా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పుస్తకాలన్నీ చదివితే,   చిత్తూరు మినహా మదనపల్లె, కర్నాటక లోని తుమకూరు, పావగడ, కోలార్ జిల్లాలతో కూడిన 10 జిల్లాల రేగినాడు (రేగిస్తాన్ అనే పేరైతే కాస్త కొట్టచ్చినట్లుగా వుంటుంది) కోసం వుద్యమిస్తాడేమోనని భయపడుతున్నాను. 


అన్ని ప్రాంతాలలోని ఉద్యోగ, వ్యాపార, రాజకీయ నాయకులవలె నేను కూడా స్వార్ధంతో ఎంతో కొంత విషయ సేకరణ చేసి జ్ఞానాన్ని పెంచుకున్నాను. అందుకు నేను  సదా కృతజ్ఞుడ్ని.          

20, జులై 2013, శనివారం

కాకి నెత్తిపై వాలిందని ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్


23 సంవత్సరాల ఆనంద్ హిందూస్తాన్ ఏరో నాటిక్స్ లో గత 7 నెలల నుండి ట్రైనీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.   అతని సోదరుడు హంపన్నతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు.    ఆఫీసుకు వెళ్లి వచ్చేప్పుడు బస్ కోసం నిలబడి వున్న ఆనంద్ తలమీద కాకి ఒక్క క్షణం కాలు పెట్టి ఎగిరింది.   ఇలా రెండు సార్లు జరిగింది. మూఢ నమ్మకాలపై విశ్వాసం వున్న ఆనంద్ తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని కంగారుగా చెప్పాడు.   జ్యోతిష్యుడ్ని కలిసిన ఆ తల్లి, దగ్గరలో వున్న హనుమంతరాయ స్వామీ ఆలయంలో దీపారాధన చెయ్యాల్సిందిగా సూచించింది.    ఆ సమాధానంతో సంతృప్తి చెందని ఆనంద్, తనకు ఏదో కీడు జరగబోతోందని ఊహించుకొని, విషం సేవించి తన గదిలో వుండి పోయాడు.   దురదృష్ట వశాత్తు, సంఘటన జరిగిన రోజు  తన సోదరుడు వేరే వూర్లో వుండటం వలన ఈ విషయం ఆలస్యంగా తెలిసింది.    ఆనంద్ కోసం సోదరుడు ఫోనులో ఎంతగా ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో, అనుమానంతో బెంగళూరు వచ్చి తలుపు తెరిచి చూడగా, నోటిలో నురగతో అచేతనంగా పడివున్న ఆనంద్ కనిపించాడు.      మూఢ నమ్మకానికి  ఆనంద్ బలైపోయాడు.      
బెంగళూరు మిర్రర్ కధనం ఆధారంగా 

మెదడుకు మేత


ఇటీవల ఒక సభలో మహా సహస్రావధాని డా॥ గరికిపాటి వారు తన చిన్న తనంలో పాఠశాలలో ఇచ్చే ఇంటిపనిని (హోం వర్క్) గుర్తుచేశారు.    అదేంటో చూద్దాం -- 

వంగతోట నుండు, వరిమళ్ళలో నుండు 
జొన్నచేలనుండు,  చోద్యముగను 
తలుపుమూల నుండు, తలమీద నుండు 
దీని భావమేమి తిరుమలేశా!

వంగతోటలో వుండేది, వరిమళ్ళలో వుండేది ఏమిటో కనుక్కోమన్నారా? 

ఈ పద్యంలో ఒక చిన్న కిటుకు దాగి వుంది, చాలా మందికి తెలిసే వున్దచ్చు.   బాగా ప్రయత్నం చేసిన తరువాత కూడా అంతు చిక్కకపోతే, .......... అనుసరించండి 
..... 


........ 


........... ................ 

పద్యాన్ని ఇలా చదివి చూడండి 
.......................... 


వంగ   తోట నుండు,     వరి  మళ్ళలో నుండు (వంకాయ కోసినదాక తోటలోనే కదండీ వుండేది; వరికూడా)
జొన్న   చేలనుండు  చోద్యముగను    (జొన్న చేలోనే వుంటుంది) 
తలుపు   మూల నుండు, తల  మీద నుండు   (ఎవరింటికైనా తలుపు ఒక మూలలోనే వుంటుంది; అలాగే తల                                                                  మీదే వుంటుంది) 
దీని భావమిదియె  తిరుమలేశా!16, జులై 2013, మంగళవారం

ఐదు రూపాయల టిక్కెట్టుకు కారణాలు ఐదు


మోడీ గారి ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలుచుకున్న అభిమానులకు కేవలం ఐదు రూపాయల టికెట్ పెట్టారు భాజపా వారు.      దీని వెనుక ఐదు కారణాలుండవచ్చు, అవేంటో చూద్దాం: 


అ) సభానంతరం భాజపా రాష్ట్ర పార్టీ వారు, విలేకరుల సమావేశం పెట్టి, మొత్తం కలెక్షన్ 25 లక్షలు వచ్చింది అంటే, 5 లక్షల మంది స్వచ్చందంగా హాజరయ్యారు అని చెప్పుకోవడానికి కావచ్చు 

ఆ) ఈ పేరుచెప్పి 25 లక్షల నల్ల ధనాన్ని తెల్ల ధనం చెయ్యడానికి అయి ఉండచ్చు 

ఇ) మోడీ గారు ఏర్పాటు చేసుకున్నారని చెప్ప బడుతున్న విదేశీ ప్రమోషన్ సంస్థల సూచన కావచ్చు 

ఈ) వేరే పార్టీ వారు సభలు పెడితే జనాన్ని డబ్బులిచ్చి తరలిస్తారు అదే మోడీ గారి సభలకు జనం ఎదురు కట్నం ఇచ్చి వస్తారు అని ప్రచారం చేసుకోవడానికి కావచ్చు 

ఉ) ఈ ఐదు రూపాయల టిక్కెట్టు సగం ముక్క మీ దగ్గర ఉంచుకోండి, చివరాఖరన లక్కీ డిప్పు ద్వారా విజేతని ప్రకటిస్తామని చెప్పవచ్చు 


ఇంతక మించి నాకేమీ కారణాలు కనపడట్లేదు. 
      


భారత్ లో ప్రతి రెండు గంటలకు ఒక ఆత్మహత్య


మన దేశంలో నగాటున ప్రతి రెండు గంటలకు ఒక ఆత్మ హత్య జరుగుతున్నట్లు 'ప్రమాదాలు మరియు ఆత్మ హత్యల పై నివేదిక 2012' ప్రకారం గత సంవత్సరంలో అక్షరాలా 1,35,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపింది.   కుటుంబ సమస్యలు పేదరికం, అనారోగ్యం మరియు ప్రేమ విఫలం ముఖ్యమైన కారణాలుగా ఈ నివేదిక తెలియచేసింది. 


జాతీయ నేర నమోదు సంస్థ (NCRB) ప్రకారం కుటుంబ కలహాలు 25.6 శాతం కాగా అనారోగ్యం 20. శాతంగా గుర్తించింది.    2010 లెక్కల ప్రకారం 1,35,585 మంది బలవన్మరణం చెందగా 2012 లో ఈ సమాఖ్య 1,35,445 గా నమోదైంది.   ఈ బలవన్మరణాలలొ 16,927 తో తమిళ్ నాడు ముందుండగా, మహారాష్ట్రలో (16,112), పశ్చిమ బెంగాల్ లో 14,957 మంది కాగా మన రాష్ట్రంలో ఈ సమాఖ్య 14,238 గా, కర్ణాటకలో 12,753 గా గుర్తించారు.  


దేశంలోనే ఈ ఐదు రాష్ట్రాలు కలిపి 55.3 శాతం సగటుగా నమోదైంది.   అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో అతి తక్కువగా 3. శాతం కాగా, రాజధాని ధిల్లీ లో 1,899 గా నమోదైంది.  ఇది ఇలా వుండగా దేశంలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి సంఖ్య గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి 3,94,982 మంది గా నమోదైంది.   ఇవే కాకుండా గత సంవత్సరంలో అసహజ మరణాల సంఖ్య 3,72,022 గా గుర్తించారు.  ఆధారం : డెక్కన్ హెరాల్డ్ 

13, జులై 2013, శనివారం

భాజపా, మోడీ, ఓ కుక్కపిల్ల

సువిశాల భారత దేశానికి ప్రధాని కావాలని (పగటి) కలలు  కంటున్న నరేంద్ర మోడీ గారు నిన్న ఒక  ప్రముఖ అంతర్జాతీయ వార్తా సేకరణ సంస్థకు ఇచ్చిన ముఖాముఖీ ఒక్క సారి చదవండి:  Do you regret what happened?
I’ll tell you. India’s Supreme Court is considered a good court today in the world. The Supreme Court created a special investigative team (SIT) and top-most, very bright officers who overlookoversee the SIT. That report came. In that report, I was given a thoroughly clean chit, a thoroughly clean chit. Another thing, any person if we are driving a car, we are a driver, and someone else is driving a car and we’re sitting behind, even then if a puppy comes under the wheel, will it be painful or not? Of course it is. If I’m a chief minister or not, I’m a human being. If something bad happens anywhere, it is natural to be sad.మోడీ గారు గుజరాత్ నరమేధం గురించి  స్థూలంగా చెప్పిందేమిటంటే -- 


'నేను వాహనం నడిపినా, వాహన చోదకుడు నడిపినప్పుడు నేను వెనుక సీట్లో కూర్చున్నా, వాహనం   కింద కుక్కపిల్ల పడితే, సహజంగానే బాధగదా! నేను కూడా మనిషినే కదా !'


మోడీ కనుసన్నలలో జరిగినట్లుగా చెప్పబడుతున్న గుజరాత్ నరమేధంలో గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు కూడా చంపబడ్డారు.  హిందూ మతం హింసను ప్రొత్సహించదు.   హింసకు ప్రతి హింస సమాధానం కాదు.  


20 కోట్ల మంది భారతీయ ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారు.     మతమేదైనా అందరూ మనుషులే.     ఇంతవరకు మన దేశాన్ని పాలించిన ప్రధాన మంత్రులు జాతి, కుల, మత, ప్రాంత బేధాలకు అతీతంగా ఉంటూ ఈ దేశ సమగ్రతను కాపాడినవారే.       అలాంటి చరిత్ర కలిగిన దేశానికి అత్యున్నత పదవి అధిష్టించాలనుకొనే వారు మాట్లాడ తగ్గ మాటలేనా ఇవి?   ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన వలన సమాజంలో వివిధ వర్గాల మధ్య చీలిక వచ్చే ప్రమాదం వుంది.  ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదు.  

  12, జులై 2013, శుక్రవారం

కాంగ్రెస్ నిర్ణయం ఇదే


ఉత్తినే - తమాషాగా --

వచ్చే ఎన్నికలలో తీర సీమాంధ్ర ప్రదేశ్ నుంచి కనీసం 25 పార్లమెంటు సీట్లు 140 శాసన సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామ్.     అలాగే, తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలు, 100 శాసన సభా స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ప్రత్యేక తెలంగాణా ఇస్తాం.    


అంటే, వచ్చే ఎన్నికలలో అందరం కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం.    


ఉత్తరాఖండ్ మృతుల్ని "ఆధార్" ద్వారా ఎందుకు గుర్తించలేదు ?


అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ కార్డుల నమోదు దాదాపు తుది దశకు చేరుకుంది.    ఆధార్ కార్డులు కేవలం చౌక ధరల దుకాణాల వస్తువుల కోసమో, చిరునామా గుర్తింపు కోసమో లేక గ్యాస్ సబ్సిడీ కోసమే కాదు నేర పరిశోధనలో, గుర్తింపబడని శవాల విషయంలో కూడా ఈ సమాచారం అత్యంత కీలకం.    


మొన్న ఉత్తరాఖండ్ బీభత్సంలో మృతిచెందిన వారిని కేవలం డి ఎన్ ఎ నమూనాలు మాత్రమే తీసుకున్నారు.   మ్రుతులలో కనీసం 50 శాతం మంది ఆధార్ కార్డులు నమోదు చేసుకున్న వారు వుండి ఉండవచ్చు.   వారి వేలి ముద్రను లేదా కంటి పాపను (ఐరిస్) బయోమెట్రిక్ యంత్ర సహాయంతో కంప్యుటర్లో నమోదు చేస్తే, కార్డు వున్న వారి చిరునామా దొరికేది కదా!    నేను నెట్ లో చూశాను, చేతివేళ్లు నలిగిపోయినా, ప్రమాదవశాత్తు శరీరం నుండి వేరు చేయబడినా కూడా వేలి ముద్రను తీసుకోవచ్చు.     మరి ప్రభుత్వం ఎందుకు చెయ్యలేదు చెప్మా! 

11, జులై 2013, గురువారం

ఆది శంకరుని సిద్ధాంతానికి సినిమా వాళ్ళ వక్ర భాష్యం !


నిన్న(10-07-13) ఆంద్ర జ్యోతిలో సినిమా పుటలో ఒక వార్త అచ్చైంది.   ఆ వార్త తాలూకు హెడ్డింగు చూడండి "స్త్రీ పురుష సంబంధాలలోనూ అద్వైతం ఉంటుందని చూపించాను" - ఇది ఒక సినీ దర్శకుని ఉవాచ.   ఆ హెడ్డింగు కింద వున్న విషయం చూడండి - "రమణ మహర్షి వద్దకు  వెళ్లక ముందు చలం వేరు, వెళ్ళిన తరువాత చలం వేరు. ద్వైతాన్ని అనుభవించి, అనుభవించి తరువాత రమణ మహర్షి ద్వారా అద్వైతంలోకి వెళ్ళిపోయారు చలం.   అద్వైత స్థితి స్త్రీ పురుషుల మధ్య కూడా ఉంటుందనీ అదే అసలైన సంబంధం"  అని ఆ దర్శకులు చెప్పిన దాన్ని ఆంద్ర జ్యోతి వారు వత్తేశారు. 


నాకు తెలిసింది అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ వేరు కాదని ఆది శంకరాచార్య గారు ప్రతిపాదించిన సిద్ధాంతం .   ద్వైతం అంటే, జీవుడు వేరు దేవుడు వేరు అని   ప్రతిపాదించాడు మధ్వాచార్యుల వారు.    రామానుజల వారి సిద్ధాంతం విశిష్టాద్వైతం.    


స్త్రీ పురుష సంబంధాల గురించి  ఆది శంకరాచార్యులవారు , మధ్వాచార్యుల వారి కన్నా ఏమైనా వివరంగా అద్వైతంలో చెప్పారా??  నా బ్లాగు చదివే, ఈ విషయం తెలిసిన  పెద్దలు ఎవరైనా కొంచం నన్ను అజ్యానాన్నించి బయటపడేయ్యాలని ప్రార్ధన.    ఇప్పటికే కె రాఘవేంద్ర రావు గారు "విశిష్టాద్వైతములో"  ఎక్కడా పొందు పరచని అన్నమయ్య ప్రేమ కధను జాజులు, సంపెంగలు, మల్లెలు, పూలు, పాలు,  పండ్ల సాక్షిగా మనకు చూపించారు.    ఇక ముందు ఎలాంటి కొత్త సిద్ధాంతాలను చూడాల్సి వస్తుందో భయంగా వుంది. 

 ఆంద్ర జ్యోతి పత్రిక పాఠం 


పాపం ఉండవల్లి !


వర్గ బలం, కుల బలం, ధన బలం లేని  ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేవలం తన వాక్ చాతుర్యంతో, తెలివితేటలతో గత రెండు విడతలుగా పార్లమెంటు సభ్యునిగా రాజమండ్రి నుంచి నెగ్గుకొస్తున్నారు.  తను మాట్లాడే విషయాలపై కూలంకషంగా వాస్తవాలు తెలుసుకున్న తరువాత మాత్రమే గణాంకాలతో సహా ఏకరువు పెట్టే బహు కొద్దిమంది వక్తల సరసన నిలుస్తాడు ఉండవల్లి.     మన దేశంలో ఏ శాసన సభ్యుడు కానీ, ఏ పార్లమెంటు సభ్యుడు కానీ ప్రజలకు జవాబుదారీగా వుండే వార్షిక నివేదికల పేరిట తనను ఎన్నుకున్న ప్రజలకు వివరించరు. కానీ, గత తొమ్మిది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నియోజక వర్గంలో సభ జరిపి తను పార్లమెంటు సభ్యుడిగా తెచ్చిన నిధులు, వాటి జామా ఖర్చులు, తను ప్రజలకు చేసిన పనులు, ఇంకా మిగిలివున్న పనులు గురించి బహిరంగంగా చెప్పడం ఆయనకు ఒక ఆనవాయితీ.   


అయితే, ఆయన వుపన్యాసంలోని ముఖ్యాంశాలను (లేదా అన్ని అంశాలను) ఏ పత్రికా,  పాఠకులకు అందించదు, కారణాలు చూద్ద్దాం  --


ఈనాడు - చిట్ ఫండ్ కంపెనీలో జరిగిన అవకతవకలను బయటికి తీసి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన  న్యాయవాది ఉండవల్లి.    గత్యంతరం లేని పరిస్తితులలో ఆయన మీటింగ్ వివరాలు రాయవలసి వస్తే, ఒక రెండు కాలంల వార్త అచ్చేసి, కేవలం ఆయన జగన్ రెడ్డిని విమర్శించిన విషయం మాత్రమే రాస్తారు. 


నమస్తే తెలంగాణా - ఈ పత్రిక ఉండవల్లిని అమాంతం గరళ కంఠుడ్ని చేసేస్తుంది.   అదేనండి, ఆన్ద్రోడు విషం కక్కాడు అని రాస్తుంది.   ఆయన చెప్పిన విషయాన్ని 'విషం' చేస్తుంది. 


ఆంద్ర జ్యోతి - అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్లు - చంద్ర బాబును మినహాయించి ఆయన జగన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు, క చ రా పై చేసిన విమర్సలకు మాత్రం  ప్రాముఖ్యం ఇస్తుంది. 

సాక్షి - మా నాన్న నిలబెడితే గెలిచిన ఉండవల్లి వై ఎస్ సార్ అనకుండా ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడా, వెయ్యండిరా వీరతాళ్ళు 


వార్త, సూర్య, భూమి - చదువరులు తక్కువ కాబట్టి, రాసినా ఒకటే, కోసినా ఒకటే.     


ఇంతవరకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణ కానీ, ప్రజలకు అందుబాటులో ఉండడు అని కానీ ఆరోపణ రాలేదు.    ఒక వేళ అలాంటి పనులమైనా చేసివుంటే, ఈపాటికి 'ఈనాడు' వదిలేది కాదు.   అయితే, ఇంత తెలివికలవాడు, మేధావి, మంచి వక్త అయినా, వచ్చే ఎన్నికలలో ప్రజలు ఎన్నుకోక పోవచ్చు.   కుల సమీకరణాలు, సినిమా గ్లామర్, డబ్బు ముందు అరుణ్ కుమార్ తల వంచాల్సిందే! ప్చ్ పాపం. 

రాష్ట్ర విభజనపై రేపు ఏ నిర్ణయం వెలువడదు


అరచేతిలో తేనె పోసి, మోచేత్తో నాకించడం అంటే ఇదే.    12 వ తేదీ డెడ్ లైన్ అని, టి డే అని, కౌంట్ డౌన్ మొదలైందని  ఊదర గొడుతూ ప్రసార సాధనాలన్నీ మంచి ఊపును తెచ్చాయి.    


సున్నితమైన తెలంగాణా లాంటి అంశాల మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, తగిన పోలీసు బందోబస్తు, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో  ముళ్ళ కంచెలు,  లారీల నిండా ప్రత్యెక పోలీసులు, లేదా విజయవాడ, వైజాగ్ అనంతపురం లాంటి ప్రాంతాలలో ప్రత్యెక బలగాలు, వారం ముందు నుండే జరిగే ప్రహసనం.    ఇంతవరకు ఇలాంటివేమీ జరిగినట్లు దాఖలాలు లేవు.   కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రేపటికి రేపు రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచుతాము లేదా రెండు మూడు  ముక్కలు చేస్తాము అని ప్రకటన చేయక పొవచ్చు. 


గతంలో దూరదర్శన్ జాతీయ చానల్లో, వారం వారం జస్పాల్ భట్టి గారి నాటకం వచ్చేది.    ఒక నాటికలో జస్పాల్ భట్టి, తన కార్యాలయంలో ఎలుకల తాకిడీ బాగా ఎక్కువగా వుందని, వాటిని నిర్మూలించడానికి వేయవలసిన పధక రచనకు ముఖ్యులతో బోర్డు రూములో సమావేశం ఏర్పాటు చేస్తాడు.    గంటల తరబడి చర్చించిన అనంతరం, బయట వేచివున్న  ఒక పెద్ద మనిషి, భట్టి గారిని అడుగుతాడు - ఏం సార్, ఏమి నిర్ణయించారని - ఆహ్ ఏముంది, వచ్చే మీటింగు ఎప్పుడు పెట్టుకుందామని తారీకు నిర్ణయించుకున్నాము అని సమాధానం వస్తుంది.      


గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదీ ఇదే! 

10, జులై 2013, బుధవారం

రాజకీయ దోషులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రాజకీయ నాయకులు ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందనే రోజులు పోయాయి  .  ఈ రోజు దేశ అతున్నత న్యాయ స్థానం వెలువరించిన తీర్పు మేరకు, రాజకీయాలను అడ్డం పెట్టుకుని నేరాలు చేద్దామనుకునే వారికి, ప్రజా ధనం దోచేయలనుకునే రాజకీయ నాయకులను కొంత మేరకు అడ్డుకునే అవకాశం వుంది.  


ఈ తీర్పు ప్రకారం శిక్ష పడ్డ వ్యక్తి జైలు నుంచి కానీ, విడుదలైన తరువాత కానీ, ఎన్నికలలో పోటీ చేసే హక్కు కోల్పోతాడు.     ఈ చట్టం వలన, రాజకీయ పదవులను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పుదాము అనుకునే  నాయకులలో కొంత భయం కలిగే అవకాశం వుంది.  


ఇలాంటి సంస్కరణలు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడో చేసి వుండాల్సింది.    సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం వారి మీదనే వుంది.  


2, జులై 2013, మంగళవారం

ముంబాయిలో పట్టుపడ్డ 'కట్టల పాములు'


జాతీయ భద్రతా సంస్థ ఆధ్వర్యంలో ఏడు వాహనాలలో ముంబై నుంచి గుజరాత్ కు తరలిపోతున్న 200 కోట్ల పైచిలుకు నగదు మరియు బంగారాన్ని స్వాధీనం చెసుకున్నారు.   బహుశా ఇంతపెద్ద మొత్తంలో మన దేశంలో డబ్బు పట్టుపడటం ఇదే మొదటిసారి. 


ఇందులో పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు, రాజేకీయ నాయకులు ఉండే అవకాశం వుంది.   రాబోయే కొన్ని రోజులలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం వుంది.   

తెలుగు మీడియాలో స్థానం దొరకని ఓడిషా పేలుడు ఘటన


తరగతి గదిలో పేలిన ఒక క్రూడ్ బాంబు ఘటనలో 24 మంది పాఠశాల విద్యార్ధులు గాయపడ్డారు, అందులో 5 గురి పరిస్థితి విషమంగా వుంది.    డెక్కన్ హెరాల్డ్ దిన పత్రికలో పతాక శీర్షికగా వచ్చిన ఈ వార్త బహుశా మన రాష్ట్ర మూడు ముక్కలాటలో కనుమరుగైంది.   


ఆ పత్రిక కధనం ప్రకారం - అయాత్పూర్ ప్రాంతంలోని బాల బాలికల పాఠశాలలొ  85 మంది విద్యార్దులున్నారు. త రగతిలో ఉపాధ్యాయురాలు హాజరు పిలిచిన తరువాత ఒక విద్యార్ధి పాఠశాల సంచి నుంచి కిందపడిన  బాంబు పేలడం వలన ఈ దుర్ఘటన సంభవించింది.


బాంబు పరిశోధక నిపుణులు, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.    కటక్ పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయానికి కేవలం 30 కి మీ దూరంలో, పాఠశాలలో ఇలాంటి దుర్ఘటన జరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు .     విద్యార్ధుల వైద్య ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తెలిపారు. 

రాయల సీమకు, తెలంగాణాకు భావ సారూప్యత వుంది


విజయ నగర సామ్రాజ్య పతనం తరువాత కర్నూల్, కడప, అనంతపురం మరియు చిత్తూర్ ప్రాంతాలు నిజాం నవాబుల పాలనలోనే ఉన్నాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం.   తదనంతరం వచ్చిన బ్రిటీష్ పాలకులకు,  కప్పం కట్ట లేని నిజాం ప్రభువు సీడెడ్ జిల్లాలుగా (సీడెడ్ అంటే ఒక చట్టబద్ధమైన ఒడంబడిక) ఆ నాలుగు ప్రాంతాలను ప్రకటించి బ్రిటిష్ వారికి (దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు) ధారాదత్తం చేశారు.     కాబట్టి కర్నూల్ మరియు అనంతపురం వాసులకు కూడా హైదరాబాద్ బిర్యానీ రుచి తెలుసు.    బిర్యానీ రుచి తెలియడం,  క చ రా గారి సిద్ధాంతాల  ప్రకారం ఒక కనీస అర్హత, కాబట్టి రాయల తెలంగాణాకు వారు ఒప్పుకొని తీరాల్సిందే.   


సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత కర్నూల్ లోని కొన్ని  ప్రాంతాలు మహబూబ్ నగర్ జిల్లాలో చేరాయి.   వీటిల్లో ముఖ్యంగా తుంగభద్రా పరీవాహక  ప్రాంతాలు ఎక్కువ.    కర్నూల్ నుంచి ప్రస్తుత రాజధాని కేవలం 210 కి మీ మాత్రమే.   ఆ రకంగా చూసినా, ఆదిలాబాద్ వారికన్నా కర్నూల్ వారికే హైదరాబాద్ సమీపం.   ఆంద్ర రాష్ట్ర రాజధానిని కోల్పోయి, హుందాగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా  ఒప్పుకున్న కర్నూల్ ప్రాంతీయులకు హైదరాబాదుపై సర్వ హక్కులు వుంటాయి.    

1, జులై 2013, సోమవారం

రాయల తెలంగాణా ఖాయమయ్యే అవకాశం!


గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ఆంద్ర ప్రదేశ్ విభజన దాదాపు  ఖాయం అయినట్లే కనిపిస్తుంది.    ఇప్పటి వరకు జాగో భాగో నినాదంతో రెచ్చిపోయిన నాయకులకు, తన ధన బలంతో దేశాన్నే శాసిద్దామనే దురుద్దేశంతో అత్యాశకు పోయిన మరొక నాయకునికి, ఒక చిన్న మంత్రి పదవి ఇవ్వకుండా తెరాసా ఆవిర్భావానికి పరోక్షంగా బీజం వేసిన ఇంకో నాయకునికి,  కళ్ళెం వేసే ఎత్తుగడలోనుంచి పుట్టినదే ఈ "రాయల తెలంగాణా".   హార్వర్డ్ యూనివర్సిటీలో చదివుకున్న కాంగ్రెస్ మేధావులు వేసిన ఈ పధకం వలన అనంతపురం, కర్నూల్ మరియు పూర్వ  నిజాం రాష్ట్రంలో అసంఖ్యాకంగా వున్న ముస్లిం వోట్ బాంక్ ను కాపాడుకోవడమే కాకుండా,  తెరాసా దూకుడుకు కళ్ళెం వేయగలుగుతుంది.    


ఈ రకమైన విభజన వలన లక్షల సంఖ్యలో తెలంగాణా ప్రాంతంలో స్థిరపడిన తెలంగాణేతరులకు రక్షణ కల్పించినట్లవుతుంది.    కోస్తాంధ్ర ప్రజలకు తెలంగాణా ప్రాంతంతో వున్న సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది వుండదు కనుక నేలబారు తీర ఆంద్ర వాసికి నష్టం లేదు.    సగటు తెలంగాణా ప్రజలకు, హైదరాబాదుతో కూడిన  10 జిల్లాలకు బదులు 12 జిల్లాలు వుండటం వలన ఎలాంటి అభ్యంతరం ఉండక పోవచ్చు.   

పట్టుమని 10 మంది పంచాయతీ సమితి సభ్యులు కూడా లేని భాజపా ఇటీవలి కాలంలో తెలంగాణలో బలం పుంజుకుంటున్నది.  పార్లమెంటులో రాయల తెలంగాణా బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చెయ్యవచ్చు.   ఇలా చేయడం ద్వారా, తెలంగాణలో ఆ పార్టీని ఎండగట్టే అవకాసం వుంది.   దిమ్మ తిరిగే ఇలాంటి పరిష్కారాలు చూపించడం కేవలం కాంగ్రెస్కే సాధ్యం . 

బహుళ ప్రయోజనాలున్న ఇలాంటి 'వేర్పాటు'ను  కేవలం రాజకీయ నాయకులకు అభ్యంతరం ఉండచ్చు కానీ, ప్రజలకు ఎలాంటి అభ్యంతరం వుండదు.