15, అక్టోబర్ 2014, బుధవారం

ఆన్ లైన్ వ్యాపారం తప్పా!


ఇటీవల ఫ్లిప్ కార్ట్ అనే ఆన్ లైన్ సంస్థ బిలియన్ సెల్ పేరిట ఏకంగా 600 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒక్క రోజులో చేసింది.  ఇది తెలిసిన రిటైల్ వ్యాపారులు కేంద్ర ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేస్తూ, ఇలాంటి ఆన్ లైన్ వ్యాపారాలను ప్రభుత్వం నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.    

బిలియన్ సేల్ పేరిట జరిగిన అమ్మకంలో నేను కొన్ని ఎలాక్త్రోనిక్ వస్తువులు కొన్నాను.  అదే వస్తువులు బయట కొంటే కనీసం 20 శాతం ఎక్కువ ఖర్చు అయ్యేది.   వ్యాపారంలో పోటీ వుండాల్సిందే.   గతంలో మారుతీ కంపెనీ మాత్రమే కార్లు తయారు చేసేది, అది కూడా 800 రకం మాత్రమే.    తరువాతి కాలంలో హుందే, ఫోర్డు రావడంతో నెలకో రకం కారుతో మారుతీ వారు పోటీ పడుతున్నారు.    పరుగు పందెంలో ఒక్కడినే పరిగెత్తి నేనే విజేతనంటే కుదరదు కదా!

డెలివరీ బాయ్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, గోడౌన్ మేనేజ్మెంట్, సార్టింగ్, కొరియర్, బాక్ ఆఫీస్ మొదలైన్ రంగాలలో అత్యుత్తమ జీతాలతో ఆన్లైన్ సంస్థలు బోలెడు మందికి ఉపాధికి కల్పిస్తున్నాయి.   కొనుగోలుదారుడికి తక్కువ ధరకు కొన్ని రకాల వస్తువులు లభ్యమౌతున్నాయి.    ఆన్ లైన్ సంస్థలు తాము చట్ట పరంగా చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తున్నంత వరకు, వస్తువుల నాణ్యతకు చట్టపరంగా రక్షణ కల్పించినంత వరకూ  ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. 

ఈ ఆన్లైన్ సంస్థలు త్వరలో ఫార్మా రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆశిద్దాం.    దీని ద్వారా కనీసం మనం కొనే మందులపై 20 నుంచి 30 శాతం వరకు ఆదా చేసుకొనే అవకాశం వుంది.   ఉదా-  నేను మా కుటుంబం కోసం కనీసం నెలకు 1500/- విలువైన మందులు కొంటాం.    ఈ మందులు మీరు ఫార్మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనండి మీకు కనీసం 20 నుంచి 25 శాతం తక్కువకు వస్తుంది .   ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు.   హైదరాబాద్ లోని కోటీకి వెళ్ళండి, బోలెడు మంది దిస్త్రిబ్యుటర్లు వున్నారు. అంటే, డిస్ట్రిబ్యూటర్  మనకే 20-25 శాతం తగ్గించి ఇస్తుంటే, అతనికి కూడా కనీసం అంతే మొత్తంలో లాభం వస్తుండవచ్చు.    అలాగే మందులు తయారు చేసే కంపెనీలకు అంతకన్నా ఎక్కువ లాభం వస్తుంది.    దీనిని బట్టి చూస్తే, పది పైసలు తయారీ ఖర్చు అయ్యే మందు మనకు చేరేప్పటికి 100 పైసలు పడుతుంది.    ఎంత దారుణం!    జనరిక్ మందుల షాపుల పేరిట అక్కడక్కడా ఒకటి అరా దుకాణాలు వున్నా, వీటిపై అవగాహన లేదు. పూర్తి స్థాయిలో లభ్యతా లెదు.    కాబట్టి, ఈ రంగంలో కూడా పోటీ రావాల్సిన తక్షణ అవసరం వుంది. ఎంపిక చేసిన కొన్ని మందులు ఆన్ లైనులో మందుల చీటీ అప్ లోడ్ చెయ్యడం ద్వారా, సులభంగా చౌకలో ఇంటి దగ్గరే తెప్పించుకొనే   అవకాశం వుంది.    

తమ లాభాల్లో గండి పడుతుందనే భయంతో కొంత మంది దళారులు, తమకు ఇప్పటివరకూ వస్తున్న అధిక లాభాల్లో కోత పడుతున్నదన్న దుఘ్దతోనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఉండవచ్చు.    కావున, మధ్యాదాయ వర్గాలకు ఈ ఆన్లైన్ వ్యాపారం ద్వారా వస్తు కొనుగోళ్ళలో మంచి జరుగుతుందని ఆశిద్దాం.    

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాదుకా పట్టాభిషేకం


శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది -  రాముని అరణ్యవాసం , భరతుని పట్టాభిషేకం.   సీతా రాములిద్దరూ నార బట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికేగుతారు.  రాముని అరణ్య వాసం తరువాత భరతుడ్ని పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలనే కైకేయి కోరికకు భరతుడు తిరస్కరించి రాముడ్ని వెదుకుకుంటూ  అడవికి వెళ్ళి అన్నని  బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం మనకు తెలిసిందే.    తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరామ చంద్రుడు, అన్నపై అపారమైన వాత్సల్యం వున్న తమ్ముడుగా భరతుడు  మనకు ఆదర్శం.     

కానీ తమిళ రాజకీయాలలో అమ్మ కొత్త ఒరవడి సృష్టించింది.   పాపం పన్నీరు గారికి ఒక జత పాదుకలు కాదు 750 జతల పాడుకల్ని ఇచ్చింది.    నార బట్టల బదులు 1000  కంచి పట్టు చీరెలు ఇచ్చింది.   అలనాటి భరతుడికి మన పన్నీరుకు బోలెడు పోలికలు ఉన్నాయి.   శ్రీరామచంద్రుని అరణ్య వాసం ముగిసిన తక్షణమే భరతుడు అన్నకు రాజ్యాన్ని సంతోషంగా అప్పగించాడు. అమ్మ జైలు నుంచి వచ్చిన తక్షణమే పన్నీరు కూడా అదే చేస్తాడు.   రాముడు లేని అయోధ్య బోసిపోయింది.   అమ్మ లేని తమిళ్ నాడు కూడా అంతే.     దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకున్న పెద్ద సమస్య ఇదే.   కొడుకో, కూతురో, భార్యో, భర్తో వుంటే కొంతలో కొంత మేలు.    లాలు జైలుకేల్తూ వాళ్లావిడకి పట్టాభిషేకం చేసారు.    అదే ఒరిస్సా, బెంగాలు, తమిళ్ నాడులలో ఇలాంటి పరిస్తితి వస్తే  పన్నీరు లాంటి పాదుకల అవసరం పడుతుంది.    కానీ పన్నీర్ లాంటి మంచి పాదుకలు అన్నిపార్టీలలో అరుదుగా దొరుకుతారు.    ఇది అమ్మ అదృష్టం.  

శ్రీరాముడికి విప్లవ వనితకి ఒకటే తేడా - తండ్రి మాట సిరసావహించడం, నీతివంతమైన పాలన రాముడి సొంతం; కోటాను కోట్లు ప్రజా ధనం పోగేసుకోవడం అమ్మ నైజం. 


25, జూన్ 2014, బుధవారం

ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి


అయ్యలారా, 

ఇటీవలి ఎన్నికలలో మీరు ఘోర పరాజయం పొందిన పిమ్మట మీరందరూ కలసి కూర్చొని ఓటమికి గల కారణాలు విశ్లేషించారు.   ఇది ఒక రకంగా సంతాప సభలా జరిగింది.   ఇందులో వచ్చిన కొన్ని సూచనలలో ముఖ్యమైనవి అ) పార్టీకి ఒక టి వి మరియు పత్రిక కావాలని ఆ) పార్టీ అధ్యక్షురాలు మరియు యువ నేత ఆంధ్రాలో తరచూ పర్యటించాలని -- 


నిజంగా మీరు పార్టీ శ్రేయస్సు కోరుకొనే నాయకులైతే దయచేసి ఈ రెండు పనులు మాత్రం చెయ్యవద్దు.  పొరపాటున ప్రజలు మీ చానల్లో సోనియా గాంధీ బొమ్మ చూసారంటే,  వాళ్లకు గతంలో తెలుగు వారిని చీల్చి చెండాడుతూ  ఆమె జరిపిన దాడి (యుద్ధ విమానంలో బిల్లు పంపడం, పార్లమెంటులో దీపాలార్పడం) వగైరాలు గుర్తు వచ్చి మానుతున్న గాయాన్ని మళ్ళీ గెలికింది మీరే అని మిమ్మల్ని ఇంకా ఘోరంగా శిక్షించే  ప్రమాదం వుంది.   


పోనీ పాపం మీరు పత్రిక పెడితే, ఎవరిని విమర్శిస్తారు -- తెదేపాను విమర్శిస్తే, జగన్ బలం పెరుగుతుంది, జగన్ను విమర్శిస్తే తెదేపా బలం పెరుగుతుంది.   మిమ్మల్ని మీరు పోగుడుకునే దానికి అక్కడ ముడి సరుకు లేదు. కాబట్టి పరిస్తితులు కొంత అనుకూలించే వరకు పొరపాటున కూడా ఆ పని చెయ్యవద్దు.   


ఎన్నికల సమయంలో మీకు చేతై నంత వరకు మీరే ప్రచారం చేసుకోండి గానీ పొరపాటున కూడా ధిల్లీ నుంచి ఎవరినీ పిలవవద్దు.  సినిమా పిచ్చి కాస్త ఎక్కువగా వున్న ఆంధ్ర ప్రజలు కూడా చిరంజీవిని తిలకించడానికి ఇక ముందు సభలకు రారు.  కనీసం మీ అంతట మీరు ప్రచారం చేసుకుంటే, ఇద్దరికో మహా అయితే పది మందికో ధరావతు దక్కే అదృష్టం వుంది.   పై నుంచి మీ నాయకులు తరచూ వస్తే అది కూడా కష్టమే.   ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒకటో ఆరో సీట్లు రాక మానవు.  


ఇప్పటికీ ఏదో ఒక మూల కాంగ్రెస్పై కాస్తో కూస్తో అభిమానమున్న వాడిగా సిగ్గుతో ఈ సలహా ఇస్తున్నాను, తప్పక పాటించ గలరు.  

23, జూన్ 2014, సోమవారం

ఎవరు స్థానికులు?


వైద్య, తాంత్రిక మరియు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు దాదాపు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి.    తమిళనాడులో 8 నుంచి 12వ తరగతి వరకు ఆ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్ధైనా అక్కడి కాలేజీల్లో  స్తానికుడిగా గుర్తింపబడతాడు.     కర్ణాటకలో 1 నుండి 12 వ తరగతి లోపల ఏడు సంవత్సరాలపాటు (పి యు సి తప్పకుండా  కర్ణాటకలోనే చదవాలి) చదివితే వారు స్థానికులుగా గుర్తింపు పొందుతారు.   ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ సిస్టం ప్రకారం ఉండేది.    అందులోను స్థానికతను ఆనప కాయ-సొర కాయ, గోంగూర-కుంటికూర గుర్తింపులతో కాకుండా ఎక్కడ చదువుకున్నారనే వాస్తవాన్ని బట్టే ప్రవేశం వుండేది.


చిక్కల్లా, ప్రియతమ నాయకుడు దివంగత మేత ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్సుమెంటు పధకం వల్లనే వచ్చింది.   తెలంగాణాలోని ఇంజనీరింగు కాలేజీలలో మాత్రం 5-7 సంవత్సరాల స్థానికత ప్రకారం విద్యార్ధులు చేరవచ్చు. కానీ, ఫీజు రియంబర్సుమెంటు విషయంలో విద్యార్ధి తండ్రి తెలంగాణలో పుట్టి వుంటేనే ఈ సదుపాయం దక్కబోతోందని సమాచారం.   కాలేజీలో ప్రవేశానికి కూడా ఈ నిబంధన పెట్టినట్లయితే, సగానికి పైగా ఇంగాజీరింగు కళాశాలలు మూత పడతాయి.       


చట్ట సభలలో ఎంపీలుగా ఎం ఎల్ ఏ లు గా ఎన్నిక కాబడడానికి స్థానికత, వాళ్ళ నాన్న, తాత ఎక్కడ పుట్టింది అవసరం లేదు కానీ,  ఫీజు రియంబర్సుమెంటుకు మాత్రం కావాలి.    మరాఠీ, ఒరియా, కన్నడ మాతృభాషగా కలిగిన వ్యక్తులు 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్న వ్యక్తులు కూడా మన రాష్ట్రం నుండి శాసన సభకు గెలవ వచ్చు.   ఈ దేశంలో పుట్టని, ఈ దేశంతో సంబంధం లేని వారు కూడా ఈ దేశాన్ని వెనుక వుండి పరిపాలించ వచ్చు.


ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగిన పుల్లెల గోపీ చందు గారు తెలంగాణా బాడ్మింటన్ అసోసియేషన్కు నిన్ననే కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   మరి వారి స్థానికతకు కొలబద్ద ఏమిటో!   

గత మూడు సంవత్సరాలనుండి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని దిగ్విజయమైన బందుతో మొదలు పెట్టి  అదే రెచ్చగొట్టే విధానాల ద్వారా ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకోవాలనుకోవడం శోచనీయం.  


మోటార్ వాహనాన్ని అమ్మేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం మా కంపెనీ సలహా మీద కొన్ని మోటార్ బైకులు షోరూం వాళ్లకి ఇచ్చి కొత్త వాహనాలు తీసుకున్నాము.   ప్రతి షోరూంకు అనుబంధంగా కొంత మంది ఏజెంట్స్ వుంటారు.  మన పాత వాహనం వాళ్ళు తీసుకొని షో రూం వాడికి డబ్బు ఇస్తారు.    షోరూం వాడు మన దగ్గర ధరలో వ్యత్యాసాన్ని తీసుకొని మనకు కొత్త వాహనం ఇస్తాడు.     ఈ మొత్తం వ్యవహారం మనకి కొత్త వాహనం వచ్చిన సరదాలో మర్చిపోతాం.   

ఇటీవలే మా ఆఫీసుకు కోర్టు నుండి 'సమన్స్' వచ్చాయి.    దాని సారాంశం -- మీ పేరిట వున్న వాహనం ఒక రోడ్డు ప్రమాదంలో వుందని, ఎవరికైతే మీ వాహనం వలన గాయాలు తగిలాయో వారు మీ మీద మూడు లక్షలకు నష్ట పరిహారం వేసారని --  పాత కాయితాలు తిరగేస్తే, తెలిసినది ఏమిటంటే, మా పాత వాహనం కొనుగోలు చేసినవాడు దానిని తన పేరిట మార్చుకోలేదు.    వాహన బీమా కూడా మా కంపెనీ పేరిట వాడే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు.   షోరూము వాడు మా దగ్గర నుండి 10,000 నగదు (పాత వాహనం విలువ) గాను మిగిలినది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనూ ముట్టినట్లు కొత్త బండి తాలూకు బిల్లులలో చూపించాడు.      బండి కొనుగోలుదారుడు చేసిన తప్పులకు మేము న్యాయస్థానం చుట్టూ తిరగ వలసి వస్తున్నది.     

అందుకనే, ఏదైనా వాహనం అమ్మినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా న్యాయవాదిని సలహా అడిగితే, ఆయన చెప్పిన అంశాలు -- 

-- కొనుగోలు చేసిన వ్యక్తీ నుండి రశీదు తీసుకోవడం (Delivery నోట్) మరవద్దు
-- వాహనం అమ్మిన మరుసటి రోజే, సంబంధిత బీమా సంస్థకు మరియు ఎక్కడైతే వాహనం మొదట  నమోదు
    అయ్యిందో ఆ యొక్క R.T.A కార్యాలయానికి ఈ transaction తాలూకు వివరాలు డెలివరీ నోటు నకలుతో
    రిజిస్టర్డ్ పోస్టు చేసి దాని రశీదును భద్రపరచుకోవడం మంచిది.
-- వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి వారి లైసెన్స్ కాపీ ఉంచుకోవడం మంచిది.
-- వాహనం అమ్మిన నెల తరువాత  R.T.A వారి వెబ్ సైట్ లో వాహనం సంఖ్యతో దాని ఓనర్ పేరు తెలుసుకోవచ్చు
     దానిలో ఇంకా మీ పేరే వుంటే మీరు తక్షణం మేల్కొని R.T.A ను సంప్రదించండి

పైన తెల్పిన వివరాలు  చదవడానికి చాలా చిన్నవిగా వుంటాయి.  అనుభవించే వాడికి అసలు విషయం తెలుస్తుంది. బైకుకు ఏక్సిడెంట్ అయింది కాబట్టి ఏదో రకంగా రాజీకి వచ్చి డబ్బులిచ్చి వదిలించుకోవచ్చు.    అదే బైకు అసాంఘీక శక్తుల చేతులో పడితే అంతే సంగతులు.  


21, జూన్ 2014, శనివారం

హిందీ జాతీయ భాష కాదు

ఏదో ఒక సంచలన ప్రకటన చేసి అసలు విషయాలను పక్క దారి పట్టించడం పాలకులకు పరిపాటైంది.   రైల్వే చార్జీలు పెంచిన ప్రకటన వెలువడిన రోజే దేశంపై హిందీ భాష దాడి వార్తను కూడా వెలువరిస్తారు.   కరుణానిధి లాంటి వాళ్ళు రైల్వే చార్జీల పెంపు పక్కన పెట్టి హిందీ గురించి మాట్లాడతారు.   

హిందీ మన జాతీయ భాష కాదు అని ఇటీవలే గుజరాత్ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.  సురేష్ కచ్చాడియా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం, దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషగా హిందీ వుందని, దానిని జాతీయ భాషగా రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన లేదని తీర్పు ఇచ్చింది.  

అధికార భాషా చట్టం 1963 ప్రకారం పార్లమెంటు కార్య కలాపాలు హిందీలో మరియు ఆంగ్లంలో జరపవచ్చని పేర్కొంది.   పార్లమెంటు చేసే ప్రతి చట్టం హిందీ లోను  ఆంగ్లంలోను అందుబాటులో ఉండేలా నిర్దేశించింది.  

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.  అందులో సందేహం లేదు.   దానిని బలవంతంగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం లేదు.   ఉత్తరాది వారికి ఇప్పటికీ దక్షిణాది వారంటే చులకన.  దక్షిణాది వారి భాష, వేషం, ఆచార  వ్యవహారాలను వారు ఈసదించుకుంటారు.   

ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సమస్యల ముందు హిందీ భాష బలవంతంగా రుద్దడం అనేది ప్రాముఖ్యత లేని విషయం.   దేశం మొత్తం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి, ఎవరు ఏ భాషలో చడువుకోవాలి అనేది వారి వారి స్వంత నిర్ణయంగా వదిలి వెయ్యాలి.    కర్ణాటక రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక విద్యనూ కన్నడ మాధ్యమంలో చదివిన విద్యార్ధులకు వైద్య మరియు తాంత్రిక విద్యలో 5 శాతం రిజర్వేషన్ వుంది.   కన్నడ మాధ్యమం విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో చదివితే రిజర్వేషన్ మరింత ఎక్కువ.   వాళ్ళ భాషను ప్రోత్సహించే విధానం యిది. 

ఉద్యోగం కోసం ఆంగ్లం, దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి హిందీ ఆత్మ సంతృప్తికి అమ్మ భాష అవసరం. 

12, జూన్ 2014, గురువారం

తెలుగు నాడు లేక తెలుగు సీమ

నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఏ పేరు బాగుంటుంది అనే విషయంపై ప్రముఖ తెలుగు ఉపన్యాసకులు ఆచార్య ఆర్ వి సుందరం గారు తెలుగు తేజం పత్రికలో ఒక వ్యాసం రాశారు.   దాని పూర్తి పాఠాన్ని సంపాదకుని అనుమతితో బ్లాగులో వుంచుతున్నాను.


3, జూన్ 2014, మంగళవారం

దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రం కర్ణాటక


ఈ రోజు బెంగలూరు మిర్రర్ దిన పత్రికలో ప్రముఖ చరిత్ర కారుడు శెట్టర్ వ్యాస్యం మొదటి పుటలో అచ్చైనది.   పాఠకుల కోసం వ్యాసం లింకు ఇస్తున్నాను.    చరిత్ర పుటల్లోకి తీసుకెళ్ళిన మంచి వ్యాసం. ఇది తప్పక చదవ వలసిన విషయం. మీ కోసం ............

http://www.bangaloremirror.com/bangalore/cover-story/We-are-the-biggest-souther-state-now/articleshow/35963324.cms?

2, జూన్ 2014, సోమవారం

మరో తెలుగు రాష్ట్రం ఏర్పడక తప్పదా ?


గత రెండు వారాలుగా జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పరిస్థితులను గమనిస్తే ప్రత్యేక రాయలసీమ కూడా ఏదో ఒక రోజు ఆవిర్భవించక తప్పదేమో అనిపిస్తుంది.     అన్ని కార్యాలయాలు ఒకే చోట పోగు చేసే కుట్ర జరుగుతున్నది.   

రాజధాని గుంటూరు-బెజవాడ మధ్య 
వ్యవసాయ విశ్వ విద్యాలయం - గుంటూరు జిల్లా లాం అనుకూలమైనది 
రైల్వే డివిజన్ - బెజవాడ  బాగా అనుకూలమైనది 
శాసన సభ - రాజధాని ఎక్కడుంటే అది కూడా అక్కడే వుండాలి కదా 
ఆర్టీసీ కేంద్ర కార్యాలయం - విజయవాడైతే బాగుంటుంది 
మెట్రో రైలు - విజయవాడ - గుంటూరు - తెనాలి బాగా అనుకూలం 
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం - విజయవాడ నుంచే జనాలు ఎక్కువ                                                          విమానం ఎక్కువ ఎక్కుతారు 
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం - ఇంకెక్కడ విజయవాడ 
ఉన్నత న్యాయ స్థానం - గతంలో ఒప్పుకున్న గుంటూరు 
డి ఐ జి కార్యాలయం - మంగళగిరిలో పానకాలు స్వామి సాక్షిగా 


ఇక మిగిలినవి -- 
పెద్ద కేంద్ర కారాగారం - కడప బాగా అనువైనది 
ఐ ఐ టి - ఇచ్చినప్పుడు చూద్దాం 
ఐ ఐ ఎం - వచ్చినప్పుడు చూద్దాం 

మరి రాయలసీమకో - ముఖ్యమంత్రే రాయలసీమ నుంచి వచ్చాడు.   అదో పెద్ద వరం.  

ఇప్పటికే హైదరాబాదు కేంద్రంగా జరిగిన అభివృద్ధితో తల బొప్పి కట్టింది.   ఇప్పుడు విజయవాడ కేంద్రంగా అదే తంతు జరగబోతోంది.    రాష్ట్రాలు ఏర్పడింది, ఏర్పడేది రియల్ ఎస్టేట్ యజమానులకొసమా లేక సామాన్యుల కోసమా తెలియని పరిస్తితి.   సామాన్యుడు గుంటూరు విజయవాడ పరిసరాల్లో సెంటు స్థలం కొనుగోలు చేసే పరిస్థితులలో లేదంటే నమ్మండి.    

వచ్చే ఎన్నికలలో కూడా జగన్ పార్టీ,  కాంగ్రెస్ పార్టీ చతికిల పడితే, తీరిక సమయం ఎక్కువ వుంటుంది కాబట్టి విజన్ 2025 లో భాగంగా ప్రత్యెక రాయలసీమ ఉద్యమం బలపడే అవకాశం వుంది.    ఏం తెలుగు వారికి మూడు రాష్ట్రాలు ముగ్గురు ముఖ్యమంత్రులు వుంటే తప్పా?   శ్రీ బాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు.   మేము మద్రాస్ తోనే కలిసివుంటాం అంటే, మమ్మల్ని మభ్య పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నారు.   సినిమాలలో మమ్మల్ని ఫాక్షనిష్టులుగా చూపిస్తూ అవమాన పరుస్తున్నారు.  మా భాష వేరు మా యాస వేరు, మా తిండి వేరు, మా వేష భాషలు, సంస్కృతి వేరు. అమాయక రాయలసీమ ప్రజలను ఆంధ్రులు ఎంతకాలం దోపిడీ చేస్తారు అని వరస డవిలాగులు మళ్ళీ ఒక దశాబ్దం తరువాత వినాల్సి రావచ్చు. హంపీ కోట బాక్ డ్రాపుతో తిమ్మమ్మ మర్రిమాను సాక్షిగా మరో లోగో గీయవచ్చు. 

ఆర్ధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ (ముఖ్యంగా అనంతపూర్) ప్రాంతాలకు మంచి జరిగినప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలోని అసమానతలు తొలగి మరో విభజనకు బీజం పడకుండా వుంటుంది. 

తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు


భారత దేశ 29 వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు.   దేశంలో మొట్టమొదటి సారిగా ఒక ప్రాంతీయ భాష మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడినట్లైంది.   భౌగోళికంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో వున్నా మనం మాట్లేడే భాష తెలుగు.   తెలంగాణా అంటేనే తెలుగు మాట్లాడే ప్రాంతం.   అచ్చ తెలుగు మాట్లాడే ప్రాంతం తెలంగాణా అని నేను నమ్ముతాను. 


ఈ శుభ సమయంలో ఒక ప్రాంతం వారు గెలిచారానో మరో ప్రాంతం వారు ఓడారనో భావించడం మూర్ఖత్వం.   రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజకీయ క్రీడ పరాకాష్టకు చేరింది.   ఈ క్రీడలో  కాంగ్రెస్ పార్టీ  పోషించిన పాత్ర తెలంగాణా లో స్థిరపడ్డ తీర సీమాన్ద్రులని కూడా కలిచివేసింది.   వారిలో ఎక్కువ మంది తెరాసకు ఓటేశారే కాని, కాంగ్రెస్  వైపు మొగ్గు చూపలేదు.   ఇది కూడా శుభ పరిణామమే.    


ఈ రోజు నుండైనా రెండు రాష్ట్రాలలోని తెలుగు వారందరు మరి ముఖ్యంగా నెటిజన్లు ఒకరినొకరు దూషించుకోకుండా  ప్రేమానురాగాలతో   అభివృద్ధి పధంలో పయనిద్దాం . 

19, మార్చి 2014, బుధవారం

గెయిల్ ట్రేడ్వెల్ - హోలీ అండ్ హెల్


గెయిల్ అనే ఆస్ట్రేలియాకు చెందిన వనిత తను మాతా అమృతానందమయి (సుధామణీ)ఆశ్రమంలో ఎలా చేరింది, 20 సంవత్సరాల తరువాత ఎలా తప్పించుకుంది, అక్కడ ఆవిడ అనుభవించిన నరకం, 'అమ్మ' కొట్టిన దెబ్బల తిట్టిన తిట్ల  తాలూకు వివరాలు   తన డైరీలో రాసుకున్న సంఘటనల ఆధారంగా ఇటీవల విడుదలైన పుస్తకమే  "హోలీ హెల్".  


కేరళ ఆశ్రమంలో తాను పడ్డ కష్టాలు, అక్కడ జరిగే దోపిడి మొదలగు విషయాలు కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో వివరించింది.   ప్రస్తుతం మన దేశంలో వున్న బాబాలు వారి వికృత చేష్టలు చూసిన తరువాత గెయిల్ రాసిన దాంట్లో వాస్తవం వుందని నమ్మవలసి వస్తుంది.     


హిందూ మతంలోని బలహీనతలను ఆసరాగా చేసుకొని స్వామి నిత్యానంద, పిరమిడ్ పత్రీ , అమ్మా భగవాన్,  కర్నూల్ జూనియర్ బాబా, ఆసారాం బాపు, ఒంగోలు దగ్గరలో ఆశ్రమం కట్టుకున్న ఇంకో భూ కబ్జాదారుడు రామ అవధూత  లాంటి వారు భక్తి పేరిట కోట్లు గడిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.    పనిలో పనిగా సినిమా వాళ్ళు, ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ అధికారులు, రాజకీయ నాయకులు వీరిని దర్శనం చేసుకొని ఆ ఆశ్రమానికి లేని గుర్తింపు తెస్తారు.  


కొంత కాలం క్రితం ఒక ఛానల్ వారు అమ్మా భగవాన్ ఆశ్రమంలో జరిగే వికృత చేష్టలు రోజంతా పదే పదే చూపించారు.   తరువాత ఏమి జరిగిందో ఏమో, ప్రభుత్వమూ చర్య తీసుకోలేదు, టి వి వారు మర్చిపోయారు.  


ఈ పుస్తకంలో అక్కడక్కడ కొన్ని అభ్యంతరకరమైన, అసభ్య రాతలున్నప్పటికి, కేరళలోని ప్రముఖ ఆశ్రమం పుట్టుక దాని ఎదుగుదల ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి వుంటే చదవచ్చు. 

కాంగ్రెస్కు గ్రహణం తాత్కాలికమే


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి మెల్లిగా ఒక్కొక్కరే  తెదేపాలోకి చేరుకుంటున్నారు.   కారణం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని.   విభజించిన తీరును తప్ప పట్టవచ్చేమో గానీ, విభజనకు మొట్ట మొదటి నుండి ఒప్పుకున్న తెదేపా ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్య పార్టీ  ఎలా అయింది? అన్ని పార్టీలు రోజూ మైకుల ముందుకొచ్చి సమస్యను పరిష్కరించమన్నారు, కాంగ్రెస్ వారు వాళ్లకు తోచిన పరిష్కారం చేశారు.   కేంద్ర, రాష్ట్ర మంత్రులుచివరి నిమిషం దాకా మంత్రి పదవి వదులుకోవడానికి ఇష్ట పడకుండా, ఇంకా ఏదో అద్భుతం జరగబోతోందని భ్రమలు కల్పించారు. మరీ విచిత్రం ఎన్ టి ఆర్ గారి కూతురు భాజపాను సమైక్య పార్టీగా భావించడం.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తెలిశాక జెండా, అజెండా మార్చేశారు.   రేపు అధికారంలోకి వచ్చాక, బాబు గారు ఎంత చాణుక్యుడైనా, ఈ వలస పక్షుల దెబ్బకు భవిష్యత్లో విల విల్లాడాల్సిందే.   


ఒక పక్క తెలంగాణా పునర్నిర్మాణం మరో పక్క ఆంధ్రాను సింగపూరుగా మార్చడం మా వల్లే సాధ్యమౌతుందని అన్ని పార్టీల వారు వక్కాణిస్తున్నారు. అంటే గత 60 సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని ఒప్పుకుంటున్నారు.    2019 ఎన్నికల నాటికి ఎన్నో మార్పులు జరగ వచ్చు. నిజంగా ఆంధ్ర ప్రదేశ్ సింగపూరు లాంటి ప్రగతిని సాధిస్తే, ఆ క్రెడిట్ రాష్ట్రాన్ని విభజించి మంచి పని చేసిన కాంగ్రెస్కు దక్కాలి.   ఐదు  సంవత్సరాల తరువాత జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావచ్చు అని అనిపిస్తే, పోలో మంటూ ఇదే నాయకులు బాబును తిట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకో లేక ఇంకో నటుడు పెట్టబోయే పార్తీలోకో చేరడం ఖాయం.   అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని.  

18, మార్చి 2014, మంగళవారం

రాజకీయ పార్టీల గురివింద నీతులు

ఎన్నికలు వచ్చేప్పటికి అన్ని పార్టీలు సిద్ధాంతాలు గాలికి వదిలేస్తాయి.   దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు అప్పటిదాకా అవినీతి గురించి తెగ ఉపన్యాసాలు చెప్పీ పార్టీలు 'మేము గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం' అంటూ నిస్సిగ్గుగా ప్రకటిస్తాయి.   అవినీతి జరిగిందని ప్రాధమిక సాక్షాధారాలు ఉండి జైళ్లకు వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా యధేచ్చగా చట్ట సభలలో పోటీకి నిలబడుతున్నారు.    అలాంటి అభ్యర్ధులలో గెలిచిన వాళ్ళు విర్రవీగుతూ ఒక ప్రకటన చేస్తారు - మేం ప్రజా న్యాయస్థానంలో గెలిచాం, కోర్టు తీర్పు కన్నా ఇదే గొప్ప అన్నట్లు చెప్తారు.  

ఇలాంటి జాబితాలో పేర్లున్న (నాకు గుర్తున్న)  కొందరు -- 

1) బి ఎస్ యడ్యూరప్ప 
2) కనిమొళి 
3) రాజా 
4) రైల్ గేట్ బన్సాల్ 
5) జగన్ బాబు 
6) లాలు ప్రసాద్ యాదవ్ 
7) మోపిదేవి 
8) శ్రీరాములు 

అవినీతి కేసుల్లో శిక్షపడ్డ గుజరాత్ మంత్రులు భావి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.     ఈ సారి ఎన్నికలలో వారే మళ్ళీ పోటీ చేసే అవకాశం వుంది.  


ఎంతసేపు ఎన్నికల కమిషన్ ఇలాంటి వారి విషయంలో  కఠినంగా వ్యవహరించడం లేదు అని అంటాం కానీ, ఇలాంటి నాయకులకు ధరావతు కూడా దక్కకుండా ఓడించాలని ఓటరు అనుకోడు.   కులమో, మతమో లేక ప్రాంతమనో ఊబిలో చిక్కుకుంటాము.    ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ మొదలైంది.  తండ్రి జైలుకు వెళితే కొడుకో, కూతురో లేక ఆయన భార్య గాని ఆ నియోజక వర్గం నుంచి కర్చీఫ్ వేస్తారు.  ప్రజలకు వీళ్ళు తప్ప గతి లేదు.    ఈ పరిస్తితి మారాలంటే సమాజంలో మార్పు రావాలి.    విద్యావంతుల శాతం పెరగాలి.   



8, మార్చి 2014, శనివారం

విజయ మాల్యా ఎక్కడో పోలీసులకు తెలియదట




వార్తల్లోని వ్యక్తీ, రాజ్యసభ సభ్యుడు, లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్య గారు పోలీసుకులకు గత సంవత్సరం నుండి కనపడలేదట.    ఆదాయపు పన్ను శాఖ వారు కోట్ల రూపాయల టి డి ఎస్ (Tax deducted at Source) పన్ను ఎగవేతకు కాను  ఆయన మీద  బెంగలూరులో ఆర్ధిక నేరాల  న్యాయస్థానంలో 2013 లో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.   గౌరవ న్యాయస్థానం వారు మాల్యాను హాజారు పరచాల్సిందిగా కబ్బన్ పార్క్ పోలీసులకు సమన్స్ పంపించింది.    2103 ఫిబ్రవరిలో జారీ అయిన సమన్స్ శాసన సభ ఎన్నికల ఒత్తిడి కారణంగా అందచేయలేక పోయామని పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది.    కోర్టు మళ్ళీ సమన్సు జారీ చేసింది.  కొంతకాలానికి పోలీసులు న్యాయస్థానానికి నివేదిక పంపుతూ తాము IPL క్రికెట్   ఆటల బందోబస్తుతో తలమునకలై ఉన్నామని అందుకే మాల్యాకు సమన్స్ అందజేయలేక పోయామని బాధ పడ్డారు.  


న్యాయమూర్తి గారికి కోపం వచ్చింది.   కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ నుండి కూత వేటు దూరంలో వున్న పంచ తార హోటలులో ఆయన గారు IPL వేలంలో పాల్గొన్నట్లు, IPL పోటీలు జరిగిన క్రీడా ప్రాంగణంలో మాల్య తాపీగా కూర్చిని తిలకించినట్లు వున్న వార్తా పత్రికల క్లిప్పింగులను పోలీసు వారికి ఇచ్చారు.    విధిలేక మరోసారి సమన్స్ జారీ చేసింది న్యాయస్థానం.  


ఈయన గారు మన గౌరవ పెద్దల సభలో పటిష్టమైన చట్టాలు చేసే సభ్యులు.   అందమైన అమ్మాయిలతో అసభ్యకరమైన కాలెండర్లు ముద్రించి ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పెద్ద మనుషులకు పంపిస్తుంటాడు.   ప్రభుత్వ రంగ బాంకుల నుంచి ఈయన గారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు  ఇప్పుడు నిరర్ధక ఆస్థులుగా మారాయి.  


రైతులు తీసుకున్న రుణాలు, గృహ రుణాలు, బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కట్టడంలో జాప్యమైతే, ప్రభుత్వ రంగ బాంకులు పత్రికలలో ప్రకటన యిచ్చి మరీ ఆస్తులను అమ్మేస్తారు.   కానీ మన చట్టం మల్యా లాంటి వారికి వర్తించదు.  

7, మార్చి 2014, శుక్రవారం

కేజ్రీవాల్ మోడీని అడగాలనుకుంటున్న కొన్ని ప్రశ్నలు


ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ప్రధాని అబ్యర్ధి నరేంద్ర మోదీని కలవాలని ప్రయత్నించారు.   అపాయింట్మెంట్ దొరక్క వెనకకు వచ్చాడు.   ఆయన మోడీని కొన్ని ప్రశ్నలు అడగాలని తలంచారు.   ఆ అడిగేదేదో ప్రజల సమక్షంలో ఒక వేదిక మీద ప్రసార మాధ్యమాల నడుమ జరిపితే ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా.    ఆయన అడగాలనుకున్న ప్రశ్నలలో కొన్ని మీ కోసం -- 

1)450 కోట్ల మత్య శాఖ కుంభకోణంలో శిక్షించబడిన పురుషోత్తం సోలంకిని మీ మంత్రివర్గంలో ఇంకా కాబినెట్ మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారు

2)గనుల కుంభకోణానికి సంబంధించి 3 సంవత్సరాల శిక్ష విధింపబడిన బాబు బోఖడియాను  (ప్రస్తుతం బెయిలులో వున్నాడు) ఇంకా మీ మంత్రివర్గం నుండి ఎందుకు తొలగించలేదు

3)సౌర శక్తిని ప్రైవేటు వ్యక్తుల నుండి యూనిట్కు 15 రూపాయలు చొప్పున మీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా మిగతా రాష్ట్రాల్లో యూనిట్ 8/- కు కొంటున్నారు.   దీని వెనుక వున్న రహస్యం ఏమిటి

4)పరిశ్రమల కోసం మీరు చేసిన భూ స్వాధీనంలో రైతులకు నష్ట పరిహారం ఎందుకు తక్కువగా ఇచ్చారు.

5)భూతల స్వర్గంగా మీరు ప్రచారం చేసుకుంటున్నగుజరాతులో  1500 ఖాళీలు గల చిన్న గుమాస్తా ఉద్యోగానికి  13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం కాదా  

6) అంబానీల కుటుంబానికి చెందినా సౌరబ్ పటేల్ మీ మంత్రివర్గంలో సహజ వాయువులు, పెట్రోలియం, శక్తి శాఖామాత్యులుగా వుండగా అంబాని కుటుంబ కంపెనీలతో ప్రభుత్వం జరిపే లావాదేవీలు పారదర్శమ్గా ఎలా వుంటాయి 

7) ఉన్నత విద్యావంతులను మీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి 5,300/- నెల జీతం ఇస్తున్నారు. ఈ జీతంతో కుటుంబం పోషణ వీలవుతుందా. 

8) అభివృద్ధి అంటే గుజరాత్ - గుజరాత్ అంటే అభివృద్ధి అనిచేప్పే మీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయ స్థితిలో వున్నాయి. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు  

ప్రశ్నలైతే బాగున్నాయి కానీ జవాబులు దొరుకుతాయా!

6, మార్చి 2014, గురువారం

బి ఎస్ ఆర్ సి పి - వై ఎస్ ఆర్ సి పి కొన్ని పోలికలు

మనిషిని పోలిన మనుషులు ఎక్కడో కోటికి ఒక్కరే ఉంటారని చెప్తారు.  కానీ, ఎంత యాదృశ్చికం! రెండు వేరు వేరు రాష్ట్రాలు.  రెండు వేరు వేరు భాషలు.   వేరు వేరు పార్టీలు, కానీ కవల పిల్లల్లాంటి పోలికలు.   పరికించండి --- 





*బడవర శ్రామికర రైతర కాంగ్రెస్ పార్టీ (బిఎస్ఆర్ కాంగ్రెస్) 

*యువక శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎసార్ కాంగ్రెస్) 

*రెండు పార్టీలది  పంఖా గుర్తే 

*ఇద్దరి పార్టీ పేరులో మనుషల పేర్లు దాగి వున్నాయి.  బళ్ళారి ఆయన పేరు బి శ్రీరాములు (బి ఎస్ ఆర్) జగన్ గారి  పార్టీ పేరు వైఎస్ఆర్ (దివంగత నేత, ప్రియతమ నాయకుడి పేరు) 

*ఇద్దరిపై ఆరోపణలకు కేంద్ర బిందువు - గనులు, గాలి(వీచేది కాదు), నీరు, డబ్బు, భూమి (పంచ భూతాలు)  

*ఇద్దరి పార్టీ జెండాల రంగులు చూడండి, చాలా దగ్గర పోలికలు వుంటాయి  

*రెండు పార్టీలలోని గుర్తులలో వున్న బొమ్మలను చూస్తే వైద్యం, విద్య, రక్షిత నీరు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  

*ఇద్దరికీ చెల్లి/అక్క వున్నారు.   వాళ్ళు ఇద్దరూ రాజకీయాలలో వున్నారు. 

*రెండు జెండాలలో ఆకుపచ్చ, బ్లూ కొట్టచ్చినట్లుగా ఒకే పాటేర్న్లో వుంటాయి.  

*ఇద్దరూ పాదయాత్ర/కారు యాత్ర చేసి వారి వారి రాష్ట్రాలు కలియ తిరిగారు 

*కొంత కాలం క్రితం వరకు ఒకరు ప్రతిపక్ష జాతీయ పార్టీలో వుండగా,       మరొకరు జాతీయ అధికార పక్షంలో సభ్యులు 

*రాష్ట్రాలు వేరైనా ఇద్దరి మాత్రు భాష ఒకటే 

*జగన్ గారికి కడపలో మంచి పట్టు వుండగా, శ్రీరాములు గారికి బళ్లారిలో తిరుగు లేదు 

* ఒకప్పుడు జగన్ కి గురివిణి సోనియా కాగా శ్రీరాములుకు సుష్మా మాత్రు సమానురాలు.  ఇద్దరూ  స్త్రీ మూర్తులే కదా.  

* తమ తమ పార్టీలతో విభేదాలు వచ్చి ఇద్దరూ పార్టీలు పెట్టుకున్నారు

* గాలంటే ఇద్దరికీ ప్రాణమే 

* రెండు పార్టీలు పుట్టిన సంవత్సరం 2011 

* విద్యార్హతలు  - ఇద్దరూ పట్టభద్రులే - ఒకరు బి ఎ మరొకరు బి కామ్ 

* ఆంగ్ల అక్షర క్రమంలో B రెండోది కాగా, Y చివరనుండి రెండోది. 


*శ్రీరాములు భాజపా నుంచి బయటకు వచ్చి ఎం ఎల్ ఎ గా పోటీ చేస్తే, భాజపా ధరావతు కోల్పోయింది .  జగన్ కూడా  కాంగ్రెస్ వదిలి సొంతంగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు ధరావతు దక్కలేదు 

ఇది ఇలా వుండగా, బి ఎస్ ఆర్ పార్టీ త్వరలో భాజపాలో కలవనుంది, మరి వై ఎస్ ఆర్ సి పి సంగతి ఏమవుతుందో చూద్దాం. 

5, మార్చి 2014, బుధవారం

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విలీనం


మేఘాలు చూసి ముంత ఒలకపోసిందిట వెనకటికి ఒకావిడ.   సోనియమ్మ కూడా తెరాసను చూసింది, యుద్ధ విమానంలో బిల్లు పంపించి ఒక ప్రాంత ప్రజలను శత్రువులుగా చూసింది.   నిన్న పండు గారు కొట్టిన దెబ్బకు  దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయింది.  ఫాం హౌస్లో పడుకుంటాడు అని ఎగతాళి చేసిన నాయకులకు ఆయన ఫాంలోకి వస్తే ఏం జరుగుతుందో సినిమా చూపించాడు.  తెలంగాణలో కచరాకు సరిసమానమైన జనాకర్షణ గల కాంగ్రెస్ నాయకుడు లేడు.    కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే విమర్శించ గల వాళ్ళు, పత్రికలకు టి.వి లకు స్టేట్ మెంట్స్ ఇచ్చే ముసలి ముతక   మాత్రమే కాంగ్రెస్లో వున్నారు. కాస్తో కూస్తో పేరు, చడువు, తెలివితేటలున్న జైపాల్ రెడ్డి గారు తెలంగాణా మొత్తం తిరగడం కష్టం.  అలాగే తీర సీమాన్ధ్రలో కూడా కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు మిగలలేదు.   చివరకు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తెరాసలో,  తీర సీమాంధ్రలో వైకాపాలో కలపాల్సిన పరిస్తితి.   తమిళ్ నాడు, ఆంద్ర, బెంగాల్, బీహార్, యు పి, ఎంపీ,  ధిల్లీ, ఒరిస్సా ---- హతవిధీ,  అన్నింటా మూడో స్థానంలోకి కాంగ్రెస్ దిగజారింది.  ఏ రాష్ట్రంలో కూడా సొంతంగా పోటీ చేసే పరిస్తితే లేదు.  కాంగ్రెస్ను ఆ దేవుడే కాపాడాలి.   

3, మార్చి 2014, సోమవారం

సినీ నటులు రాజకీయాల్లో అవసరమా


తెలంగాణా వారి అదృష్టం - ఆ ప్రాంతంలో సినీ నటులూ తక్కువే, వారిలో రాజకీయాలలో ప్రవేశించిన వారు తక్కువే. ఎన్నిచేప్పినా విజయశాంతి ఆంధ్ర ప్రాంతము నుండే వచ్చిందనేది నిర్వివాదం.   బాబు మోహన్ మాత్రం దండయాత్రలు చేస్తున్నాడు.   కానీ తీర ఆంధ్ర ప్రదేశ్లో వోటర్లపై వీరి ప్రభావము చాలా ఎక్కువ.   నాకు గుర్తున్నంతవరకు క్రింది జాబితాలో ఇచ్చిన నటులందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన వారే -- 

1) ఎన్ టి ఆర్ 
2) కృష్ణ 
3) కృష్ణం రాజు 
4) విజయ నిర్మల 
5) జమున 
6) ఎ వి ఎస్ 
7) ధర్మవరపు సుబ్రహ్మణ్యం 
8) జీవిత/రాజశేఖర్ 
9) చిరంజీవి 
10) టి సుబ్బి రామి రెడ్డి 
11) రామానాయుడు 
12) రోజా 
13) మోహన్ బాబు 
14) కోట శ్రీనివాస రావు 
15) రావు గోపాల రావు 
16) కొంగర జగ్గయ్య 
17) నాగభూషణం 
18) శివప్రసాద్(తిరుపతి)
19) గిరిబాబు 
20) శివకృష్ణ 
21) నరేష్ 
22) దాసరి నారాయణ రావ్ 
23) జయసుధ 
24) శారద 
25) విజయ్ చందర్ 
26) జయప్రద 
27) కవిత 
28) మురళీ మోహన్ 
29) సుమన్ 
30) శాయి కుమార్ 
31) హరికృష్ణ 
32) బాలకృష్ణ 
32) పవన్ కళ్యాణ్ 

(బ్లాగు చదివే వాళ్ళు ఇంకొన్ని పేర్లు సూచించ వచ్చు) 

సినిమా వారు రాజకీయాలలోకి రాకూడదని నా ఉద్దేశం కాదు.   ఉపాధ్యాయుడు తన బోధనా వృత్తి మాత్రం చేస్తే బాగుంటుంది కానీ, దానితో పాటు జీవిత భీమా ఏజెంట్గా కూడా పని చేస్తేనే సమస్య.  

ఒక్క రామారావు తప్ప మిగిలిన వారికి రాజకీయాలు ఫుల్ టైం కాదు.   తీర సీమాన్ధ్రలో మొదటి నుంచి సినిమాలు చూడడం, నటులపై అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం చాలా ఎక్కువ.   ఈ సినీ అభిమానమే వోట్లుగా రూపాంతరం చెందుతుంది.   

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది ఉన్నత  విద్యావంతులైన నాయకులు.   పదవిని ఒక భూషణంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూసే వ్యక్తులు.   ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకత్వంలో,  అయితే గుత్తేదారు లేదంటే సినీ రంగం వారు మాత్రమే ఎన్నికలలో ముందుకు వస్తున్నారు.    కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నత విద్యావంతులు, వ్యాపారాలు లేనివాళ్ళు, పదవిని సమాజ సేవకోసం మాత్రమే వినియోగించే వాళ్ళు అత్యవసరం.   

      

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చిన్న రాష్ట్రాల పేరిట రాజకీయ క్రీడ


ఒక కొత్త జిల్లా ఏర్పడితే కనీసం 10 మంది రాజకీయ నిరుద్యోగులకు పదవి దక్కుతుంది, అదే ఒక రాష్ట్రమే ఏర్పడితే వందలమంది రాజకీయ నిరుద్యోగులకు పదవి లభిస్తుంది.   ఈ సూత్రాన్ని బాగా వంటపట్టించుకున్న భాజపా ఈ ఊబిలోకి కాంగ్రెస్ పార్టీని కూడా లాగింది.   అవసరాన్ని బట్టి దీపాలు ఆర్పి, తలుపులు మూసేసి, ఎంపీలను కొట్టించైనా మూజువాణీ పెట్టేసి రాష్ట్రాల  విభజన  జరపవచ్చని ఇటీవలే రుజువైంది.  భాజపా అగ్ర నాయకత్వం పదే పదే, తాము 3 రాష్ట్రాలు వేర్పాటు చేస్తే, ఇరు రాష్ట్రాలు మిఠాయిలు పంచుకున్నారు అని చెప్తూ  "రాజధానితో పాటు రాష్ట్రం విడిపోలేదు"  అన్న నగ్న సత్యాన్ని దాచిబెడతారు.  60 సంవత్సరాలకు పైబడి ప్రత్యెక రాష్ట్ర  డిమాండ్ వున్న గూర్ఖాలాండ్లో తెలంగాణా విభజన తరువాత కదలిక మొదలైంది.    గూర్ఖాలాండ్ నాలుగు దేశాల అంతర్జాతీయ సరిహద్దు (నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్) వెంబడి వుంది. తెలంగాణాలో రాజకీయ నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఆత్మ హత్యలు జరిగితే, గూర్ఖాలాండు ప్రజలలో విద్యావంతులు తక్కువ.   వారాల తరబడి బందులు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు వున్నాయి.   భాజపా అగ్రనేత జస్వంత్ సింగ్ 2009లో డార్జీలింగ్ పార్లమెంటు స్థానం నుంచి గూర్ఖాలాండు జనముక్తి మోర్చా మద్దుతుతో గెలుపొందాడు.   తెలంగాణలో సోనియా గాంధీ కేవలం గులాబీ కండువా మాత్రమే కప్పుకుని 2009 లో ప్రచారం చేసింది.   ఇక్కడ జస్వంత్ గారు ఏకంగా ఒక వేర్పాటు వాద, విచ్ఛిన్నకర శక్తితో చేతులు కలిపి వారి మద్దుతుతో ఎంపీగా కొనసాగుతున్నారు.   తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత గూర్ఖాలాండు ఉద్యమకారులు దిల్లీలో జస్వంత్ సింగు గారికోసం తెగ వెదికారు.   ఆయన ధిల్లీ లోనూ, డార్జిలింగు ఆఫీసులోను లేకపోవడంతో సమీప పోలీసు స్టేషన్ లో కూడా 'మిస్సింగ్ కంప్లైంట్' ఇచ్చారు.    


సీట్ల కోసం, వోట్ల కోసం వెంపర్లాడే జాతీయ పార్టీలుగా చెప్పుకొనే ఈ పార్టీలు ఏదో ఒక రోజు ఈ దేశ విచ్చిన్నానికి పరోక్షంగా సహాయం చేస్తాయనడంలో ఆశ్చర్యం లెదు.  

కాంగ్రెసుతో పొత్తు తెరాసకు నష్టం


తిరునాళ్ళకో, జాతరకో వెళ్ళేటప్పుడు ఉన్నంత హుషారు తిరిగి ఇంటికి వచ్చేప్పుడు వుండదు.  ఇది చాలా సహజం. ఉద్యమకారునికిగా కచరా సంవత్సరం క్రితం కాంగ్రెసును దుమ్మెత్తి పోస్తూ "తెరాస ను కాంగ్రెస్లో విలీనం చేస్తే ప్రత్యెక రాష్ట్రం ఇస్తామంటున్నారుగా, ఎంతో కష్టపడి పెంచిన పార్టీని మీ బొంద మీద కలపడానికి సిద్ధం, ఇప్పుడైనా రాష్ట్రం ప్రకటించండి" అని తనకు ఇష్టం లేకపోయినా స్వరాష్ట్రం కొరకు పార్టీని త్యాగం చెయ్యడానికి ఆనాడు సిద్ధపడ్డారు. కానీ ఈ రోజు పరిస్థితులు వేరు.   రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రెండంకేలకే పరిమితమయ్యే పరిస్తితిలో వుంది.   అలాంటప్పుడు తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసి మరో (అ) చిరంజీవిగా మిగిలే బదులు, సొంతంగా 10-12 స్థానాలలో అభ్యర్ధులను గెలిపించుకొని రాబోయే భాజపా ప్రభుత్వానికి  మద్దతు ఇచ్చి తెలంగాణా రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకొనే వెసులుబాటు వుంటుంది.   తెలంగాణా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ, జనాన్ని ఆకట్టుకోగలిగిన కాంగ్రెస్ నాయకుడు ఎవరూ లేరు.   నిన్నటి దాకా సొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని తిట్టిన వి హెచ్, పాల్వాయ్, పొన్నం  లను చూసి వోట్లేసే వెర్రిబాగుల వాళ్ళు తెలంగాణలో లేరు.  


ప్రస్తుత లోకసభలో 18 మంది ఏమ్పీలున్న డి ఎం కె నాలుగు పదవులు పొందింది.  వాళ్లకు వాళ్ళ రాష్ట్రానికి "మేళ్ళు"  జరిగాయి.      భక్తవ శంకరుడి దర్శనం కావాలంటే ముందు నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి.   కాంగ్రెస్ పార్టీలో అమ్మగారిని కలవాలంటే ఇలాంటి నందులు వేరు వేరు పేర్లతో, రూపాలతో దిల్లీలో వుంటాయి.   ముందు వారిని ప్రసన్నం చేసుకోవాలి, వారు అనుమతిస్తే అమ్మగారిని కలవచ్చు.   ఈ కష్టాలకు బదులు సొంతంగా పార్టీని కొనసాగించి మనకు కావలసిన మేళ్ళు జరిపించుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే, ఆంధ్ర రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను, ప్రజలను  పెద్దగా తిట్టడానికి వుండదు.  దీని బదులు ఇంకో 10 సంవత్సారాలు తమ పార్టీ కొనసాగితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పక్క రాష్ట్ర ప్రజలను దూషించి వారు గతంలో చేసినట్లుగా చెబుతున్న దోపిడీని గుర్తుచేసి వోట్లు దండుకోవచ్చు.  తీర్దానికి తీర్ధం - ప్రసాదానికి ప్రసాదం.   

20, ఫిబ్రవరి 2014, గురువారం

అసలు క్విడ్ ప్రో కో అంటే ఇదే


మంగళవారం నుంచి నిరంతరాయంగా నడుస్తున్న ధారావాహికలో పెద్దమ్మ, చిన్నమ్మ, దద్దమ్మలు కలిసి  రాజ్యసభ అంకంతో  రక్తి  కట్టిస్తున్నారు. పెద్దమ్మ బిల్లు పెట్టింది, చిన్నమ్మ నోట్లో వేలేసుకొని తలాడించి  కాంగ్రెస్ ఎంపీల చేత కాళ్ళకు నమస్కారం పెట్టించుకుంది.   అంతా  అయిపోయిన తరువాత  మన మాట వంకర వెంకయ్య గారు సీమాన్ధ్రకు అన్యాయం జరగనివ్వం అనే పదాన్ని పది రూపాయల నోటు మీద ఎన్ని భాషలలో ముద్రించి వుంటుందో అన్ని భాషలలో మైకు ముందు చెప్పేస్తారు.   ఇహ నుంచి తెలంగాణా విమోచన ప్రదాత చిన్నమ్మ, సీమాన్ధ్ర కింగ్ మన వెంకయ్య. ఎన్నికలప్పుడు చిన్నమ్మ తెలంగాణలో ప్రచారం చేస్తారు, తీర సీమాన్ధ్రలో వెంకయ్య గారు జనాల్ని మభ్య పెడతారు.   వెంకయ్య గారు అంత్య ప్రాసలతో జనాల్ని ఓలలాడించినా ఆయనకు ఆంధ్ర నాయకులు అడ్డు చెప్పరు, కారణం ఆయన జనాభాలో ఐదు శాతం సామాజిక వర్గానికి ప్రతినిధి కాబట్టి.   


చిత్త సుద్ధి వుంటే, సుష్మా స్వరాజ్ లోక్ సభలో ఎందుకు బిల్లుకు సవరణలు పెట్టలేదు?  అంతా 23 నిమిషాలలో కానిచ్చి తెలంగాణా వారి ఓట్లను కొల్లగోడదామని కాదా?   ఇప్పుడు బిల్లును ఏదో విధంగా అడ్డుకున్నట్లు నటించి రాజ్యసభలో నాటకాన్ని రక్తి కట్టించి ఆంధ్రలో ఓట్లు దండుకుందామన్న దుర్బుద్ధి కాక మరేమిటి?   


ఇంతవరకూ వచ్చాక మళ్ళీ రాజ్యసభలో గొడవెందుకు.   అసలే బలహీన మనస్తత్వం వున్న ప్రజలున్న రాష్ట్రం మనది.   ఇప్పుడు బిల్లు ఆలస్యం అయితే, ఆత్మ హత్యలు జరగ వచ్చు.    లైట్లు ఆపేసి మేజువాణి పెట్టేస్తే సరి.  






19, ఫిబ్రవరి 2014, బుధవారం

కొత్త రాష్ట్రంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పించండి


రాష్ట్ర విభజన నేపధ్యంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాముఖ్యం ఇవ్వాలి.   ద్వి భాషా సూత్రం అమలు చేసినా తప్పులేదు.    తీర సీమాన్ధ్ర ప్రాంతంలో, తెలంగాణా రాష్ట్రం లాగా ఉర్దూకు అంత ఆదరణ, ప్రాముఖ్యం లేదు.   కాబట్టి తెలుగును నిర్భందంగా ఏడవ తరగతి వరకు, ఆ తరువాత కనీసం ఒక పాఠ్యాంశంగా చేర్చాలి.   తెలుగు భాషకు ఆయువు పట్టైనా తెలంగాణలో ఉర్దూ భాషకు రాజకీయ పరమైన, భౌగోళిక పరమైన మద్దతు లభించి తెలుగు కొంత నష్టపోయే అవకాశం వుంది.     ఆ రాష్ట్ర జనాభాలో కనీసం 10-12 శాతం మాత్రు భాషగా మాట్లాడే ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ వర్గం వారు సహించరు.   కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలోనైనా తెలుగు భాషను పరిరక్షించడం ద్వారా మాత్రు భాషకు మేలు చేసినట్లవుతుంది.  


18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు


తెలంగాణా ఇచ్చేశారు.  అది కూడా 'మేజువాణి' ఓటుతో ఇచ్చేశారు. తలుపులేసి, బయట ప్రపంచానికి తెలియకుండా ఇచ్చారు కాబట్టి ఇది మూజువాణి కాకుండా మేజువాణి అనడమే సమంజసం.  మరో వింతేమిటంటే, ముగ్గురు స్త్రీలు కలిసి ఈ బిల్లును ఒంటి చేత్తో పరిష్కరించారు.   కాకపొతే ఇందులో ఇద్దరు విద్యాధికులు కాగా  మరొకరిది  వానాకాలం చదువు.   

గత ఆరు నెలల నుంచి విభజన వాదులు సమైక్య వాదులుగా (కొద్ది మంది) సమైక్య వాదులు విభజన వాదులుగా మారారు. బయటికి చెప్పినా చెప్పక పోయినా, భాజపా సీమాంధ్ర ప్రాంత నాయకులు సమైక్యవాదులుగా, సత్తి బాబు & పార్టీ, మాన్యులు డొక్కా గారు, పనబాక గారు, బాల రాజు గారు, కొండ్రు గారు, పుట్టు తెలుగు వారు కాని కేంద్ర అమాత్యులు, రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి గారు  విభజన వాదులుగా మరారు.     సంతలో వింత ఏమిటంటే, హరీష్ రావు గారు, కె టి ఆర్ గారు  ఎప్పటిలా మాట్లాడే వారి మాట తీరుకు విరుద్ధంగా తెలంగాణాలోని   సీమాన్ధ్రాలకు అభయ హస్తం ఇస్తామనగా, పెప్పర్ రాజగోపాల్ గారు, చక్రవర్తి అశోక్ సామ్రాట్లాగా అస్త్ర సన్యాసం చేసి తెలుగు వారు విడిపోయినా ఐక్యంగా వుండాలని కాంక్షించారు. 

తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆంద్ర ప్రాంత ప్రజల పిల్లలు పది సంవత్సరాలు తెలంగాణా ప్రాంతంలో చదివితే సహజంగానే ఆ ప్రాంతంలో వున్న విద్య, ఉద్యోగాలకు అర్హత పొందుతారు.   2012 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు.   ఎన్ని సార్లు అబద్ధం చెప్పినా ఈ సంఖ్య 4.5 కోట్లు కాదు.   ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, జంట నగరాలు, మహబూబ్ నగర్, మెదక్, రంగా రెడ్డి ప్రాంతాలలో తీర సీమాన్ధ్రులు కొన్ని దశాబ్దాల క్రితమే స్థిరపడి కనీసం 30 నుంచి 40 శాసన సభ్యుల ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో వున్నారు.    దీనికి చిన్న ఉదాహరణ - మల్కాజ్గిరి పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటు స్థానాల గెలుపుపై వివిధ పార్టీలలో వున్నసీమాన్ధ్ర నేతల  విశ్వాసం.   గత పది సంవత్సరాల ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తే, తెలంగాణా ప్రాంతం నుంచి నోరు జారే నాయకులు ఎవరైనా వున్నారంటే, కేవలం 4 నుంచి 5 జిల్లాలకే పరిమితం.   గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్దగా నోరు జారడు, ఎందుకంటే నల్గొండ పార్లమెంటు పరిధిలో గణనీయంగా ఆంద్ర ప్రాంత ప్రజలు వున్నారు.  అలాగే ఖమ్మం, మల్కాజ్గిరి, సికిందరాబాద్ మొ॥     ఇహ, జంట నగరాలలో వున్న ఏ పరిశ్రమలోనైనా, కేవలం ప్రతిభ ఆధారంగా వుద్యోగం ఇస్తారు గానీ, వీడు మన జిల్లా వాడనో లేక ప్రాంతం వాడనో ఉద్యోగంలోకి తీసుకోరు.   138 పై చిలుకు కేంద్ర సంస్థలు హైదరాబాదులో వున్నాయి మరి వాటిలో ఉద్యోగాలు తీర సీమాన్ద్రులకు దక్కవా అంటే - ఇది కూడా అవాస్తవం.   అన్ని స్కిల్డ్ ఉద్యోగాలకు దేశవ్యాప్త పరీక్ష ద్వారా మాత్రమే నియామకాలు వుంటాయి.   కాబట్టి ఆందోళన అనవసరం. ఈ విభజన వలన తీవ్రమైన నీటి యుద్ధాలు, అంతర్ రాష్ట్ర పన్నులు ఇరు ప్రాంత ప్రజల మీద తీవ్రంగా పడే ప్రమాదం వుంది.     అత్యంత దుర్భిక్షంతో వున్న రాయల సీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం ఈ విభజన ఒక అశనిపాతం.   42 మంది సభ్యులతో కేంద్రాన్ని శాసించే స్థితిలో వున్న ఆంద్ర ప్రదేశ్, ఆ స్థానాన్ని కోల్పోయి పలుచన కావడం తధ్యమ్. 

దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలతో పోలిస్తే, హైదరాబాదులో నివాసం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.  సర్వ హంగులున్న ఈ పట్టణానికి, ధరలు పెరగక ముందే  తీర సీమాన్ధ్రులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్థిర  నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆంద్ర ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల గుప్పిటలో నలుగుతున్న రియల్ ఎస్టేట్ భూముల ధరలు ఆకాశాన్ని అంటుకున్న ఈ సందర్భంలో హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకోవడం ఉత్తమం . 

తీర సీమాన్ధ్రకు జరగబోయే అతి  పెద్ద నష్టం ఏదైనా వుంటే మొట్ట మొదటగా అది మత మార్పిడుల రూపంలో వుంటుంది. దేశ వ్యాప్తంగా క్రైస్తవంలోకి మార్పిడి జరిగేది తీర ప్రాంతాలలోనే.  ఈ విభజన వలన,  తిరుపతి ఏడు కొండలలో కొన్ని కొండలను దిగ మింగెయ్యాలని తలపెట్టిన ప్రియతమ నాయకుడి కొడుకు కాంగ్రెస్ సహకారంతో  అధికారం లోకి వచ్చే అవకాశం ఎక్కువ.   ఈ కుటుంబ ప్రాభవం పొందడానికి క్రైస్తవం లోకి బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది.     

ఏతా వాతా విభజన వలన జరిగే పెద్ద లాభాలు ఏమైనా ఉన్నాయంటే, అవి రెండు మంత్రి వర్గాలు, రెండు చోట్లా రియల్ ఎస్టేటు ముసుగులో ప్రజలను పీడించే బేనామీ రాజకీయ నాయకులు మాత్రమే.   ఈ విభజన ద్వారా కాంగ్రెస్ భాజపాలు కుట్ర పూరితంగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను దెబ్బ వెయ్యడం ద్వారా రాబోయే రోజులలో ప్రజలకు కేవలం తాము మాత్రమె దీక్కు అన్న సంకేతాన్ని సంయుక్తంగా పంపినట్లైంది. 

మరోసారి 29 వ రాష్ట్రం (అందునా తెలుగు రాష్ట్రం) తెలంగాణాకు శుభాకాంక్షలు!


14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఆప్(ప) సోపాలు


క్రేజీవాల్ - గత సంవత్సరం నుంచి రాజకీయ ముఖచిత్రం పై 'మార్పు' తీసుకొస్తానని ధిల్లీ వీధుల్లో బోల్తా పడ్డాడు.   ఈ మార్పు అనే పదం వాడిన రాజకీయ నాయకుడు ఎవ్వడూ ఎక్కువ కాలం పార్టీని నడపలా!    చిరు జీవి గెలిచిన ఐదు నెలలకు బోర్డు మార్చేస్తే, కేజ్రీవాల్ గారు యాభై రోజులలోనే మార్పు తెచ్చారు.   గెలిచిన 15 రోజులకే కాంగ్రెస్ కబంధ హస్తాలలో చిక్కుకొని ఆప సోపాలు పడి  ఐదు వారాలకే విల విల లాడుతున్నాడు.  బాబు గారి నోట్లో మట్టి కొట్టి  చిరంజీవి కూడా ఠాగూర్ (ఈ పేరు బాగా వత్తి పలకండి) పేరిట సినిమా తీసి, రిటైల్ స్థానాలు గెలిచి, హోల్ సేల్ గా అమ్మ గారి ముందు సాగిల పడ్డాడు. క్రేజీ వాల్  కూడా తన శక్తి వంచన లేకుండా భాజపా ను ఓడించి, కబంధ హస్తం సాయంతో ధిల్లీ పీఠాన్ని ఎక్కాడు.   హస్తం చేతికి చిక్కి, నోరు మూసుకొని వుండక లోక్ పాల్ బిల్లు, దీక్షిత్ పై విచారణ అంటూ విర్ర వీగితే కాంగ్రెస్ మార్షల్ లాంటి గవర్నర్ ఊరుకుంటాడా!  అప్పటి దాకా కాంగ్రెస్ ను నిందించి, అధికార వ్యామోహానికి లోనై పదవి అలంకరించిన రోజు నీ బుద్ధి ఏమైంది.  

క్రేజీ బాబు- బాగా వేగంగా పరుగెత్తే రైలు మార్గం వెయ్యాలంటే, ఉన్న మార్గాన్ని ముందు పీకేస్తే జనం ఊరుకోరు.   మన నేతి బీర కాయ ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు రావాలి. గవర్నర్లు, స్పీకర్లు, అధికార్లు  పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించటం మొదలు పోవాలి. అధికారంలోకి వచ్చిన సత్వరం తమ ఆస్తులను త్యజించాలి.  ఒక సారి ఎన్నికైన వాడు రెండో సారి పోటీ చెయ్య కూడదు.  అనువంశిక పాలన పోవాలి. దీనికి ఇంకో ఐదు దశాబ్దాలు పట్టవచ్చు.  అప్పటి దాకా సర్డుకుబోవటం నేర్చుకుంటే పది కాలాల పాటు అధికారంలో వుండి నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.     

లాంకో వారి "స్ప్రే" ఉత్పాదనలు


నిన్నటి నుంచి ప్రతి చానలు, ప్రతి పత్రికా పాపం లగడపాటి రాజగోపాల్ను మిరియాల పొడి ఉపయోగించాడని నిందిస్తున్నాయి.    ఇదే మిరియాల పొడి చారులో వేస్తే అబ్బా రుచి అమోఘంగా వుంది, జలుబు రొంప దెబ్బకు కొట్టుకు పోయిందని మనం లొట్టలు వేసుకొని వాడతాము. పాపం రాజగోపాల్ గారు కూడా అదే చెప్పదలుచుకున్నారు.    లాంకో బ్రాండ్ మిరియాలను 'కాషా'యంగాను, రొంప తగ్గించడానికి మరియు దుష్టులనుండి రక్షణ కొరకు ఎలా ఉపయోగ పడుతుందో ప్రయోగాత్మకంగా భారతీయులకు వివరించాడు. ఇదే విన్యాసం ప్రకటన రూపంలో వివిధ మాధ్యమాల ద్వారా జన బాహుళ్యానికి చేరువ అవడానికి కనీసం 10 కోట్లు ఖర్చు అవుతుంది.  ఈ ప్రయోగంతో మనకు తెలిసింది ఏమిటంటే, ఇది ఒక ఉత్తమమైన స్వీయ రక్షణ  ఆయుధం.   ఇక ముందు మాటల్లేవ్ - మాట్లాడుకోవటాల్లేవ్, కేవలం మిరియాల పొడి మాత్రమే, బస్తీ మే సవాల్.  పోలీసులు కూడా టియర్ గాస్ బదులు మిరియాల గాస్ వదలచ్చు.  ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ.   పై పెచ్చు, ఇది ఆయుర్వేద ఔషధం కూడాను.  రైతులు ఇక నుంచి మిరియాల సాగు ఎక్కువ చెయ్యవచ్చు.   చేనుకు చేవ రైతుకు రొక్కం.     

కాంగ్రెస్ మార్షల్స్ ఏమి చేసేది ముందుగా చెప్పలేదు, రాజగోపాల్ కూడా పెప్పర్ వాడతానని ముందుగా చెప్పలేదు, కాబట్టి చెల్లుకు చెల్లు.  ఈ విషయంలో మహా మేధావి, రాజీవ్ గాంధీని పబ్లిక్ గా ఉరి తీయాలని నొక్కి వక్కాణించిన ఉత్తమ పార్లమెన్టేరియన్ ను మాత్రం సలహా అడగ కండి, ఆయన దీనిని 'తొండి' అని చెప్పి సోనియా గాంధీ మెప్పు పొందుతాడు.   

నన్నడగితే, సోమవారం నుండి పార్లమెంటులో తాడాట (టగ్  ఆఫ్ వార్) పెట్టి ఎవరు గెలుస్తారో తేల్చాలండి.  కాకపోతే ఈ తాడును బాబు గారికి, కచరా గారికి, సోనియాకు  మెడకు చుట్టి క్షీర సాగర మధనమ్లా చేస్తే చూసే వాళ్లకు కూడా  వినోదం మీడియా వాళ్లకు రేటింగ్స్ బాగుంటాయి.   ఎందుకంటే, నామా నాగేశ్వర రావు గారు బయటికి వచ్చి  నేను నారాయణను, మొదుగులను కొట్టి మరీ బిల్లు పెట్టించాను అని చెప్పి బాబు గారితో పాటు అపోలోకు వెళ్లి నారాయణను పలకరించి వచ్చాడు. కొట్టింది కాంగ్రెస్, తెదేపా వాళ్ళు; తన్నులు తిన్నది తెదేపా, కాంగ్రెస్ వాళ్ళు; లాభం కచారాకు, బాబుకు, సోనియమ్మకు.  కాబట్టి   ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్న ఈ ముగ్గురు మూర్ఖులకు క్షీర సాగర మధనమో, కుంభీ పాకమో తప్పకుండా జరిపించాలండి.    

26, జనవరి 2014, ఆదివారం

బిల్లు తిప్పి పంపినా విభజన ఆగదు


ఏ శక్తి, ఒక్క భాజపా తప్ప, రాష్ట్ర విభజన బిల్లును ఆపలేదు.   అది ఆర్టికల్ 3కు వున్న అధికారం. యుద్ధ విమానంలో వచ్చిన  బిల్లును 24 గంటలలో తిప్పి పంపండి, చర్చించడానికి ఏమి వుంది  అని చాలా మంది చెప్పారు.   దిల్లీలో వున్న రాజ్యాంగేతర శక్తి, తీసేసిన తాసిల్దార్ డిగ్గీ కూడా చెప్పాడు.   ఆయన గారు ఇంకొక అడుగు ముందుకేసి, శాసన సభ అభిప్రాయం ఏదైనా కావచ్చు, పార్లమెంటు నిర్ణయం ఫైనల్ అని సెలవిచ్చారు. ఇది కూడా వాస్తవమె.   అలాంటప్పుడు ఈ బిల్లును తిరస్కరించినా లేక ఆమోదించి తిప్పి పంపినా  జరిగే నష్టం ఏమీ లేదు, మనల్ని విడదీయడానికి కాని కలపడానికి కాని ఆర్టికల్ 3 వుంది కదా.   గడువుకన్నా ముందే, రేపే బిల్లును తిరస్కరిస్తూ తిప్పి పంపిస్తే సరి.   భవిష్యత్లో కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే వారు శాసన సభలను గమనంలోకి తీసుకోకుండా మళ్ళీ కలపవచ్చు.   పార్లమెంటులో సాధారణ మెజారిటీతో మళ్ళీ కలిపెయ్యవచ్చు.   ఈ రాజకీయ రాక్షస క్రీడ ఇలా జరుగుతున్నంత కాలం తెలుగు వాడి పరువు గంగ పాలు కాక తప్పదు.   

25, జనవరి 2014, శనివారం

వి ఐ పి లకు మాత్రమే పరిమితమౌతున్న తిరుమల



గత కొద్ది సంవత్సరాలుగా కలియుగ వైకుంఠమ్ అతి ముఖ్యమైన వ్యక్తుల తాకిడితో సామాన్యులకు స్వామి వారి దర్శన భాగ్యం దుర్లభమౌతోంది.  భక్తుల రద్దీని నియంత్రించడానికి  గతంలో తి తి దే అధికారి ఒకరు ఒక ప్రతిపాదన చేశారు.  దాని ప్రకారం, ఒక సారి స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు కనీసం మూడు సంవత్సరాలు గుడి ఛాయలకు కూడా రాకూడదు.   సామాన్య భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.   ఈ నియమం వెంటనే వి ఐ పి భక్తుల విషయంలో అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.  వి ఐ పి లకు కేటాయిస్తున్న విలువైన దర్శన సమయాన్ని  నిత్యం వేల సంఖ్యలో కాలి నడకన వచ్చే భక్తులకు, వృద్ధులకు  వీలైనంత త్వరగా దర్శనం కల్పించడం ద్వారా తి తి దే పాలక వర్గం స్వామి వారి కృపకు పాత్రులౌతారు.   ప్రతి నిత్యం వి ఐ పి దర్శనం ద్వారా వచ్చే భక్తుల వివరాలు, వాళ్ళను వి ఐ పి దర్శనం చేయించడానికి సిఫారస్ చేసిన వాళ్ళ వివరాలు తప్పకుండా తి తి దే వెబ్ సైట్లో పెట్టాలి. దీనితో పాటు వి ఐ పి భక్తులంటే ఎవరు, ఏ అర్హత వున్న వాళ్ళు సిఫారస్ ఉత్తరం ఇవ్వచ్చో కూడా స్పష్టంగా అంతర్జాలంలో పెట్టాలి.   ఇలా చెయ్యకపోతే, ఇంకొంత మంది దావూద్ ఇబ్రహీం అనుచరులో, ఛోటా రాజన్ శిష్యులో వి ఐ పి లుగా చెలామణి అయితే, దేవస్థానం పవిత్రత దెబ్బతినే ప్రమాదం వుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కేవలం వి ఐ పి లకు మాత్రమే పరిమితం చెయ్యొద్దని మనవి. 

తెలంగాణపై స్వరం మారుస్తున్న భాజపా!


అధికార పార్టీ పార్లమెంటులో రాష్ట్ర విభజనపై బిల్లు ఎప్పుడు పెట్టినా మేము బేషరతు మద్దతు ఇస్తాం అని ఊదరగొట్టిన భాజపా "అశ్వ్థ్థథ్థామ హతః కుంజరః " అన్న మహాభారత ఘట్టాన్ని గుర్తుచేస్తోంది.   బిల్లు పెట్టేప్పుడు సీమాన్ధ్రకు కూడా న్యాయం చెయ్యాలి.   భాజపా నాయు(కు)డు, తెదేపా నాయు(కు)డు - ఇద్దరు నాయుళ్ళు చెప్పేదీ దాదాపుగా ఇదే.   కానీ ఈ ఇద్దరు నాయుళ్ళు ఏమి చేస్తే సమంగా న్యాయం జరుగుతుందో చెప్పరు.   వాళ్ళని వచ్చే ఎన్నికలలో ప్రజలు అధికారంలోకి తెచ్చిన ఉత్తర క్షణం వాళ్ళ దగ్గరున్న పెట్టె లోనుండి సమన్యాయమనే పదార్ధాన్ని బయటకు తీసి అందరినీ సంతృప్తి పరుస్తారట.   లేదంటే పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించి బిల్లును ఓడించడం ద్వారా సాధారణ ఎన్నికలకు నెల రోజులు ముందుగానే వెళ్ళడం.   

10 సంవత్సరాలు శీతల గిడ్డంగిలో దాచిన విభజనను ఎన్నికలలో కనీసం ఒక ప్రాంతపు ఓట్లనన్నా కొల్లగొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే, మరి భాజపా చూస్తూ ఊరుకోలేదు కదా!  సీమాన్ధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేసే హీరోలం మేమే, ఇరు ప్రాంతాల వారు మాకు సమంగా ఓటెయ్యండి అని భాజపా చెప్తోంది.     జులై 2013 నుండి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వున్నా లేనట్లే.   ఒక వేళ భాజపా అధికారంలోకి వచ్చి బిల్లు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలుపుతుందనే నమ్మకం లేదు.   ఈ రెండు పార్టీలు కలిసి ప్రగతి పధంలో వున్న తెలుగు రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి.   ఈ సమస్యకు ఏదో రకమైన పరిష్కారం త్వరలో లభించాలని ఆశిద్దాం.  

23, జనవరి 2014, గురువారం

చర్చకు గడువు పెంచకపోవచ్చు


రాష్ట్ర పునర్విభజన బిల్లుకు గడువు పెంచే అవకాశాలు తక్కువగానే వున్నాయి.  గడువు పెంచమని సభాపతి కూడా విజ్ఞప్తి చేస్తే ఆ విషయాన్ని గౌరవ రాష్ట్రపతి కూడా తీవ్రంగా పరిశీలించి వుండేవారు.   సాధారణంగా, సభలో అందరు సభ్యుల ప్రసంగం ముగుసిన తరువాత చివరిగా సభా నాయకుడు ప్రసంగిస్తారు.   ఇంతవరకూ బాబు గారు మాట్లాడలేదు.   బహుశా గడువు పొడిగించరనే అనుమానంతోనే ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. గడువు పొడిగించకపోతే మనము  చంద్ర బాబు గారి ప్రసంగం వినే అదృష్టం కోల్పోతాము.    హడావుడిలో ఓటింగుకు కూడా అవకాశం వుండదు.   ఇంతవరకూ వచ్చాక విభజన ఆగుతుంది అనిగాని, ఆగిపోవాలని కోరుకోవడం కానీ అర్ధం లేదు.    నిర్ణయం ఏదైనా, ఇరు ప్రాంతాలలోని సామాన్యుడు నష్టపోయాడు గాని, ఒంగోలులో వందల ఎకరాలు కొన్న వీర సమైక్య వాదులకొచ్చిన నష్టం ఏమీ లేదు.      

4, జనవరి 2014, శనివారం

సభలో చర్చ మరియు ఓటింగ్ జరగాలి


శాసన సభలో పునర్విభజన బిల్లుపై సత్వరం చర్చ జరగాలి.   అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలను నమోదు చెయ్యాలి.   చర్చ జరిగినా జరగక పోయినా జనవరి 23 తరువాత శాసన సభ తమ అధికారాన్ని కోల్పోతుంది.   చర్చ జరపకుండా అడ్డుకుంటున్న వాళ్ళంతా విభజనను సమర్ధిస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది.   ఆర్టికల్ 3 ప్రకారం ఈ తతంగాన్ని పూర్తి చేసే సర్వాధికారం కేంద్రానికే వుంది.   కనీసం చర్చ జరిగితే సభ్యుల అభిప్రాయాల ప్రకారం కొన్ని విషయాలనైనా కేంద్రం పరిశీలించే అవకాశం వుంది.   ప్రస్తుత పరిస్తితులలో కాంగ్రెస్ పార్టీకి తీర సీమంధ్ర లోని 25 స్థానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు.   అలాంటప్పుడు సోనియా గాంధీ బొమ్మలు తగులబెట్టి ఆమెతో ఆమె పార్టీతో వైరుధ్యం పెంచుకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం వుంది.   మొండివాడు రాజుకంటే బలవంతుడు అనే నానుడి మనకు తెలియంది కాదు.   

తక్షణ కర్తవ్యం శాసన సభలో బిల్లుపై సంపూర్ణంగా చర్చించి, తగు సవరణలు ప్రతిపాదించి  ఆపై  ఓటింగు జరిపి, అలా వీగిపోయిన బిల్లును రాష్ట్రపతికి పంపడం ఉత్తమం.  ప్రతిపక్షం అధికారపక్షం కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. 

2, జనవరి 2014, గురువారం

మన రాష్ట్రంలో చట్టం అమలులో వుందా?



గత మూడున్నర సంవత్సరాలుగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, ప్రతి నాయకుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.  ఒక నాయకుడు మానవ బాంబు అవుతానంటాడు, ఇంకొకాయన రైళ్ళు పడగోడతాను అని, ఇంకొక ఎంపీ గారు లేటెస్ట్ గా ముఖ్యమంత్రిని కాల్చేస్తా అని మీడియా ముందు రెచ్చిపోతున్నాడు.   గతంలో బాగా చదువుకున్న ప్రొఫెసర్ గారు, నక్సలైట్లచే చంపబడిన మాజీ  సభాధ్యక్షులు శ్రీపాదరావు గారికి పట్టిన గతే ఆయన తనయుడు మంత్రి శ్రీధర బాబు గారికి పడుతుందని హెచ్చరించారు.   

ఒక ప్రాంతం వాడు ఇంకొక ప్రాంతానికి రాకూడని ఫత్వాలు జారీ చేయడం సర్వసాధారణమైంది.   అన్ని పార్టీల నాయకులు వాళ్ళ పిల్లల్ల్ని శత్రు ప్రాంత పిల్లలతో ఇచ్చి పుచ్చుకున్నారు.   కేవలం వారు మాత్రమె సరిహద్దులు దాట  వచ్చు.   ఇలాంటి భయాందోళనలు రేకిత్తించడం వలననే తెలంగాణా ఏర్పాటులో జాప్యం మరియు అధికారాల కేంద్రీకరణ.    ప్రజాస్వామ్య హరణకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.  

తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, ఇలాంటి పరిస్తితికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బాధ్యులే.   మితిమీరిన ప్రజాస్వామ్యం పరిపాలనకు చేటు కలిగించేదే.     ఈ వికృత రాజకీయ క్రీడకు కనీసం 2014 మార్చిలో నన్నా తెర దించితే ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు.        

1, జనవరి 2014, బుధవారం

విలువలేని ప్రభుత్వ కమిషన్లు


రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షంపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు  లేదా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నప్పుడు హైకోర్టు/సుప్రీం కోర్టు నివ్రుత్త న్యాయమూర్తి చేత ఒక కమిషన్  ను ఏర్పాటు చెస్తాయి.   కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఇలా ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు వాళ్లకు అనుకూలంగా లేకపోతే తిరస్కరించడం ఒక పరిపాటిగా మారింది.  కొన్ని సందర్భాలలో ఈ కమిటీలు కేవలం ప్రతిపక్షాలను తాత్కాలికంగా శాంతింపచేయడానికి లేదా కాలహరణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఆదర్శ్ పేరిట బొంబాయిలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకోసం కట్టిన అపార్టుమెంటులో కొంత మంది కేంద్ర మంత్రులు, స్వయానా రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రులు , కొంతమంది అధికార ప్రముఖులు కలిసి తలా కొన్ని ఫ్లాట్లు పంచుకున్నారు.   దీనిపై నియమించిన కమీషన్ తన నివేదికలో వీళ్ళు చేసిన అక్రమాలను  బట్టబయలు చేసింది.   అలాగే, జస్టిస్  శ్రీకృష్ణ కమిషన్ గతంలో భాజపా శివసేన అరాచకాలపై ఇచ్చిన నివేదికను కూడా ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు.   ఇదే శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన సమస్యపై 85 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం పాటు అన్ని ప్రాంతాలు తిరిగి ఇచ్చిన సమగ్ర నివేదికను కనీసం పార్లమెంటులో ప్రవేశ పెట్ట లేదు. అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన న్యాయ నిర్ణేతలు నిగ్గుతేల్చిన అంశాలపై కనీసం చర్చించనప్పుడు జడ్జీల సమయం ఎందుకు వృధా చేస్తారు?   నివేదికలోని అంశాలు  తమకు అనుకూలంగా  వుంటే ఒకరకంగాను లేకుంటే మరో రకంగాను  వ్యవహరించడం సమంజసమేనా? ఈ విషయంలో అధికార మరియు ప్రతిపక్షాల వైఖరి ఒకేలా వుండటం మరీ విచిత్రం.   కనీసం ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఇలాంటి నివేదికలకు  తప్పకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.