25, జనవరి 2014, శనివారం

వి ఐ పి లకు మాత్రమే పరిమితమౌతున్న తిరుమల



గత కొద్ది సంవత్సరాలుగా కలియుగ వైకుంఠమ్ అతి ముఖ్యమైన వ్యక్తుల తాకిడితో సామాన్యులకు స్వామి వారి దర్శన భాగ్యం దుర్లభమౌతోంది.  భక్తుల రద్దీని నియంత్రించడానికి  గతంలో తి తి దే అధికారి ఒకరు ఒక ప్రతిపాదన చేశారు.  దాని ప్రకారం, ఒక సారి స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు కనీసం మూడు సంవత్సరాలు గుడి ఛాయలకు కూడా రాకూడదు.   సామాన్య భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.   ఈ నియమం వెంటనే వి ఐ పి భక్తుల విషయంలో అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.  వి ఐ పి లకు కేటాయిస్తున్న విలువైన దర్శన సమయాన్ని  నిత్యం వేల సంఖ్యలో కాలి నడకన వచ్చే భక్తులకు, వృద్ధులకు  వీలైనంత త్వరగా దర్శనం కల్పించడం ద్వారా తి తి దే పాలక వర్గం స్వామి వారి కృపకు పాత్రులౌతారు.   ప్రతి నిత్యం వి ఐ పి దర్శనం ద్వారా వచ్చే భక్తుల వివరాలు, వాళ్ళను వి ఐ పి దర్శనం చేయించడానికి సిఫారస్ చేసిన వాళ్ళ వివరాలు తప్పకుండా తి తి దే వెబ్ సైట్లో పెట్టాలి. దీనితో పాటు వి ఐ పి భక్తులంటే ఎవరు, ఏ అర్హత వున్న వాళ్ళు సిఫారస్ ఉత్తరం ఇవ్వచ్చో కూడా స్పష్టంగా అంతర్జాలంలో పెట్టాలి.   ఇలా చెయ్యకపోతే, ఇంకొంత మంది దావూద్ ఇబ్రహీం అనుచరులో, ఛోటా రాజన్ శిష్యులో వి ఐ పి లుగా చెలామణి అయితే, దేవస్థానం పవిత్రత దెబ్బతినే ప్రమాదం వుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కేవలం వి ఐ పి లకు మాత్రమే పరిమితం చెయ్యొద్దని మనవి. 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి