30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాదుకా పట్టాభిషేకం


శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది -  రాముని అరణ్యవాసం , భరతుని పట్టాభిషేకం.   సీతా రాములిద్దరూ నార బట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికేగుతారు.  రాముని అరణ్య వాసం తరువాత భరతుడ్ని పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలనే కైకేయి కోరికకు భరతుడు తిరస్కరించి రాముడ్ని వెదుకుకుంటూ  అడవికి వెళ్ళి అన్నని  బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం మనకు తెలిసిందే.    తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరామ చంద్రుడు, అన్నపై అపారమైన వాత్సల్యం వున్న తమ్ముడుగా భరతుడు  మనకు ఆదర్శం.     

కానీ తమిళ రాజకీయాలలో అమ్మ కొత్త ఒరవడి సృష్టించింది.   పాపం పన్నీరు గారికి ఒక జత పాదుకలు కాదు 750 జతల పాడుకల్ని ఇచ్చింది.    నార బట్టల బదులు 1000  కంచి పట్టు చీరెలు ఇచ్చింది.   అలనాటి భరతుడికి మన పన్నీరుకు బోలెడు పోలికలు ఉన్నాయి.   శ్రీరామచంద్రుని అరణ్య వాసం ముగిసిన తక్షణమే భరతుడు అన్నకు రాజ్యాన్ని సంతోషంగా అప్పగించాడు. అమ్మ జైలు నుంచి వచ్చిన తక్షణమే పన్నీరు కూడా అదే చేస్తాడు.   రాముడు లేని అయోధ్య బోసిపోయింది.   అమ్మ లేని తమిళ్ నాడు కూడా అంతే.     దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకున్న పెద్ద సమస్య ఇదే.   కొడుకో, కూతురో, భార్యో, భర్తో వుంటే కొంతలో కొంత మేలు.    లాలు జైలుకేల్తూ వాళ్లావిడకి పట్టాభిషేకం చేసారు.    అదే ఒరిస్సా, బెంగాలు, తమిళ్ నాడులలో ఇలాంటి పరిస్తితి వస్తే  పన్నీరు లాంటి పాదుకల అవసరం పడుతుంది.    కానీ పన్నీర్ లాంటి మంచి పాదుకలు అన్నిపార్టీలలో అరుదుగా దొరుకుతారు.    ఇది అమ్మ అదృష్టం.  

శ్రీరాముడికి విప్లవ వనితకి ఒకటే తేడా - తండ్రి మాట సిరసావహించడం, నీతివంతమైన పాలన రాముడి సొంతం; కోటాను కోట్లు ప్రజా ధనం పోగేసుకోవడం అమ్మ నైజం. 


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి