26, మార్చి 2013, మంగళవారం

కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు


రాజకీయాలలో పూర్తి కాలం మిత్రులు లేదా శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ అనేక ప్రాంతీయ పక్షాలు చేస్తున్న విన్యాసాలు ఈ విషయాన్ని రుజువు చెస్తున్నాయి.    15 సంవత్సరాల నుండి నిరంతరాయంగా కేంద్రంలో అధికార పార్టీతో పాలు పంచుకున్న ద్రా ము క (dmk) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరోసారి రాదేమోనన్న సందేహంతో ఆ పార్టీకి దూరమయ్యింది.     గతంలోలాగా 18 పార్లమెంటు స్థానాలను వచ్చే ఎన్నికలలో ద్రా  ము క నిలబెట్టుకో లేకపోయినా, పరిస్తితులు కలసి వస్తే, మరోసారి భాజపా తో జతకట్టడానికి కావలసిన ప్రణాళిక ముందుగానే సిద్దం చేసుకుంది.     జయలలిత కళ్ళెర్ర చేస్తే, 14 రోజులలోనే అటల్జీ గద్దె దిగాల్సి వచ్చింది.    జయ లలితతో సంకీర్ణ రాజకీయం చేయడం చాలా కష్టం.    ఆ సంగతి భాజపాకు బాగా తెలుసు.    


తమిళ్ నాడులో ఎలాగైతే రెండు పార్టీల పాలన వుందో, ఉత్తర ప్రదేశ్లో కూడా దాదాపు అదే పరిస్తితి.    తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు మూలమైతే, ఇక్కడ భాజపా వ్యతిరేక రాజకీయాలు కొనసాగుతున్నాయి.    ఉత్తరప్రదేశ్లో ఈ పరిస్తితి కాంగ్రెస్కు లాభసాటి కానుంది.    ఇది ఇలా వుండగా, బీహార్లో నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం వుంది.    మరో పెద్ద రాష్ట్రం బెంగాల్ లో మమతతో తల గోక్కొవడానికి ఎవరు  సిద్ధపడతారో వేచి చూడాలి.    ఒరిస్సాలో స్థానికంగా బిజు జనతా దళ్కు భాజపాతో వున్న శత్రుత్వం, కాంగ్రెస్కు అవకాశం కావచ్చు.    మిగిలింది ఎన్సిపి, తెదేపా, జనతా దళ్ (సెక్యులర్), కజపా,  తెరాస, వైఎసార్సిపి పార్టీలు.    కేంద్రంలో ప్రస్తుతానికి కేవలం రెండు ప్రధాన కూటములు మాత్రమె ప్రముఖంగా వుండటం తెదేపా మనుగడకు పెద్ద ముప్పు.   అటు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేక, ఇటు భాజపాకు దగ్గర కాలేక తమ ఉనికిన్ కోల్పెయే ప్రమాదం వుంది.   తెరాస, వైఎసార్ సిపిలు కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి మద్దతునిచ్చినా ఆశ్చర్యపోనవసరం లెదు.   భాజపా కూటమి, కాంగ్రెస్ కూటమిలలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాల్సి వస్తే, వామ పక్షాలు ఖచ్చితంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తాయనడంలో సందేహం లెదు.    


సంకీర్ణ రాజకీయంలో సభ్యులను "మానేజ్" చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా భాజపాకు తెలియక పోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే మరో పెద్ద అంశం.   కేవలం 10 నెలల వ్యవధిలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలు కొత్త ఎత్తులకు పొత్తులకు వేదికకానుంది. 


అంధకారంలో ఆంధ్ర ప్రదేశ్


రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో వుందని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకోవడాన్ని బట్టి చూస్తే పరిస్తితి తీవ్రత అర్ధమవుతుంది.   ఈ సంక్షోభానికి తెరాసా,   వైయసార్ వాళ్ళేమో తెదేపాను కిరణ్ కుమార్ గారిని తప్పుపట్టడం, తెదేపా వాళ్ళేమో కిరణ్ కుమార్ గారిని వైఎస్ ను తప్పు పట్టడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతున్ది.     


కరెంటు కష్టాలకు ప్రక్రుతి సహకరించక పోవడంతోపాటు, బాబు గారి హయాంలోనూ, రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలంలోనూ సరిదిద్దలేని తప్పులు జరిగాయి.    గోదావరి బేసిన్ లో గాస్ గుజరాత్ ప్రభుత్వం తరలించుకు పోయినపుడు బాబు గారు ఎందుకు చేష్టలుడిగి కూర్చున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది .   తరువాత వచ్చిన సబ్సిడీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనను పట్టించుకోకుండా కేవలం ఉచిత విద్యుత్ పంపిణీ మీద దృష్టి పెట్టి వోట్ల రాజకీయం చేసింది .    విద్యుత్ ఛార్జీలు కనిష్టంగా కూడా పెంచకుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం వలన, ప్రస్తుత ప్రభుత్వం మీద మోయలేని భారం ఒక్క సారిగా పదుతున్నది.   


ప్రైవేటు రంగంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కోసం వచ్చే సంస్థలను మన నారాయణ గారు రానివ్వరు.  వచ్చే వాళ్ళల్లో 90 శాతం పచ్చటి పొలాలను ఏదో ఒక రకంగా కాజెయ్యాలనే దురుద్దేశంతో వచ్చే వాళ్ళే!   
విద్యుత్ కొరత, ఛార్జీల పెంపు మీద నిరంతరం పోరాడుతున్న వామ పక్షాలను మరియు ప్రతిపక్షాలను  ఎదుర్కోవడానికి కిరణ్ కుమార్ సర్కార్ ఇప్పటికిప్పుడు చెయ్యగలిగింది ఏమీ లెదు.   కనీసం భవిష్యత్ అవసారాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ టి పి సి లాంటి సంస్థలతో కలిసి వారి ఆధ్వర్యంలో పనిచేసేలా మాత్రమె ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించాలి.   బొగ్గు ఆధారిత విద్యత్ ఉత్పాదన కేంద్రాల నుంచి వచ్చే కాలుష్యం (fly ash ) వల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పొతారు.   కానీ ప్రస్తుతం వున్న కాలుష్య నియంత్రణ పరికరాల ద్వారా గరిష్టంగా  దీనిని అరికట్టవచ్చు .    అదే విధంగా బొగ్గు నుంచి వచ్చే బూడిదను నిర్జన ప్రదేశాలలో పెద్ద పెద్ద నీటి కుంటలు తవ్వి వాటిలోకి బూడిదను వదలడం ద్వారా, నాణ్యమైన బొగ్గును వినియోగించడం ద్వారా,  రోడ్ల నిర్మాణం లోనూ, సిమెంటు ఇటుకల తయారీలో, సిమెంటు పరిశ్రమలలో కూడా దీనిని ఉపయోగించి చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు.   

13, మార్చి 2013, బుధవారం

ప్రహసనంగా మారుతున్న అవిశ్వాస తీర్మానాలు


ప్రస్తుత శాసన సభలో తెరాస ప్రతిపాదింప దలచిన అవిశ్వాస తీర్మానం కేవలం ఒక రాజకీయ ప్రహసనం మాత్రమే.   మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించెయ్యాలని కోరుకునేవి రెండే  రెండు ప్రధాన ఉద్యమ పార్టీలు - తెరాస (తెలంగాణా కోసం) వై కా పా (జగన్ గారిని కాపాడడం కోసం).   కాంగ్రెస్, తెదేపాలు ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవు.   తెలంగాణా ఉద్యమం తరువాత గుడ్డిలో మెల్లలా తెదేపా తెలంగాణలో పుంజుకోవటం మొదలుపెట్టింది.     తెదేపా బలపడడం సుతరాము ఇష్టం లేని  వైకాపా,  తె రా స లు తెదేపా ను దెబ్బకొట్టే అన్ని మార్గాలను అన్వేషిస్తూ చివరకు అవిశ్వాసం మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా బాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కొంత వరకు సఫలీకృతం అయ్యాయి.    


తెలంగాణా అంశం మీద పూర్తి వ్యతిరేకతతో వున్న వైకాపాతో,  శాసన సభలో వారి మద్దతుతో ప్రత్యేక తెలంగాణా ప్రధాన అంశంగా  తెరాస అవిశ్వాసం పెట్టడం, ఇవ్వాళో రేపో కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమౌతున్న వైకాపా దానిని సమర్ధించడం చూస్తే ఇది కేవలం తెదేపాను ఇరుకున పెట్టడానికి మాత్రమే ఇరు పార్టీల ఎత్తుగడగా కనిపిస్తున్నది.    రాష్ట్ర శాసన సభకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే అధికారం లేదు.   ఈ అంశంపై పార్లమెంటులో చర్చించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు.   


తెలంగాణాపై అంత చిత్త శుద్ధి వుంటే, భాజపా, లోక్ దళ్ , ఎన్ సి పి  వైకాపా మద్దతుతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులపాలు చేయవచ్చు కదా!   కేవలం టి వి చర్చలకు మాత్రమే తెలంగాణా అంశాన్ని పరిమితం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. 


పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లు - ప్రతిపక్షాల అనైక్యత కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగా మారింది.  

12, మార్చి 2013, మంగళవారం

ఏనుగు తోక కన్నా తొండమే బెటర్


తప్పు చేసినా చెయ్యకపోయినా ఏ కన్నతల్లి కూడా తన బిడ్డ జైలులో ఉండటాన్ని జీర్ణించుకోలేదు.    ఇది డబ్బు వున్నవాళ్ళకైనా లేని వాళ్ళ విషయంలోనైన సహజం .    అందుకు విజయమ్మ గారు ఏ మాత్రం మినహాయింపు  కాదు.     


ఆవిడ నిన్న ఎకనామిక్ టైమ్స్ పత్రికకు (ఈ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ స్థానిక పత్రికలతో మాట్లాడరు)    ఇచ్చిన ముఖా ముఖిలో తన కొడుకు కాంగ్రెస్ను వీడవద్దని చెప్పినా ఆలకించ లేదు అని వాపొయారు.    కాంగ్రెస్ పార్టీ వై కా పా ను విలీనం చెయ్యమంటున్నా తాము దానికి అంగీకరించడం లేదు అని, కేవలం పొత్తుకు మాత్రం సిద్ధం అని చెప్పకనే చెప్పారు.    బహుశా  జగన్ గారికి ప్రజా రాజ్యం "విలీనం" గుర్తొచ్చి వుంటుంది.     18 శాతం ఓట్లు తెచ్చుకున్న చిరంజీవి పార్టీ ఒక కేంద్ర మంత్రి పదవితో, ముగ్గురు రాష్ట్ర మంత్రి పదవులతో విలీనం కావలసి వచ్చింది.   జైలు నుంచి ఇప్పుడప్పుడే బయటపడే మార్గం లేక  విక్కీ లీక్స్ లాంటి ఇలాంటి లీకులు కావాలనే రాజకీయ నాయకులు ఇస్తుంటారు.   వీటినే "ఫీలర్స్" అంటారు.    కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే వై సి పి అవసరం ఎంతైనా వుంది.    


చిరంజీవిలా లొంగిపొయెకన్నా  శరద్ పవార్ లాగా కాంగ్రెస్ను అంటిపెట్టుకొని  కావలసిన మంత్రి పదవి తనకు తన వాళ్ళకు తీసుకుంటూ చీటికి మాటికి బెదిరిస్తూ ఎంచక్కా కాలక్షేపం  చెయ్యవచ్చు.  అదే పవార్ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే, కుల సమీకరణాలలోనో ప్రాంతీయ సమీకరణాలలోనో లేక విదేయ/అవిధేయత వలననో మంత్రి పదవి ఇంత  కాలం దక్కి వుండేది కాదు.   అందుకే అంటారు ఏనుగు తోకగా వుండే కన్నా తొండంగా ఉండటమే గౌరవం . 

కర్ణాటక స్థానిక సంస్థలు "హస్త"గతం


ఇటీవల జరిగిన   కర్నాటక రాష్ట్ర గ్రామ పంచాయితీలు, పురపాలక సంఘాలు, జిల్లా పంచాయితీలు మరియు నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తన ఆధిక్యతను చాటింది.   


నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు నేలకొరిగినట్లు, బళ్ళారి లోని 35 కార్పోరేట్ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 26 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా, భాజపా కనీసం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పొయిన్ది.  గాలి మిత్రుడు శ్రీరాములు స్థాపించిన బి ఎస్ ఆర్ పార్టీ (దీని గుర్తు కూడా సీలింగు ఫానే) కూడా బళ్లారిలో మట్టి కరిచింది .   కనీసం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లి-ధార్వాడ్ కార్పోరేషన్లో కూడా భాజపా పూర్తి ఆధిక్యం సాధించలెకపొయిన్ది.    మోడీ గారిని ప్రధానిగా చేయడానికి భాజపాకు కర్నాటక చాలా కీలకం.   అలాంటి కీలక రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలు మితిమీరిన అవినీతి వల్ల భాజపా పరువు పొగొట్టుకుంది. 


యడియూరప్ప కొత్తగా పెట్టిన పార్టీ కర్నాటక జనతా పక్ష తను సొంతంగా అనుకూల ఫలితాలు సాధించలేక పోయినా  భాజపా వోట్లను గణనీయంగా చీల్చడంద్వారా భాజపాను మాత్రం చావుదెబ్బకొట్టి దాదాపు 3వ స్థానానికి నెట్టివేసి ఆ పార్టీకి తన అవసరం ఎంత వుందో తెలియపరచాడు.    కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాలకు మాత్రమె పరిమితమైన జనతాదళ్ కూడా ఈ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకొని తన ఉనికిని చాటుకుంది. 


కేవలం 3 నెలలోపు జరగనున్న రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో ఇదే తరహా  ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి.   

మో'ఢీ' మన దేశ ప్రధాని పదవికి అర్హుడా!


ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్నది సంకీర్ణాల యుగం.  రాబోయే కాలంలో కూడా అదే కొనసాగబోతోంది.    పుట్టగొడుగుల లాగా పుట్టుకొస్తున్న ప్రాంతీయ పార్టీలు దేశంలో  100 దాకా వున్నాయి.  ప్రాంతీయ పార్టీల ప్రధమ ప్రాధాన్యం తమ ప్రాంతం గురించో, రాష్ట్రం గురించో వుంటుంది.    ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా కనీసం డజను ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా కష్ట సాధ్యం.   


ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులను, బెదిరింపులను ఎదురుకుంటూ ఎంతో సమన్వయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది.       భాజపా చెప్తున్నట్లు మోడీ గారు మన ప్రధాని అయితే దేశాన్ని గుజరాత్ లాగా చేస్తాడు అని.     గుజరాత్ లాగా అంటే ఏ విషయంలో?     ఈ మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే ఫలితాలలో గుజరాత్ దేశంలో ఎన్నో స్థానంలో వుంది?    జి డి పి లో బీహార్, ఎం పి, మహారాష్ట్ర తరువాతి స్థానం గుజరాత్ కు దక్కిన్ది.   అలాగే గ్రామీణ ప్రాంత ఉపాధి కల్పనలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఎం పి, కర్ణాటకల తరువాతి స్థానం గుజరాత్  ది.   వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో మాత్రం రెండవ స్థానంలో వుంది.   


గుజరాతీయులు వస్తుతహా వ్యాపార నైపుణ్యం కలవారు.    ఈ విషయం, బొంబాయిలో వున్న గుజరాతీయులు ఆ తరువాత గుజరాత్లో వున్న స్థానిక వ్యాపారులు దీనిని రుజువు చేశారు.    అక్కడ అభివృద్ధి కూడా కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం.      ఇప్పటి వరకు మన ప్రధానులుగా చేసిన వారు అత్యంత విద్యావంతులు, మచ్చ లేని వారు, అన్ని మతాలను కలుపుకొని పోయే విశాల దృక్పధం కల వారు.     మన పొరుగు దేశాలతో అంతగా సఖ్యత లేని ప్రస్తుత పరిస్తితులలో మోడీ లాంటి వ్యక్తి ఈ సువిశాల భారత దేశానికి సమర్ధుడైన నాయకుడు కాగలుగుతాడా, అసలు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతారా కాలమే నిర్ణయిస్తుంది.