27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అధిష్టానాన్ని ధిక్కరించిన రాహుల్ గాంధీని సస్పెండ్ చేస్తారా!


శిక్ష పడిన ప్రజా ప్రతినిధులను అనర్హత వేటు నుంచి రక్షించే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ "నాన్సెన్స్" అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.   అధిష్టానం కొన్ని శిలా శాసనాలను ప్రజల మీద పడేస్తుంది, వాటిని స్వీకరించాల్సిందే.   వాటికి వ్యతిరేకంగా మాట్లాడే ఎంతటి వారినైనా అధిష్టానం ఉపెక్షించదు.   కావాలంటే, పాల్వాయి గోవర్ధన రెడ్డి గారిని అడగండి.   ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి.   అవసరమొస్తే, అధిష్టాన నిర్ణయాన్ని అమలు పరచే ప్రక్రియలో భాగంగా, సొంత ప్రభుత్వాన్నైనా కూల్చి వేయమనే ఉదార స్వభావం  ఆయనది ఆయన పార్టీ పెద్దలది.        


ఈ ఉదాహరణ ప్రకారం, ఎంత గొప్పవాడైనా అధిష్టాన్నాన్ని ధిక్కరిస్తే, క్రమశిక్షణ చర్యలు తప్పవు.   రాహుల్ గాంధీ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు.   ఆప్షన్స్ వుండవు.    త్వరలో వీళ్ళిద్దరినీ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని బహిష్కరణ వేటు వేసి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం వుంది అని నిరూపిస్తారని ఆశిద్దాం. 

26, సెప్టెంబర్ 2013, గురువారం

అరిచే డిగ్గీ కరవడు


ఏదో ఒక విమానాశ్రయంలో డిగ్గీ విలేకరులను పలకరిస్తుంటాడు.  మాట్లాడిన ప్రతి సారి బిల్లు రెడి, విభజన ఖాయం భౌ భౌ అని చెప్పి వెళ్లి పోతాడు.  

ఒక పక్క చంద్ర బాబును భాజపా ప్రసన్నం చేసుకోగా జగన్ బాబును  కాంగ్రెస్ దువ్వేసింది.   వీళ్ళిద్దరూ పచ్చి సమైక్య వాదులు.   చంద్ర బాబు కన్నా, జగన్కె హైదరాబాదు లో ఆస్తులు ఎక్కువ వున్నాయి.   అలాంటి జగన్ హైదరాబాదు ను వదులుకొని తెలంగాణా ఇచ్చెయ్యండి, నేను మీకే మద్దతు ఇస్తా అని అనడు.   పార్లమెంటులో 18 శాతం ఎంపీ సీట్లు దక్షిణ భారత దేశంలో వున్నాయి.    దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీలు మొట్ట మొదటి నుండి ఇక్కడే వున్నాయి.   అలాంటి పరిస్తితులలో తెలంగాణా ఎక్కడి నుండి ఇస్తారు. 

భాజపా మద్దతు లేకుండా బిల్లు ప్రవేశ పెట్ట లేరు.   ఇప్పటికే, భాజపా నేతలు తెలంగాణా పై సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు.   ముందు సీమంద్రుల ఉద్యమ వివరాలు వాళ్ళ కోర్కెలు కనుక్కోండి ఆ తరువాత బిల్లు పెట్టండి.   మేము చూడు 3 రాష్ట్రాలు కిషన్ రెడ్డి చెప్పినట్లు 30 నిమిషాలలో ఇచ్చాము (వేరుపడిన రాష్ట్రం రాజధాని కోరలేదన్న సంగతి వీళ్ళు అడగరు - వాళ్ళు చెప్పరు) ఎంత ప్రశాంతంగా వుందో!  మీరు అలాంటి ప్రతిపాదనతోనే సావకాశంగా చర్చించి బిల్లు పెట్టండి, మేము ఇంకా ఇక్కడ బతికి వున్నది కేవలం తెలంగాణా రాష్ట్రాన్ని విడగొట్టదానికే అని సెలవిస్తారు.   అసలు కాంగ్రెస్ కు కావలసింది కూడా అదే.   ఇచ్చి నట్లు వుండాలి కాని ఇవ్వకూడదు.   

చివరకు మింగలేక కక్కలేక అవస్త పడేది కేవలం కె సి ఆర్ మాత్రమె.   సొంతంగా పోటీ చేస్తే మహా అయితే ఒక 20 మంది ఎం ఎల్ ఎ లు ఇద్దరు ఎం పీ లు గెలుస్తారు.  కొంత కాలానికి విసుగొచ్చి కాంగ్రెస్లో కలుస్తారు.  సీమ లో జగన్ తీర ప్రాంతంలో బాబు గెలుస్తారు.   బాబు గారు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అవడం ఖాయం.   సీమాంధ్ర ప్రజలకు కూడా ఈ రెండు పార్టీలు తప్ప వేరే దిక్కు లేదు.   .    

తెలంగాణలో ఎలా అయితే సమైక్య వాదులున్నారో, కోస్తా ప్రాంతంలో కూడా కొంత మంది ప్రత్యెక రాష్ట్ర వాదులున్నారు. అసలు కె సి ఆర్ కు తెలంగాణా రావడం ఇష్టం ఉన్నట్లయితే, తనే వ్యక్తీగతంగా ఇరు ప్రాంతాలలో మేధావులను కూడగట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అవలంబించేవారు.   అప్పటికే రాష్ట్రం వచ్చినట్లు, తనే కాబోయే ముఖ్యమంత్రిగా ఊహించుకొని కొద్దిమంది ఐ ఎ ఎస్ లతో సమీక్షలు కూడా చేసారు.   ఆ తరువాత, నో ఆప్షన్స్, కర్రీ పాయంట్ (ఈయనకు వాస్తవానికి తెలంగాణలో వర్రీ పాయంట్) బస్సుల మీద దాడులు, యూనివర్సిటీ అని పిలవబడే ఒక సత్రం లోని చిన్న పిల్లల చేత "తంతం" అని చెప్పించడం, బుల్లబ్బాయి లాంటి హుందా లేని అసభ్యకర వ్యాఖ్యలతో చప్పట్లు కొట్టించుకోవడం వగైరా వగైరా చిలిపి చేష్టలన్నీ ఆయన రాష్ట్ర విభజన అయిష్టతను చాటుతున్నాయి.   

అందుకే, జనం ఎక్కడ తెలంగానా విషయం మర్చిపొతారొ అని మధ్య మధ్యలో మధ్య ప్రదేశ్ తీసేసిన తాసీల్దారు భౌ భౌ అంటుంటారు.  అంతా సక్రమంగా వుంటే ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు.   ఎవరి బాధ వాళ్ళది.

23, సెప్టెంబర్ 2013, సోమవారం

వేడి పుట్టించని 'చల్ల' వివాదం


బడికి పోక ముందు కాకర కాయలు అని పలికే పిల్లాడు ఉద్యమ బడిలోకి వెళ్ళాక కీకర కాయలు అన్నాడట!  

మనం చల్ల అనే పదాన్ని ఆంద్రోళ్ళు మజ్జిగ అంటారు, మజ్జిగ అనే పదం మజ్జి అనే తమిళ పదం నుంచి వచ్చింది అని శెలవిచ్చారు కె సి ఆర్ గారు.   ఆయనకు తెలుగు భాష మీద, సాహిత్యం మీద నిస్సందేహంగా పట్టు వుంది. అందునా సిద్ధిపేట, పటాన్ చేరు ప్రాంతాలు పద్య కవులకు పుట్టినల్లు.   మల్లినాధ సూరి ఒకప్పుడు పటాన్ చేరు వాసి.   ఇప్పటికీ సిద్దిపేటలో చందోబద్దంగా రాయగల పద్య కవులు పదుల సంఖ్యలో వున్నారు.    కానీ, ఈ విషయంలో కె సి ఆర్ గారు తప్పులో కాలేసారు.   చల్ల అనే పదం కోస్తా ప్రాంతంలో విరివిగా వాడతారు.    తమిళంలో మోర్ అంటే మజ్జిగ.   కన్నడంలో మజ్జిగె అన్నా అదే అర్ధం.    ఇవన్నీ పర్యాయ పదాలు.   తెలుగు భాషలో ఒక పదానికి కనీసం 5-6 పర్యాయ పదాలు వున్నాయి.   చల్ల కొచ్చి ముంత దాయడం అనే సామెత ఏంతో  ప్రాచుర్యంలో వుంది.    

మేము ఆంద్రోల్ల లాగా 'గేదె' అనం, బఱ్ఱె అంటాం అని ఇంకొకరు సెలవిచ్చారు. బఱ్ఱె, బఱ్ఱె గొడ్లు అనే పదం తీర సీమాంధ్ర ప్రాంతంలో వాడే తెలుగు పదం.   యాసల పేరుతో ప్రజలను విడదీయడం వలన తెలుగు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది.     తీర సీమ ప్రాంతంలో కొన్ని వర్గాలు ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకం కాదు, కానీ కె సి ఆర్ కు వ్యతిరేకం.   ప్రస్తుత తెలంగాణా సమాజానికి కె సి ఆర్ తో పని లేదు.   ఆయన వలన లాభం కన్నా నష్టం ఎక్కువ.   

ఇక సినిమాల విషయాని కొస్తే, రాయలసీమ ఫాక్షనిజాన్ని, తెలంగాణా యాసను  విలన్లకు, గోదావరి యాసను కమేడియన్లకు, శ్రీకాకుళం యాస నౌకర్లకు మాత్రమే పెట్టారు అని విమర్శ. గతంలో వచ్చిన సినిమాలలో ఏంతో మంది విలన్లకు  కృష్ణా, గోదావరి యాసలో డైలాగులు చెప్పించారు.   అప్పట్లో రాజనాల విలన్గా తీర ప్రాంత మాండలికంలో మాట్లాడగా, రమణా  రెడ్డి నెల్లూరు యాసలో డైలాగులు చెప్పేవారు. సినిమా నిర్మాణం కేవలం వ్యాపారం.   బ్రాహ్మణులను ఎగతాళి చేసే సీన్స్ సినిమాలో పెట్టి, ఆ కులం వాళ్ళందరినీ పిరికి పందలుగా చూపించే ప్రయత్నం ఎన్నో సినిమాలలో జరిగింది.   కానీ ఆ సినిమాలన్నీ నిర్మాతలకు కాసుల పంట పండించింది.    నిర్మాతకు కావాలసింది డబ్బు.   అది తెలంగాణాకు చెందిన దిల్ రాజైనా, కోస్తాకు చెందినా రెడ్డి గారైనా.    

మనస్ఫూర్తిగా విడిపోవాలన్న ఉద్దేశం కె సి ఆర్ లో వుంటే, ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావు.  అమాయక ప్రజలను కొంచం సేపు ఆకట్టుకోవడాని కే సి ఆర్ గారు చేసే తాత్కాలిక ప్రయత్నాలు చెయ్యాల్సిన తరుణం కాదు ఇది.     

19, సెప్టెంబర్ 2013, గురువారం

సమైక్యాంధ్ర పై కవిత

-  రచన శ్రీ ఆదూరి శ్రీనివాస రావు 

కలిసిమెలిసి తిరుగుదాం-కలిసిమెలిసి పెరుగుదాం

కలిసిమెలిసికలిమిచెలిమిబలము గుణముపెంచుదాం

ఆంధ్రమాత బిడ్డలము-అన్నదమ్ములం మనం 

అందరమూ ఏకమై -అభివృధ్ధిని చూపుదాం

విడిపోతున్నామన్న,-విరివిగ వర్షాలుపడున!

తెలంగాణవేరైతే -తెలువులు రెట్టింపు అగునా!

రాజకీయరాబందులు ముక్కలు ముక్కలుచేస్తే

కుక్కలు చింపిన విస్తరై-కూడుకూడమట్టిపాలు

వీధివీధినిరసనలు-విభజనపు గుసగుసలు

రాళ్ళురువ్వుకోటాలూ పోలీసులతూటాలూ

హాస్పెటళ్ళమూసివేత -ప్రాణాలతీసివేత,

ఎన్నాళ్ళీకొట్లాటలు-ఎన్నెళ్ళీపోట్లాటలు,

ఆంధ్రజనుల సమస్యలు -ఆంటోనీకేమితెల్సు?'

తీర్పుచెప్పటందుకు -దిగ్విజయాసింగు ఎవరు?

మనమంతాకలసిపోయి-మనసు విప్పి మాట్లాడుదాం

స్వార్ధమున్న సిమ్హాలను -కలిసికట్టుగ వేటాడుదాం,

విడిపోవుటమొదలైతే -విధి కొక్క రాష్ట్రమాయె!

నదులన్నీ విభజిస్తే సెలఏళ్ళుగమారిపోయె!

కలహాలూ  పెంచుకుంటె -కాపురాలు తుంచుకుంటె

సాధించేదేమిటన్న సౌభాగ్యం ఎక్కడన్న

కలసిమెలసి తిరుగుదాం-కలసిమెలసి పెరుగుదాం

కలిసిమెలసి కలిమిచెలిమి బలము గుణము పెంచుదాం.


18, సెప్టెంబర్ 2013, బుధవారం

-: సమైక్య ఆంధ్ర కవితాగోష్టి--వచనకవిత.

రచన - శ్రీమతి ఆదూరి హైమవతి, బెంగళూరు 
కలసి మెలసుంటే - కలదెంతొ సుఖము
 అలకాపురంబులో  -   అలమేలుసంతూ
          కలహంబులేలేక  -  కలసిమెలసుండ్రి.
 పిల్లలూఎదిగారు  -   పెళ్ళిళ్ళు జరిగాయి,
తోడికోడండ్రొచ్చి    -   తంపులూపెట్ట,
                        స్వార్ధపరులూచేరి విషము చిలికించ
                         పండంటికాపురం ఎండిపోసాగె
              లుకలుకలురేగాయి  –   మనసులూవిరిగాయి,
                పలకరింపులుమారె ! -  ప్రేమ అడుగంటే .
     ఆధిపత్యముకొరకు –ఆరాటములు పెరగ,
    మదిలోనియోచనలొ-మార్పులూ వచ్చె
                అన్నదమ్ములమధ్య   - అలకలూ పెరిగే
              ‘ ఉమ్మడీ ’కాపురం-‘ నెమ్మదీ ’ కోల్పోయె.
 ముఖములూ మాడ్చుకుని  -  ‘మగువ ‘ లుండంగ,
  మీసములు మెలిపెడ్తు  -  ‘మగలు’ మెలగంగ,
                                 ‘ఎందుకీ మటమటలు  -  మౌనవ్రతాలు!
                                    కలిసుండలేమని  -   విడిపోవదలచిరి.
 ‘  మా మధ్య  బేధాలు  - మరి ఆగవండీ!
  చెరి సగము పంచుకుని  -  చక్కపోతా ’ మని
                      ఊరి పెద్దల గలిసి  -  విడమర్చిచెప్ప,
                        పెద్దన్న వద్దన్న-  వీధికెక్కాడు.
         పెద్దలందరు చేరి -   సుద్దులూ జెప్ప,
           ‘ రాజీకి ‘రామనీ  ,-  రచ్చ కెక్కారు .
                               ‘  పెదకాపు బాబయ్య !-  కుదరదూ మాకు,
                                           విడగొట్టి  భాగాలు -   పంచి పెట్టయ్యా! ‘
                               ‘ నేనెరుగ విషయాలు  -   మునసబూ నడుగు 
      ‘ మనసులూ తెల్సిన -  మునసబూమామా!
         మారుమాటాడక    -  మార్గంబు చెప్పు’-
        ‘ నాకేమితెలుసోయి  -  కరణాన్నికలువు
                                ‘ కరి ’ నైన కట్టేయు  -  కరణమూ బావా!
                                   కలిసుండలేమింక  -  విడగొట్టు మమ్ము’.
          ‘నాకేమితెలుసోయి! -  ప్రెసిడెంటునడుగు
        ‘నకలు’ తీసే వాడు -  కధలు నడిపేవాడు.
                          అతడైతె  మీకన్ని  చక్కజేస్తాడు.’-
                                        ‘ పెద్దతగవులు తీర్చు -  ప్రెసిడెంటు అన్నా!
                                           పెరిగాము ఒక ఇంట  -   కుదరదిక మీద
          హద్దులూ గీయండి  -  లెక్కలూ తేల్చండి,
          బుధ్ధులూ చెప్పంగ  -  పూనుకోవలదు.
                                     ‘ నాకేమితెలుసదీ  పంతులూ  నడుగు.’
                          ‘     పురహితము కోరేటి -  పంతులూ గారూ!
                          పుణ్యముండును మీకు  -  స్వరము విప్పండి.
         మీవల్లకాదంటే  -  ముందుగా చెప్పండి !
        న్యాయస్థానములోన  -  వ్యాజ్యమేస్తాము .
                                        ‘ చాలకాలముగాను  -   మేలైనరీతిలో
                                         కలకలా లాడేటి  -   గృహము మీదయ్యా!
        కోర్టుకెక్కగ నేల!   -   కొల్లబోనేల?
         కలిసుండి కలిమంత -  అనుభవించండి!,   
                               పులివాతబడినట్టి  -  ఎద్దులా కధను,
                                రొట్టె కోల్పోయిన  -  పిల్లులా కతనూ
        వినలేద!కనలేద!,  -  బుధ్ధియే లేదా?
         నోరుమూసుకుపొండి -  విడగొట్టలేను,
                         కలిసి ఉంటేమీకు  -   కలుగునూ సుఖమూ
                          ఉమ్మడీకాపురం   -   ఊరటిస్తుంది,
     ఖర్చులు తగ్గేను  -  మిగులు పెరిగేను,
     కట్టెల మూటవలె -   బలముపెరిగేను.
                           మంచితల కెక్కక  - మతిచెడినవారు
                           కత్తులూదూశారు -  కుత్తుకలు కోశారు,
  గుంపులూకట్టారు-గునపాలు తీశారు  ,
   రక్తపుటేరులూ ! - రణరంగమాయె !!
                      ఊరంత చేరించి  -  ఊరడించింది,
                     సుద్దులూచెప్పింది  -  హద్దు లొద్దంది,
      అన్నదమ్ములు లేచి  -   ఆలోచనలుచేసి,
       చేతులూకలిపారు -   చకచకానడిచారు.
మధ్యవారొచ్చి  -  మాయమాటలు చెప్ప
మరుగునా పడిపోయె  - మనతెలివి  అంత ,
                 చెప్పుడూమాటలూ -- చేకూర్చు చేటని
                     చివరకూ తెలిశారు --  చక్కబడ్డారు.
       ఐకమత్యము తోనె  - ‘ ఐవోజు ‘ పెరుగనీ
       తెల్సుకుని -  కల్సుకుని  - కదలిపోయారు.-
ఆంధ్రప్రదేష్ -అంధప్రదేష్  కాకుండా ,  కలివిడికాపురం కలకాలం చేసి ,   భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం  అసువులుబాసిన  అమరజీవి ఆత్మకు  ప్రశాంతి  కలకాలం  నిలపాలని  కోరుతూ,
ఆంధ్రప్రదేష్ లో పుట్టిపెరిగిన --                 ఆదూరి.హైమవతి.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి


గత దశాబ్ద కాలంగా తెలంగాణా ప్రాంతం నుంచి వినిపిస్తున్న డిమాండ్ - హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని.     ఈ విషయంలో, తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో బలంగా వున్న భాజపా అందరికంటే కొంచెం ఎక్కువగా తన వాణిని వినిపిస్తున్నది.   దీనికి ప్రధాన కారణం - భాజపా లెక్క ప్రకారం నిజాం రాష్ట్ర విమోచన ముస్లింలపై హిందువుల ఆధిపత్యానికి ప్రతీకగా మలుచుకోవాలనే దుర్బుద్ధి తప్ప మరేమీ కాదు. 


బ్రిటీష్ వాడు మనల్ని విడిచి పెట్టి పోతూ, విభజించి పాలించు అనే సూత్రాన్ని కూడా మనకు అప్పగించాడు.   భారత్ కు స్వతంత్రాన్ని ప్రకటించి, భారత్లో వున్న 500 పైగా సంస్థానాలు భారత్ లో భాగంగా ఉండాలా లేక స్వతంత్రంగా ఉండాలా అనేది వారి ఇష్టం అని మెలిక పెట్టారు.   ఒక్క కాశ్మీర్ రాజు, నిజాం నవాబు మినహా  మిగిలిన స్వతంత్ర సంస్థానాలు అన్నీ భారత్ లో కలవడానికి ఇష్టపడ్డాయి.   


వాస్తవానికి, ఖాసిం రిజ్వీ నాయకత్వంలో స్థానికంగా వున్న  దేశ్ముఖ్లు, దొరలు సాగించిన దోపిడీలు, హత్యలు, అత్యాచారాల పై తెలంగాణా విముక్తి పేరిట పోరాటాలు చేసింది కమ్యునిష్టులు.  పోరాటం తుది దశకు చేరుకుంటున్న సమయంలో, ఉక్కు మనిషి పటేల్  పోలీస్ చర్య తీసుకొని నిజాం కబంధ హస్తాల నుంచి ప్రజలను పూర్తి విముక్తం కావించాడు.   మిగిలిన ప్రాంతాలలోని తెలుగు వాళ్ళు బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు, నిజాం రాష్ట్రంలోని తెలుగు వారు నిజాం పై పోరాడారు.    కానీ, చరిత్ర పాఠ్య పుస్తకాలలో తగినంత ప్రాధాన్యం కల్పించక పోవడానికి వోటు బాంక్ రాజకీయాలే కారణం. 


అదే సమయంలో ఫ్రెంచ్ వారి పాలనలో వున్న యానాం ను అనధికారికంగా విముక్తం చేయడానికి పధకం రచించింది అప్పటి ఆంద్ర రాష్ట్ర మంత్రి, టంగుటూరి వారి శిష్యుడు తెన్నేటి విశ్వనాధం గారు (ఆయన ఆత్మ కధలో రాసుకున్నారు).   ప్రపంచ దేశాల నుంచి  ఒత్తిడి వస్తుందని నెహ్రు వారించినా, అక్కడి స్థానిక తెలుగు వాళ్ళను ప్రోత్సహించి మరీ ఫ్రెంచ్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది.   చివరకు 1954 నుంచి దశలవారీగా  ఫ్రెంచ్ పాలన నుంచి యానాం విముక్తి ప్రారంభమైంది.   


ఈ రెండు ప్రాంతాల విముక్తికి  ఒకటే తేడా - ఖాసిం రిజ్వీ మిలిటరీ హెడ్ గా నిజాం పాలకులు ప్రజలపై అరాచకత్వానికి పూనుకున్నాడు.   కానీ ఫ్రెంచ్ వారు అలా చెయ్యలేదు.   


ఈ నేపధ్యంలో,  నిజాం  విమోచనా ఉద్యమాన్ని అధికారికంగా జరిపితే తప్పేంటి?    హైదరాబాద్ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా పాటించడానికి కాంగ్రెస్ పార్టీకి, తెదేపాకు, కొంతవరకు తెరాసాకు అభ్యంతరం ఉండవచ్చు.   కారణం ముస్లింల వోట్లు ఎక్కడ పోతాయోనని.   భాజపా కు ముస్లిం సమూహం వంద శాతం దూరం కాబట్టి, వారు అందరికన్నా ఎక్కువగా అరుస్తూ, సంబురాలు చెయ్యాల్సిందే అంటారు.    కానీ, నిజాం పాలన విముక్తిలో ముఖ్య పాత్ర పోషించిన కమ్యునిష్టులను పట్టించుకొనే నాధుడు లేడు.  

  

16, సెప్టెంబర్ 2013, సోమవారం

సి పి బ్రౌన్ సేవా సమితి ఆధ్వర్యంలో బెంగళూరులో సమైక్యాంద్రపై కవితా గోష్ఠి


పరిశ్రమల మంత్రి గారు కళ్ళు తెరవండి


ఎద్దు పుండు కాకికి ముద్దు  అనే సామెత ఆంద్ర ప్రదేశ్ లోని పరిస్థితులకు అద్దం పడుతోంది.  ఒక పక్క ఉన్నత విద్యావంతుడు, అమెరికాకు పొట్టకూటికోసం వలస వెళ్ళిన మన పొన్నాల లక్ష్మయ్య గారు ఉద్యమాల కాలంలో ఐ టి రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని చెప్తుండగా, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.    ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చిన పరిశ్రమల ప్రతినిధి ఇంటర్వ్యు చదవండి --- 


15, సెప్టెంబర్ 2013, ఆదివారం

భావ ప్రకటనా స్వేచ్చ అంటే కిషన్ రెడ్డి గారికి ఎంత ప్రేమో

భాజపా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ మధ్య ఒక విచిత్రమైన కల వచ్చింది(బహుశా ఆ కల పగటి పూట వచ్చి ఉండచ్చు).   ఆ కలయొక్క సారాంశం, ఇరు ప్రాంతాలలో భాజపా అత్యధిక పార్లమెంటు స్థానాలు, శాసన సభా స్థానాలు గెలిచినట్లు!      ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సొంత గ్రామంలో తన పార్టీ బలపరచిన అభ్యర్ధిని గెలిపించుకోలేని ఈయన గారు చెప్పే మాటలు వింటుంటే  ఒక సామెత గుర్తొస్తోంది -  ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే ఇదే మరి.    భాజపా శాసన సభ్యులందరూ (అప్పటికి ఉన్నది ఇద్దరే) రాజీనామా చేసి తెలంగాణా నినాదం మీద మళ్ళీ గెలుస్తామని బీరాలు పలికి తను మాత్రం అంబర్ పేట్ నుంచి మళ్ళీ గెలవలేమేమో అన్న సందేహంతో, తోక ముడిచిన ధీశాలి కిషన్ రెడ్డి గారు! 


ఆంద్ర ప్రదేశ్ లో కనీసం వోటు హక్కు కూడా లేని ప్రాస కోసం ఏడ్చే ఆంధ్రోడు  వెంకయ్య గారి శిష్యుడికి సడన్గా భావ ప్రకటన స్వేచ్చ గుర్తొచ్చింది. బాబూ కిషన్ రెడ్డీ - మీరు చెప్పే భావ ప్రకటన స్వేచ్చ కేవలం తీర సీమాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్తిస్తుందా ?  తెలంగాణాలోని లక్షలాది విశాలాంధ్ర వాదుల నోరు నొక్కినప్పుడు మీరు వల్లించే ఈ భావ ప్రకటనా స్వేచ్చ ఎక్కడికి పోయింది. అందరికీ సమాన హక్కులుండే రాష్ట్ర రాజధానిలో కనీసం విలేకరుల సమావేశం పెట్టుకొనే స్వేచ్ఛ వేరే ప్రాంతాల వారికి లేదా?  పత్రికా విలేకరుల ముసుగులో గుండాలు చేసిన దాడులు మీరు ఖండించనప్పుడు, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి గురివింద నీతులు చెప్పే నైతికత తమకేక్కడనుంచి వచ్చిందో సెలవిస్తారా?


ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల వారిగా ఏ పార్టీ అయినా చీలిపోతే మొదటి వరుసలో వచ్చేది భాజపా అనే నగ్న సత్యాన్ని వచ్చే సార్వత్రికలలోపు మీరు వెండి తెరపై చూడవచ్చు.   రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి కావలసిన సీట్లు దండుకొనే ఉద్దేశంతో తెలంగాణాను ప్రకటించిందని మీరు కాంగ్రెస్ ను తిట్టారు. అంటే తెలంగాణా వేర్పడితే కాంగ్రెస్కు లాభం కానీ మీకేమీ ఉపయోగం లేదన్న తత్త్వం  ఈ పాటికి మీకు బోధ పడే వుంటుంది.   ఈ దిశగానే మోడీ గారు తెదేపాతో జట్టుకట్టబోతున్నరానీ రాష్రం కోడై కూస్తున్నది.  భాజపా ఒక జాతీయ పార్టీ.  పొత్తులు ఎత్తులు అన్నీ కేంద్ర స్థాయిలో ఉంటాయే గాని మీ మాటకు కట్టుబడి కేంద్రంలో పీఠం వదులుకోరు.   సొంత గ్రామ పంచాయతీ కూడా మీరు  గెలుచుకోలేదు, మీ మాట మేమెందుకు వినాలి అనవచ్చు.  ఒక వేళ మీరు కాదు కూడదు అని మొండికేస్తే, మీకు అద్వానీ గారి అడ్రసు ఇస్తారు.   ఇక కోస్తా ప్రాంతంలో మీ పార్టీలో ఎదురు చెప్పే ప్రసక్తే లేదు, కారణం - అక్కడ జిల్లా అధ్యక్షులుగా చెప్పుకొనే ఉత్సవ విగ్రహాలలో ఎక్కువ మంది   మీ వెంకయ్య గారి సామాజిక వర్గానికి చెందిన వారే.   తెదేపాతో కలవడం వల్ల వారికి కొంత బృతి దొరికే అవకాశం  వుంది. కాబట్టి వారు వ్యతిరేకించరు. 


రాబోయే రోజులలో ఇదే నిజమైతే, మీరు మీ పార్టీకి రాజీనామా చేస్తారని, వాక్ స్వాతంత్ర్యమే ధ్యేయంగా (అన్ని ప్రాంతాలలో) పని చేస్తారని ఆశిస్తున్నాం.      

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

పోలీసు శాఖలో యూనియన్ను ప్రోత్సహిస్తున్న నేతలు


శని వారం జరిగిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఒక కానిస్టేబుల్ జై తెలంగాణా నినాదాలు చేసి తెరాస వారిచే కీర్తింపబడినాడు .   ఆయనకు ధనయోగం, నాయకుల దర్శనం, యూ ట్యూబ్ చిత్రాలు, కీర్తి ఖండూతి దక్కాయి. రాబోయే తెలంగాణలో ఆయనకు డబల్ ప్రమోషన్ ఇచ్చ్చినా ఆశ్చర్యం లేదు.    ఈ కానిస్టేబుల్ ఒకప్పుడు ఎం ఎల్ ఎ గారి అంగ రక్షకుడిగా కూడా పనిచేశారు.   ఇలాంటి మనస్తత్వం వున్న వ్యక్తి ఉన్మాదిగా మారే ప్రమాదం వుంది. నినాదాలు చేసినంత మాత్రాన ఆయనను ఆకాశానికి ఎత్తడం చూస్తే, కొంత మంది ఉన్మాదులు పెట్రేగే అవకాశం వుంది.      


యూనిఫాం సేవలలో వుండేవారు ముఖ్యంగా తెలంగాణా వారంతా కలిసికట్టుగా ఆంధ్రోళ్ళ దౌర్జన్యాలను అడ్డుకోవాలని మన బాగు కోసం చట్టాలు చెయ్యాల్సిన పార్లమెంటు సభ్యుడు సెలవిచ్చాడు.   ఇలాంటి అడ్డు అదుపు లేని మాటలతో రెచ్చగొడితే, పాపం అమాయకులైన యువత పక్కదారులు పడుతున్నారు.  ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులను ప్రోత్సహిస్తే, రాబోయే రోజులలో హింస-ప్రతి హింసలకు దారితీసి ఇది జాతుల మధ్య వైరంగా పరిణమించే ప్రమాదం వుంది.   ఉద్యమం ముసుగులో అరాచకాన్ని ప్రోత్సహించి వోట్లు దండుకొనే నాయకుల కుట్రలు సగటు ప్రజానీకం ఇప్పటికైనా పసిగట్ట కలరని ఆశిద్దాం.