20, జూన్ 2013, గురువారం

దీని భావమేమి తిరుమలేశా!


మన భాషలో వున్న చమత్కారం, తెలుగు వాళ్ళలో వున్న చతురత, భాషపై అన్ని వర్గాల ప్రజలకు వున్న అభిమానం, పట్టు ఇలాంటి పద్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.   


బావ, మరదలిని తమలపాకులలోకి సున్నం కావాలని, ఒక బావ, తన మరదలితో ఎంత చమత్కారంగా అడుగుతున్నాడో చూడండి.    


పర్వత శ్రేష్ఠ  పుత్రికా పతి విరోధి 
యన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి 
పేర్మిమీరిన ముద్దలా పెద్ద బిడ్డ!
సున్నమించుక తే(గదే సుందరాంగి!


పర్వత శ్రేష్ఠ  పుత్రిక = పర్వత శ్రేష్టుడు అంటే హిమవన్తుదు.   ఆయన పుత్రిక పార్వతీ దేవి.   ఆమె భర్త శివుడు, ఆయనకు విరోధి మన్మధుడు - ఆయన అన్న బ్రహ్మ దేవుడు - బ్రహ్మ దేవుని భార్య సరస్వతి - సరస్వతీ దేవి అత్త గారు లక్ష్మీ దేవి - ఆమె తండ్రి సముద్రుడు = సముద్రిని పెద్ద కూతురు పెద్దమ్మ ( నీకేమైనా దరిద్ర  పెద్దమ్మ నెత్తినెక్కిన్దా అని పెద్ద వాళ్ళు అంటారు కదా, ఆమె ఈ పెద్దమ్మ)  - స్థూలంగా ఈ పద్యం అర్ధ్యం ఏంటంటే, ఓసి పెద్దమ్మా సున్నం తీసుకురా అని చమత్కారం. 


ఆయన మరదలు కూడా బావ గారికి చమత్కార పద్యంతో పాటు సున్నం కూడా ఇచ్చింది. 

శతపత్రంబుల మిత్రుని 
సుతు(జంపిన వాని బావ సూనుని మామన్ 
సతతము( దాల్చెడు నాతని 
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో !

శతపత్రాలు అంటే తామరాకులు ; వాటికి మిత్రుడు సూర్యుడు; 
సూర్యుని పుత్రుడు కర్ణుడు; ఆయనను చంపినవాడు అర్జునుడు ; అర్జునుని బావ కృష్ణుడు ; కృష్ణుని సూనుడు 
మన్మధుడు;  ఆయన మామ చంద్రుడు;  సతతము అంటే ఎప్పుడూ/ నిరంతరం ; చంద్రుడ్ని ఎప్పుడు తలమీద  ధరించేవాడు  శివుడు ; శివుని కుమారుడు గణపతి ; గణపతి వాహనం మూషికం ; ఎలుకకు విరోధి పిల్లి; పిల్లికి విరోధి కుక్క; 

ఈ పద్యం ద్వారా మరదలు " ఒరే కుక్కా సున్నమిదిగో" అని తనను దరిద్రపు గోట్టుతో పోల్చిన బావకు పెట్టిన సున్నం. 


గమనిక :  ఇలాంటి పద్యాలు మీ దగ్గర ఉన్నట్లయితే, నాకు పంపించండి - మిగిలన  తెలుగు వారితో పంచుకోండి.   మీ పిల్లలకు ఆటవిడుపుగా చెప్తే, వారికి మన భాషపై అభిమానం పెరుగుతుంది.  

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి