1, జనవరి 2014, బుధవారం

విలువలేని ప్రభుత్వ కమిషన్లు


రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షంపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు  లేదా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నప్పుడు హైకోర్టు/సుప్రీం కోర్టు నివ్రుత్త న్యాయమూర్తి చేత ఒక కమిషన్  ను ఏర్పాటు చెస్తాయి.   కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఇలా ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు వాళ్లకు అనుకూలంగా లేకపోతే తిరస్కరించడం ఒక పరిపాటిగా మారింది.  కొన్ని సందర్భాలలో ఈ కమిటీలు కేవలం ప్రతిపక్షాలను తాత్కాలికంగా శాంతింపచేయడానికి లేదా కాలహరణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఆదర్శ్ పేరిట బొంబాయిలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకోసం కట్టిన అపార్టుమెంటులో కొంత మంది కేంద్ర మంత్రులు, స్వయానా రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రులు , కొంతమంది అధికార ప్రముఖులు కలిసి తలా కొన్ని ఫ్లాట్లు పంచుకున్నారు.   దీనిపై నియమించిన కమీషన్ తన నివేదికలో వీళ్ళు చేసిన అక్రమాలను  బట్టబయలు చేసింది.   అలాగే, జస్టిస్  శ్రీకృష్ణ కమిషన్ గతంలో భాజపా శివసేన అరాచకాలపై ఇచ్చిన నివేదికను కూడా ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు.   ఇదే శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన సమస్యపై 85 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం పాటు అన్ని ప్రాంతాలు తిరిగి ఇచ్చిన సమగ్ర నివేదికను కనీసం పార్లమెంటులో ప్రవేశ పెట్ట లేదు. అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన న్యాయ నిర్ణేతలు నిగ్గుతేల్చిన అంశాలపై కనీసం చర్చించనప్పుడు జడ్జీల సమయం ఎందుకు వృధా చేస్తారు?   నివేదికలోని అంశాలు  తమకు అనుకూలంగా  వుంటే ఒకరకంగాను లేకుంటే మరో రకంగాను  వ్యవహరించడం సమంజసమేనా? ఈ విషయంలో అధికార మరియు ప్రతిపక్షాల వైఖరి ఒకేలా వుండటం మరీ విచిత్రం.   కనీసం ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఇలాంటి నివేదికలకు  తప్పకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.       

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి