31, మే 2013, శుక్రవారం

ఎంపీ రాజయ్య మిడిల్ డ్రాప్ !


సహస్రావధాని డా॥ గరికిపాటి గారి కావ్యం సాగర ఘోష కావ్యంలో చెప్పినట్లు "తల్లి మాటను కాదని పిన తల్లి దయకు నేడ్వ, రెంటికిని చెడ్డ రేవడైతిన్" అని ఒక పద్యం వుంది.    పాపం మన వరంగల్ ఎం పీ రాజయ్య గారికి ఈ పద్యం బాగా నప్పుతుంది.    శ్రీహరి సర్వాంతర్యామి, ఇందుగలదండులేడని సందేహము వలదు .....   కడియం శ్రీహరి తే రా స లో చేరిక తే దే పా కు మాత్రమె కాదు, రాజయ్య గారికి  కూడా దెబ్బ  తగిలింది.     కె సి ఆర్ మాట తప్పే మనిషి కాదు, శ్రీ హరి కి కన్ఫర్మ్ చేసిన వరంగల్ ఎం పీ  బెర్తు కాన్సిల్ చెయ్యలేడు.   ఇప్పటిదాకా కాంగ్రెస్ మనోబావలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఆయనకు 2014 లో సీటు వస్తుందో రాదో తెలీదు.    


ఎప్పటినుంచో తన జట్టులో వున్న తక్కిన ఇద్దరు ఎంపీలు కారెక్కి జాం జాం అని తిరగబోతుంటే తను మాత్రం కాడి కింద పడేశాడు.      ఆయనను వదులుకోవడం ఇష్టం లేని కె సి ఆర్, వరంగల్ జిల్లా నుంచి ఎం ఎల్ ఎ ను చేస్తాను కారేక్కమంటున్నాడు.  రాబోయే రోజుల్లో ఏమి చేస్తాడో చూడాలి మరి!



హత్య, మానభంగం కేసులో జీవిత ఖైదు పడ్డ భాజపా ఎం ఎల్ ఎ భర్త


శాస్త్రం చెప్పే బల్లి కుడితి తొట్లో పడటం అంటే ఇదే - మధ్య ప్రదేశ్ కు చెందిన ప్రస్తుత భాజపా శాసన సభ్యురాలు ఆశారాణి గారి భర్త,  ఒకప్పటి శాసన సభ సభ్యుడు అయిన అశోక్ వీర్ విక్రం సింగ్ గారికి స్థానిక న్యాయస్థానం యావజ్జీవిత కారాగార శిక్ష విధించింది.   


2009 వ సంవత్సరంలో 21 సంవత్సరాలు వయసున్న  తన మనవరాలి వరసైన యువతిని  బలవంతంగా   లొంగ దీసుకోవడంతో ఇతగాడి పతనం ప్రారంభం అయింది.    కొంతకాలంగా మనోవేదనను అనుభవిస్తున్న ఆ యువతి, సింగ్ తనపై చేస్తున్న అత్యాచారాన్ని ఆపకపోతే ఈ విషయాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో, సదరు విక్రం సింగ్ ఆ యువతిని హత్య చేసి భోపాల్కు సమీపంలో పారేశాడు.   గతంలో జరిగిన బూటాసింగ్ బంధువు హత్యకేసలో ఆరోపణలు ఎదుర్కొని రుజువులు లేని కారణంగా విడుదల కాబడ్డ "రాజు భయ్యా"    ఎట్టకేలకు  పోలీసులు సరైన సాక్షాధారాలు న్యాయస్థానం ముందుంచడంతో ఈ కేసులో  యావజ్జీవ కారాగార శిక్ష పడింది.     


మనవరాలిని బలాత్కారం చేసి హత్య చేసిన ఘన చరిత్ర కలిగిన ఈ బుందేల్ ఖండ్ రాజా వారు కాంగ్రెస్ నుంచి భాజపా వరకు అన్ని పార్టీలలో పనిచేసాడు.     సాటి స్త్రీ అని కూడా  చూడకుండా పని మనిషిని హింసించి  ఆమె ఆత్మ హత్యకు కారణమై కేసులు ఎదుర్కుంటున్న  ఆయన భార్యను  ఎం ఎల్ ఎ ను చేసి భారతీయ జనతా పార్టీ  వీర విక్రం సింగ్ గారి మర్యాదను కాపాడింది.  


"తెలంగాణా ఉష్ణోగ్రతలను దోచుకుంటున్న ఆంధ్రోళ్లు"


జల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ, భూముల దోపిడీ, బొగ్గు దోపిడీ, నిధుల దోపిడీ, సున్నపు రాయి  దోపిడీ వగైరా వగైరా గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూనే వున్నాం.    నిన్ననే, ఒక వార్తా పత్రికలో ప్రొఫెసర్ కోదండ రెడ్డి గారి పత్రికా ప్రకటన చూసి విస్తుపోయాను.   ఆ ప్రకటన సారంశం ఏమిటంటే, తెలంగాణలో నమోదవుతున్న ఉష్నోగ్రతల వివరాలను  ఆంధ్రా పాలకులు కొన్ని డిగ్రీలు తక్కువగా నమోదు చేస్తూ, తెలంగాణాకు అన్యాయం చేస్తున్నారని.    ఈ విషయమై మేధావి వర్గంతో చర్చించి మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేస్తామని ఆయన శెలవిచ్చారు.   


మేధావిగా తనను తాను  భావించుకొనే కోదండం గారు ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్ర ఉద్య'మమ్' గురించిన ప్రణాళికలు మానేసి, ఆంధ్రోల్ల ఉష్ణోగ్రత దోపిడీ గురించి వార్తల్లో నలుగుతున్నారు, తధాస్తు!

గుండెలు 'మండేలా'


నోబుల్ పురస్కార గ్రహీత, 97 సంవత్సరాల కురువృద్ధుడు, దక్రిష్ణాఫ్రికా విముక్తి పోరాట యోధుడు నెల్సన్  మండేలా దురదృష్ట వశాత్తు ఆంద్ర ప్రదేశ్ రాజకీయ వార్తల్లో వ్యక్తి అయ్యాడు.      శ్వేత జాతి పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్షను  అనుభవించిన మండేలా, మన జగన్ బాబు సరసన ఫ్లేక్సీలలో చేరాడు.    జైలుకు వెళ్ళిన ప్రతి వాడు గాంధీలు, మండేలాలు కాలేరు.    అలాగే, ప్రజా కోర్టులో నెగ్గిన ప్రతి వ్యక్తీ పునీతుడు కాలేడు.    మహారాష్ట్రలో పేరు మోసిన పెద్ద అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గవ్లి, స్వతంత్ర అభ్యర్ధిగా జైలు నుంచి  పోటీ చేసి  శాసన సభకు ఎన్నిక అయ్యాడు.     నిన్న మొన్నటి దాకా జూనియర్, సీనియర్ ఎన్ టి ఆర్, ప్రభాస్ మొ॥ నటుల సరసన మాత్రమె చేరిన జగనన్న ఇప్పుడు కొత్తగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మండేలా సరసన చేరడం చూస్తె, రాజకీయాలు ఎంతగా పతనావస్తకు చేరాయో అర్ధమౌతుంది.   


18, మే 2013, శనివారం

నవ్యత లోపించిన రఘునందన్ ఆరోపణలు


బహిష్కృత తెరాస నేత, మంచి వక్త, న్యాయవాది రఘునందన్ పుంఖాను పుంఖాలుగా తెరాస కుటుంబం మీద గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు.     డబ్బులు వసూలు చేయడం తప్పేమీ కాదని, ఈ సారి ఎన్నికలలో సూట్ కేసులు తెచ్చిన వాళ్ళకే సీట్లు అని తెగేసి చెప్పి  దానికి చట్ట బద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తెరాసకు చెందిన న్యాయవాది, విద్యావంతుడు  ప్రకాష్  గారు.  


ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గత దశాబ్ద కాలంగా పరిశీలిస్తున్న వారికి ఈ ఆరోపణలు పెద్ద ఆశ్చర్యం కలిగించలెదు.       పదే  పదే  ఈ విషయాలను తీర సీమాంధ్ర నేతలు చెప్తున్నా, వారు "ఆంధ్రోల్లు" కాబట్టి వాళ్ళ మాటలు మనం విశ్వసిన్చకూడదు.    ఈ విషయాలు తెలిసిన చాలా మంది తెలంగాణా నేతలు కూడా  తమ మీద "తెలంగాణా ద్రోహి" అనే ముద్ర పడుతుందనే భీతితో బయట పడ  లేదు.    కాంగ్రెస్స్ పార్టీ కె సి ఆర్ ను మానేజ్ చేస్తుండగా, అల్లుడు గారు విద్యాలయాయలు, సుపుత్రుడు కార్పోరేట్ రంగాన్ని, కుమార్తె సినీ రంగాన్ని ఆట ఆడి చ్చారు.     ఇటీవల ఫిక్సింగ్ లో పట్టుబడ్డ శ్రీశాంత్ ఒక టవల్ ను  బయటకు ప్రదర్శించడం ద్వారా  సంకేతం ఇచ్చి బుకీలను సంతోషపరిచాడు.   ఈ టెక్నిక్, మన సినీ రంగంలో ఎప్పుడో ప్రారంభమైంది.    తెరాసకు సంబంధించిన, సినిమాలతో సంబంధం లేని తెరాస  నాయకులను, సి డి విడుదుల కార్యక్రమాలకు, ముహూర్తం షాట్ లకు పిలవడం ద్వారా, అమాయకులైన తెరాస కార్యకర్తలకు సిగ్నల్స్ ఇస్తారు.      మనకు రావలసింది మనకు ముట్టింది, ఈ సినిమా షూటింగ్ మీద దాడులు చెయ్యొద్దు అని ఉద్యమ కారులకు అర్ధమౌతుంది.    అలాగే, స్కూళ్ళు, కాలేజీలు బందు అంటారు.   "అదియును నీ పతి  ప్రాణంబు దక్క" అన్నట్లు, చైతన్య, నారాయణలకు మాత్రం ఈ బందు వర్తించకుండా జాగర్త పడతారు.   కేవలం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు (ఎక్కువ శాతం పేద విద్యార్ధులు ఇక్కడ చదువుతారు) , విశ్వ విద్యాలయాలు మాత్రం ఎంచక్కా మూసేస్తారు.        హైదరాబాదులో రెండు సంవత్సరాల క్రిందట, కార్పోరేట్ కంపెనీల ప్రముఖుల్ని అందర్నీ ఒక చోట సమావేశ పరచి, తెరాస  పెద్దలు వాళ్లకి క్లాస్ పీకారు.  మీరు భయపడవద్దు, మీ డబ్బుకు మేము రక్షణగా వుంటాం, అని శెలవిచ్చారు    


ఏతా  వాత రఘు నందన్ ఎపిసోడ్ వల్ల  తేలింది ఏమిటంటే, హరీష్ రావ్ ఆకృత్యాలకు ఆగడాలకు తెరాస కుటుంబం కూడా విసిగిపోయిందని, పార్టీలో దాదాపు రెండవ స్థానంలో వున్న హరీష్ ఎప్పటికైనా తమ కంట్లో నలుసౌతా డని తెలిసే కెసిఆర్ కాని, ఆయన కొడుకు  గాని హరీష్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేదు. 


ఈ కుటుంబ పతనాన్ని, దయచేసి తెలంగాణా పతనంగా చూడవద్దు.     తెలంగాణా వేరు తెరాస వేరు అని ఆలోచించిన రోజు నిజాన్ని నిజంగా చూడగలుగుతారు.  కందుకము వోలె సజ్జనుడు, మృత్తికము వోలె దుర్జనుడు .... అన్న పద్యం    గుర్తొస్తొన్ది.   నోటికి ఎంతోస్తే అంత  మాట్లాడడం, సభ్యతా, సంస్కారం లేకుండా అసెంబ్లీ సాక్షిగా జయప్రకాశ్ నారాయణ్ మీద చెయ్యి చేసుకోవడం, పోలీస్ అధికారులను వ్రాయడానికి కూడా జుగుప్సు కలిగేలా  బూతులు తిట్టడం, ఎ పి  భవన్లో ఒక  దళిత అధికారిని విపరీతంగా కెమారాల సాక్షిగా  కొట్టడం వారి పతనానికి సూచికలు.   లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి,  వేర్పాటు మాత్రమె జిందా తిలిస్మాత్ లా సర్వరోగ నివారిణి  అని చెప్పి అమాయకులను రెచ్చగొట్టి ఆత్మ హత్యలకు  పురిగొల్పి, దానికి అందమైన పేరు 'బలిదానం' అని వాటిని పదే  పదే  చెప్తూ, టి వి లలో చూపిస్తూ గ్లోరిఫై చేసే ప్రయత్నం చేసారు.     ఎం తో  మంది కన్న తల్లులకు కడుపు శోకం మిగిల్చారు . ఇన్ని పాపాలు చేసిన వ్యక్తులకు తమ పాపలు రాబోయే రోజుల్లో కట్టి కుడుపుతాయి అనడంలో సందేహం లేదు.  


17, మే 2013, శుక్రవారం

విభజన వాదంతో నష్టపోయిన తెదేపా


బాదల్ దేఖ్కె బాల్టీ ఖాళీ కర్తే క్యా - మబ్బును చూసి వున్న నీళ్ళు ఖాళీ చేయడం - ఇదో    నానుడి .   ఇది సరిగ్గా తెదేపా కు  వర్తిస్తున్ది.     పట్టుమని పది మాటలు కూడా ఏ  విషయం మీద మాట్లాడలేని ఎర్రబల్లి, రెచ్చిపోయే   రేవంత్ రెడ్డి, అతిగా మాట్లాడే నాగం, తెరాస మద్దతు ఇచ్చినా  ఘనపూర్ లో ఓడిపోయిన కడియం, మొ॥ వారి మాట విని తెరాసాతో పొత్తుకోసం తహతహ లాడి , తీర సీమంధ్ర ప్రాంతంలో జరగబోయే నష్టాన్ని అంచనా వెయ్యకుండా, స్వర్గీయ  ఎర్రన్న నాయకత్వంలో తెలంగాణపై ఒక కమిటీ వేసారు.


ఆ,  కాంగ్రెస్స్ తెలంగాణా ఇవ్వోచ్చిందా, మనం ఇచ్చేది కేవలం పార్టీ  తీర్మానమే కదా అని ఒక కాగితం ఇచ్చారు.      కె సి ఆర్ ఆహార దీక్షతో పరిస్తితులు మారి వీర తెలంగాణ వాదం అనే సుడిగుండంలో తెదేపా చిక్కుకుంది.  


మీరు శాసన సభలో తీర్మానం చెయ్యండి , మేము పొడుగు సంతకం పెడతాం, అని రెచ్చగొట్టారు.    చేతులు కాలాయి, ఎన్ని ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు.     నిన్న కాక మొన్న పుట్టిన వై ఎస్ ఆర్ పార్టీ చూడండి, మా చేతుల్లో ఏమీ లేదు, అంతా  కేంద్రం ఇష్టం అని అసలైన రెండు కళ్ళ ధోరణిని వ్యక్త పరచిన్ది.    కానీ "రెండు కళ్ళ సిద్ధాంతి" అనే  టైటిల్ మాత్రం బాబు గారికి దక్కింది.       దమ్ముంటే, కేంద్రానికి మళ్ళీ లెటర్ ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం అని తెరాసా రెచ్చగొట్టింది.   తే తెదేపా బృందం బాబు గారిని మళ్ళీ కల్లోలంలోకి నెట్టింది.   మీరు ఉత్తరం ఇవ్వండి, తెలంగాణ  ప్రాంతంలో మనకిక తిరుగుండదు అని చెవిలో జోరీగలా శబ్దం చేస్తూ బాబుని  తప్పుదారి పట్టించారు.    మరో సారి  లిఖితపూర్వకంగా గృహ శాఖామాత్యులు షిండే గారికి ఇచ్చారు.    ఈ ఉత్తరం కూడా అంత  స్పష్టంగా లేదు, మీరు జై తెలంగాణా అని అనాలి అని తెరాసా చెప్పిందే తడవుగా, అవును మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని పదే  పదే  చెప్పారు బాబు గారు.    రాజు గారి పెద్ద భార్య పతివ్రత అంటే అర్ధం తప్పోస్తుంది కాబట్టి , మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పాలి అని పట్టు పట్టారు.   ఏదో అశ్వద్ధామ కుంజరః అన్నట్లు, మేము అనుకూలమే అని బాబు గారు చెప్పారు.     అమ్మా అదేమీ కుదరదు - మీరు కూడా మాతో కలిసి ఉద్యమాలు చేసి ఆంధ్రూల్లు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళని తరిమి కొట్టాలి, మాది మాగ్గావాలి అని నినదిస్తూ ,  బస్సులు రైళ్ళు తగలపెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అప్పుడే మిమ్మల్ని నమ్మేది అని శాసించారు.     


రాజకీయ చాణుక్యుడైన బాబు గారు ఈ విషయంలో బొక్క  బోర్లా పడ్డారు, తనకు తెలియకుండానే తెరాసా రాజకీయ క్రీడలో పావుగా మారి  , ఇరు ప్రాంతాల్లో నష్టపోయారు.   ఈ ప్రక్రియలో ఎవరైతే బాబు వెంట నడిచి ఆయన్ని రెచ్చగొట్టి, తెరాసాని బూతులు తిట్టారో, వారంతా సైకిల్ దిగి కారు ఎక్కి వారే ఇప్పుడు బాబును 'కారు'కూతలు కూస్తున్నారు .   ఈ పరిణామంతో  బాబు గారి పరిస్తితి   రెంటికీ చెడ్డ రేవడి అన్న చందమైంది.      విభజన సెంటిమెంటు తీవ్రంగా వున్న వరంగల్, కరీం నగర్లలో  మిగిలిన ఎర్రబల్లి, రమణ లాంటి వాళ్ళు కూడా సైకిల్ దిగి కారో కమలమో ఎక్కేసినప్పుడే మాత్రమె తెదేపా తన  పార్టీ  ప్రక్షాళన చేసుకొనే   అవకాశం వుండదు.  


బాబు గారూ - ఎవరైతే ప్రస్తుతం కె సి ఆర్ ను బూతులు తిడుతున్నారో వారందరి మీద ఒక్కన్ను వేసి వుంచండి.  వాళ్ళంతా ఆ పార్టీలోకి వెళ్ళేవారే , బహుశా తెరాస అధినేత, తనను  ఎవరు ఎక్కువ బూతులు తిడుతున్నారో రోజూ టి వి చూసి వారికి గేలం వేస్తుండ వచ్చు.   ఇలాంటి వారిని తన పార్టీలోకి తీసుకోవడం వలన మీ పార్టీని ఖాళీ చెయ్యచ్చు, వీళ్ళ బూతులు వినే బాధ నుండి తనూ తప్పుకోవచ్చు.    తెలివంటే అదే మరి, కె సి ఆర్ ను చూసి నేర్చుకోండి. 

12, మే 2013, ఆదివారం

తిరుమలలో ఇంకా కొనసాగుతున్న తమిళ భాష పెత్తనం


భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆంద్ర రాష్ట్రంలో భాగమైన  తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు తమిళ ఆధిపత్యంలోనే ఇంకా ఉన్నట్లుగా అనిపిస్తుంది.    ఇందుకు ఉదాహరణగా కొన్ని రకాలైన సేవల పేర్లను పరిశీలించండి :

పరకామణి
కొయిల్ ఆళ్వార్  తిరుమంజనం
తిరుచ్చి
తిరుమాడవీధి
తిరుప్పావై
ఊంజల్ సేవై
తిరుమంజనం
తోమాల సేవ
మేల్చాట్ వస్త్రం
పోటు
పడి
వగపడి

చెప్పుకుంటూ పోతే ఎన్నో అర్ధం కాని అరవ పేర్లు.   తమిళ భాషకు వ్యతిరేకంగా చెప్తున్న విషయం కాదు, తెలుగు భాషపై వున్న అభిమానం మాత్రమే.     స్వరాష్ట్రం ఏర్పడి ఐదు దశాబ్దాలు దాటినా ఇలాంటి వాటిని పట్టించుకొనే నాధుడు లేడు.    పరకామణి అంటే కానుకలు లెక్కించే ప్రదేశం, ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ అని, పోటు అంటే వంట గది అని, మేల్చాట్ వస్త్రం అంటే శేష వస్త్రం అని తెలుగులో (ఇంకా సరైన, ఖచ్చితమైన పేర్లు ఉండచ్చు) ఉపయోగించలేమా?

ప్రపంచ మహాసభలు జరిగిన తిరుపతి నుంచే తెలుగు వాడకాన్ని మొదలుపెట్టడం అత్యవసరం.  

10, మే 2013, శుక్రవారం

ప్రతిపక్ష హోదా కోసం భాజపా బేరసారాలు


బుధ వారం నాడు వెలువడ్డ కర్నాటక శాసనసభ ఫలితాలలో జనతాదళ్ (సె) మరియు భాజపాకు చెరో నలభై సీట్ల వంతున వచ్చాయి.     వోట్ల శాతం ప్రకారం జనతా దళ్ భాజపా కన్నా ఆధిక్యంతో వుండడం వలన భాజపా ప్రతిపక్ష హోదా కోల్పోయింది.     కనీసం ప్రతిపక్ష హోదా అన్నా దక్కాలంటే, ఏదైనా ఒక పార్టీ కానీ, ఇండిపెండెంట్లు కానీ, భాజపా తీర్ధం పుచ్చుకోవాలి.    


ఎన్నికల ముందే, గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ (బి ఎస్ ఆర్ సి పి) భాజపాతో మంతనాలు జరిపింది.   ఎన్నికల ముందు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని భాజపా, విలీనం ప్రతిపాదనల్ని తిరస్కరించింది.    ప్రస్తుత పరిస్తితులలో ప్రతిపక్ష హోదా పొందాలంటే గాలి పార్టీ విలీనం తప్పనిసరి.    ఈ దిశగా భాజపా అడుగులు వేస్తున్నట్లు వినికిడి.     

8, మే 2013, బుధవారం

కన్నడనాట భాజపా పతనం సంపూర్ణం



సర్వేలు, పార్టీలు, సామాన్య ప్రజలు ఊహించినట్లే, భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో పతనమైంది.    ఈ పతనం ఎంత సంపూర్ణం అంటే, జె డి ఎస్ కు భాజపా కు సమానమైన స్థానాలు గెలవడం వలన రెండవ స్థానం కోసం తీవ్ర సందిఘ్తత నెలకొంది.     ఎన్నికలు జరిగిన 223 స్థానాలలో 121 స్థానాలు హస్తగతం కాగా, భాజపాకు 11 జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా కరవైంది.     కేవలం బెంగలూరు నగరంలో వచ్చిన 13 స్తానాలవలన భాజపా పరువు నిలబెట్టుకోగలిగింది.    

దక్షిణాదిన పాగా వెయ్యడం ద్వారా కేంద్రంలో అధికారంలోకి వద్దామని ఎత్తులు వేసిన భాజపా కు కన్నడ ప్రజలు తగిన శాస్తి చేశారు.     

7, మే 2013, మంగళవారం

బెంగళూరు భా జ పా మానిఫెస్టోలో నైట్ లైఫు పెంపు పై హామీ


కళాశాల విద్యార్ధినులు  ధరించే దుస్తుల విషయంలో ఆంక్షలు పెట్టడం, పాశ్చాత్య పద్ధతులైన ప్రేమికుల రోజు జరుపుకోవడాన్ని వ్యతిరేకించడం, క్లబ్ పబ్ కల్చర్ మన భారత సాంప్రదాయానికి విరుద్ధం అని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడంలో భారతీయ జనతా పార్టీ పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది.  

శాస్త్రం చెప్పిన బల్లి కుడితి తొట్లో పడ్డట్టు - కర్నాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా యువకుల కోసం ప్రత్యేకించి మానిఫెస్టోలో ఒక వాగ్దానం చేసింది.     అదేమిటంటే, ఇప్పటిదాకా పబ్బులు , బారులు, హోటళ్ళు, క్లబ్బులు కేవలం  రాత్రి 11.30 దాకానే పనిచేస్తున్నాయని, తాము అధికారంలోకి వస్తే దానిని అర్ధరాత్రి ఒంటి గంట దాకా పొడిగించి యువతకు లాభం చేకూరుస్తామని ప్రమాణం చేసింది.   గతంలోనే భాజపా ప్రభుత్వం నైట్ లైఫ్ పెంచడానికి చేసిన ప్రయత్నాలను బెంగళూరు పోలీసు బాసు వ్యతిరేకించారు.     రాత్రి పూట నగరం 11 గంటలకల్లా ప్రశాంతంగా వుండాలని, సంఘ వ్యతిరేక శక్తులను అదుపులో ఉంచాలంటే ఇదొక మార్గమని  NDTV సాక్షిగా జరిగిన చర్చలో వివరించారు. 


ఒక్క బెంగళూరు నగరంలోనే 28 శాసన సభ క్షేత్రాలు వున్నాయి.  గతంలో 17 స్థానాలు భాజపా కైవశం చేసుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది.    ఇక్కడ పని చేస్తున్న ఐ టి. బి టి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా వుంది.    ఏమి చేస్తే వాళ్ళ వోట్లను ఆకర్షించవచ్చో పెద్దలు ఆలోచన చేసి, ఇలాంటి పనికి దిగజారారు.     ఇలాంటి పనుల వలన ఇతర పార్టీలకు తాము ఏమాత్రం తీసిపోమని చెప్పకనే చెప్పింది.    




పాపం వెంకయ్య నాయుడు


మన రాష్ట్రానికి చెందిన బి జె పి నాయకుడు, ఒకప్పటి జాతీయ పార్టీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు గారు కర్నాటక  నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.    కర్నాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఆయన తన వోటు హక్కు వినియోగించుకోవడానికి మల్లేశ్వరం నియోజకవర్గం లోని ఒక పోలింగు బూతుకు వచ్చి, క్యూ లైను ఖాతరు చెయ్యకుండా సరాసరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు.     వోటర్లలో వి ఐ పి వోటర్లు ఉండరనే సత్యాన్ని పాపం మర్చి పోయాడు పాపం .   కానీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేసి లైను లో రమ్మని క్లాస్ పీకారు.   నేను పార్లమెంటు సభ్యుడ్ని, వేరే కార్యక్రమం వుందన్నా, అక్కడ ఆయన్ని ఎవరూ గుర్తు పట్టలేదు, పత్తించుకొలెదు.   చివరకు, బుద్ధిమంతుడిలా వరుసలో నుంచిని ఆయన తన అమూల్యమైన వోటు హక్కు వినియోగించుకున్నాడు.    

అంత్య ప్రాసలతో, తనదైన శైలిలో నిరంతరం   టి వి ల ద్వారా పత్రికల ద్వారా మనకు  కనువిందు చేసే నాయుడు గారిని సామాన్య వోటరు గుర్తుపట్టక పోవడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.  


నిన్న డెక్కన్ హెరాల్డ్లో వచ్చిన కధనం ఆధారంగా 


6, మే 2013, సోమవారం

మళ్ళీ సచ్చీలతను నిరూపించుకున్న సి బి ఐ


కేంద్ర నేర పరిశోధక సంస్థ (సి బి ఐ) ప్రపంచంలోని గొప్ప పరిశోధక సంస్థలలో ఒకటి.  రైల్వే బోర్డు సభ్యుల నియామకాల్లో దళారిగా వ్యవహరిస్తున్న   రైల్వే మంత్రి బన్సాల్ మేనల్లుడుని అదుపులోకి తీసుకోవడం ద్వారా, తన సచ్చీలతను మరోసారి చాటి చెప్పింది.    కేంద్ర ప్రభుత్వానికి వరుస సమస్యలు తెచ్చిపెట్టిన బొగ్గు కుంభకోణం నిన్న జరిగిన రైల్వే సభ్యుల నియాకంలోను పాలకులకు తలవంచకుండా  తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. 


అధికారంలో వున్న వారి  మెప్పు పొందాలనే దురుద్దేశం సి బి ఐ కి వుంటే, ప్రభుత్వ పెద్దలకు ముందుగానే హెచ్చరించి యు  పి ఎ ప్రభుత్వానికి అవినీతి మారక అంటకుండా కాపాదగాలిగేది.     కానీ, పత్రికలూ ఈ విషయాన్ని మరుగున పడేసి, కేవలం అవినీతి జరిగిందనే విషయాన్ని భూతద్దంలో చూపించాయి.   


మేధావులు, విశ్లేషకులు, ఉన్నత న్యాయస్థానం  కోరుకున్నట్లు,  అతి త్వరలో సి బి ఐ కి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినట్లయితే, చాలా  వరకు రాజకీయ నాయకుల దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశం వుంది. 

4, మే 2013, శనివారం

బాధను దిగమింగి యు పి ఎస్ సి పరీక్షలో వికసించిన కోమల్


Deserted by husband just after marriage, Gujarat girl clears top UPSC exam


కోమల్ ప్రవీణ్  భాయ్  గణతార - గుజరాత్ లో  ఈ రోజు వార్తల్లోని వ్యక్తి.    నిన్న యు పి ఎస్ సి విడుదల చేసిన ఫలితాలలో దేశంలో 591 వ స్థానంలో, గుజరాత్ నుంచి సివిల్ సర్వీస్ కు ఎన్నికైన  11 మందిలోనూ ఒకరు.    చాలా మంది మహిళలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలో రాణిస్తున్నారు  ఇది గొప్ప విషయమేమీ కాకపోవచ్చు.   కానీ పెళ్ళైన పదిహేను రోజులకు కట్నం చాలలేదని భర్త వదిలేసిన వర కట్న బాధితురాలు ఈ మహిళ. 

భావనగర్ జిల్లాలోని ఒక కుగ్రామములో ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తన కష్టాన్ని దిగమింగుకుంటూ పట్టుదలతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలై  భారత రెవెన్యూ సేవలలో ప్రవేశించబోతోంది .  ఆమ్రేలి జిల్లాలోని సవరకుండ్ల గ్రామానికి చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడి కుమార్తె కోమల, న్యూజిలాండ్ లో స్థిరపడిన తన భర్త శైలేష్ పోపట్ పై న్యాయ పోరాటానికి సిద్ధమౌతోంది .    ఇప్పటి దాకా ఆర్ధిక పరిస్థితి సహకరించనందున  మరియు తన ముందున్న లక్ష్యాన్ని ఛేదించాలనే  తపనతో,  కట్నం కోసం తనను వదిలేసిన భర్తపై న్యాయ పోరాటానికి సిద్ధపడలేదు. "కేవలం నేను పేద కుటుంబం నుంచి వచ్చానని, కట్న కానుకలు తగినంతగా ఇవ్వలేదన్న కారణంగా  నన్ను వేధించిన నా భర్త, అత్తా మామలపై చట్ట పరంగా పోరాడుతాను" అంటున్నారు కాబోయే ఐ ఆర్ ఎస్ అధికారి కోమల.  తన భర్త శైలేష్ న్యూజిలాండ్లో ఎక్కడ వున్నారో, ఏమి ఉద్యోగం చేస్తున్నారో, అతని చిరునామా, ఫోన్ నంబర్  కూడా తనకు తెలియదని ఆమె వాపోయారు.  

"ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి దూరంగా వెళ్ళిన శైలేష్ తనను ఎప్పుడు సంప్రదించలేదని, ఇంత  వరకు విడాకులు కూడా కోరలేదని" ఆమె తెలిపారు 

 శైలేష్ ఎం ఎస్ సి (రసాయన శాస్త్రం) లో రాజ్ కోట్ నుంచి  స్నాతకోత్తర పట్టా కలిగి వుండగా,  కోమల్ రాజ్ కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో డిప్లోమో మరియు డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా బి ఎ ఆ తరువాత సవరకుండల నుంచి ఉపాధ్యాయ శిక్షణా వృత్తిలో సర్టిఫికేట్ను కలిగి వున్నారు. 

అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీసెస్లో చేరాలన్న ధృడ సంకల్పంతో 2008 లో యు పి  ఎస్ సి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే  అహమ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్  అఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో   చేరింది కోమల్.  జనరల్ విభాగం లో నాలుగో సారి చేసిన ప్రయత్నం ఫలించింది.   గుజరాతీ మాధ్యంలో ఇంటర్వ్యూ కు హాజరైన కోమల్, చరిత్ర మరియు గుజరాతీ సాహిత్యం అనే రెండు అంశాలు ఫైనల్ పరీక్షల కోసం ఎంచుకుని విజయం సాధించింది .     

ఇంత పెద్ద కష్టాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కొని లక్ష్యాన్నిముద్దాడిన    కోమల్ ప్రవీణ్ భాయ్ గణతార అభినందనీయురాలు మరియు మనందరికీ స్పూర్తి ప్రదాత. 

3, మే 2013, శుక్రవారం

ప్రయాణీకుల భద్రతతో ఆడుకున్న పైలెట్లు


అది ఏప్రిల్ 12, 2013.   ఎప్పటిలాగే, ఎయిర్ ఇండియా 333 విమానం బాంగ్ కాక్ నుండి ఉదయం 8.55 నిమిషాలకు 166 మంది ప్రయాణీకులతో  ఢిల్లీ విమానశ్రయానికి  బయలు దేరింది.   అరగంట ప్రయాణం తరువాత  విమానం 33,000 అడుగుల ఎత్తులో వున్నపుడు,  కాక్పిట్లో వున్న కో-పైలెట్ రవీంద్రనాథ్ సౌచాలయంకు వెళ్తూ "నిబంధనల ప్రకారం" రెండో వ్యక్తి తప్పకుండా కాక్పిట్లో ఉండాలన్న పద్దతిని పాటించి తన స్థానంలో  ఏర్ హోస్టెస్ జె భట్ అనే ఆవిడను కూర్చోబెట్టి వెళ్ళాడు.  ఇలా ఇద్దరు వ్యక్తులు కాక్పిట్లో ఎప్పుడూ ఉండాలన్న ఆంతర్యం ఏమిటంటే, ఏదైనా కారణాల వల్ల పైలెట్ విమానాన్ని అదుపు చెయ్యలేని పక్షంలో రెండవ వ్యక్తి తక్షణం సమాచారం అందివ్వడానికి.  


ఇది ఇలా వుండగా, ప్రయాణీకుల ప్రాణాలను  ఫణంగా పెట్టి, అప్పటి వరకు కెప్టన్ కుర్చీలో వున్న సోనీ అనే పైలెట్ కూడా, కనికా కళా అనే ఇంకో హోస్టేను తన స్థానంలో కూర్చోబెట్టి, ఆ ఇద్దరు మహిళలకు విమాన చోదనలో శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టాడు.   కొంచెంసేపు నేర్పిన తరువాత సదరు పైలెట్ సోనీ గారు కూడా కాక్పిట్ను వదిలి బయటకు వచ్చారు.    ఆటో పైలెట్ పద్ధతిలో పెట్టిన  విమానాన్ని పైలెట్, కో పైలెట్ స్థానంలో కూర్చున్న ఆ ఇద్దరు హొస్టెస్లు దాదాపు 30 నిమిషాల పాటు నడిపారు.  సాంకేతిక లోపాల కారణంగా  ఆటో పైలెట్ సౌకర్యం విఫలం కావడంతో తక్షణం విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు విమాన చోదకులు తిరిగి తమ స్థానాలకు చేరుకున్నారు.    ఈ తతంగం  మొత్తం,  ప్రయాణీకుల సేవల నిమిత్తం నియమించబడిన ఒక సీనియర్ వ్యక్తి కళ్ళెదుటే జరగడంతో, ఈ సంఘటనను అతను ఎయిర్ లైన్సు ఉన్నతాధికారుల ద్రుష్టికి  తీసుకొచ్చాడు.  


ఈ దుస్సాహసానికి బాధ్యులైన నలుగురిని, అధికారులు విధులనుంచి తొలగించడం జరిగింది.  మరిన్ని వివరాల కోసం అరుణ్ మిశ్రా,   పౌర విమాన యాన మహా నిర్దేశకులను  (DGCA) సంప్రదించగా ఆయన ఈ సంఘటనను   ధ్రువ పరుస్తూ    "భద్రతా నియమాలను ఉల్లంఘించిన కారణంగా వారిని విధులనుంచి తొలగించి తదుపరి విచారణకూడా నిర్వహిస్తునట్లు"  పత్రికకు తెలియ చేశారు.  


ప్రభుత్వం నియమించిన విమాన యాన భద్రతా కమిటీలో సభ్యుడైన కెప్టన్ మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ, తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలను కఠిన చర్యల ద్వారా ప్రయాణీకులకు భద్రత కల్పించడంలో విఫలమౌతూ నిర్లక్ష్య పూరిత ధోరణితో వ్యవహరిస్తున్న   పౌర విమానయాన అధికారులే బాధ్యత వహించాలని  చెప్పారు. 

(బెంగళూరు మిర్రర్ ఆంగ్ల దిన పత్రికలో ఈ రోజు మొదటి పుటలో  అచ్చైన కధనానికి తెనుగు అనువాదం) 

జైలు కెళ్ల నున్న "దాడి"


ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు అనేది సామెత.    మంచి మాస్టారుగా, నిజాయితీ పరుడుగా  పేరున్న దాడి వీరభద్ర రావు తెలుగు దేశంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ పార్టీతో బంధం తెంచుకున్నారు.   ఈ విషయంలో ఆయన తప్పు పెద్దగా లేనప్పటికీ, ఆయన జగన్ గూటికి చేరతారని వస్తున్నా వార్తలు ఆయన అభిమానుల్ని కలవర పెడుతున్నాయి.     నేడో, రేపో చంచల్గుడా జైలుకు వెళ్లి తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.   మంత్రిగా, మంచి వక్తగా, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా, నిజాయతీ పరుడిగా పేరున్న దాడి జైలు పార్టీకి వెళ్ళడం ఆత్మహత్యా సదృశం కాగలదు.   

2, మే 2013, గురువారం

ప్రత్యేక రాష్ట్ర కోరిక నాలుగున్నర కోట్ల ఆకాంక్ష కాదు


నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఆంద్ర ప్రదేశ్ జనాభా 8.46 కోట్లు కాగా అందులో హైదరాబాద్తో కూడిన తెలంగాణా ప్రాంత జనాభా 3.53 కోట్లు మాత్రమే.    ప్రతి టి వి చర్చల్లో, ఉపన్యాసాల్లో ఇహ నుంచి విభజన కోరే మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పి మభ్య పెట్టడం సమంజసం.    ఈ మూడున్నర కోటిలో పద్నాలుగు  సంవత్సరాల లోపల వయసు వున్న పిల్లలు 25% శాతం మంది అంటే 88 లక్షల మంది ఉన్నారు.   వీళ్ళకు ఆ'కాంక్ష' రావడానికి ఇంకొక  5-10 సంవత్సరాలు పడుతుంది.    అంటే, నికరంగా 2.65 కోట్ల మంది  ఆకాంక్ష. 


ఇందులో, తెలంగాణాను పూర్తిగా వ్యతిరేకించే ప్రజలు (అంటే బాన్స్వాడ ఎం ఎల్ ఎ  పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పినట్లు -  నాకు వోట్లేయ్యని సేటిలర్స్ పని పడతానని అన్నాడు చూడండి), సి పి ఎం, ఎం ఐ ఎం,  జగ్గారెడ్డి  లాంటి సమైక్యాంధ్ర మద్దతు దారులు  , జంట నగరాలు వాటి చుట్టు పక్కల ప్రాంతాలు, విభజన జరిగితే మరో గుజరాత్ అవుతున్దనుకొనే ముస్లింలు, వ్యవసాయ రంగంలో వలస వచ్చి స్థిరపడిన రైతులు, జంట నగరాలలో దశాబ్దాల వెనుక స్థిరపడిన వారు, పైకి విభజన కోరుతూ (రాజకీయ మనుగడ కోసం) లోలోపాల సమైక్యంగా వుండాలనుకొనే వారు, కంచె ఐలయ్య లాంటి మేధావులు, భద్రాచలం డివిజన్, మునగాల పరగణా ప్రజలు,మహబూబ్ నగర్ జిల్లాలో చేరిన కర్నూల్ ప్రాంతాల గ్రామాలు,   చందాదల దందాను మౌనంగా ఎదుర్కొంటున్న వారు, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని కోరుకొనే వారు,  -----  ఇలాంటి వారి  సంఖ్య కేవలం 25 నుంచి 30 శాతం వుందని అనుకుంటే, మిగిలేది కేవలం 2కోట్ల  మంది.     


చంద్ర బాబు నాయుడు చూపించే విక్టరీ గుర్తు (రెండు వేళ్ళు) కి అర్ధం బహుశా అదే కావచ్చు.     కాబట్టి, ఇహ నుంచి ఏ చర్చలు జరిగినా రెండు కోట్ల మంది ఆ'కాంక్ష' అనడం సముచితం.