కళాశాల విద్యార్ధినులు ధరించే దుస్తుల విషయంలో ఆంక్షలు పెట్టడం, పాశ్చాత్య పద్ధతులైన ప్రేమికుల రోజు జరుపుకోవడాన్ని వ్యతిరేకించడం, క్లబ్ పబ్ కల్చర్ మన భారత సాంప్రదాయానికి విరుద్ధం అని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడంలో భారతీయ జనతా పార్టీ పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది.
శాస్త్రం చెప్పిన బల్లి కుడితి తొట్లో పడ్డట్టు - కర్నాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా యువకుల కోసం ప్రత్యేకించి మానిఫెస్టోలో ఒక వాగ్దానం చేసింది. అదేమిటంటే, ఇప్పటిదాకా పబ్బులు , బారులు, హోటళ్ళు, క్లబ్బులు కేవలం రాత్రి 11.30 దాకానే పనిచేస్తున్నాయని, తాము అధికారంలోకి వస్తే దానిని అర్ధరాత్రి ఒంటి గంట దాకా పొడిగించి యువతకు లాభం చేకూరుస్తామని ప్రమాణం చేసింది. గతంలోనే భాజపా ప్రభుత్వం నైట్ లైఫ్ పెంచడానికి చేసిన ప్రయత్నాలను బెంగళూరు పోలీసు బాసు వ్యతిరేకించారు. రాత్రి పూట నగరం 11 గంటలకల్లా ప్రశాంతంగా వుండాలని, సంఘ వ్యతిరేక శక్తులను అదుపులో ఉంచాలంటే ఇదొక మార్గమని NDTV సాక్షిగా జరిగిన చర్చలో వివరించారు.
ఒక్క బెంగళూరు నగరంలోనే 28 శాసన సభ క్షేత్రాలు వున్నాయి. గతంలో 17 స్థానాలు భాజపా కైవశం చేసుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ పని చేస్తున్న ఐ టి. బి టి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా వుంది. ఏమి చేస్తే వాళ్ళ వోట్లను ఆకర్షించవచ్చో పెద్దలు ఆలోచన చేసి, ఇలాంటి పనికి దిగజారారు. ఇలాంటి పనుల వలన ఇతర పార్టీలకు తాము ఏమాత్రం తీసిపోమని చెప్పకనే చెప్పింది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి