3, మే 2013, శుక్రవారం

ప్రయాణీకుల భద్రతతో ఆడుకున్న పైలెట్లు


అది ఏప్రిల్ 12, 2013.   ఎప్పటిలాగే, ఎయిర్ ఇండియా 333 విమానం బాంగ్ కాక్ నుండి ఉదయం 8.55 నిమిషాలకు 166 మంది ప్రయాణీకులతో  ఢిల్లీ విమానశ్రయానికి  బయలు దేరింది.   అరగంట ప్రయాణం తరువాత  విమానం 33,000 అడుగుల ఎత్తులో వున్నపుడు,  కాక్పిట్లో వున్న కో-పైలెట్ రవీంద్రనాథ్ సౌచాలయంకు వెళ్తూ "నిబంధనల ప్రకారం" రెండో వ్యక్తి తప్పకుండా కాక్పిట్లో ఉండాలన్న పద్దతిని పాటించి తన స్థానంలో  ఏర్ హోస్టెస్ జె భట్ అనే ఆవిడను కూర్చోబెట్టి వెళ్ళాడు.  ఇలా ఇద్దరు వ్యక్తులు కాక్పిట్లో ఎప్పుడూ ఉండాలన్న ఆంతర్యం ఏమిటంటే, ఏదైనా కారణాల వల్ల పైలెట్ విమానాన్ని అదుపు చెయ్యలేని పక్షంలో రెండవ వ్యక్తి తక్షణం సమాచారం అందివ్వడానికి.  


ఇది ఇలా వుండగా, ప్రయాణీకుల ప్రాణాలను  ఫణంగా పెట్టి, అప్పటి వరకు కెప్టన్ కుర్చీలో వున్న సోనీ అనే పైలెట్ కూడా, కనికా కళా అనే ఇంకో హోస్టేను తన స్థానంలో కూర్చోబెట్టి, ఆ ఇద్దరు మహిళలకు విమాన చోదనలో శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టాడు.   కొంచెంసేపు నేర్పిన తరువాత సదరు పైలెట్ సోనీ గారు కూడా కాక్పిట్ను వదిలి బయటకు వచ్చారు.    ఆటో పైలెట్ పద్ధతిలో పెట్టిన  విమానాన్ని పైలెట్, కో పైలెట్ స్థానంలో కూర్చున్న ఆ ఇద్దరు హొస్టెస్లు దాదాపు 30 నిమిషాల పాటు నడిపారు.  సాంకేతిక లోపాల కారణంగా  ఆటో పైలెట్ సౌకర్యం విఫలం కావడంతో తక్షణం విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు విమాన చోదకులు తిరిగి తమ స్థానాలకు చేరుకున్నారు.    ఈ తతంగం  మొత్తం,  ప్రయాణీకుల సేవల నిమిత్తం నియమించబడిన ఒక సీనియర్ వ్యక్తి కళ్ళెదుటే జరగడంతో, ఈ సంఘటనను అతను ఎయిర్ లైన్సు ఉన్నతాధికారుల ద్రుష్టికి  తీసుకొచ్చాడు.  


ఈ దుస్సాహసానికి బాధ్యులైన నలుగురిని, అధికారులు విధులనుంచి తొలగించడం జరిగింది.  మరిన్ని వివరాల కోసం అరుణ్ మిశ్రా,   పౌర విమాన యాన మహా నిర్దేశకులను  (DGCA) సంప్రదించగా ఆయన ఈ సంఘటనను   ధ్రువ పరుస్తూ    "భద్రతా నియమాలను ఉల్లంఘించిన కారణంగా వారిని విధులనుంచి తొలగించి తదుపరి విచారణకూడా నిర్వహిస్తునట్లు"  పత్రికకు తెలియ చేశారు.  


ప్రభుత్వం నియమించిన విమాన యాన భద్రతా కమిటీలో సభ్యుడైన కెప్టన్ మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ, తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలను కఠిన చర్యల ద్వారా ప్రయాణీకులకు భద్రత కల్పించడంలో విఫలమౌతూ నిర్లక్ష్య పూరిత ధోరణితో వ్యవహరిస్తున్న   పౌర విమానయాన అధికారులే బాధ్యత వహించాలని  చెప్పారు. 

(బెంగళూరు మిర్రర్ ఆంగ్ల దిన పత్రికలో ఈ రోజు మొదటి పుటలో  అచ్చైన కధనానికి తెనుగు అనువాదం) 

1 కామెంట్‌ :