2, ఫిబ్రవరి 2013, శనివారం

క చ రా గారి సుభాషితాలు


చంద్రశేఖర్ రావు గారి పాండిత్యం చూస్తే ఈర్ష్య కలగక మానదు.   ఆయనకున్న అవలక్షణాలను పక్కన పెడితే, నిస్సందేహంగా ఆయనకు పంచ కావ్యాల మీద, సుభాషితాల మీద, శతకాల మీద తప్పకుండా గట్టి పట్టు వుండే ఉండచ్చు.    ఇందిరా పార్కు ప్రసంగంలో ఆయన భర్తృ హరి సుభాషితాలలోని అత్యంత ప్రముఖమైన "ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాససంత్రస్తులై .... అన్న శార్దూల పద్యాన్ని శుద్ధంగా, శ్రావ్యంగా వినిపించారు.  ఈ మధ్య మొదలైన అశుద్ధ ప్రసంగాలు తప్ప, ఆయన గతంలో చాలా బాగా ఉపన్యాసం చేసేవాడు. 


ఇంత  విద్వత్ ఉన్న వ్యక్తికీ అదే భర్తృ హరి సుభాషితాలలోని ఈ క్రింది పద్యం వల్లే వేస్తె ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది :

ఉ ||  క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు,  ఙాతి హుతాశనుండు, మి 
       త్రము  దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్ , సువిద్య వి
       త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా
        ప్రముఖపదార్ధముల్ గలుగుపట్టున (దత్కవచాదు  లేటికిన్.

తాత్పర్యం:

ఓర్పు ఉంటే కవచం అక్కరలేదు.   క్రోధముంటే హాని కలిగించడానికి శత్రువుతో పనిలేదు.  దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు.   స్నేహితుడుంటే ఔషధం (అయ్యా ఇది "ఆ"  ఔషధం అనుకోవద్దు) అక్కరలేదు.  దుష్టులుంటే భయంకరమైన సర్పాలు అక్కరలేదు.  ఉదాత్తమైన కవిత్వం ఉంటె రాజ్యంతో పనిలేదు.   చక్కని విద్య ఉంటె సంపదతో ప్రయోజనం లేదు.   తగురీతిని సిగ్గు ఉంటె వేరే అలంకారం అక్కరలేదు.    ఈ ఓర్పు మొదలైన పదార్ధాలు ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటితో ప్రయోజనం లేదు. 
 
 
ఆయనకు కావసింది ఓర్పు, మంచి సలహాదారులు, క్రోధాన్ని అదుపులో ఉంచుకోవడం, నోరు పారేసుకోక పోవడం. ఆ పరమేశ్వరుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు ఋజు ప్రవర్తన కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 

2 కామెంట్‌లు :

  1. నోరు చేసుకుని జనాన్ని ఉద్రేక పరచక పోతే ఎవడు ఓటేస్తాడూ?ఏదో ఒకటి కెలికి జనాన్ని రెచ్చగొట్టకపోతే ఎవడి బ్రతుకు వాడు బతుకు తున్న ఈ రోజుల్లో రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు ఎలా చేస్తారు...కాబట్టి నోటితో ఉద్యమాల్ని నిర్మించాలి కచారా గారు!!

    రిప్లయితొలగించండి