సాక్షి పత్రిక చదవాలంటే భయం. ఏ వార్త చదివినా మనసులో ఒక రకమైన నెగటివ్ ధోరణి బయలు దేరుతుంది. సిబిఐ, బొగ్గు కుంభకోణం విషయంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన ఒక అఫిడవిట్లో, న్యాయ శాఖామంత్రి మరియు ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు కొంతమంది తాము తయారు చేసిన ముసాయిదా నివేదికను ముందుగానే చూశారని వాగ్మూలం ఇచ్చింది. ఈ వార్తను పట్టుకుని సిబిఐకి దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేసింది సాక్షి పత్రిక. సిబిఐ అధికార పక్షానికి కొమ్ము కాస్తుందని, జగనన్నును కూడా అలానే జైలులో పెట్టారని చెప్పే ప్రయత్నం చేసింది.
సిబిఐ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తుంది అన్న ఆరోపణ నిజమైతే, వారు దాఖలు చేసిన అఫిడవిట్లో, తాము ఆ నివేదికను ఎవరికీ చూపలేదనే చిన్న అబద్ధం చెప్పి కాంగ్రెస్ పార్టీని కష్టాలనుంచి బయట పడేసేది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక నిజాన్ని బట్ట బయలు చేసి ధైర్యంగా ముందుకొచ్చిన సిబిఐ ను అభినందించాల్సిందే.
నిజాయతీ పరుడు, విద్యాధికుడు ఐన లక్ష్మీనారాయణ లాంటి అధికారులు ఈ దేశంలో ఇంకా వున్నారు కాబట్టే, ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన కొంత మందైనా కారాగారాల్లో చిప్ప కూడు తింటూ మగ్గుతున్నారు . అపర శ్రీ కృష్ణ దేవరాయలుగా తనను తానూ అభివర్ణించుకున్న గాలి సోదరులను అక్కడి ప్రజలు పూర్తిగా మర్చిపోయి స్వేచ్చా వాయువులు పీలుస్తున్నారు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు పోయింది అన్న నానుడి మన రాష్ట్రంలో కూడా నిజమవ్వడానికి ఎంతో దూరం లేదు.