63 సంవరాల వయసు, 86 శాసన సభ నియోజక వర్గాలు, 16 జిల్లాలు, 162 మండలాలు , 2817 కిలో మీటర్లు, 208 రోజులు, 2 లక్షల కోట్ల హామీలు...... ఇదీ స్థూలంగా చంద్ర బాబు వస్తున్నా మీకోసం లెక్కలు.
మొండి పట్టుదలకు మారుపేరైన చంద్ర బాబు, వయసుతో వచ్చే సమస్యలను కూడా లెక్క చేయకుండా, సుమారు 7 నెలలపాటు హిందూపురం నుంచి విశాఖ పట్నం దాకా కాలి నడకన ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తన పాద యాత్ర ఓట్ల జైత్ర యాత్రగా మలుస్తుందో లేదో ఇదమిద్ధంగా ఇప్పుడే చెప్పలేము కానీ, నిస్త్రాణంగా వున్న కార్యకర్తలను తట్టి లేపింది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు . చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్నపుడు తన పార్టీ కార్యకర్తలను పట్టించుకోక పోవడం, అభివృద్ధిని కేవలం హైదరాబాదుకు పరిమితం చేయడం, కరువు పరిస్తితులు, చిరంజీవి ప్రజారాజ్యం చీల్చిన కొన్ని సామాజిక వర్గాల వోట్లు, రాజశేఖర్ రెడ్డి చరిష్మా, ఇత్యాది అంశాల వలన అధికారం కోల్పోయిన ఆయనకు, ఈ పాద యాత్ర పునర్జీవనం ఇచ్చింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
పులి మీద పుట్రలా, గత 3 సంవత్సరాలలో జరిగిన ప్రాంతీయ ఉద్యమాలు, ఉద్రిక్తతలు, తెదేపా తీసుకున్న నిర్ణయాలు ఇరు ప్రాంతాలలోని ప్రజలనూ ఆకట్టుకోలేక పోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం గడువు ఉన్న తరుణంలో సాగించిన ఈ పాద యాత్ర తెలుగు దేశంకు ఎంతో కొంత మేలు చేస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి