15, అక్టోబర్ 2014, బుధవారం

ఆన్ లైన్ వ్యాపారం తప్పా!


ఇటీవల ఫ్లిప్ కార్ట్ అనే ఆన్ లైన్ సంస్థ బిలియన్ సెల్ పేరిట ఏకంగా 600 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒక్క రోజులో చేసింది.  ఇది తెలిసిన రిటైల్ వ్యాపారులు కేంద్ర ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేస్తూ, ఇలాంటి ఆన్ లైన్ వ్యాపారాలను ప్రభుత్వం నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.    

బిలియన్ సేల్ పేరిట జరిగిన అమ్మకంలో నేను కొన్ని ఎలాక్త్రోనిక్ వస్తువులు కొన్నాను.  అదే వస్తువులు బయట కొంటే కనీసం 20 శాతం ఎక్కువ ఖర్చు అయ్యేది.   వ్యాపారంలో పోటీ వుండాల్సిందే.   గతంలో మారుతీ కంపెనీ మాత్రమే కార్లు తయారు చేసేది, అది కూడా 800 రకం మాత్రమే.    తరువాతి కాలంలో హుందే, ఫోర్డు రావడంతో నెలకో రకం కారుతో మారుతీ వారు పోటీ పడుతున్నారు.    పరుగు పందెంలో ఒక్కడినే పరిగెత్తి నేనే విజేతనంటే కుదరదు కదా!

డెలివరీ బాయ్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, గోడౌన్ మేనేజ్మెంట్, సార్టింగ్, కొరియర్, బాక్ ఆఫీస్ మొదలైన్ రంగాలలో అత్యుత్తమ జీతాలతో ఆన్లైన్ సంస్థలు బోలెడు మందికి ఉపాధికి కల్పిస్తున్నాయి.   కొనుగోలుదారుడికి తక్కువ ధరకు కొన్ని రకాల వస్తువులు లభ్యమౌతున్నాయి.    ఆన్ లైన్ సంస్థలు తాము చట్ట పరంగా చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తున్నంత వరకు, వస్తువుల నాణ్యతకు చట్టపరంగా రక్షణ కల్పించినంత వరకూ  ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. 

ఈ ఆన్లైన్ సంస్థలు త్వరలో ఫార్మా రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆశిద్దాం.    దీని ద్వారా కనీసం మనం కొనే మందులపై 20 నుంచి 30 శాతం వరకు ఆదా చేసుకొనే అవకాశం వుంది.   ఉదా-  నేను మా కుటుంబం కోసం కనీసం నెలకు 1500/- విలువైన మందులు కొంటాం.    ఈ మందులు మీరు ఫార్మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనండి మీకు కనీసం 20 నుంచి 25 శాతం తక్కువకు వస్తుంది .   ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు.   హైదరాబాద్ లోని కోటీకి వెళ్ళండి, బోలెడు మంది దిస్త్రిబ్యుటర్లు వున్నారు. అంటే, డిస్ట్రిబ్యూటర్  మనకే 20-25 శాతం తగ్గించి ఇస్తుంటే, అతనికి కూడా కనీసం అంతే మొత్తంలో లాభం వస్తుండవచ్చు.    అలాగే మందులు తయారు చేసే కంపెనీలకు అంతకన్నా ఎక్కువ లాభం వస్తుంది.    దీనిని బట్టి చూస్తే, పది పైసలు తయారీ ఖర్చు అయ్యే మందు మనకు చేరేప్పటికి 100 పైసలు పడుతుంది.    ఎంత దారుణం!    జనరిక్ మందుల షాపుల పేరిట అక్కడక్కడా ఒకటి అరా దుకాణాలు వున్నా, వీటిపై అవగాహన లేదు. పూర్తి స్థాయిలో లభ్యతా లెదు.    కాబట్టి, ఈ రంగంలో కూడా పోటీ రావాల్సిన తక్షణ అవసరం వుంది. ఎంపిక చేసిన కొన్ని మందులు ఆన్ లైనులో మందుల చీటీ అప్ లోడ్ చెయ్యడం ద్వారా, సులభంగా చౌకలో ఇంటి దగ్గరే తెప్పించుకొనే   అవకాశం వుంది.    

తమ లాభాల్లో గండి పడుతుందనే భయంతో కొంత మంది దళారులు, తమకు ఇప్పటివరకూ వస్తున్న అధిక లాభాల్లో కోత పడుతున్నదన్న దుఘ్దతోనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఉండవచ్చు.    కావున, మధ్యాదాయ వర్గాలకు ఈ ఆన్లైన్ వ్యాపారం ద్వారా వస్తు కొనుగోళ్ళలో మంచి జరుగుతుందని ఆశిద్దాం.    

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాదుకా పట్టాభిషేకం


శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది -  రాముని అరణ్యవాసం , భరతుని పట్టాభిషేకం.   సీతా రాములిద్దరూ నార బట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికేగుతారు.  రాముని అరణ్య వాసం తరువాత భరతుడ్ని పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలనే కైకేయి కోరికకు భరతుడు తిరస్కరించి రాముడ్ని వెదుకుకుంటూ  అడవికి వెళ్ళి అన్నని  బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం మనకు తెలిసిందే.    తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరామ చంద్రుడు, అన్నపై అపారమైన వాత్సల్యం వున్న తమ్ముడుగా భరతుడు  మనకు ఆదర్శం.     

కానీ తమిళ రాజకీయాలలో అమ్మ కొత్త ఒరవడి సృష్టించింది.   పాపం పన్నీరు గారికి ఒక జత పాదుకలు కాదు 750 జతల పాడుకల్ని ఇచ్చింది.    నార బట్టల బదులు 1000  కంచి పట్టు చీరెలు ఇచ్చింది.   అలనాటి భరతుడికి మన పన్నీరుకు బోలెడు పోలికలు ఉన్నాయి.   శ్రీరామచంద్రుని అరణ్య వాసం ముగిసిన తక్షణమే భరతుడు అన్నకు రాజ్యాన్ని సంతోషంగా అప్పగించాడు. అమ్మ జైలు నుంచి వచ్చిన తక్షణమే పన్నీరు కూడా అదే చేస్తాడు.   రాముడు లేని అయోధ్య బోసిపోయింది.   అమ్మ లేని తమిళ్ నాడు కూడా అంతే.     దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకున్న పెద్ద సమస్య ఇదే.   కొడుకో, కూతురో, భార్యో, భర్తో వుంటే కొంతలో కొంత మేలు.    లాలు జైలుకేల్తూ వాళ్లావిడకి పట్టాభిషేకం చేసారు.    అదే ఒరిస్సా, బెంగాలు, తమిళ్ నాడులలో ఇలాంటి పరిస్తితి వస్తే  పన్నీరు లాంటి పాదుకల అవసరం పడుతుంది.    కానీ పన్నీర్ లాంటి మంచి పాదుకలు అన్నిపార్టీలలో అరుదుగా దొరుకుతారు.    ఇది అమ్మ అదృష్టం.  

శ్రీరాముడికి విప్లవ వనితకి ఒకటే తేడా - తండ్రి మాట సిరసావహించడం, నీతివంతమైన పాలన రాముడి సొంతం; కోటాను కోట్లు ప్రజా ధనం పోగేసుకోవడం అమ్మ నైజం. 


25, జూన్ 2014, బుధవారం

ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి


అయ్యలారా, 

ఇటీవలి ఎన్నికలలో మీరు ఘోర పరాజయం పొందిన పిమ్మట మీరందరూ కలసి కూర్చొని ఓటమికి గల కారణాలు విశ్లేషించారు.   ఇది ఒక రకంగా సంతాప సభలా జరిగింది.   ఇందులో వచ్చిన కొన్ని సూచనలలో ముఖ్యమైనవి అ) పార్టీకి ఒక టి వి మరియు పత్రిక కావాలని ఆ) పార్టీ అధ్యక్షురాలు మరియు యువ నేత ఆంధ్రాలో తరచూ పర్యటించాలని -- 


నిజంగా మీరు పార్టీ శ్రేయస్సు కోరుకొనే నాయకులైతే దయచేసి ఈ రెండు పనులు మాత్రం చెయ్యవద్దు.  పొరపాటున ప్రజలు మీ చానల్లో సోనియా గాంధీ బొమ్మ చూసారంటే,  వాళ్లకు గతంలో తెలుగు వారిని చీల్చి చెండాడుతూ  ఆమె జరిపిన దాడి (యుద్ధ విమానంలో బిల్లు పంపడం, పార్లమెంటులో దీపాలార్పడం) వగైరాలు గుర్తు వచ్చి మానుతున్న గాయాన్ని మళ్ళీ గెలికింది మీరే అని మిమ్మల్ని ఇంకా ఘోరంగా శిక్షించే  ప్రమాదం వుంది.   


పోనీ పాపం మీరు పత్రిక పెడితే, ఎవరిని విమర్శిస్తారు -- తెదేపాను విమర్శిస్తే, జగన్ బలం పెరుగుతుంది, జగన్ను విమర్శిస్తే తెదేపా బలం పెరుగుతుంది.   మిమ్మల్ని మీరు పోగుడుకునే దానికి అక్కడ ముడి సరుకు లేదు. కాబట్టి పరిస్తితులు కొంత అనుకూలించే వరకు పొరపాటున కూడా ఆ పని చెయ్యవద్దు.   


ఎన్నికల సమయంలో మీకు చేతై నంత వరకు మీరే ప్రచారం చేసుకోండి గానీ పొరపాటున కూడా ధిల్లీ నుంచి ఎవరినీ పిలవవద్దు.  సినిమా పిచ్చి కాస్త ఎక్కువగా వున్న ఆంధ్ర ప్రజలు కూడా చిరంజీవిని తిలకించడానికి ఇక ముందు సభలకు రారు.  కనీసం మీ అంతట మీరు ప్రచారం చేసుకుంటే, ఇద్దరికో మహా అయితే పది మందికో ధరావతు దక్కే అదృష్టం వుంది.   పై నుంచి మీ నాయకులు తరచూ వస్తే అది కూడా కష్టమే.   ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒకటో ఆరో సీట్లు రాక మానవు.  


ఇప్పటికీ ఏదో ఒక మూల కాంగ్రెస్పై కాస్తో కూస్తో అభిమానమున్న వాడిగా సిగ్గుతో ఈ సలహా ఇస్తున్నాను, తప్పక పాటించ గలరు.  

23, జూన్ 2014, సోమవారం

ఎవరు స్థానికులు?


వైద్య, తాంత్రిక మరియు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు దాదాపు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి.    తమిళనాడులో 8 నుంచి 12వ తరగతి వరకు ఆ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్ధైనా అక్కడి కాలేజీల్లో  స్తానికుడిగా గుర్తింపబడతాడు.     కర్ణాటకలో 1 నుండి 12 వ తరగతి లోపల ఏడు సంవత్సరాలపాటు (పి యు సి తప్పకుండా  కర్ణాటకలోనే చదవాలి) చదివితే వారు స్థానికులుగా గుర్తింపు పొందుతారు.   ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ సిస్టం ప్రకారం ఉండేది.    అందులోను స్థానికతను ఆనప కాయ-సొర కాయ, గోంగూర-కుంటికూర గుర్తింపులతో కాకుండా ఎక్కడ చదువుకున్నారనే వాస్తవాన్ని బట్టే ప్రవేశం వుండేది.


చిక్కల్లా, ప్రియతమ నాయకుడు దివంగత మేత ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్సుమెంటు పధకం వల్లనే వచ్చింది.   తెలంగాణాలోని ఇంజనీరింగు కాలేజీలలో మాత్రం 5-7 సంవత్సరాల స్థానికత ప్రకారం విద్యార్ధులు చేరవచ్చు. కానీ, ఫీజు రియంబర్సుమెంటు విషయంలో విద్యార్ధి తండ్రి తెలంగాణలో పుట్టి వుంటేనే ఈ సదుపాయం దక్కబోతోందని సమాచారం.   కాలేజీలో ప్రవేశానికి కూడా ఈ నిబంధన పెట్టినట్లయితే, సగానికి పైగా ఇంగాజీరింగు కళాశాలలు మూత పడతాయి.       


చట్ట సభలలో ఎంపీలుగా ఎం ఎల్ ఏ లు గా ఎన్నిక కాబడడానికి స్థానికత, వాళ్ళ నాన్న, తాత ఎక్కడ పుట్టింది అవసరం లేదు కానీ,  ఫీజు రియంబర్సుమెంటుకు మాత్రం కావాలి.    మరాఠీ, ఒరియా, కన్నడ మాతృభాషగా కలిగిన వ్యక్తులు 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్న వ్యక్తులు కూడా మన రాష్ట్రం నుండి శాసన సభకు గెలవ వచ్చు.   ఈ దేశంలో పుట్టని, ఈ దేశంతో సంబంధం లేని వారు కూడా ఈ దేశాన్ని వెనుక వుండి పరిపాలించ వచ్చు.


ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగిన పుల్లెల గోపీ చందు గారు తెలంగాణా బాడ్మింటన్ అసోసియేషన్కు నిన్ననే కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   మరి వారి స్థానికతకు కొలబద్ద ఏమిటో!   

గత మూడు సంవత్సరాలనుండి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని దిగ్విజయమైన బందుతో మొదలు పెట్టి  అదే రెచ్చగొట్టే విధానాల ద్వారా ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకోవాలనుకోవడం శోచనీయం.  


మోటార్ వాహనాన్ని అమ్మేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం మా కంపెనీ సలహా మీద కొన్ని మోటార్ బైకులు షోరూం వాళ్లకి ఇచ్చి కొత్త వాహనాలు తీసుకున్నాము.   ప్రతి షోరూంకు అనుబంధంగా కొంత మంది ఏజెంట్స్ వుంటారు.  మన పాత వాహనం వాళ్ళు తీసుకొని షో రూం వాడికి డబ్బు ఇస్తారు.    షోరూం వాడు మన దగ్గర ధరలో వ్యత్యాసాన్ని తీసుకొని మనకు కొత్త వాహనం ఇస్తాడు.     ఈ మొత్తం వ్యవహారం మనకి కొత్త వాహనం వచ్చిన సరదాలో మర్చిపోతాం.   

ఇటీవలే మా ఆఫీసుకు కోర్టు నుండి 'సమన్స్' వచ్చాయి.    దాని సారాంశం -- మీ పేరిట వున్న వాహనం ఒక రోడ్డు ప్రమాదంలో వుందని, ఎవరికైతే మీ వాహనం వలన గాయాలు తగిలాయో వారు మీ మీద మూడు లక్షలకు నష్ట పరిహారం వేసారని --  పాత కాయితాలు తిరగేస్తే, తెలిసినది ఏమిటంటే, మా పాత వాహనం కొనుగోలు చేసినవాడు దానిని తన పేరిట మార్చుకోలేదు.    వాహన బీమా కూడా మా కంపెనీ పేరిట వాడే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు.   షోరూము వాడు మా దగ్గర నుండి 10,000 నగదు (పాత వాహనం విలువ) గాను మిగిలినది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనూ ముట్టినట్లు కొత్త బండి తాలూకు బిల్లులలో చూపించాడు.      బండి కొనుగోలుదారుడు చేసిన తప్పులకు మేము న్యాయస్థానం చుట్టూ తిరగ వలసి వస్తున్నది.     

అందుకనే, ఏదైనా వాహనం అమ్మినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా న్యాయవాదిని సలహా అడిగితే, ఆయన చెప్పిన అంశాలు -- 

-- కొనుగోలు చేసిన వ్యక్తీ నుండి రశీదు తీసుకోవడం (Delivery నోట్) మరవద్దు
-- వాహనం అమ్మిన మరుసటి రోజే, సంబంధిత బీమా సంస్థకు మరియు ఎక్కడైతే వాహనం మొదట  నమోదు
    అయ్యిందో ఆ యొక్క R.T.A కార్యాలయానికి ఈ transaction తాలూకు వివరాలు డెలివరీ నోటు నకలుతో
    రిజిస్టర్డ్ పోస్టు చేసి దాని రశీదును భద్రపరచుకోవడం మంచిది.
-- వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి వారి లైసెన్స్ కాపీ ఉంచుకోవడం మంచిది.
-- వాహనం అమ్మిన నెల తరువాత  R.T.A వారి వెబ్ సైట్ లో వాహనం సంఖ్యతో దాని ఓనర్ పేరు తెలుసుకోవచ్చు
     దానిలో ఇంకా మీ పేరే వుంటే మీరు తక్షణం మేల్కొని R.T.A ను సంప్రదించండి

పైన తెల్పిన వివరాలు  చదవడానికి చాలా చిన్నవిగా వుంటాయి.  అనుభవించే వాడికి అసలు విషయం తెలుస్తుంది. బైకుకు ఏక్సిడెంట్ అయింది కాబట్టి ఏదో రకంగా రాజీకి వచ్చి డబ్బులిచ్చి వదిలించుకోవచ్చు.    అదే బైకు అసాంఘీక శక్తుల చేతులో పడితే అంతే సంగతులు.  


21, జూన్ 2014, శనివారం

హిందీ జాతీయ భాష కాదు

ఏదో ఒక సంచలన ప్రకటన చేసి అసలు విషయాలను పక్క దారి పట్టించడం పాలకులకు పరిపాటైంది.   రైల్వే చార్జీలు పెంచిన ప్రకటన వెలువడిన రోజే దేశంపై హిందీ భాష దాడి వార్తను కూడా వెలువరిస్తారు.   కరుణానిధి లాంటి వాళ్ళు రైల్వే చార్జీల పెంపు పక్కన పెట్టి హిందీ గురించి మాట్లాడతారు.   

హిందీ మన జాతీయ భాష కాదు అని ఇటీవలే గుజరాత్ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.  సురేష్ కచ్చాడియా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం, దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషగా హిందీ వుందని, దానిని జాతీయ భాషగా రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన లేదని తీర్పు ఇచ్చింది.  

అధికార భాషా చట్టం 1963 ప్రకారం పార్లమెంటు కార్య కలాపాలు హిందీలో మరియు ఆంగ్లంలో జరపవచ్చని పేర్కొంది.   పార్లమెంటు చేసే ప్రతి చట్టం హిందీ లోను  ఆంగ్లంలోను అందుబాటులో ఉండేలా నిర్దేశించింది.  

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.  అందులో సందేహం లేదు.   దానిని బలవంతంగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం లేదు.   ఉత్తరాది వారికి ఇప్పటికీ దక్షిణాది వారంటే చులకన.  దక్షిణాది వారి భాష, వేషం, ఆచార  వ్యవహారాలను వారు ఈసదించుకుంటారు.   

ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సమస్యల ముందు హిందీ భాష బలవంతంగా రుద్దడం అనేది ప్రాముఖ్యత లేని విషయం.   దేశం మొత్తం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి, ఎవరు ఏ భాషలో చడువుకోవాలి అనేది వారి వారి స్వంత నిర్ణయంగా వదిలి వెయ్యాలి.    కర్ణాటక రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక విద్యనూ కన్నడ మాధ్యమంలో చదివిన విద్యార్ధులకు వైద్య మరియు తాంత్రిక విద్యలో 5 శాతం రిజర్వేషన్ వుంది.   కన్నడ మాధ్యమం విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో చదివితే రిజర్వేషన్ మరింత ఎక్కువ.   వాళ్ళ భాషను ప్రోత్సహించే విధానం యిది. 

ఉద్యోగం కోసం ఆంగ్లం, దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి హిందీ ఆత్మ సంతృప్తికి అమ్మ భాష అవసరం. 

12, జూన్ 2014, గురువారం

తెలుగు నాడు లేక తెలుగు సీమ

నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఏ పేరు బాగుంటుంది అనే విషయంపై ప్రముఖ తెలుగు ఉపన్యాసకులు ఆచార్య ఆర్ వి సుందరం గారు తెలుగు తేజం పత్రికలో ఒక వ్యాసం రాశారు.   దాని పూర్తి పాఠాన్ని సంపాదకుని అనుమతితో బ్లాగులో వుంచుతున్నాను.


3, జూన్ 2014, మంగళవారం

దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రం కర్ణాటక


ఈ రోజు బెంగలూరు మిర్రర్ దిన పత్రికలో ప్రముఖ చరిత్ర కారుడు శెట్టర్ వ్యాస్యం మొదటి పుటలో అచ్చైనది.   పాఠకుల కోసం వ్యాసం లింకు ఇస్తున్నాను.    చరిత్ర పుటల్లోకి తీసుకెళ్ళిన మంచి వ్యాసం. ఇది తప్పక చదవ వలసిన విషయం. మీ కోసం ............

http://www.bangaloremirror.com/bangalore/cover-story/We-are-the-biggest-souther-state-now/articleshow/35963324.cms?

2, జూన్ 2014, సోమవారం

మరో తెలుగు రాష్ట్రం ఏర్పడక తప్పదా ?


గత రెండు వారాలుగా జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పరిస్థితులను గమనిస్తే ప్రత్యేక రాయలసీమ కూడా ఏదో ఒక రోజు ఆవిర్భవించక తప్పదేమో అనిపిస్తుంది.     అన్ని కార్యాలయాలు ఒకే చోట పోగు చేసే కుట్ర జరుగుతున్నది.   

రాజధాని గుంటూరు-బెజవాడ మధ్య 
వ్యవసాయ విశ్వ విద్యాలయం - గుంటూరు జిల్లా లాం అనుకూలమైనది 
రైల్వే డివిజన్ - బెజవాడ  బాగా అనుకూలమైనది 
శాసన సభ - రాజధాని ఎక్కడుంటే అది కూడా అక్కడే వుండాలి కదా 
ఆర్టీసీ కేంద్ర కార్యాలయం - విజయవాడైతే బాగుంటుంది 
మెట్రో రైలు - విజయవాడ - గుంటూరు - తెనాలి బాగా అనుకూలం 
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం - విజయవాడ నుంచే జనాలు ఎక్కువ                                                          విమానం ఎక్కువ ఎక్కుతారు 
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం - ఇంకెక్కడ విజయవాడ 
ఉన్నత న్యాయ స్థానం - గతంలో ఒప్పుకున్న గుంటూరు 
డి ఐ జి కార్యాలయం - మంగళగిరిలో పానకాలు స్వామి సాక్షిగా 


ఇక మిగిలినవి -- 
పెద్ద కేంద్ర కారాగారం - కడప బాగా అనువైనది 
ఐ ఐ టి - ఇచ్చినప్పుడు చూద్దాం 
ఐ ఐ ఎం - వచ్చినప్పుడు చూద్దాం 

మరి రాయలసీమకో - ముఖ్యమంత్రే రాయలసీమ నుంచి వచ్చాడు.   అదో పెద్ద వరం.  

ఇప్పటికే హైదరాబాదు కేంద్రంగా జరిగిన అభివృద్ధితో తల బొప్పి కట్టింది.   ఇప్పుడు విజయవాడ కేంద్రంగా అదే తంతు జరగబోతోంది.    రాష్ట్రాలు ఏర్పడింది, ఏర్పడేది రియల్ ఎస్టేట్ యజమానులకొసమా లేక సామాన్యుల కోసమా తెలియని పరిస్తితి.   సామాన్యుడు గుంటూరు విజయవాడ పరిసరాల్లో సెంటు స్థలం కొనుగోలు చేసే పరిస్థితులలో లేదంటే నమ్మండి.    

వచ్చే ఎన్నికలలో కూడా జగన్ పార్టీ,  కాంగ్రెస్ పార్టీ చతికిల పడితే, తీరిక సమయం ఎక్కువ వుంటుంది కాబట్టి విజన్ 2025 లో భాగంగా ప్రత్యెక రాయలసీమ ఉద్యమం బలపడే అవకాశం వుంది.    ఏం తెలుగు వారికి మూడు రాష్ట్రాలు ముగ్గురు ముఖ్యమంత్రులు వుంటే తప్పా?   శ్రీ బాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు.   మేము మద్రాస్ తోనే కలిసివుంటాం అంటే, మమ్మల్ని మభ్య పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నారు.   సినిమాలలో మమ్మల్ని ఫాక్షనిష్టులుగా చూపిస్తూ అవమాన పరుస్తున్నారు.  మా భాష వేరు మా యాస వేరు, మా తిండి వేరు, మా వేష భాషలు, సంస్కృతి వేరు. అమాయక రాయలసీమ ప్రజలను ఆంధ్రులు ఎంతకాలం దోపిడీ చేస్తారు అని వరస డవిలాగులు మళ్ళీ ఒక దశాబ్దం తరువాత వినాల్సి రావచ్చు. హంపీ కోట బాక్ డ్రాపుతో తిమ్మమ్మ మర్రిమాను సాక్షిగా మరో లోగో గీయవచ్చు. 

ఆర్ధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ (ముఖ్యంగా అనంతపూర్) ప్రాంతాలకు మంచి జరిగినప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలోని అసమానతలు తొలగి మరో విభజనకు బీజం పడకుండా వుంటుంది. 

తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు


భారత దేశ 29 వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు.   దేశంలో మొట్టమొదటి సారిగా ఒక ప్రాంతీయ భాష మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడినట్లైంది.   భౌగోళికంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో వున్నా మనం మాట్లేడే భాష తెలుగు.   తెలంగాణా అంటేనే తెలుగు మాట్లాడే ప్రాంతం.   అచ్చ తెలుగు మాట్లాడే ప్రాంతం తెలంగాణా అని నేను నమ్ముతాను. 


ఈ శుభ సమయంలో ఒక ప్రాంతం వారు గెలిచారానో మరో ప్రాంతం వారు ఓడారనో భావించడం మూర్ఖత్వం.   రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజకీయ క్రీడ పరాకాష్టకు చేరింది.   ఈ క్రీడలో  కాంగ్రెస్ పార్టీ  పోషించిన పాత్ర తెలంగాణా లో స్థిరపడ్డ తీర సీమాన్ద్రులని కూడా కలిచివేసింది.   వారిలో ఎక్కువ మంది తెరాసకు ఓటేశారే కాని, కాంగ్రెస్  వైపు మొగ్గు చూపలేదు.   ఇది కూడా శుభ పరిణామమే.    


ఈ రోజు నుండైనా రెండు రాష్ట్రాలలోని తెలుగు వారందరు మరి ముఖ్యంగా నెటిజన్లు ఒకరినొకరు దూషించుకోకుండా  ప్రేమానురాగాలతో   అభివృద్ధి పధంలో పయనిద్దాం . 

19, మార్చి 2014, బుధవారం

గెయిల్ ట్రేడ్వెల్ - హోలీ అండ్ హెల్


గెయిల్ అనే ఆస్ట్రేలియాకు చెందిన వనిత తను మాతా అమృతానందమయి (సుధామణీ)ఆశ్రమంలో ఎలా చేరింది, 20 సంవత్సరాల తరువాత ఎలా తప్పించుకుంది, అక్కడ ఆవిడ అనుభవించిన నరకం, 'అమ్మ' కొట్టిన దెబ్బల తిట్టిన తిట్ల  తాలూకు వివరాలు   తన డైరీలో రాసుకున్న సంఘటనల ఆధారంగా ఇటీవల విడుదలైన పుస్తకమే  "హోలీ హెల్".  


కేరళ ఆశ్రమంలో తాను పడ్డ కష్టాలు, అక్కడ జరిగే దోపిడి మొదలగు విషయాలు కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో వివరించింది.   ప్రస్తుతం మన దేశంలో వున్న బాబాలు వారి వికృత చేష్టలు చూసిన తరువాత గెయిల్ రాసిన దాంట్లో వాస్తవం వుందని నమ్మవలసి వస్తుంది.     


హిందూ మతంలోని బలహీనతలను ఆసరాగా చేసుకొని స్వామి నిత్యానంద, పిరమిడ్ పత్రీ , అమ్మా భగవాన్,  కర్నూల్ జూనియర్ బాబా, ఆసారాం బాపు, ఒంగోలు దగ్గరలో ఆశ్రమం కట్టుకున్న ఇంకో భూ కబ్జాదారుడు రామ అవధూత  లాంటి వారు భక్తి పేరిట కోట్లు గడిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.    పనిలో పనిగా సినిమా వాళ్ళు, ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ అధికారులు, రాజకీయ నాయకులు వీరిని దర్శనం చేసుకొని ఆ ఆశ్రమానికి లేని గుర్తింపు తెస్తారు.  


కొంత కాలం క్రితం ఒక ఛానల్ వారు అమ్మా భగవాన్ ఆశ్రమంలో జరిగే వికృత చేష్టలు రోజంతా పదే పదే చూపించారు.   తరువాత ఏమి జరిగిందో ఏమో, ప్రభుత్వమూ చర్య తీసుకోలేదు, టి వి వారు మర్చిపోయారు.  


ఈ పుస్తకంలో అక్కడక్కడ కొన్ని అభ్యంతరకరమైన, అసభ్య రాతలున్నప్పటికి, కేరళలోని ప్రముఖ ఆశ్రమం పుట్టుక దాని ఎదుగుదల ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి వుంటే చదవచ్చు. 

కాంగ్రెస్కు గ్రహణం తాత్కాలికమే


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి మెల్లిగా ఒక్కొక్కరే  తెదేపాలోకి చేరుకుంటున్నారు.   కారణం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని.   విభజించిన తీరును తప్ప పట్టవచ్చేమో గానీ, విభజనకు మొట్ట మొదటి నుండి ఒప్పుకున్న తెదేపా ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్య పార్టీ  ఎలా అయింది? అన్ని పార్టీలు రోజూ మైకుల ముందుకొచ్చి సమస్యను పరిష్కరించమన్నారు, కాంగ్రెస్ వారు వాళ్లకు తోచిన పరిష్కారం చేశారు.   కేంద్ర, రాష్ట్ర మంత్రులుచివరి నిమిషం దాకా మంత్రి పదవి వదులుకోవడానికి ఇష్ట పడకుండా, ఇంకా ఏదో అద్భుతం జరగబోతోందని భ్రమలు కల్పించారు. మరీ విచిత్రం ఎన్ టి ఆర్ గారి కూతురు భాజపాను సమైక్య పార్టీగా భావించడం.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తెలిశాక జెండా, అజెండా మార్చేశారు.   రేపు అధికారంలోకి వచ్చాక, బాబు గారు ఎంత చాణుక్యుడైనా, ఈ వలస పక్షుల దెబ్బకు భవిష్యత్లో విల విల్లాడాల్సిందే.   


ఒక పక్క తెలంగాణా పునర్నిర్మాణం మరో పక్క ఆంధ్రాను సింగపూరుగా మార్చడం మా వల్లే సాధ్యమౌతుందని అన్ని పార్టీల వారు వక్కాణిస్తున్నారు. అంటే గత 60 సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని ఒప్పుకుంటున్నారు.    2019 ఎన్నికల నాటికి ఎన్నో మార్పులు జరగ వచ్చు. నిజంగా ఆంధ్ర ప్రదేశ్ సింగపూరు లాంటి ప్రగతిని సాధిస్తే, ఆ క్రెడిట్ రాష్ట్రాన్ని విభజించి మంచి పని చేసిన కాంగ్రెస్కు దక్కాలి.   ఐదు  సంవత్సరాల తరువాత జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావచ్చు అని అనిపిస్తే, పోలో మంటూ ఇదే నాయకులు బాబును తిట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకో లేక ఇంకో నటుడు పెట్టబోయే పార్తీలోకో చేరడం ఖాయం.   అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని.  

18, మార్చి 2014, మంగళవారం

రాజకీయ పార్టీల గురివింద నీతులు

ఎన్నికలు వచ్చేప్పటికి అన్ని పార్టీలు సిద్ధాంతాలు గాలికి వదిలేస్తాయి.   దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు అప్పటిదాకా అవినీతి గురించి తెగ ఉపన్యాసాలు చెప్పీ పార్టీలు 'మేము గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం' అంటూ నిస్సిగ్గుగా ప్రకటిస్తాయి.   అవినీతి జరిగిందని ప్రాధమిక సాక్షాధారాలు ఉండి జైళ్లకు వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా యధేచ్చగా చట్ట సభలలో పోటీకి నిలబడుతున్నారు.    అలాంటి అభ్యర్ధులలో గెలిచిన వాళ్ళు విర్రవీగుతూ ఒక ప్రకటన చేస్తారు - మేం ప్రజా న్యాయస్థానంలో గెలిచాం, కోర్టు తీర్పు కన్నా ఇదే గొప్ప అన్నట్లు చెప్తారు.  

ఇలాంటి జాబితాలో పేర్లున్న (నాకు గుర్తున్న)  కొందరు -- 

1) బి ఎస్ యడ్యూరప్ప 
2) కనిమొళి 
3) రాజా 
4) రైల్ గేట్ బన్సాల్ 
5) జగన్ బాబు 
6) లాలు ప్రసాద్ యాదవ్ 
7) మోపిదేవి 
8) శ్రీరాములు 

అవినీతి కేసుల్లో శిక్షపడ్డ గుజరాత్ మంత్రులు భావి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.     ఈ సారి ఎన్నికలలో వారే మళ్ళీ పోటీ చేసే అవకాశం వుంది.  


ఎంతసేపు ఎన్నికల కమిషన్ ఇలాంటి వారి విషయంలో  కఠినంగా వ్యవహరించడం లేదు అని అంటాం కానీ, ఇలాంటి నాయకులకు ధరావతు కూడా దక్కకుండా ఓడించాలని ఓటరు అనుకోడు.   కులమో, మతమో లేక ప్రాంతమనో ఊబిలో చిక్కుకుంటాము.    ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ మొదలైంది.  తండ్రి జైలుకు వెళితే కొడుకో, కూతురో లేక ఆయన భార్య గాని ఆ నియోజక వర్గం నుంచి కర్చీఫ్ వేస్తారు.  ప్రజలకు వీళ్ళు తప్ప గతి లేదు.    ఈ పరిస్తితి మారాలంటే సమాజంలో మార్పు రావాలి.    విద్యావంతుల శాతం పెరగాలి.   



8, మార్చి 2014, శనివారం

విజయ మాల్యా ఎక్కడో పోలీసులకు తెలియదట




వార్తల్లోని వ్యక్తీ, రాజ్యసభ సభ్యుడు, లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్య గారు పోలీసుకులకు గత సంవత్సరం నుండి కనపడలేదట.    ఆదాయపు పన్ను శాఖ వారు కోట్ల రూపాయల టి డి ఎస్ (Tax deducted at Source) పన్ను ఎగవేతకు కాను  ఆయన మీద  బెంగలూరులో ఆర్ధిక నేరాల  న్యాయస్థానంలో 2013 లో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.   గౌరవ న్యాయస్థానం వారు మాల్యాను హాజారు పరచాల్సిందిగా కబ్బన్ పార్క్ పోలీసులకు సమన్స్ పంపించింది.    2103 ఫిబ్రవరిలో జారీ అయిన సమన్స్ శాసన సభ ఎన్నికల ఒత్తిడి కారణంగా అందచేయలేక పోయామని పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది.    కోర్టు మళ్ళీ సమన్సు జారీ చేసింది.  కొంతకాలానికి పోలీసులు న్యాయస్థానానికి నివేదిక పంపుతూ తాము IPL క్రికెట్   ఆటల బందోబస్తుతో తలమునకలై ఉన్నామని అందుకే మాల్యాకు సమన్స్ అందజేయలేక పోయామని బాధ పడ్డారు.  


న్యాయమూర్తి గారికి కోపం వచ్చింది.   కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ నుండి కూత వేటు దూరంలో వున్న పంచ తార హోటలులో ఆయన గారు IPL వేలంలో పాల్గొన్నట్లు, IPL పోటీలు జరిగిన క్రీడా ప్రాంగణంలో మాల్య తాపీగా కూర్చిని తిలకించినట్లు వున్న వార్తా పత్రికల క్లిప్పింగులను పోలీసు వారికి ఇచ్చారు.    విధిలేక మరోసారి సమన్స్ జారీ చేసింది న్యాయస్థానం.  


ఈయన గారు మన గౌరవ పెద్దల సభలో పటిష్టమైన చట్టాలు చేసే సభ్యులు.   అందమైన అమ్మాయిలతో అసభ్యకరమైన కాలెండర్లు ముద్రించి ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పెద్ద మనుషులకు పంపిస్తుంటాడు.   ప్రభుత్వ రంగ బాంకుల నుంచి ఈయన గారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు  ఇప్పుడు నిరర్ధక ఆస్థులుగా మారాయి.  


రైతులు తీసుకున్న రుణాలు, గృహ రుణాలు, బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కట్టడంలో జాప్యమైతే, ప్రభుత్వ రంగ బాంకులు పత్రికలలో ప్రకటన యిచ్చి మరీ ఆస్తులను అమ్మేస్తారు.   కానీ మన చట్టం మల్యా లాంటి వారికి వర్తించదు.  

7, మార్చి 2014, శుక్రవారం

కేజ్రీవాల్ మోడీని అడగాలనుకుంటున్న కొన్ని ప్రశ్నలు


ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ప్రధాని అబ్యర్ధి నరేంద్ర మోదీని కలవాలని ప్రయత్నించారు.   అపాయింట్మెంట్ దొరక్క వెనకకు వచ్చాడు.   ఆయన మోడీని కొన్ని ప్రశ్నలు అడగాలని తలంచారు.   ఆ అడిగేదేదో ప్రజల సమక్షంలో ఒక వేదిక మీద ప్రసార మాధ్యమాల నడుమ జరిపితే ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా.    ఆయన అడగాలనుకున్న ప్రశ్నలలో కొన్ని మీ కోసం -- 

1)450 కోట్ల మత్య శాఖ కుంభకోణంలో శిక్షించబడిన పురుషోత్తం సోలంకిని మీ మంత్రివర్గంలో ఇంకా కాబినెట్ మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారు

2)గనుల కుంభకోణానికి సంబంధించి 3 సంవత్సరాల శిక్ష విధింపబడిన బాబు బోఖడియాను  (ప్రస్తుతం బెయిలులో వున్నాడు) ఇంకా మీ మంత్రివర్గం నుండి ఎందుకు తొలగించలేదు

3)సౌర శక్తిని ప్రైవేటు వ్యక్తుల నుండి యూనిట్కు 15 రూపాయలు చొప్పున మీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా మిగతా రాష్ట్రాల్లో యూనిట్ 8/- కు కొంటున్నారు.   దీని వెనుక వున్న రహస్యం ఏమిటి

4)పరిశ్రమల కోసం మీరు చేసిన భూ స్వాధీనంలో రైతులకు నష్ట పరిహారం ఎందుకు తక్కువగా ఇచ్చారు.

5)భూతల స్వర్గంగా మీరు ప్రచారం చేసుకుంటున్నగుజరాతులో  1500 ఖాళీలు గల చిన్న గుమాస్తా ఉద్యోగానికి  13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం కాదా  

6) అంబానీల కుటుంబానికి చెందినా సౌరబ్ పటేల్ మీ మంత్రివర్గంలో సహజ వాయువులు, పెట్రోలియం, శక్తి శాఖామాత్యులుగా వుండగా అంబాని కుటుంబ కంపెనీలతో ప్రభుత్వం జరిపే లావాదేవీలు పారదర్శమ్గా ఎలా వుంటాయి 

7) ఉన్నత విద్యావంతులను మీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి 5,300/- నెల జీతం ఇస్తున్నారు. ఈ జీతంతో కుటుంబం పోషణ వీలవుతుందా. 

8) అభివృద్ధి అంటే గుజరాత్ - గుజరాత్ అంటే అభివృద్ధి అనిచేప్పే మీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయ స్థితిలో వున్నాయి. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు  

ప్రశ్నలైతే బాగున్నాయి కానీ జవాబులు దొరుకుతాయా!

6, మార్చి 2014, గురువారం

బి ఎస్ ఆర్ సి పి - వై ఎస్ ఆర్ సి పి కొన్ని పోలికలు

మనిషిని పోలిన మనుషులు ఎక్కడో కోటికి ఒక్కరే ఉంటారని చెప్తారు.  కానీ, ఎంత యాదృశ్చికం! రెండు వేరు వేరు రాష్ట్రాలు.  రెండు వేరు వేరు భాషలు.   వేరు వేరు పార్టీలు, కానీ కవల పిల్లల్లాంటి పోలికలు.   పరికించండి --- 





*బడవర శ్రామికర రైతర కాంగ్రెస్ పార్టీ (బిఎస్ఆర్ కాంగ్రెస్) 

*యువక శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎసార్ కాంగ్రెస్) 

*రెండు పార్టీలది  పంఖా గుర్తే 

*ఇద్దరి పార్టీ పేరులో మనుషల పేర్లు దాగి వున్నాయి.  బళ్ళారి ఆయన పేరు బి శ్రీరాములు (బి ఎస్ ఆర్) జగన్ గారి  పార్టీ పేరు వైఎస్ఆర్ (దివంగత నేత, ప్రియతమ నాయకుడి పేరు) 

*ఇద్దరిపై ఆరోపణలకు కేంద్ర బిందువు - గనులు, గాలి(వీచేది కాదు), నీరు, డబ్బు, భూమి (పంచ భూతాలు)  

*ఇద్దరి పార్టీ జెండాల రంగులు చూడండి, చాలా దగ్గర పోలికలు వుంటాయి  

*రెండు పార్టీలలోని గుర్తులలో వున్న బొమ్మలను చూస్తే వైద్యం, విద్య, రక్షిత నీరు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  

*ఇద్దరికీ చెల్లి/అక్క వున్నారు.   వాళ్ళు ఇద్దరూ రాజకీయాలలో వున్నారు. 

*రెండు జెండాలలో ఆకుపచ్చ, బ్లూ కొట్టచ్చినట్లుగా ఒకే పాటేర్న్లో వుంటాయి.  

*ఇద్దరూ పాదయాత్ర/కారు యాత్ర చేసి వారి వారి రాష్ట్రాలు కలియ తిరిగారు 

*కొంత కాలం క్రితం వరకు ఒకరు ప్రతిపక్ష జాతీయ పార్టీలో వుండగా,       మరొకరు జాతీయ అధికార పక్షంలో సభ్యులు 

*రాష్ట్రాలు వేరైనా ఇద్దరి మాత్రు భాష ఒకటే 

*జగన్ గారికి కడపలో మంచి పట్టు వుండగా, శ్రీరాములు గారికి బళ్లారిలో తిరుగు లేదు 

* ఒకప్పుడు జగన్ కి గురివిణి సోనియా కాగా శ్రీరాములుకు సుష్మా మాత్రు సమానురాలు.  ఇద్దరూ  స్త్రీ మూర్తులే కదా.  

* తమ తమ పార్టీలతో విభేదాలు వచ్చి ఇద్దరూ పార్టీలు పెట్టుకున్నారు

* గాలంటే ఇద్దరికీ ప్రాణమే 

* రెండు పార్టీలు పుట్టిన సంవత్సరం 2011 

* విద్యార్హతలు  - ఇద్దరూ పట్టభద్రులే - ఒకరు బి ఎ మరొకరు బి కామ్ 

* ఆంగ్ల అక్షర క్రమంలో B రెండోది కాగా, Y చివరనుండి రెండోది. 


*శ్రీరాములు భాజపా నుంచి బయటకు వచ్చి ఎం ఎల్ ఎ గా పోటీ చేస్తే, భాజపా ధరావతు కోల్పోయింది .  జగన్ కూడా  కాంగ్రెస్ వదిలి సొంతంగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు ధరావతు దక్కలేదు 

ఇది ఇలా వుండగా, బి ఎస్ ఆర్ పార్టీ త్వరలో భాజపాలో కలవనుంది, మరి వై ఎస్ ఆర్ సి పి సంగతి ఏమవుతుందో చూద్దాం. 

5, మార్చి 2014, బుధవారం

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విలీనం


మేఘాలు చూసి ముంత ఒలకపోసిందిట వెనకటికి ఒకావిడ.   సోనియమ్మ కూడా తెరాసను చూసింది, యుద్ధ విమానంలో బిల్లు పంపించి ఒక ప్రాంత ప్రజలను శత్రువులుగా చూసింది.   నిన్న పండు గారు కొట్టిన దెబ్బకు  దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయింది.  ఫాం హౌస్లో పడుకుంటాడు అని ఎగతాళి చేసిన నాయకులకు ఆయన ఫాంలోకి వస్తే ఏం జరుగుతుందో సినిమా చూపించాడు.  తెలంగాణలో కచరాకు సరిసమానమైన జనాకర్షణ గల కాంగ్రెస్ నాయకుడు లేడు.    కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే విమర్శించ గల వాళ్ళు, పత్రికలకు టి.వి లకు స్టేట్ మెంట్స్ ఇచ్చే ముసలి ముతక   మాత్రమే కాంగ్రెస్లో వున్నారు. కాస్తో కూస్తో పేరు, చడువు, తెలివితేటలున్న జైపాల్ రెడ్డి గారు తెలంగాణా మొత్తం తిరగడం కష్టం.  అలాగే తీర సీమాన్ధ్రలో కూడా కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు మిగలలేదు.   చివరకు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తెరాసలో,  తీర సీమాంధ్రలో వైకాపాలో కలపాల్సిన పరిస్తితి.   తమిళ్ నాడు, ఆంద్ర, బెంగాల్, బీహార్, యు పి, ఎంపీ,  ధిల్లీ, ఒరిస్సా ---- హతవిధీ,  అన్నింటా మూడో స్థానంలోకి కాంగ్రెస్ దిగజారింది.  ఏ రాష్ట్రంలో కూడా సొంతంగా పోటీ చేసే పరిస్తితే లేదు.  కాంగ్రెస్ను ఆ దేవుడే కాపాడాలి.   

3, మార్చి 2014, సోమవారం

సినీ నటులు రాజకీయాల్లో అవసరమా


తెలంగాణా వారి అదృష్టం - ఆ ప్రాంతంలో సినీ నటులూ తక్కువే, వారిలో రాజకీయాలలో ప్రవేశించిన వారు తక్కువే. ఎన్నిచేప్పినా విజయశాంతి ఆంధ్ర ప్రాంతము నుండే వచ్చిందనేది నిర్వివాదం.   బాబు మోహన్ మాత్రం దండయాత్రలు చేస్తున్నాడు.   కానీ తీర ఆంధ్ర ప్రదేశ్లో వోటర్లపై వీరి ప్రభావము చాలా ఎక్కువ.   నాకు గుర్తున్నంతవరకు క్రింది జాబితాలో ఇచ్చిన నటులందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన వారే -- 

1) ఎన్ టి ఆర్ 
2) కృష్ణ 
3) కృష్ణం రాజు 
4) విజయ నిర్మల 
5) జమున 
6) ఎ వి ఎస్ 
7) ధర్మవరపు సుబ్రహ్మణ్యం 
8) జీవిత/రాజశేఖర్ 
9) చిరంజీవి 
10) టి సుబ్బి రామి రెడ్డి 
11) రామానాయుడు 
12) రోజా 
13) మోహన్ బాబు 
14) కోట శ్రీనివాస రావు 
15) రావు గోపాల రావు 
16) కొంగర జగ్గయ్య 
17) నాగభూషణం 
18) శివప్రసాద్(తిరుపతి)
19) గిరిబాబు 
20) శివకృష్ణ 
21) నరేష్ 
22) దాసరి నారాయణ రావ్ 
23) జయసుధ 
24) శారద 
25) విజయ్ చందర్ 
26) జయప్రద 
27) కవిత 
28) మురళీ మోహన్ 
29) సుమన్ 
30) శాయి కుమార్ 
31) హరికృష్ణ 
32) బాలకృష్ణ 
32) పవన్ కళ్యాణ్ 

(బ్లాగు చదివే వాళ్ళు ఇంకొన్ని పేర్లు సూచించ వచ్చు) 

సినిమా వారు రాజకీయాలలోకి రాకూడదని నా ఉద్దేశం కాదు.   ఉపాధ్యాయుడు తన బోధనా వృత్తి మాత్రం చేస్తే బాగుంటుంది కానీ, దానితో పాటు జీవిత భీమా ఏజెంట్గా కూడా పని చేస్తేనే సమస్య.  

ఒక్క రామారావు తప్ప మిగిలిన వారికి రాజకీయాలు ఫుల్ టైం కాదు.   తీర సీమాన్ధ్రలో మొదటి నుంచి సినిమాలు చూడడం, నటులపై అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం చాలా ఎక్కువ.   ఈ సినీ అభిమానమే వోట్లుగా రూపాంతరం చెందుతుంది.   

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది ఉన్నత  విద్యావంతులైన నాయకులు.   పదవిని ఒక భూషణంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూసే వ్యక్తులు.   ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకత్వంలో,  అయితే గుత్తేదారు లేదంటే సినీ రంగం వారు మాత్రమే ఎన్నికలలో ముందుకు వస్తున్నారు.    కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నత విద్యావంతులు, వ్యాపారాలు లేనివాళ్ళు, పదవిని సమాజ సేవకోసం మాత్రమే వినియోగించే వాళ్ళు అత్యవసరం.   

      

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చిన్న రాష్ట్రాల పేరిట రాజకీయ క్రీడ


ఒక కొత్త జిల్లా ఏర్పడితే కనీసం 10 మంది రాజకీయ నిరుద్యోగులకు పదవి దక్కుతుంది, అదే ఒక రాష్ట్రమే ఏర్పడితే వందలమంది రాజకీయ నిరుద్యోగులకు పదవి లభిస్తుంది.   ఈ సూత్రాన్ని బాగా వంటపట్టించుకున్న భాజపా ఈ ఊబిలోకి కాంగ్రెస్ పార్టీని కూడా లాగింది.   అవసరాన్ని బట్టి దీపాలు ఆర్పి, తలుపులు మూసేసి, ఎంపీలను కొట్టించైనా మూజువాణీ పెట్టేసి రాష్ట్రాల  విభజన  జరపవచ్చని ఇటీవలే రుజువైంది.  భాజపా అగ్ర నాయకత్వం పదే పదే, తాము 3 రాష్ట్రాలు వేర్పాటు చేస్తే, ఇరు రాష్ట్రాలు మిఠాయిలు పంచుకున్నారు అని చెప్తూ  "రాజధానితో పాటు రాష్ట్రం విడిపోలేదు"  అన్న నగ్న సత్యాన్ని దాచిబెడతారు.  60 సంవత్సరాలకు పైబడి ప్రత్యెక రాష్ట్ర  డిమాండ్ వున్న గూర్ఖాలాండ్లో తెలంగాణా విభజన తరువాత కదలిక మొదలైంది.    గూర్ఖాలాండ్ నాలుగు దేశాల అంతర్జాతీయ సరిహద్దు (నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్) వెంబడి వుంది. తెలంగాణాలో రాజకీయ నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఆత్మ హత్యలు జరిగితే, గూర్ఖాలాండు ప్రజలలో విద్యావంతులు తక్కువ.   వారాల తరబడి బందులు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు వున్నాయి.   భాజపా అగ్రనేత జస్వంత్ సింగ్ 2009లో డార్జీలింగ్ పార్లమెంటు స్థానం నుంచి గూర్ఖాలాండు జనముక్తి మోర్చా మద్దుతుతో గెలుపొందాడు.   తెలంగాణలో సోనియా గాంధీ కేవలం గులాబీ కండువా మాత్రమే కప్పుకుని 2009 లో ప్రచారం చేసింది.   ఇక్కడ జస్వంత్ గారు ఏకంగా ఒక వేర్పాటు వాద, విచ్ఛిన్నకర శక్తితో చేతులు కలిపి వారి మద్దుతుతో ఎంపీగా కొనసాగుతున్నారు.   తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత గూర్ఖాలాండు ఉద్యమకారులు దిల్లీలో జస్వంత్ సింగు గారికోసం తెగ వెదికారు.   ఆయన ధిల్లీ లోనూ, డార్జిలింగు ఆఫీసులోను లేకపోవడంతో సమీప పోలీసు స్టేషన్ లో కూడా 'మిస్సింగ్ కంప్లైంట్' ఇచ్చారు.    


సీట్ల కోసం, వోట్ల కోసం వెంపర్లాడే జాతీయ పార్టీలుగా చెప్పుకొనే ఈ పార్టీలు ఏదో ఒక రోజు ఈ దేశ విచ్చిన్నానికి పరోక్షంగా సహాయం చేస్తాయనడంలో ఆశ్చర్యం లెదు.  

కాంగ్రెసుతో పొత్తు తెరాసకు నష్టం


తిరునాళ్ళకో, జాతరకో వెళ్ళేటప్పుడు ఉన్నంత హుషారు తిరిగి ఇంటికి వచ్చేప్పుడు వుండదు.  ఇది చాలా సహజం. ఉద్యమకారునికిగా కచరా సంవత్సరం క్రితం కాంగ్రెసును దుమ్మెత్తి పోస్తూ "తెరాస ను కాంగ్రెస్లో విలీనం చేస్తే ప్రత్యెక రాష్ట్రం ఇస్తామంటున్నారుగా, ఎంతో కష్టపడి పెంచిన పార్టీని మీ బొంద మీద కలపడానికి సిద్ధం, ఇప్పుడైనా రాష్ట్రం ప్రకటించండి" అని తనకు ఇష్టం లేకపోయినా స్వరాష్ట్రం కొరకు పార్టీని త్యాగం చెయ్యడానికి ఆనాడు సిద్ధపడ్డారు. కానీ ఈ రోజు పరిస్థితులు వేరు.   రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రెండంకేలకే పరిమితమయ్యే పరిస్తితిలో వుంది.   అలాంటప్పుడు తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసి మరో (అ) చిరంజీవిగా మిగిలే బదులు, సొంతంగా 10-12 స్థానాలలో అభ్యర్ధులను గెలిపించుకొని రాబోయే భాజపా ప్రభుత్వానికి  మద్దతు ఇచ్చి తెలంగాణా రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకొనే వెసులుబాటు వుంటుంది.   తెలంగాణా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ, జనాన్ని ఆకట్టుకోగలిగిన కాంగ్రెస్ నాయకుడు ఎవరూ లేరు.   నిన్నటి దాకా సొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని తిట్టిన వి హెచ్, పాల్వాయ్, పొన్నం  లను చూసి వోట్లేసే వెర్రిబాగుల వాళ్ళు తెలంగాణలో లేరు.  


ప్రస్తుత లోకసభలో 18 మంది ఏమ్పీలున్న డి ఎం కె నాలుగు పదవులు పొందింది.  వాళ్లకు వాళ్ళ రాష్ట్రానికి "మేళ్ళు"  జరిగాయి.      భక్తవ శంకరుడి దర్శనం కావాలంటే ముందు నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి.   కాంగ్రెస్ పార్టీలో అమ్మగారిని కలవాలంటే ఇలాంటి నందులు వేరు వేరు పేర్లతో, రూపాలతో దిల్లీలో వుంటాయి.   ముందు వారిని ప్రసన్నం చేసుకోవాలి, వారు అనుమతిస్తే అమ్మగారిని కలవచ్చు.   ఈ కష్టాలకు బదులు సొంతంగా పార్టీని కొనసాగించి మనకు కావలసిన మేళ్ళు జరిపించుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే, ఆంధ్ర రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను, ప్రజలను  పెద్దగా తిట్టడానికి వుండదు.  దీని బదులు ఇంకో 10 సంవత్సారాలు తమ పార్టీ కొనసాగితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పక్క రాష్ట్ర ప్రజలను దూషించి వారు గతంలో చేసినట్లుగా చెబుతున్న దోపిడీని గుర్తుచేసి వోట్లు దండుకోవచ్చు.  తీర్దానికి తీర్ధం - ప్రసాదానికి ప్రసాదం.