18, సెప్టెంబర్ 2013, బుధవారం

-: సమైక్య ఆంధ్ర కవితాగోష్టి--వచనకవిత.

రచన - శ్రీమతి ఆదూరి హైమవతి, బెంగళూరు 
కలసి మెలసుంటే - కలదెంతొ సుఖము
 అలకాపురంబులో  -   అలమేలుసంతూ
          కలహంబులేలేక  -  కలసిమెలసుండ్రి.
 పిల్లలూఎదిగారు  -   పెళ్ళిళ్ళు జరిగాయి,
తోడికోడండ్రొచ్చి    -   తంపులూపెట్ట,
                        స్వార్ధపరులూచేరి విషము చిలికించ
                         పండంటికాపురం ఎండిపోసాగె
              లుకలుకలురేగాయి  –   మనసులూవిరిగాయి,
                పలకరింపులుమారె ! -  ప్రేమ అడుగంటే .
     ఆధిపత్యముకొరకు –ఆరాటములు పెరగ,
    మదిలోనియోచనలొ-మార్పులూ వచ్చె
                అన్నదమ్ములమధ్య   - అలకలూ పెరిగే
              ‘ ఉమ్మడీ ’కాపురం-‘ నెమ్మదీ ’ కోల్పోయె.
 ముఖములూ మాడ్చుకుని  -  ‘మగువ ‘ లుండంగ,
  మీసములు మెలిపెడ్తు  -  ‘మగలు’ మెలగంగ,
                                 ‘ఎందుకీ మటమటలు  -  మౌనవ్రతాలు!
                                    కలిసుండలేమని  -   విడిపోవదలచిరి.
 ‘  మా మధ్య  బేధాలు  - మరి ఆగవండీ!
  చెరి సగము పంచుకుని  -  చక్కపోతా ’ మని
                      ఊరి పెద్దల గలిసి  -  విడమర్చిచెప్ప,
                        పెద్దన్న వద్దన్న-  వీధికెక్కాడు.
         పెద్దలందరు చేరి -   సుద్దులూ జెప్ప,
           ‘ రాజీకి ‘రామనీ  ,-  రచ్చ కెక్కారు .
                               ‘  పెదకాపు బాబయ్య !-  కుదరదూ మాకు,
                                           విడగొట్టి  భాగాలు -   పంచి పెట్టయ్యా! ‘
                               ‘ నేనెరుగ విషయాలు  -   మునసబూ నడుగు 
      ‘ మనసులూ తెల్సిన -  మునసబూమామా!
         మారుమాటాడక    -  మార్గంబు చెప్పు’-
        ‘ నాకేమితెలుసోయి  -  కరణాన్నికలువు
                                ‘ కరి ’ నైన కట్టేయు  -  కరణమూ బావా!
                                   కలిసుండలేమింక  -  విడగొట్టు మమ్ము’.
          ‘నాకేమితెలుసోయి! -  ప్రెసిడెంటునడుగు
        ‘నకలు’ తీసే వాడు -  కధలు నడిపేవాడు.
                          అతడైతె  మీకన్ని  చక్కజేస్తాడు.’-
                                        ‘ పెద్దతగవులు తీర్చు -  ప్రెసిడెంటు అన్నా!
                                           పెరిగాము ఒక ఇంట  -   కుదరదిక మీద
          హద్దులూ గీయండి  -  లెక్కలూ తేల్చండి,
          బుధ్ధులూ చెప్పంగ  -  పూనుకోవలదు.
                                     ‘ నాకేమితెలుసదీ  పంతులూ  నడుగు.’
                          ‘     పురహితము కోరేటి -  పంతులూ గారూ!
                          పుణ్యముండును మీకు  -  స్వరము విప్పండి.
         మీవల్లకాదంటే  -  ముందుగా చెప్పండి !
        న్యాయస్థానములోన  -  వ్యాజ్యమేస్తాము .
                                        ‘ చాలకాలముగాను  -   మేలైనరీతిలో
                                         కలకలా లాడేటి  -   గృహము మీదయ్యా!
        కోర్టుకెక్కగ నేల!   -   కొల్లబోనేల?
         కలిసుండి కలిమంత -  అనుభవించండి!,   
                               పులివాతబడినట్టి  -  ఎద్దులా కధను,
                                రొట్టె కోల్పోయిన  -  పిల్లులా కతనూ
        వినలేద!కనలేద!,  -  బుధ్ధియే లేదా?
         నోరుమూసుకుపొండి -  విడగొట్టలేను,
                         కలిసి ఉంటేమీకు  -   కలుగునూ సుఖమూ
                          ఉమ్మడీకాపురం   -   ఊరటిస్తుంది,
     ఖర్చులు తగ్గేను  -  మిగులు పెరిగేను,
     కట్టెల మూటవలె -   బలముపెరిగేను.
                           మంచితల కెక్కక  - మతిచెడినవారు
                           కత్తులూదూశారు -  కుత్తుకలు కోశారు,
  గుంపులూకట్టారు-గునపాలు తీశారు  ,
   రక్తపుటేరులూ ! - రణరంగమాయె !!
                      ఊరంత చేరించి  -  ఊరడించింది,
                     సుద్దులూచెప్పింది  -  హద్దు లొద్దంది,
      అన్నదమ్ములు లేచి  -   ఆలోచనలుచేసి,
       చేతులూకలిపారు -   చకచకానడిచారు.
మధ్యవారొచ్చి  -  మాయమాటలు చెప్ప
మరుగునా పడిపోయె  - మనతెలివి  అంత ,
                 చెప్పుడూమాటలూ -- చేకూర్చు చేటని
                     చివరకూ తెలిశారు --  చక్కబడ్డారు.
       ఐకమత్యము తోనె  - ‘ ఐవోజు ‘ పెరుగనీ
       తెల్సుకుని -  కల్సుకుని  - కదలిపోయారు.-
ఆంధ్రప్రదేష్ -అంధప్రదేష్  కాకుండా ,  కలివిడికాపురం కలకాలం చేసి ,   భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం  అసువులుబాసిన  అమరజీవి ఆత్మకు  ప్రశాంతి  కలకాలం  నిలపాలని  కోరుతూ,
ఆంధ్రప్రదేష్ లో పుట్టిపెరిగిన --                 ఆదూరి.హైమవతి.

3 కామెంట్‌లు :

  1. ఆంధ్రమాతా దండకం
    శ్రీ ఆంధ్ర మాతా, నమో ఆంధ్ర మాతా, నమో తెలుగుతల్లి, తెలుగు తేజంబు నలుదిశల చాటించినావే, కీర్తి ఖంఢాంతరాన ప్రకాశింపగా చేసినావే, భాషా ప్రయుక్త రాష్ట్రంబుగా ఎదిగి, అంధ్రన్, తెలంగానన్ సీమ ప్రాంతంబులన్ సమదృష్టిగా జూచినావే, దయాశీలివే, ధర్మమున్ నాల్గు పాదాల నడిపించినావే, అన్ని జిల్లాల అభివృద్ధి గావించినావే, నీ కీర్తినేనెంచ నేనెంతవాడన్, కరుణించి కాపాడవే తల్లి, బాధలన్ దీర్పవే, బందులన్ ఆపవే, నీ భజన నే సేతునే… విభజనల్ ఆపవే, సమైక్యంబుగా రాష్ట్రమున్ నిలపవే, ఓ భారతీ పుత్రి, సదా నీవె సమవర్తి, తెలంగాన నేతలకు సద్భుద్ధి ప్రసాదింపవె, మనసులన్ మార్చవె, మనుషులన్ జేయవె, కలసివుంటేనె కలదు సుఖంబను నీతి బోధింపవె, సద్భుద్ది కలిగించవె,కనక దుర్గమ్మవె, కాళికామాతవే, మహంకాళివే, మారి మరిడెమ్మవే…నీకు పొంగళ్ళు నే సేతు, బోనాలు నే ఇత్తు,మొక్కులన్ దీర్తునే, కోర్కెలన్ దీర్పవే.. దయామూర్తివే, మమ్ములన్ గావవే !
    సోనియా మాయ మటుమాయగా చేయవే,మన్మోహనున్ మనసునున్ మార్చవే, కేసియారున్ నిరోధించవే, కేటియార్ నోరు మూయించవే, ఈటెలకు నోరు కుట్టేయవే, కోదండరామున్ కట్టిపడవెయ్యవే, తోక పార్టీలకున్ తెలివితేటల్ ప్రసాదింపవే, ఉస్మానియా మానియా లోకమున్ మార్చవే... కళ్ళు తెరిపించవే, సమైక్యాంధ్ర మంత్రమ్ము బోధించవే...సదా నిన్ను స్మరియింతు, సదా పూజలున్ చేతునే...మొరాలింపవే...నమస్తే ఆంధ్ర మాతా..నమస్తే..నమస్తే నమః !
    11-09-2013 ...శనగల

    రిప్లయితొలగించండి
  2. ఆదూరి హైమవతి ఆశ నెరవేరాలి,
    మా సీమ హైమవతి మాట నెరవేరాలి,
    అందరూ కోరేది అదియె నెరవేరాలి,
    జై సమైక్యాంధ్రకు జయము కలగాలి,,,,,
    హైమవతి గారూ!మీ గేయం కాదు కాదు పాట చాలా చాలా బాగుంది.చదివిన వెంటనే నా చిన్న తనంలో చదువుకున్న "గడప లన్నిటిలోన ఏ గడప మేలు?అనే పాట గుర్తుకు రాగా ఆ వరుసలో పాడుకుంటూ ఆనందించాను.మీ ఆశయమే మా ఆశ కూడా!తప్పక జయం లభిస్తుంది.ఎందుకంటే "యతో ధర్మస్తతో జయం"అని గదా! ఆర్యోక్తి.మరోసారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. సోమార్క గారూ!
    నమస్కారమండీ! అంతకుముందురోజే అమేరికానుండీ జన్మభూమి ఐన ప్రియ భారతంలో అడుగెట్టాము.ఇంకా మంచిగా రూపొందించేసమయంలేకపోయింది.మీకు కృతఙ్ఞతలండీ! నిజానికి దాన్ని 'కలవారికోడలూ ...'వరుసలో పాడుకునేవిధంగా భావించాను.ఇలా పాడుకుని సరిపోయిందేమో చూడగలరా!శలవు.
    ఆదూరి.హైమవతి.

    రిప్లయితొలగించండి