తెలంగాణా వచ్చిందన్న పుట్టెడు దుఃఖంతో కుమిలి పోతున్న కె సి ఆర్, తెలంగాణలో పనిచేస్తున్న ఆంద్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణా ఖాళీ చెయ్యాల్సిందే, వేరే దారి లేదు అని హుకుం జారీ చేశారు. సీమాంధ్ర సినిమా షూటింగులు, విద్యాలయాలు, సెటిల్మెంట్లు, రియల్ వ్యాపారాల ద్వారా బంగారు బాతు గుడ్లు పెట్టే వ్యాపారాన్ని వదులుకుంటే తనకు మిగిలేది చిప్పే అనే సంగితి తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరితే తన బతుకు చిరింజీవి బతుకు కన్నా అధ్వాన్నం అవుతుందనీ తెలుసు.
అందుకే ఏదో విధంగా బెదిరింపులకు దిగడం ద్వారా, వచ్చిన తెలంగాణాకు మెలిక పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తనే తెలంగాణా రాష్ట్రానికి దిక్కైనట్లు, కాబోయే ముఖ్యమంత్రి తరహాలో హుకుం జారీ చేస్తున్నాడు. కనీసం బిల్లు పెట్టిందాకా ఓపిక పట్టకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు (క్షమించాలి, బిల్లు పెట్టిన తరువాత చెయ్యమని కాదు నా ఉద్దేశ్యం) . తెలంగాణా వచ్చిన తరువాత వొంటరి పోరు చేసి భంగపడే కంటే. తెలంగాణా బిల్లు ఇంకా కార్యరూపం దాల్చలేదు అని చెప్పి ప్రజలను మరోసారి రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు, నోట్లు దండుకొనే ప్రయత్నంగా అని అనిపిస్తుంది.
పొరుగు ప్రాంతంలో భావోద్వేగాలు ఉన్నపుడు పెద్ద మనిషి తరహాలో, అయిందేదో అయింది, మనమంతా తెలుగు వాళ్ళం, విడిపోయినా మనమందరం ఒకటే, మీకున్న భయాలు, సందేహాలు నాకు చెప్పండి, ఇక నుంచి నేనే మీకు అండగా వుంటాను అని నష్టపోయిన వాళ్ళ మనసులు గెలుచుకొనే ప్రయత్నం చెయ్యకుండా శక్తి వంచన లేకుండా రెచ్చగొడుతున్నారు. నిన్నటికి నిన్న హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి పక్షపాతాన్ని ఎండగట్టారు - కారణం, సీమాంధ్రలో అల్లర్లు జరుగుతుంటే రబ్బరు బుల్లెట్లు ఉపయోగించ వద్దు అని ముఖ్యమంత్రి చెప్పారట. అంటే ఇతగాడి ఉద్దేశ్యం ఎ కె 47 ఎందుకు వాడడం లేదు అని అర్ధం. కెసిఆర్ గారి పత్రికలో రాస్తారు, అక్కడ ఉద్యమంలో పిడికెడు మంది కూడా పాల్గోటం లేదు అని. మరి పిడికెడు మంది కోసం ఎ కె 47 అవసరమా? కె సి ఆర్ నిరాహార దీక్ష జరిగిన మొదటి రోజే రంగు నీళ్ళు నెత్తిన పోసుకొని అగ్గిపెట్టె వెతికి వందాలాది ప్రాణాలు పోవడంలో ఆజ్యం పోసిన ఘనుడీయన. ఎక్కడ చనిపోయినా పేదలు, యువకులు మాత్రమె. ఇది వాంచనీయం కాదు. ఇంతవరకు కె సి ఆర్ కు కానీ, లగడపాటికి కానీ ఒక్క లాఠీ దెబ్బ తగల లేదు. ఇదీ మహాత్మా గాంధీ నడిపిన పోరాటానికి ఈ కుక్క మూతి పిందేలకు వున్న తేడా.
మరోపక్క డిగ్గీ రాజా గారు, తెలంగాణా లోని తీర సీమాన్ద్రులకు రక్షణ కల్పిస్తాం అని చెప్పి, తెలంగాణా సమాజాన్ని దౌర్జన్యకారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆవేశాకావేశాలు రిగిల్చేది ఇరుప్రక్కల వున్న రాజకీయ నాయకులు మాత్రమే! నిన్న రాయలసీమలో 8వ తరగతి చదివే పిల్లవాడు ఆత్మ హత్య చేసుకున్నాడు. అంతకుముందు హైదరాబాదులో ఒక ఆటో డ్రైవర్ 610 జీ వో అమలు చెయ్యలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రం అంటే ఏమిటో 8వ తరగతి పిల్లవాడికి తెలియదు. 610 జీవో ఆటో చోదకుడికి సంబంధం లేనిది. ఆవేశంతో తీసుకునే నిర్ణయం తీవ్రంగా వుంటుంది.
కొంచం ఉద్రిక్తతలు తగ్గగానే, కె సి ఆర్ తో సహా, అన్ని ప్రాంతాల నాయకులు ఆంధ్రప్రాంతంలో పర్యటించి, ఆయన మీద వాళ్ళకున్న ద్వేషాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి. ఆయన లాంటి మాటకారి (కిలాడీకి) ఇదేమి గొప్ప విషయం కాదు. అలానే, ఇరు పక్షాల విశ్వ విద్యాలయ విద్యార్ధుల నాయకులు నెలరోజులపాటు విశ్వవిద్యాలయాల ఇంటర్ చేంజ్ చేసుకొని తద్వారా మమేకం అయ్యేందుకు ప్రోత్సహించాలి. పనిలో పని, పొన్నం ప్రభాకర్ గారికి పుల్లట్లు కూడా తినిపించాలి. ఇంత కాలంగా విష బీజాలు నాటిన నాయకులు తమ అహాన్ని చంపుకొని ఈ చర్యలకు పూనుకోవాలి. ఇది జరగకుండా విభజన జరిగితే, తెలంగాణా రాష్ట్రం మీద పెట్టుబడి దారులకు అపనమ్మకం ఏర్పడి నష్టపోయే ప్రమాదం వుంది.
ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పద్ధతిలో, కేంద్రం విధి విధానాలను రూపొందించి రాష్ట్ర విభజన జరిగినా నష్టం లేదు అనుకొనే వారు చాలా మంది తీర ప్రాంతంలో వున్నారు. అహంకారాన్ని పక్కనబెట్టి, ఇరు ప్రాంతాల పెద్ద మనుషులు, మేధావులతో (నాన్ పొలిటికల్) తక్షణం ఒక కమిటీ వేసి, సమస్యాత్మ విషయాలు వాటి పరిష్కారాలు గుర్తించాల్సి వుంది. తమ కోరికను సాధించుకున్న వారు కొంత పట్టు విడుపు ధోరణి అవలంబించాలి. వైషమ్యాలు పెంచి పొషించి ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకా తగల పెడతారు. దీనివలన తెలుగు జాతి పరువు పొరుగు రాష్ట్రాలలో నవ్వులపాలైంది.