23, ఆగస్టు 2013, శుక్రవారం

వేగంగా మారుతున్న రాజకీయాలు


సి డబ్లు సి విభజన నిర్ణయం తరువాత రాష్ట్రంలో మాట తప్పటాలు మడిమెలు పూర్తిగా తిప్పటాలు మొదలయ్యాయి.   ఈ సారి అనూహ్యంగా సిపిఐ, భాజపా, తెరాస  కూడా మడిమెలు తిప్పాయి.   సిపిఐ కి చెందిన కార్మిక సంఘాలు సమైక్యాంధ్ర సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటుండగా, అతి వీర తెలంగాణా వాది, విశాలాంధ్ర నారాయణ కూడా సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు.   బహుశా నారాయణకు తత్త్వం బోధ పడినట్లుంది.   ప్రపంచ కార్మికులారా ఏకం కండి - తెలుగు ప్రజలారా విడిపోండి అనే ఆయన గారి నినాదం పెద్దగా వర్కవుట్ అయినట్లు లేదు.    


తెరాస ఏకైక లక్ష్యం తెలంగాణా లాగా, నరేంద్ర మోడీ గారి ఏకైక లక్ష్యం ప్రధాని కావడం.   ఈయన గారు కూడా తన లక్ష్యం కోసం బొంత పురుగుల్ని, గొంగళి పురుగుల్ని ముద్దాడే రకం.   మన రాష్ట్రంలో వోటు హక్కు కూడా  లేని, ప్రసంగం కన్నా ప్రాస మీద ఎక్కువ దృష్టి పెట్టే నెల్లూరు నాయకుడి గారి ఆధ్వర్యంలో మోడీ గారి ప్రైవేటు దర్బారుకు ఒకే సామాజిక వర్గంకు సంబంధించిన నాయకులు ఇటీవల హైదరాబాదులో కలిశారు.   వీళ్ళందరికీ ప్రత్యేక్షంగానో పరోక్షంగానో తెదేపాతో బాదరాయణ సంబంధం కలవారే.   మోడీ గారు  ఎన్టిఆర్ను ప్రశంసించడం మొదలుకొని   పార్లమెంటులో తెదేపా ఎంపీ ల సస్పెన్షన్కు వ్యతిరేకంగా  సుష్మా స్వరాజ్ గారి ప్రవర్తన వరకు భాజపాలో  అనూహ్యమైన మార్పు వచ్చింది. 


కర్ణాటకలో బుధవారం రెండు పార్లమెంటు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే, భాజపా కనీసం అభ్యర్ధిని నిలబెట్టుకోలేదు సరికదా, జనతా దళ్ కు మద్దతుగా చెమటోడ్చి ప్రచారంలో బహిరంగంగా కష్టపడింది.   ఇవన్నీ మోడీ గారి నాయకత్వంలో వేగంగా మారుతున్న పరిణామాలకు తార్కాణాలు.   సిడబ్లుసి నిర్ణయంతో భాజపా రెంటికి చెడ్డ రేవడైందన్న విషయం కనీస రాజకీయ పరిజ్యానం వున్న ఎవరికైనా అర్ధమౌతుంది.    కనీసం 4-5 సీట్లు తెలంగాణలో రావాలంటే, తెదేపా మద్దతు అవసరం.   నాకది - నీకిది (క్విడ్ ప్రో క్వో) అన్నట్లు మోడీ ప్రధాని అవడానికి తెదేపా సహాయం చేస్తుంది, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మోడీ గారు పరోక్షంగా సహాయ పడతారు.     


విభజన ప్రకటన వెలువడిన వెంటనే, మన రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది ఎవరైనా వుంటే, మొదలు తెరాసా తరువాత చిరంజీవి మాత్రమే.    హార్వార్డ్ విశ్వ విద్యాలయంలో చదివిన ఉద్దండ పిండాలు కాంగ్రెస్ పార్టీలో వున్నారు.   ప్రకటనకు ముందే, చాలా మంది ఉద్యమకారుల్ని విమానాల్లో పిలిపించుకుని మచ్చిక చేసుకున్నారు.   తెరసాకు వ్యతిరేకంగా ప్రకటనల్ని ఇప్పించారు.   విపరీతంగా వలసల్ని ప్రోత్సహించారు.   తెరాసా నాయకుడు తానే కాబోయే రాష్ట్రానికి ప్రధాన మంత్రిలాగా చాలా అవాంచనీయ ప్రకటనలను చేశాడు.   పట్టు విడుపులు లేకుండా సమస్య పరిష్కారం దొరకదని ఆయనకు బాగా తెలుసు, కానీ ఆయన కావాలనే రెచ్చగొడతారు.     ఉద్యమం పది కాలాల పాటు వుంటే ఏదైనా లాభం కానీ, తెలంగాణా వస్తే తనని పట్టించుకునే పరిస్తితే వుండదు.    అందుకు చక్కని ఉదాహరణ మన మెగా  స్టారు గారే.   సినిమాలలో ప్రతి వాడికి వేలు చూపించే స్థాయి నుంచి అమ్మగారి తర్జని ప్రయోగంతో  దగా స్టారుగా రూపాంతరం చెందారు.    తన కుటుంబ సభ్యుల సినిమాలు విడుదలకు నోచుకోక శ్లేష్మంలో పడ్డ ఈగ లాగా అయింది ఆయన పరిస్తితి. 


ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్లో అన్ని పార్టీల పరిస్తితి ఇదే.    వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా పరిస్తితులలో పెద్ద మార్పు రాకపోవచ్చు.   దీనివలన తీవ్రంగా నష్టపోతోంది ఉద్యోగార్ధులు, పారిశ్రామిక వేత్తలు మరియు మధ్య తరగతి ప్రజానీకం మాత్రమే 

2 కామెంట్‌లు :