తెలంగాణా ఇచ్చేశారు. అది కూడా 'మేజువాణి' ఓటుతో ఇచ్చేశారు. తలుపులేసి, బయట ప్రపంచానికి తెలియకుండా ఇచ్చారు కాబట్టి ఇది మూజువాణి కాకుండా మేజువాణి అనడమే సమంజసం. మరో వింతేమిటంటే, ముగ్గురు స్త్రీలు కలిసి ఈ బిల్లును ఒంటి చేత్తో పరిష్కరించారు. కాకపొతే ఇందులో ఇద్దరు విద్యాధికులు కాగా మరొకరిది వానాకాలం చదువు.
గత ఆరు నెలల నుంచి విభజన వాదులు సమైక్య వాదులుగా (కొద్ది మంది) సమైక్య వాదులు విభజన వాదులుగా మారారు. బయటికి చెప్పినా చెప్పక పోయినా, భాజపా సీమాంధ్ర ప్రాంత నాయకులు సమైక్యవాదులుగా, సత్తి బాబు & పార్టీ, మాన్యులు డొక్కా గారు, పనబాక గారు, బాల రాజు గారు, కొండ్రు గారు, పుట్టు తెలుగు వారు కాని కేంద్ర అమాత్యులు, రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి గారు విభజన వాదులుగా మరారు. సంతలో వింత ఏమిటంటే, హరీష్ రావు గారు, కె టి ఆర్ గారు ఎప్పటిలా మాట్లాడే వారి మాట తీరుకు విరుద్ధంగా తెలంగాణాలోని సీమాన్ధ్రాలకు అభయ హస్తం ఇస్తామనగా, పెప్పర్ రాజగోపాల్ గారు, చక్రవర్తి అశోక్ సామ్రాట్లాగా అస్త్ర సన్యాసం చేసి తెలుగు వారు విడిపోయినా ఐక్యంగా వుండాలని కాంక్షించారు.
తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆంద్ర ప్రాంత ప్రజల పిల్లలు పది సంవత్సరాలు తెలంగాణా ప్రాంతంలో చదివితే సహజంగానే ఆ ప్రాంతంలో వున్న విద్య, ఉద్యోగాలకు అర్హత పొందుతారు. 2012 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు. ఎన్ని సార్లు అబద్ధం చెప్పినా ఈ సంఖ్య 4.5 కోట్లు కాదు. ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, జంట నగరాలు, మహబూబ్ నగర్, మెదక్, రంగా రెడ్డి ప్రాంతాలలో తీర సీమాన్ధ్రులు కొన్ని దశాబ్దాల క్రితమే స్థిరపడి కనీసం 30 నుంచి 40 శాసన సభ్యుల ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో వున్నారు. దీనికి చిన్న ఉదాహరణ - మల్కాజ్గిరి పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటు స్థానాల గెలుపుపై వివిధ పార్టీలలో వున్నసీమాన్ధ్ర నేతల విశ్వాసం. గత పది సంవత్సరాల ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తే, తెలంగాణా ప్రాంతం నుంచి నోరు జారే నాయకులు ఎవరైనా వున్నారంటే, కేవలం 4 నుంచి 5 జిల్లాలకే పరిమితం. గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్దగా నోరు జారడు, ఎందుకంటే నల్గొండ పార్లమెంటు పరిధిలో గణనీయంగా ఆంద్ర ప్రాంత ప్రజలు వున్నారు. అలాగే ఖమ్మం, మల్కాజ్గిరి, సికిందరాబాద్ మొ॥ ఇహ, జంట నగరాలలో వున్న ఏ పరిశ్రమలోనైనా, కేవలం ప్రతిభ ఆధారంగా వుద్యోగం ఇస్తారు గానీ, వీడు మన జిల్లా వాడనో లేక ప్రాంతం వాడనో ఉద్యోగంలోకి తీసుకోరు. 138 పై చిలుకు కేంద్ర సంస్థలు హైదరాబాదులో వున్నాయి మరి వాటిలో ఉద్యోగాలు తీర సీమాన్ద్రులకు దక్కవా అంటే - ఇది కూడా అవాస్తవం. అన్ని స్కిల్డ్ ఉద్యోగాలకు దేశవ్యాప్త పరీక్ష ద్వారా మాత్రమే నియామకాలు వుంటాయి. కాబట్టి ఆందోళన అనవసరం. ఈ విభజన వలన తీవ్రమైన నీటి యుద్ధాలు, అంతర్ రాష్ట్ర పన్నులు ఇరు ప్రాంత ప్రజల మీద తీవ్రంగా పడే ప్రమాదం వుంది. అత్యంత దుర్భిక్షంతో వున్న రాయల సీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం ఈ విభజన ఒక అశనిపాతం. 42 మంది సభ్యులతో కేంద్రాన్ని శాసించే స్థితిలో వున్న ఆంద్ర ప్రదేశ్, ఆ స్థానాన్ని కోల్పోయి పలుచన కావడం తధ్యమ్.
దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలతో పోలిస్తే, హైదరాబాదులో నివాసం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సర్వ హంగులున్న ఈ పట్టణానికి, ధరలు పెరగక ముందే తీర సీమాన్ధ్రులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆంద్ర ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల గుప్పిటలో నలుగుతున్న రియల్ ఎస్టేట్ భూముల ధరలు ఆకాశాన్ని అంటుకున్న ఈ సందర్భంలో హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకోవడం ఉత్తమం .
తీర సీమాన్ధ్రకు జరగబోయే అతి పెద్ద నష్టం ఏదైనా వుంటే మొట్ట మొదటగా అది మత మార్పిడుల రూపంలో వుంటుంది. దేశ వ్యాప్తంగా క్రైస్తవంలోకి మార్పిడి జరిగేది తీర ప్రాంతాలలోనే. ఈ విభజన వలన, తిరుపతి ఏడు కొండలలో కొన్ని కొండలను దిగ మింగెయ్యాలని తలపెట్టిన ప్రియతమ నాయకుడి కొడుకు కాంగ్రెస్ సహకారంతో అధికారం లోకి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కుటుంబ ప్రాభవం పొందడానికి క్రైస్తవం లోకి బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది.
ఏతా వాతా విభజన వలన జరిగే పెద్ద లాభాలు ఏమైనా ఉన్నాయంటే, అవి రెండు మంత్రి వర్గాలు, రెండు చోట్లా రియల్ ఎస్టేటు ముసుగులో ప్రజలను పీడించే బేనామీ రాజకీయ నాయకులు మాత్రమే. ఈ విభజన ద్వారా కాంగ్రెస్ భాజపాలు కుట్ర పూరితంగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను దెబ్బ వెయ్యడం ద్వారా రాబోయే రోజులలో ప్రజలకు కేవలం తాము మాత్రమె దీక్కు అన్న సంకేతాన్ని సంయుక్తంగా పంపినట్లైంది.
మరోసారి 29 వ రాష్ట్రం (అందునా తెలుగు రాష్ట్రం) తెలంగాణాకు శుభాకాంక్షలు!