చాలా మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వ్యక్తులు హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని, మహా నగరం, ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అన్న దృష్టితో పెట్టుబడి పెట్టి ఇండ్ల స్థలాలు, ఫ్లాట్స్ కొనుగోలుచేశారు. గత మూడు సంవత్సరాల నుండి కొన్ని అసాంఘీక శక్తులు పెట్రేగిపోయి రాష్ట్రం విడిపోగానే వాళ్ళ ఇండ్లు, స్థలాలు మేము లాక్కొని మీకు దగ్గరుండి ఇప్పిస్తాం అని ప్రచారం చేశారు. కొంతమంది అమాయకులు ఆ మాటలు విని మోసపోయారు. ఇటీవల నేను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాను. తెలంగాణాకు చెందిన వారి సహచర ఉద్యోగులు (అందరూ కాదు కొద్ది మంది మాత్రమె)తీర సీమాంధ్ర ఉద్యోగులని కూడా తమ ఇళ్ళు ఎప్పుడు తక్కువ ధరకు అమ్మి వెళ్ళిపోతున్నారని పరిహాస మాడుతున్నారట ! ఈ భయాలకు తోడు ప్రతి రాజకీయ గుండా టి వి గొట్టం నోట్లో పెట్టుకొని రేచ్చిపోతూ "సెటిలర్లను మేం పొట్టలో పెట్టుకుంటాం, మేం వాళ్ళని కొట్టం తిట్టం" అని అత్యంత ఆప్యాయంగా బెదిరిస్తుంటారు.
తీర సీమాన్ధ్రులు ఎన్నుకున్న కొంత మంది కోటీశ్వరులైన ఎం పీ, ఎం ఎల్ ఏ లు తమ ఆదాయంతో ఒంగోలు, గుంటూరు, విశాఖ ప్రాంతాలలో గతంలోనే వేల ఎకరాలు భూములు చౌకగా కొట్టేశారు. రాబోయే రాజధాని, దాని పక్కనే సముద్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఎస్ ఈ జెడ్, ఐ టి పార్క్ అనే పేరుతో ప్లాట్లు చేసి ఎక్కడ లేని రేట్లకు అమ్మేశారు. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఈ మూడు ప్రాంతాలలో ధారపోశారు. రాజకీయ నాయకుల ముసుగులో వున్న రియల్ వ్యాపారులు, కొన్ని వార్తా సంస్థలకు డబ్బులిచ్చి మరీ రాబోయే రాజధాని కొలతలు, విమానాలు ఎగురుతున్న బొమ్మలు చూపించారు. ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని ఒంగోలులో ఊరికి దూరంగా గజం 20,000 ఉందంటే నమ్మండి. గుంటూరు-విజయవాడ మధ్యలో స్థలాలు అంత రేటు లేకపోయినా, అక్కడి రియల్ ఎస్టేట్ మాఫియా అరిచేతిలో తెనేపోసి మోచెయ్యి దాకా నాకిస్తుంది. రోజుకు సగటున ఎంతమంది విమాన ప్రయాణం చేస్తున్నారు? అదేమన్నా కార్మికులకు పెద్ద స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమా? సామాన్యుడికి కావాల్సింది తొందరగా, తక్కువ ఖర్చులో గమ్యం చేరడం. పరిశ్రమల పేరిట ఎస్ ఈ జెడ్ ల భూములు భోంచేసి వ్యవసాయ అర్హమైన భూమిని లేకుండా చేశారు. భూముల కొరత వలన సామాన్య రైతు ఎకరం భూమి సొంతం చేసుకోవాలంటే కనీసం 6-7 లక్షలు కావాల్సిన పరిస్థితి.
ఇలాంటి పరిస్థితులలో తీర ప్రాంతంలో భూములు కొనడం కన్నా పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాదులో పెట్టుబడి పెట్టడం సరైంది. ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. జీతాలు మరీ తక్కువ. ప్రైవేటు రంగంలో పెట్టుబడి పెట్టిన విదేశీ కంపెనీలు, తెలంగాణా పెట్టుబడిదారుల కంపెనీలు, మార్వాడీ కంపెనీలు లేదా తీర సీమంధ్ర పెట్టుబడులు పెట్టిన కంపెనీలైనా వారు జీతమిచ్చి పెట్టుకొనే ఉద్యోగులుని ప్రాంతాలతో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్నవారినే తీసుకుంటారు తప్ప, ఇక్కడున్న కంపెనీలలో తెలంగాణా వారిని మాత్రమే తీసుకోవాలి, సోరకాయని చూపించి దీనిని ఆనప కాయ అంటారా అనే ఇంటర్వ్యు చేసి ఉద్యోగం ఇవ్వాలంటే, ఏ పెట్టుబడి దారుడు హైదరాబాదుకు రాడు. కాకపోతే, మధ్య మధ్యలో శివసేన లాంటి కొన్ని గ్రూపులు తెలంగాణలో కూడా తయారవుతాయి. ఏ పెట్టుబడిదారుడైనా ఇలాంటి వారికోసం సంవత్సరానికి 'ఇంత' అని ముట్ట చెప్పాల్సిందే. దేశ వ్యాప్తంగా జరిగే తంతు ఇదే.
హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి తరుణం. రాజధాని కోసం కొత్తగా బిల్డింగులు, ఐ ఐ ఎం, ఐ ఐ టి వచ్చినంత మాత్రాన సామాన్యుడికి తీరప్రాంతంలో ఉపాధి దొరకదు. ఈ భవంతులు కట్టినంత కాలం ఇటుకలు మోయడానికి, తాపీ పని చేసే వారికి, వారిని నియోగించుకొనే లగడపాటి, రాయపాటి, బోయపాటి, కామినేని, నన్నపనేని, రామినేని దగ్గుపాటి, కావూరి మొ॥ వారికి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. ఒంగోలు, గుంటూరు, విశాఖలలో భూములు కొనే డబ్బులో సగం డబ్బుతో ఇక్కుడ అన్ని వసతులు వున్న ఇండ్లు కొనుగోలు చెయ్యవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆరక్షణ ఉండక పోవచ్చు కానీ, ప్రైవేటు ఉద్యోగాలకు భవిష్యత్లో కొదవ వుండదు.
ప్రత్యేక రాష్ట్రం వేర్పడ్డ తరువాత, తీర ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కోన లేక మళ్ళీ హైదరాబాదుకు తిరిగి రావడం ఖాయం.