ఇటీవలి కోల్ కుంభకోణం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. చివరికి ఈ ఆరోపణల వలన ప్రధాన మంత్రి కూడా ఇబ్బంది పడ్డారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలలో వాస్తవానికి ప్రతిపక్షాలది ఇదే ప్రధాన అజెండా. కేవలం 12 పనిదినాలు మాత్రమే జరిగే ఈ సమావేశాలలో ఎన్నో ముఖ్యమైన ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలు (తెలంగాణా బిల్లుతో సహా) సభ ముందుకు వచ్చే అవకాశం వుంది. అలాంటి సందర్భంలో, ప్రధాన ప్రతిపక్షం బొగ్గు కుంభకోణానికి ప్రధమ ప్రాధాన్యాన్నిచ్చి తెలంగాణా బిల్లును రెండవ అంశంగా చేపడితే, రాష్ట్ర విభజనకు భాజపా సుముఖంగా లేదు అని ప్రచారం చేసే అవకాశం వుంది. ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి భాజపా తెలంగాణా అంశంపై చర్చిస్తే, పుణ్యకాలం పూర్తయి సార్వత్రిక ఎన్నికల ముందు బొగ్గుమసి నుంచి తప్పించుకోవచ్చు. ఒక వేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టినా, ఆమోదం పొందినా, బిల్లు పెట్టకపోయినా లేక దాని మీద చర్చ జరగకపోయినా కాంగ్రెస్కు లాభం. ఒకవేళ బిల్లు చర్చకు రాకపోతే, తీర సీమాన్ద్రులు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న కాంట్రాక్టర్లు రాయపాటి, బోయపాటి, లగడపాటి, కావూరి మొ॥ జనం మధ్యలోకి వెళ్లి తాము ఎంత వీరోచితంగా పోరాడి తెలంగాణా బిల్లును అడ్డుకున్నామో, తమబోటి వారిని మళ్ళీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు. ప్రజలు ఈలలు వేసి చప్పట్లు కొడతారు. మళ్ళీ ఐదు సంవత్సరాల కోసం వారే గెలుస్తారు. బిల్లు ఆమోదం పొందితే, అమ్మ దయ. మీరు మాకు వోట్లు వెయ్యాల్సిందే అని కరాఖండిగా తెలంగాణలో చెప్పచ్చు. లేదంటే, చూశారా అమ్మ ఎంతో ముచ్చటపడి ఆనంద భాష్పాలతో తడిపి మరీ బిల్లు పెడితే భాజపా వారు అడ్డుతగిలారు. ఆ పార్టీ అన్ద్రోల్లతో కలిసి మనలని మోసం చేసింది. వాళ్ళు ప్రచారానికొస్తే అడ్డుకోండి, తరిమి తరిమి కొట్టండి, దిమ్మెలు కూల్చండి అని చెప్పవచ్చు. ఈ విభేదాలు ఇలానే కొనసాగుతూ వైషమ్యాలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం వుంది. ఇది పసిగట్టే, శ్రీవారు చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని డి మెర్జర్ చేసినా మేము మాత్రం మెర్జ్ కాము, పొత్తు ప్రసక్తే లేదని తేల్చేశారు. ఎవరిపాటికి వారు విడివిడిగా పోటీ చేసే విషయం ముందు తెలిసుంటే కాంగ్రెస్ విభజన ఊబి లోకి పాపం దిగేదే కాదు.
రాజకీయ నాయకులు ప్రజల యొక్క తెలివి తేటలు, విజ్ఞత మొదలైన విషయాలను వారి ఉపన్యాసాలలో తరచూ చొప్పిస్తుంటారు. కానీ వారికీ తెలుసు, ప్రజల జ్ఞాపక శక్తి ఆయుష్షు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అని. రాజకీయ నాయకులు చెప్పేదే నిజమైతే, ఎమర్జన్సీ తరువాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి అంతర్ధానమై వుండేది. అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీ మహారాష్ట్ర శాసన సభకు ఎన్నికై వుండే వాడు కాదు. ప్రజల జ్ఞాపక శక్తి అంత ఎక్కువైతే, చాలా మంది రాజకీయ నాయకులు రెండో సారి ఎన్నికయ్యే వారు కాదు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి