13, మార్చి 2013, బుధవారం

ప్రహసనంగా మారుతున్న అవిశ్వాస తీర్మానాలు


ప్రస్తుత శాసన సభలో తెరాస ప్రతిపాదింప దలచిన అవిశ్వాస తీర్మానం కేవలం ఒక రాజకీయ ప్రహసనం మాత్రమే.   మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించెయ్యాలని కోరుకునేవి రెండే  రెండు ప్రధాన ఉద్యమ పార్టీలు - తెరాస (తెలంగాణా కోసం) వై కా పా (జగన్ గారిని కాపాడడం కోసం).   కాంగ్రెస్, తెదేపాలు ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవు.   తెలంగాణా ఉద్యమం తరువాత గుడ్డిలో మెల్లలా తెదేపా తెలంగాణలో పుంజుకోవటం మొదలుపెట్టింది.     తెదేపా బలపడడం సుతరాము ఇష్టం లేని  వైకాపా,  తె రా స లు తెదేపా ను దెబ్బకొట్టే అన్ని మార్గాలను అన్వేషిస్తూ చివరకు అవిశ్వాసం మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా బాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కొంత వరకు సఫలీకృతం అయ్యాయి.    


తెలంగాణా అంశం మీద పూర్తి వ్యతిరేకతతో వున్న వైకాపాతో,  శాసన సభలో వారి మద్దతుతో ప్రత్యేక తెలంగాణా ప్రధాన అంశంగా  తెరాస అవిశ్వాసం పెట్టడం, ఇవ్వాళో రేపో కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమౌతున్న వైకాపా దానిని సమర్ధించడం చూస్తే ఇది కేవలం తెదేపాను ఇరుకున పెట్టడానికి మాత్రమే ఇరు పార్టీల ఎత్తుగడగా కనిపిస్తున్నది.    రాష్ట్ర శాసన సభకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే అధికారం లేదు.   ఈ అంశంపై పార్లమెంటులో చర్చించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు.   


తెలంగాణాపై అంత చిత్త శుద్ధి వుంటే, భాజపా, లోక్ దళ్ , ఎన్ సి పి  వైకాపా మద్దతుతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులపాలు చేయవచ్చు కదా!   కేవలం టి వి చర్చలకు మాత్రమే తెలంగాణా అంశాన్ని పరిమితం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. 


పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లు - ప్రతిపక్షాల అనైక్యత కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగా మారింది.  

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి