అయ్యలారా,
ఇటీవలి ఎన్నికలలో మీరు ఘోర పరాజయం పొందిన పిమ్మట మీరందరూ కలసి కూర్చొని ఓటమికి గల కారణాలు విశ్లేషించారు. ఇది ఒక రకంగా సంతాప సభలా జరిగింది. ఇందులో వచ్చిన కొన్ని సూచనలలో ముఖ్యమైనవి అ) పార్టీకి ఒక టి వి మరియు పత్రిక కావాలని ఆ) పార్టీ అధ్యక్షురాలు మరియు యువ నేత ఆంధ్రాలో తరచూ పర్యటించాలని --
నిజంగా మీరు పార్టీ శ్రేయస్సు కోరుకొనే నాయకులైతే దయచేసి ఈ రెండు పనులు మాత్రం చెయ్యవద్దు. పొరపాటున ప్రజలు మీ చానల్లో సోనియా గాంధీ బొమ్మ చూసారంటే, వాళ్లకు గతంలో తెలుగు వారిని చీల్చి చెండాడుతూ ఆమె జరిపిన దాడి (యుద్ధ విమానంలో బిల్లు పంపడం, పార్లమెంటులో దీపాలార్పడం) వగైరాలు గుర్తు వచ్చి మానుతున్న గాయాన్ని మళ్ళీ గెలికింది మీరే అని మిమ్మల్ని ఇంకా ఘోరంగా శిక్షించే ప్రమాదం వుంది.
పోనీ పాపం మీరు పత్రిక పెడితే, ఎవరిని విమర్శిస్తారు -- తెదేపాను విమర్శిస్తే, జగన్ బలం పెరుగుతుంది, జగన్ను విమర్శిస్తే తెదేపా బలం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు పోగుడుకునే దానికి అక్కడ ముడి సరుకు లేదు. కాబట్టి పరిస్తితులు కొంత అనుకూలించే వరకు పొరపాటున కూడా ఆ పని చెయ్యవద్దు.
ఎన్నికల సమయంలో మీకు చేతై నంత వరకు మీరే ప్రచారం చేసుకోండి గానీ పొరపాటున కూడా ధిల్లీ నుంచి ఎవరినీ పిలవవద్దు. సినిమా పిచ్చి కాస్త ఎక్కువగా వున్న ఆంధ్ర ప్రజలు కూడా చిరంజీవిని తిలకించడానికి ఇక ముందు సభలకు రారు. కనీసం మీ అంతట మీరు ప్రచారం చేసుకుంటే, ఇద్దరికో మహా అయితే పది మందికో ధరావతు దక్కే అదృష్టం వుంది. పై నుంచి మీ నాయకులు తరచూ వస్తే అది కూడా కష్టమే. ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒకటో ఆరో సీట్లు రాక మానవు.
ఇప్పటికీ ఏదో ఒక మూల కాంగ్రెస్పై కాస్తో కూస్తో అభిమానమున్న వాడిగా సిగ్గుతో ఈ సలహా ఇస్తున్నాను, తప్పక పాటించ గలరు.