16, నవంబర్ 2013, శనివారం

శాసన సభలో బిల్లు ఆమోదం పొందడం ఖాయం


ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు స్వల్ప ఆధిక్యంతో నెగ్గే అవకాశం లేకపోలేదు.   కాంగ్రెస్ పార్టీ ఈ పాటికే దానికి తగిన తాయిలాలు ఏర్పాట్లు చేసి ఉండచ్చు.   కిరణ్ కుమార్ వ్యతిరేక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దువ్వుతుంది.  ఎవరైతే బిల్లుకు మద్దతు ఇస్తారో వాళ్ళందరిని కొత్త రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పెద్ద పదవులు ఖాయం అని చెప్తారు.    శాసన సభ ఆమోదంతో  సంబంధం లేకుండా బిల్లు పార్లమెంటుకు వెళుతుంది అక్కడ భాజపా మద్దతిస్తే గెలుస్తుంది.    ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసినా, అనుకూలంగా ఓటు చేసినా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై తీర సీమాంధ్ర ప్రాంతంలో గెలవడం కష్టం.  ఓటరు జ్ఞాపక శక్తి చాలా తక్కువ.   2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోలేదు.   కాబట్టి, ఎలానూ గెలవని కాడికి కాంగ్రెస్ అధిష్టానంతో గొడవ ఎందుకు ఎంచక్కా ఒక జాతీయ పార్టీతో వుంటే ఐదు లేక 10 సంవత్సరాలలో ఒక స్థాయికి రావచ్చు అని భావించే వాళ్ళు కనీసం 30 మంది శాసన సభ్యులు తీర సీమంధ్రలో వున్నారు.   చంద్ర బాబు నాయుడు ఓటింగ్ సమయంలో వాకౌట్ చెయ్యచ్చు.     కొంత మంది శాసన సభ్యుల రాజీనామాలు సభాపతి దగ్గర పెండింగ్లో వున్నాయి.   వాటిని ఆయన ఆమోదిస్తే, మార్గం ఇంకా సులువవుతుంది.     వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో రోహిణీ కార్తె  కార్తీక మాసం లోనే వచ్చే ప్రమాదం లేకపోలేదు.  

4 కామెంట్‌లు :