16, జనవరి 2013, బుధవారం

ఎవడి గోల వాడిది

 
చలి కాలమైనప్పటికి ఈ సారి మన రాష్ట్రంలో పెద్ద చలిగా అనిపించలేదు. అప్పుడే ఎండాకాలంలో లాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికితోడు, ఈ జనవరి 28 "చావు గీత" (dead line) ఒకటి పులిమీద పుట్రలా దాపురించింది. చివరికి ఆంద్ర ప్రదేశ్ చరిత్ర చదువుకొనే పిల్లల్లు ఎన్ని తేదీలు గుర్తుపెట్టుకోవాలో మరి.
 
 
విధి ఎంత బలీయమైనది. నిర్భయ అత్యాచారం మన మస్తిష్కం నుంచి జారుకుంది, బాబు గారు కాళ్ళు పుళ్ళు పడేటట్లు చేస్తున్న యాత్ర సంగతి మర్చిపోయినాము, జగన్ గారు జైలు జీవితం అందుకు గల కారణాలు వదిలేశాము, క చ రా గారు ఉద్యాన వనంలో సేద తీరుతున్నారని గుర్తు లేదు, అక్బరుద్దీన్ అరెస్టు మర్చిపొయాము, స్వామీజీ అక్రమ అరెస్టును విస్మరించాము.     దేశ సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది. వీటన్నిటికి మించి ఒకే ఒక్క తెలుగు దిన పత్రికలో వచ్చిన వార్త (అది నిజామో కాదో ఎవ్వరికీ తెలియదు) - రాష్ట్రాన్ని విడదీస్తున్నారని - అంతే , ఎవరి ప్రాంత మనో'బావా'లను వారు 23 చానళ్ళ ముందు రక రకాల విన్యాసాలతో వ్యక్తపరచారు. ఇందులో సహజంగానే గత 2 సంవత్సరాలుగా పేటంట్ పొందిన పదాలు అగ్నిగుండం, కల్లోలం, నాలుకలు కోస్తా, అడ్డుకుంటా, వీడెబ్బ సొత్తు అవును/కాదు, బచ్చ, లుచ్చ, బద్మాష్, పెట్టుబడిదారు, రాజీనామాలు, దోపిడిదారు ఇత్యాది పద ప్రయోగాలు.
 
 
రేపు సమైక్య వాదులు తలపెట్టిన సభ అడ్డుకుంటామని మన కవిత గారు అప్పుడే వార్నింగు ఇచ్చారు. మరోపక్క గుంటూరులో భా జ పా ఆఫీసు తగలేశారు. రేపు కవితమ్మగారు అడ్డుకుంటే, తలకాయలు పగిలేది పాపం పోలీసులకు, ఇరుపక్షాల అమాయక చక్రవర్తులకు మాత్రమే. ఎందుకంటే, ముందుగా నాయకులని అదుపులోకి తీసుకొని వాళ్లకి లైవ్ ప్రసారాల ద్వారా తలకాయలు ఎట్లా పగిలేది ఒళ్ళు ఎంత బాగా హూనంఅయ్యేది చూపించాలి కదా! నాయకులకు కనీసం చొక్కా గుండీ కూడా వూడదు. లాభం మాత్రం రాజకీయ పార్టీలకు, టి వి ఛానళ్ళకు. దెబ్బలు మాత్రము అమాయకంగా రెచ్చిపోయిన వాళ్లకు.

 
 
ఒక పక్క మార్చ్ మాసం ముంచుకొస్తోంది, 10 వ తరగతి, ఇంటర్, వ్రుత్తి విద్య ప్రవేశ పరీక్షలు కేవలం 100 రోజులలోపునే వున్నాయి. కఠిన నిర్ణయాల ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, అవసరమొస్తే, ఆందోళనలకు నాయకత్వం వహించేవాళ్ళపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎంతైనా వుంది.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి