ఏ శక్తి, ఒక్క భాజపా తప్ప, రాష్ట్ర విభజన బిల్లును ఆపలేదు. అది ఆర్టికల్ 3కు వున్న అధికారం. యుద్ధ విమానంలో వచ్చిన బిల్లును 24 గంటలలో తిప్పి పంపండి, చర్చించడానికి ఏమి వుంది అని చాలా మంది చెప్పారు. దిల్లీలో వున్న రాజ్యాంగేతర శక్తి, తీసేసిన తాసిల్దార్ డిగ్గీ కూడా చెప్పాడు. ఆయన గారు ఇంకొక అడుగు ముందుకేసి, శాసన సభ అభిప్రాయం ఏదైనా కావచ్చు, పార్లమెంటు నిర్ణయం ఫైనల్ అని సెలవిచ్చారు. ఇది కూడా వాస్తవమె. అలాంటప్పుడు ఈ బిల్లును తిరస్కరించినా లేక ఆమోదించి తిప్పి పంపినా జరిగే నష్టం ఏమీ లేదు, మనల్ని విడదీయడానికి కాని కలపడానికి కాని ఆర్టికల్ 3 వుంది కదా. గడువుకన్నా ముందే, రేపే బిల్లును తిరస్కరిస్తూ తిప్పి పంపిస్తే సరి. భవిష్యత్లో కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే వారు శాసన సభలను గమనంలోకి తీసుకోకుండా మళ్ళీ కలపవచ్చు. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో మళ్ళీ కలిపెయ్యవచ్చు. ఈ రాజకీయ రాక్షస క్రీడ ఇలా జరుగుతున్నంత కాలం తెలుగు వాడి పరువు గంగ పాలు కాక తప్పదు.
26, జనవరి 2014, ఆదివారం
బిల్లు తిప్పి పంపినా విభజన ఆగదు
25, జనవరి 2014, శనివారం
వి ఐ పి లకు మాత్రమే పరిమితమౌతున్న తిరుమల
గత కొద్ది సంవత్సరాలుగా కలియుగ వైకుంఠమ్ అతి ముఖ్యమైన వ్యక్తుల తాకిడితో సామాన్యులకు స్వామి వారి దర్శన భాగ్యం దుర్లభమౌతోంది. భక్తుల రద్దీని నియంత్రించడానికి గతంలో తి తి దే అధికారి ఒకరు ఒక ప్రతిపాదన చేశారు. దాని ప్రకారం, ఒక సారి స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు కనీసం మూడు సంవత్సరాలు గుడి ఛాయలకు కూడా రాకూడదు. సామాన్య భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఈ నియమం వెంటనే వి ఐ పి భక్తుల విషయంలో అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. వి ఐ పి లకు కేటాయిస్తున్న విలువైన దర్శన సమయాన్ని నిత్యం వేల సంఖ్యలో కాలి నడకన వచ్చే భక్తులకు, వృద్ధులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించడం ద్వారా తి తి దే పాలక వర్గం స్వామి వారి కృపకు పాత్రులౌతారు. ప్రతి నిత్యం వి ఐ పి దర్శనం ద్వారా వచ్చే భక్తుల వివరాలు, వాళ్ళను వి ఐ పి దర్శనం చేయించడానికి సిఫారస్ చేసిన వాళ్ళ వివరాలు తప్పకుండా తి తి దే వెబ్ సైట్లో పెట్టాలి. దీనితో పాటు వి ఐ పి భక్తులంటే ఎవరు, ఏ అర్హత వున్న వాళ్ళు సిఫారస్ ఉత్తరం ఇవ్వచ్చో కూడా స్పష్టంగా అంతర్జాలంలో పెట్టాలి. ఇలా చెయ్యకపోతే, ఇంకొంత మంది దావూద్ ఇబ్రహీం అనుచరులో, ఛోటా రాజన్ శిష్యులో వి ఐ పి లుగా చెలామణి అయితే, దేవస్థానం పవిత్రత దెబ్బతినే ప్రమాదం వుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కేవలం వి ఐ పి లకు మాత్రమే పరిమితం చెయ్యొద్దని మనవి.
తెలంగాణపై స్వరం మారుస్తున్న భాజపా!
అధికార పార్టీ పార్లమెంటులో రాష్ట్ర విభజనపై బిల్లు ఎప్పుడు పెట్టినా మేము బేషరతు మద్దతు ఇస్తాం అని ఊదరగొట్టిన భాజపా "అశ్వ్థ్థథ్థామ హతః కుంజరః " అన్న మహాభారత ఘట్టాన్ని గుర్తుచేస్తోంది. బిల్లు పెట్టేప్పుడు సీమాన్ధ్రకు కూడా న్యాయం చెయ్యాలి. భాజపా నాయు(కు)డు, తెదేపా నాయు(కు)డు - ఇద్దరు నాయుళ్ళు చెప్పేదీ దాదాపుగా ఇదే. కానీ ఈ ఇద్దరు నాయుళ్ళు ఏమి చేస్తే సమంగా న్యాయం జరుగుతుందో చెప్పరు. వాళ్ళని వచ్చే ఎన్నికలలో ప్రజలు అధికారంలోకి తెచ్చిన ఉత్తర క్షణం వాళ్ళ దగ్గరున్న పెట్టె లోనుండి సమన్యాయమనే పదార్ధాన్ని బయటకు తీసి అందరినీ సంతృప్తి పరుస్తారట. లేదంటే పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించి బిల్లును ఓడించడం ద్వారా సాధారణ ఎన్నికలకు నెల రోజులు ముందుగానే వెళ్ళడం.
10 సంవత్సరాలు శీతల గిడ్డంగిలో దాచిన విభజనను ఎన్నికలలో కనీసం ఒక ప్రాంతపు ఓట్లనన్నా కొల్లగొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే, మరి భాజపా చూస్తూ ఊరుకోలేదు కదా! సీమాన్ధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేసే హీరోలం మేమే, ఇరు ప్రాంతాల వారు మాకు సమంగా ఓటెయ్యండి అని భాజపా చెప్తోంది. జులై 2013 నుండి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వున్నా లేనట్లే. ఒక వేళ భాజపా అధికారంలోకి వచ్చి బిల్లు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలుపుతుందనే నమ్మకం లేదు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రగతి పధంలో వున్న తెలుగు రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ సమస్యకు ఏదో రకమైన పరిష్కారం త్వరలో లభించాలని ఆశిద్దాం.
23, జనవరి 2014, గురువారం
చర్చకు గడువు పెంచకపోవచ్చు
రాష్ట్ర పునర్విభజన బిల్లుకు గడువు పెంచే అవకాశాలు తక్కువగానే వున్నాయి. గడువు పెంచమని సభాపతి కూడా విజ్ఞప్తి చేస్తే ఆ విషయాన్ని గౌరవ రాష్ట్రపతి కూడా తీవ్రంగా పరిశీలించి వుండేవారు. సాధారణంగా, సభలో అందరు సభ్యుల ప్రసంగం ముగుసిన తరువాత చివరిగా సభా నాయకుడు ప్రసంగిస్తారు. ఇంతవరకూ బాబు గారు మాట్లాడలేదు. బహుశా గడువు పొడిగించరనే అనుమానంతోనే ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. గడువు పొడిగించకపోతే మనము చంద్ర బాబు గారి ప్రసంగం వినే అదృష్టం కోల్పోతాము. హడావుడిలో ఓటింగుకు కూడా అవకాశం వుండదు. ఇంతవరకూ వచ్చాక విభజన ఆగుతుంది అనిగాని, ఆగిపోవాలని కోరుకోవడం కానీ అర్ధం లేదు. నిర్ణయం ఏదైనా, ఇరు ప్రాంతాలలోని సామాన్యుడు నష్టపోయాడు గాని, ఒంగోలులో వందల ఎకరాలు కొన్న వీర సమైక్య వాదులకొచ్చిన నష్టం ఏమీ లేదు.
4, జనవరి 2014, శనివారం
సభలో చర్చ మరియు ఓటింగ్ జరగాలి
శాసన సభలో పునర్విభజన బిల్లుపై సత్వరం చర్చ జరగాలి. అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలను నమోదు చెయ్యాలి. చర్చ జరిగినా జరగక పోయినా జనవరి 23 తరువాత శాసన సభ తమ అధికారాన్ని కోల్పోతుంది. చర్చ జరపకుండా అడ్డుకుంటున్న వాళ్ళంతా విభజనను సమర్ధిస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఆర్టికల్ 3 ప్రకారం ఈ తతంగాన్ని పూర్తి చేసే సర్వాధికారం కేంద్రానికే వుంది. కనీసం చర్చ జరిగితే సభ్యుల అభిప్రాయాల ప్రకారం కొన్ని విషయాలనైనా కేంద్రం పరిశీలించే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్తితులలో కాంగ్రెస్ పార్టీకి తీర సీమంధ్ర లోని 25 స్థానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు సోనియా గాంధీ బొమ్మలు తగులబెట్టి ఆమెతో ఆమె పార్టీతో వైరుధ్యం పెంచుకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం వుంది. మొండివాడు రాజుకంటే బలవంతుడు అనే నానుడి మనకు తెలియంది కాదు.
తక్షణ కర్తవ్యం శాసన సభలో బిల్లుపై సంపూర్ణంగా చర్చించి, తగు సవరణలు ప్రతిపాదించి ఆపై ఓటింగు జరిపి, అలా వీగిపోయిన బిల్లును రాష్ట్రపతికి పంపడం ఉత్తమం. ప్రతిపక్షం అధికారపక్షం కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
2, జనవరి 2014, గురువారం
మన రాష్ట్రంలో చట్టం అమలులో వుందా?
గత మూడున్నర సంవత్సరాలుగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, ప్రతి నాయకుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు మానవ బాంబు అవుతానంటాడు, ఇంకొకాయన రైళ్ళు పడగోడతాను అని, ఇంకొక ఎంపీ గారు లేటెస్ట్ గా ముఖ్యమంత్రిని కాల్చేస్తా అని మీడియా ముందు రెచ్చిపోతున్నాడు. గతంలో బాగా చదువుకున్న ప్రొఫెసర్ గారు, నక్సలైట్లచే చంపబడిన మాజీ సభాధ్యక్షులు శ్రీపాదరావు గారికి పట్టిన గతే ఆయన తనయుడు మంత్రి శ్రీధర బాబు గారికి పడుతుందని హెచ్చరించారు.
ఒక ప్రాంతం వాడు ఇంకొక ప్రాంతానికి రాకూడని ఫత్వాలు జారీ చేయడం సర్వసాధారణమైంది. అన్ని పార్టీల నాయకులు వాళ్ళ పిల్లల్ల్ని శత్రు ప్రాంత పిల్లలతో ఇచ్చి పుచ్చుకున్నారు. కేవలం వారు మాత్రమె సరిహద్దులు దాట వచ్చు. ఇలాంటి భయాందోళనలు రేకిత్తించడం వలననే తెలంగాణా ఏర్పాటులో జాప్యం మరియు అధికారాల కేంద్రీకరణ. ప్రజాస్వామ్య హరణకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, ఇలాంటి పరిస్తితికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బాధ్యులే. మితిమీరిన ప్రజాస్వామ్యం పరిపాలనకు చేటు కలిగించేదే. ఈ వికృత రాజకీయ క్రీడకు కనీసం 2014 మార్చిలో నన్నా తెర దించితే ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు.
1, జనవరి 2014, బుధవారం
విలువలేని ప్రభుత్వ కమిషన్లు
రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షంపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు లేదా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నప్పుడు హైకోర్టు/సుప్రీం కోర్టు నివ్రుత్త న్యాయమూర్తి చేత ఒక కమిషన్ ను ఏర్పాటు చెస్తాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఇలా ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు వాళ్లకు అనుకూలంగా లేకపోతే తిరస్కరించడం ఒక పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాలలో ఈ కమిటీలు కేవలం ప్రతిపక్షాలను తాత్కాలికంగా శాంతింపచేయడానికి లేదా కాలహరణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఆదర్శ్ పేరిట బొంబాయిలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకోసం కట్టిన అపార్టుమెంటులో కొంత మంది కేంద్ర మంత్రులు, స్వయానా రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రులు , కొంతమంది అధికార ప్రముఖులు కలిసి తలా కొన్ని ఫ్లాట్లు పంచుకున్నారు. దీనిపై నియమించిన కమీషన్ తన నివేదికలో వీళ్ళు చేసిన అక్రమాలను బట్టబయలు చేసింది. అలాగే, జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ గతంలో భాజపా శివసేన అరాచకాలపై ఇచ్చిన నివేదికను కూడా ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన సమస్యపై 85 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం పాటు అన్ని ప్రాంతాలు తిరిగి ఇచ్చిన సమగ్ర నివేదికను కనీసం పార్లమెంటులో ప్రవేశ పెట్ట లేదు. అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన న్యాయ నిర్ణేతలు నిగ్గుతేల్చిన అంశాలపై కనీసం చర్చించనప్పుడు జడ్జీల సమయం ఎందుకు వృధా చేస్తారు? నివేదికలోని అంశాలు తమకు అనుకూలంగా వుంటే ఒకరకంగాను లేకుంటే మరో రకంగాను వ్యవహరించడం సమంజసమేనా? ఈ విషయంలో అధికార మరియు ప్రతిపక్షాల వైఖరి ఒకేలా వుండటం మరీ విచిత్రం. కనీసం ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఇలాంటి నివేదికలకు తప్పకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)