కర్ణాటక జనతా పార్టీ నాయకుడు, పూర్వ భాజపా ముఖ్యమంత్రి స్వగృహ ప్రవేశం ఖాయమైంది. జనవరి 15 తరువాత ఆయన తన పార్టీని భాజపా లో కలపనున్నారు. ఈ పరిణామం కాంగ్రెసుకే కాదు జనతా దళ్కు కూడా నష్టమే. భాజపాను మూడో స్థానానికి నెట్టివేసి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న దేవెగౌడ పార్టీ, యడ్యూరప్ప చేరికితో శాసన సభ సభ్యుల సంఖ్యను పెంచుకొని ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకోనుంది.
యద్యూరప్పను పార్టీ నుంచి గెంటి వేసే వరకు వెంటాడి వేధించిన అనంతకుమార్, సదానంద గౌడ, ఈశ్వరప్ప మొ॥ తమంత తాముగా పార్టీపై వత్తిడి పెంచి మరీ తమ నేతను వెనుకకు రప్పించుకోవడం ఆయన బలాన్ని తెలయచేస్తుంది. యడ్డీ ఒక మాస్ లీడర్. రాష్ట్ర జనాభాలో సుమారు 17% గా వున్న లింగాయత్ లకు ఈయనే పెద్ద దిక్కు. ఈయన మాట వారికి వేద వాక్కు. అలాంటి నేత భాజపాలో తిరిగి చేరడంతో కన్నడ నాట రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయనను ఎదుర్కోవాలంటే, కాంగ్రెస్-జనతాదళ్ ఏకం కాక తప్పదు. అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక పరిణామం అశనిపాతంలా దాపురించింది.