27, జులై 2013, శనివారం

ఉద్యమం వలన జరిగిన మేళ్ళు


రాష్ట్ర  సమస్య పరిష్కరించబడినా, పడకపోయినా, లాభపడింది కేవలం 15 పై చిలుకు అందుబాటులో వున్న ప్రసార మాధ్యమాలు మరియు విమానయాన సంస్థలు మరియు నాబోటిగాళ్ళు  మాత్రమే.   టివి చర్చల్లో, పత్రికా వ్యాసాల్లో తెలుగు ప్రజలు ఒకరినొకరు విపరీతంగా దూషించుకుంటున్నారు.    చివరకు, నన్నయ్యను విశ్వనాథ వారిని కూడా వదిలిపెట్టడం లేదు.   అయితే, పత్రికా పఠనం వలన ఎన్నో 'నిఘూడ రహస్యాలు' తెలుసుకోవడానికి అవకాశం కలిగింది.   


తెలింగానము అంటే అర్ధం ఏమిటో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వరంగల్ జిల్లా పరకాల ముద్దుబిడ్డ, ఆంద్ర ప్రాంతానికి బ్రిటీష్ వారిచే 'నియోగి'న్చబడ్డ పరకాల వంశానికి చెందిన ప్రభాకర్ గారి ద్వారా తెలుసుకున్నా.  


టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర చదివి  ప్రేమ వివాహం, అందులోనూ భాషాంతర, కులాంతర వివాహం ద్వారా రాజాజీ గారు  గాంధీ గారిని మెప్పించి తమిళనాడుకు చేసిన మేలును అర్ధం చేసుకున్నాను. 


తెదేపా నాయకుల పుణ్యమా అని, చంద్ర శేఖర్ రావ్ గారు విజయనగరం నుండి బహు భాషా కోవిదుడు కె కె గారు రాజమహేంద్రవరము నుండి నిజాం రాష్ట్రానికి వలస వచ్చారని తెలుసుకున్నా. 


ఉండవల్లి గారి దయవల్ల తెలగాణ్య బ్రాహ్మణులు తెలంగాణా ప్రాంతం నుంచి వలస వచ్చారని, వీరిలో విశాఖ ఉక్కు కోసం నినదించిన వ్యక్తీ ప్రముఖుడనీ తెలుసుకున్నా. 
  

కంచె ఐలయ్య గారు తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ధైర్యంగా చెప్పగలిగిన మనిషి.   తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడితే సామాన్య ప్రజలను దొరలు, భూస్వాములు అణచివేస్తారని,   అణగారిన వర్గాల పిల్లలు ఆంగ్లము చదవడం ద్వారా మిగిలిన విద్యార్ధులతో పోటీ పడవచ్చని తెలుసుకున్నా.  


రెండు రోజుల క్రితం హటాత్తుగా మళ్ళీ తెరమీదకొచ్చి ఐతరేయ బ్రాహ్మణీయమ్ గురించి, ఆంద్ర అనే పదం గురించి అసలు ఆంద్ర ప్రదేశ్ పేరు పెట్టకపోతే ఈ గొడవ వుండేది కాదని వక్కాణించారు.     మరో పత్రికలో వ్యాసం రాసిన ఒక మహిళామణి, ఆంద్ర భాష వేరు, తెలుగు వేరు అని, యునెస్కో లెక్కల ప్రకారం ఆంద్ర భాష వచ్చే 50 సంవత్సరాలలో అంతరించిపోతుందని ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు.   ఆవిడ గారి ప్రకారం, తీర సీమాన్ద్రులంతా ఆర్యులని, వీరు ముని శాపం వలన కుక్క మాంసం తినే వాళ్ళని వ్రాశారు.    
   

మీరేమో తెలుగునాడు అంటారు.    తెలుగు బతకాలంటే 12 జిల్లాల తెలుగునాడు కావాలంటారు.   ఇంకొక తెలంగాణ కవయిత్రి తెలుగు వేరు ఆంధ్రం వేరు అంటుంది.    మీరు మాట్లాడే భాష నాకు నూటికి 99.99 శాతం అర్ధమౌతుంది.    బొత్స సత్యనారాయణ గారి మాట సోనియాజీకి అర్ధమైనప్పుడు మీ భాష మాకెందుకు అర్ధం కాదండి.    సి నారాయణ రెడ్డి గారి మీద ఆన - ఆయనను అడగండి చెప్తాడు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని.     సంస్కృత సమాసాలు, సంధులు దట్టించి రాసే కవి పుంగవులు మన ముద్దుల మేనల్లుడు నాయకత్వం వహించే మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఉన్నంత మంది, మిగిలిన తెలుగు ప్రాంతాలలో లేరన్న నిజాన్ని తెలుసుకున్నా .     


ఐలయ్య గారూ - మీరు పదే పదే ప్రస్తావించే మనుశాస్త్రం గురించి ప్రస్తుతమున్న  ఏ బ్రాహ్మణ కుటుంబంలోని వాళ్లకు పరిచయం ఉంటుందని అనుకోవడం లేదు.    ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మను ధర్మ శాస్త్రం ఆచరణ సాధ్యం కాదు.    కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాసిన పుస్తకాన్ని, అలాంటి పుస్తకం ఒకటుందని తెలీని నా బోటిగాళ్ళకు మీరు అనవసరంగా పరిచయం చేస్తున్నారు.  రాష్ట్ర జనాభాలో కనీసం 5 శాతం కూడా లేని కులాన్ని మీరు పదే పదే టార్గెట్ చేస్తుంటారు.     అల్లసాని పెద్దన విరచిత   స్వారోచిష మనుసంభవం మరియు మీరు పదే పదే హెచ్చరించే మనుశాస్త్రం ఒకటేనా అని సందేహం వుండేది.    మనుచరిత్ర చదివిన తరువాత ఇందులో కుల ప్రస్తావన లేదే, బహుశా అది ఇదీ వేరే అని అర్ధమైంది.   


ఈ ఉద్యమం వలన మీకు కూడా మంచే జరిగిందని నా ఉద్దేశం.     మీరు ఐతరేయ బ్రాహ్మనీయం, ఉపనిషత్తులు, ఋగ్వేదంలోని కొన్ని పనసలన్నా నేర్చుకొని వుంటారు.    వాదనకు పనికివచ్చే విషయాలకోసం, మీరు  ఇన్ని సార్లు  వేదాధ్యయనం చేయడం వలన మాకన్నా మీకే ఎక్కువ మంచి జరుగుతుంది.   


ఆంధ్రము, ఆంధ్రోళ్లు పేరుతొ మీరు రెచ్చగొట్టడం నాబోటిగాళ్ళకు ఒకరకంగా మంచే జరిగింది. ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం చచ్చీ చెడీ చదివాను.   ఆరుద్ర గొప్పతనం గురించి తెలిసింది.    ఎంత పరిశోధన చేశాడు.  కనిమళ్ళ శాసనం దగ్గరనుంచి అద్దంకి తరువోజ ఛందస్సులోని పండరంగడి శాసనం దాకా  ప్రస్తావించాడు.     


బహుశా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పుస్తకాలన్నీ చదివితే,   చిత్తూరు మినహా మదనపల్లె, కర్నాటక లోని తుమకూరు, పావగడ, కోలార్ జిల్లాలతో కూడిన 10 జిల్లాల రేగినాడు (రేగిస్తాన్ అనే పేరైతే కాస్త కొట్టచ్చినట్లుగా వుంటుంది) కోసం వుద్యమిస్తాడేమోనని భయపడుతున్నాను. 


అన్ని ప్రాంతాలలోని ఉద్యోగ, వ్యాపార, రాజకీయ నాయకులవలె నేను కూడా స్వార్ధంతో ఎంతో కొంత విషయ సేకరణ చేసి జ్ఞానాన్ని పెంచుకున్నాను. అందుకు నేను  సదా కృతజ్ఞుడ్ని.          

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి