మన రాష్ట్రం గత మూడు సంవత్సరాలలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అందులో ముఖ్యమైనవి - ముగ్గురు ముఖ్య మంత్రులు మారడం, ఆహార దీక్ష, సకల జనుల సమ్మె పేరిట సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం, భూకంపాలు సృష్టించడం, గుఱ్ఱం జాషువా మొదలు, శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాల వరకు నేలపాలు చెయ్యడం, కేబుళ్ళు తగల పెట్టడం, 18 సార్లు ఉప ఎన్నికలు రావడం, అసంఖ్యాకంగా ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ మరియు పార్లమెంటు సభ్యులు పార్టీలు మారడం, ఒక ఎంపీ, ఒక ఎం ఎల్ ఎ జైలు లో వుండటం మొ॥
ఈ రికార్డులన్నిటితోపాటు, నిన్న సభాపతి గారి తీర్పు ద్వారా సభ్యత్వం కోల్పోయిన మరో 15 మంది మాజీలు అయ్యారు. రాజకీయ పార్టీల స్వార్ధానికి ప్రజలపై మరోసారి భారం పడాల్సిన అగత్యం నుంచి దాదాపు తప్పించుకున్నట్లే. ఐదు సంవత్సారాలు తమ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఎన్నుకున్న ప్రజలను మధ్యలోనే ముంచేసి, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేశారు.
ఈ ప్రమాదకరమైన పరిస్తితి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజా ప్రతినిధులు రాజానామా చేసి పార్టీ మారదలచుకుంటే, ఆ ప్రతినిధి కనీసం మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికలలో పోటీ చెయ్యకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చెయ్యాలి. నియోజకవర్గ ప్రజల మనోభావాలు పేరుతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉప ఎన్నికలు తెస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నాయకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం వుంది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి