ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట ముట్టిచ్చుకున్నాట్ట వెనకటికెవడో, అట్లుంది మన రాష్ట్ర అధికార - ప్రతిపక్ష నాయకుల తీరు. ఇవ్వాళ డెహరాడూన్ విమానాశ్రయంలో జరిగిన ఈ బూతులాట పంచాంగానికి ససాక్షంగా నిలిచిన ఈ వీడియోలు చూడండి :
http://www.youtube.com/watch?v=vhFQfWzNZu8 తెలుగు మీడియా
http://www.youtube.com/watch?v=ZYKsJeg4h8w హిందీ మీడియా
ఎల్ బి నగర్ కూడలిలో ఉదయాన్నే 5 గంటలకు ఊర్ల నుంచి వచ్చే బస్సులు ఆగినప్పుడు, మన ప్రమేయం లేకుండానే ఆటో వాళ్ళు సంచిని మనతో సహా ఒక్క ఊపున కిందకు దించుతారు చూడండి, సరిగ్గా డూన్ విమానాశ్రయంలో వి హనుమంత రావు గారు జనాల్ని కాంగ్రెస్ విమానం ఎక్కిస్తే, రాథోడ్ గారు కొంత మంది జనాల్ని తెదాపా విమానం ఎక్కించి టిక్కెట్లు కొట్టి కూర్చో పెట్టి బెల్టు కూడా కట్టారు. ఇంతలో కాంగ్రెస్ పెద్దాయన ఒకాయన, మా విమానంలో దారిలో తినడానికి అదిరిపోయే ఫుడ్ అరేంజ్ చేశాం అని కేకాసారు. ఆప్తులను వదిలి 10 రోజుల పైగా నరకం అనుభవిస్తున్న బాధితులు విస్తుపోగా, డూన్ విమానాశ్రయ ప్రయాణీకులు, సెక్యూరిటి సిబ్బంది నవ్వుకున్నారు.
బాధితులను ఆదుకొనే సదుద్దేశంతో మొట్టమొదట చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గార్లు ఎ పి భవన్ కు చేరుకున్నారు. అయితే, మొదటి రెండు రోజులు వరదల తీవ్రత, ప్రాణ నష్టం అంచనా వేయడంలో కొంత వరకు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పార్టీల వారీగా వున్న తెలుగు మీడియా ఎప్పుడైతే, కొండలు గుట్టలు పాకడం మొదలు పెట్టిందో, ప్రభుత్వానికి వరదల నష్టం అర్ధమైంది. బాబు గారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బట్టలు డబ్బులు విరాళంగా అందించారు. ఎ పి భవన్ రెసిడెంట్ కమీషనర్ గోయల్పై విరుచుకు పడ్డారు. ఇంతవరకు అభినందించ తగ్గ విషయం.
అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రిని ఇంగ్లీష్, తింగ్లీశ్ లో కేక లేశారు. పుండు మీద కారం చల్లినట్లు, మెడికల్ టీమ్స్ పేరుతో ఎ పి భవన్లో తాత్కాలిక పార్టీ ఆఫీస్ పెట్టారు. నిజంగా రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతె, డాక్టర్ల జేబులకు తెదేపా బాడ్జ్ లు, టేబుళ్ళకు బాబు గారి ఫోటో వున్న బ్యానర్లు ఎందుకండి. మోడీని ఆదర్శంగా తీసుకుని బాబు గారు కూడా (రాయల సీమ నుంచి తెప్పించారేమో) ఒక 30 తెల్ల సుమోలు, విమానాలు, హెలికాప్టర్లు, కేసినేని వారి సౌజన్యంతో బస్సులు (బస్సు ముందు భాగంలో తెదేపా బ్యానర్లు మర్చిపోలేదు సుమా) ఏర్పాటు చేశారు. తెదేపా చర్యలవల్ల ప్రభుత్వంలో కదలిక ఒచ్చిన మాట వాస్తవం. కానీ మీడియా సాక్షిగా జరుగుతున్న ఈ కార్యక్రమం మాత్రం బాగా లేదు.
ఇది నిజంగా రాజకీయం కాకపొతే, ఒట్టేసి చెప్పమనండి, వచ్చే ఎన్నికలలో మోడీ, తెదాపా మరియు ఇతర పక్షాలు ఈ విషయాల్ని ప్రస్తావించనని? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. ఎన్నికలప్పుడు ఈ విషయాన్ని తన పరిపాలనా నైపుణ్యంతో ముడిపెట్టి వోట్లు అడిగేది అడిగేదే.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి