1, డిసెంబర్ 2012, శనివారం

అతి సర్వత్ర వర్జయేత్

ఒక సముద్రం ఒడ్డున ఒక పెద్ద మనిషి భార్య పిల్లలతో కాపురం ఉంటున్నాడు. ప్రతి నిత్యం సముద్రంలో దొరికే జీవరాసులని పట్టుకొని వాటినే ఆహారంగా తింటూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఏ బాదర బందీ లేదు. రేపటి సంగతి ఏంటి అనే చింత లేకుండా గడుపుతున్నాడు. ఒక నాడు ఒక పర్యాటకుడు సముద్రం దగ్గర సేద తీరుదామని వచ్చాడు. హాయిగా బొజ్జ మీద టవల్ వేసుకొని పడుకొన్న ఈ పెద్దమనిషిని గమనిస్తాడు. అతనిదగ్గరికి వెళ్లి ఏమండి మీరేమి చేస్తుంటారు అని అడుగుతాడు. నిద్రపోతున్నానండి అని ఛలోక్తి విసురుతాడు ఆ పెద్ద మనిషి. అది కాదండి జీవించడానికి ఏమి చేస్తారండి అని అడుగుతాడు. దానికి ఆ పెద్దమనిషి సముద్రంలో దొరికే చిన్న చిన్న జీవరాసులని పట్టి వాటిని వండుకొని ముప్పోద్దుల సేవిస్తు ఉంటాము అంటాడు. ఏమండి మీరు ఖాళీగా వున్నారు కదా - పగలు చేపలు పట్టి సాయంత్రానికి వాటిని మార్కెట్లో అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది అని చెప్తాడు. అయిష్టంగానే ఆ పెద్దమనిషి ఇతని మాటని విని మరుసటి రోజునుంచి చేపలు పట్టి మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. మరి కొన్ని రోజుల తర్వాత ఆ పర్యాటకుడు వచ్చి పెద్దమనిషిని మెచ్చుకొని ఎన్నాళ్ళని ఈ చిన్న తెప్ప మీద సముద్రంలోకి వెళ్తావు హాయిగా ఒక మర బోటు కొనుకుంటే ఎంచక్కా శ్రమ తక్కువతో బోలెడు చేపలు పట్టి ఎక్కువ డబ్బు గడించవచ్చు అని చెప్తాడు. తను దాచుకున్న డబ్బుతో మర పడవ కొనుక్కొని ఎక్కువ చేపలు పట్టి మార్కెట్లో అమ్ముతూ 24 గంటలు కస్టపడి ఎక్కువ డబ్బులు గడిస్తాడు. మళ్ళీ ఈ మిత్రుడు వస్తాడు. ఓరి పెద్దమనిషి ఎన్నాళ్ళని పక్కన ఊళ్ళోని మార్కెటుకు వెళ్లి చేపలు అమ్ముతావు? హాయిగా విదేశాలకు ఎగుమతి చేసి డాలర్లు సంపాదించుకో అని చెప్తాడు.
  
కానీ ఈ సారి మన పెద్ద మనిషి అతని మాట వినల. తన దగ్గర వున్న వలలు, మర పడవలు అమ్మేస్తాడు. తనకి కావాల్సిన రోజువారి ఆహారానికి మాత్రం చేపలు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటాడు. ఇది ఇలా వుండగా ఆ పర్యాటకుడు మళ్ళీ వస్తాడు. ప్రశాంతంగా సముద్రం ఒడ్డున సేద తీరుతున్న ఆ పెద్దమనిషితో - ఇదిగో పెద్దమనిషి నేను చూడు రాబోయే వృద్ధాప్యం గురించి ఇప్పటినుంచి కష్టపడుతుంటే నువ్వేంది ఇలా వ్యాపారాలన్నీ మూసేసావ్ అంటాడు. హాయిగా సంపాదించి వృద్ధాప్యంలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోక ఎందుకయ్యా సంపాదన ఆపివేసావు అంటాడు. అందుకా పెద్దమనిషి ఓరి వెర్రిబాగులోడ నువ్వెప్పుడో రాబోయే వృద్ధాప్యం గురించి ఆ తరువాత రాబోయే "హాయి" గురించి మాట్లాడుతున్నావు నువ్వు పరిచయం కాక ముందు నేనే ఎంతో హాయిగా జీవిస్తున్నాను. నీ వెధవ ఐడియా నా జీవితాన్ని మార్చింది, ఇలాంటి వెధవ సలహాలు ఇహ ముందు ఇవ్వద్దు అని చెప్తాడు.
 
ఈ కధలో నీతి ఏంటంటే - డబ్బు అవసరం ప్రతి వాడికి వుంది. కానీ దానికీ ఒక మితం వుంది. కోట్లు దోచుకుంటున్న రాజకీయ నాయకులకు కంటి మీద కునుకుండదు, ఎప్పుడు సి బి ఐ లక్ష్మీ నారాయణ వచ్చి అరెస్టు చేస్తాడో నని. కేవలం సంపాదనే పరమావధిగా ఇల్లాలికి పిల్లలకి సమయం కేటాయించకుండా , వేల్టికి సరిఐన తిండి లేక చక్కర వ్యాధి, రక్తపోటు, తింటే అరగదు, తినకపోతే నీరసంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్న పెద్ద మనుషులు ఈ దేశంలో ఏంతో మంది వున్నారు. ఉదా: మన గాలి గారినే తీసుకోండి, రత్నఖచిత సిమ్హాసానాలు హంస తూలికా తల్పాలు, పట్టు పరుపులు, చివరకు తను వాడే స్నానపు గది లోని పరికరాలు కూడా బంగారమే. కానీ ఈ మితిమీరిన ధనాశ చివరకు భార్యా బిడ్డలను దూరంచేసింది, 10 బై 10 జైలు గది మాత్రం మిగిలింది.
 
మితిమీరిన సంపాదన అనే కాంక్ష అది మనిషి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కాని మన కధలోని పెద్దమనిషి హాయిగా ఇలాంటి భయాలేమి లేకుండా బోర మీద తడి తువ్వాలు వేసుకొని మధ్యానం ఓ గంట కునుకు తీస్తాడు. వాడికి ఏ రోగం లేదు, ఆదాయ పన్ను, అమ్మకపు పన్ను గొడవ లేదు. ఎందుకో ఈ విషయం కోట్లు వున్నా ఇంకా అక్రమంగా సంపాదించాలనే వారికి అర్ధం కాదు.
 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి