28, నవంబర్ 2012, బుధవారం

ప్రపంచ తెలుగు మహాసభలకు "టేల్గులో" ఆహ్వానం

ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో డిసెంబర్ మాసంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో హడావుడి మొదలయింది. వాయువేగంతో తెలుగు గురించి విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టారు పాలకులు. ఇవ్వాళ మన రాష్ట్రంలోని నాయకులలో ముఖ్యంగా దృశ్య శ్రవణ యంత్రాలలో చర్చల్లో పాల్గోనే ప్రముఖుల్లో తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడే వారే చాలా మంది వున్నారు. ఎంత ఎక్కువగా ఆంగ్ల పదాలు కలిపితే అంత బాగా మాట్లాడినట్లు లెక్క. వీరికితోడు మన దృశ్య శ్రవణ యంత్రాల కార్యక్రమ నిర్వాహకులు "dont గో ఎనీవేర్, just వన్ సెకండ్లో వి విల్ బి విత్ u, అప్పటి దాకా వన్ స్మాల్ బ్రేక్" అంటారు. ఈ వాక్యంలో మనం ఒక గంట కూర్చొని తెలుగు పదాలు వెదికితే ఒకటో ఆరో దొరకకపోదు. ఇది మొత్తం తెలుగు కార్యక్రమం. అంతదాకా ఎందుకు, మన ముఖ్య మంత్రిగారికే తెలుగు సరిగా రాదు. ఆయన సభాధ్యక్షులుగా వున్నప్పుడు వారి ఊత పదాలు మనకు తెలియనివి కావు. దయచేసి మీ కుర్చీలు మీరు తీసుకొని వెళ్ళండి. (ప్లీజ్ టేక్ యువర్ సీట్స్). రాజకీయ నాయకుల పిల్లలే కాదు మన పిల్లల్లో ఎంత మంది (తెలుగు మాధ్యమంలో చదవడం వదిలేయండి) కనీసం తెలుగు రెండవ భాషగా నేర్చుకోవడానికి ఇస్టపడుతున్నారు? వాళ్ళు నేర్చుకున్టామన్నా తల్లితండ్రులము మనం ఒప్పుకోము, ఎందుకంటే, ఎక్కువ మార్కులు కావాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు, తెలుగు రాదు గాని, నూటికి 95 మార్కులు అప్పటికి అప్పుడు సంస్కృతం రెండవ భాషగా తీసుకుంటే (చెప్పే వాడికి రాదు, వినేవాడికి రాదు, దిద్దేవాడికి అంతకన్నా రాదు) మార్కులు తప్పకుండా వస్తాయని నమ్మకం. అది నిజం కూడా! 
   

ఎంతసేపటికి మనం పక్కనవున్న తమిళనాడుతో పోల్చుకొని వాళ్ళెంత భాషాదురభిమానులో మనం పొగుడుతాం. కానీ ఆ రాష్ట్రం భారతదేశానికి ఒక అంచున వుంది. తమిళనాడు పొరుగు రాష్ట్రాలన్నీ దక్షిణాది రాష్ట్రాలే. కాని మన దురదృష్టం మన చుట్టుపక్కల ఒడిష, చత్తీస్గడ్, మహారాష్ట్ర ఒక వైపు ఇంకొకవైపు తమిళనాడు కర్నాటక రాష్ట్రాలు వున్నాయి. ఈ ప్రత్యెక భౌగోళిక పరిస్తులవలన , దేశంలోనే హిందీ తర్వాత మాట్లాడే అతిపెద్ద భాష ఐన తెలుగు ప్రమాదంలో పడింది. ఈ భౌగోళిక పరిస్తితులవలననే మన రాష్ట్రంనుండి గెలిచిన పార్లమెంట్ సభ్యులలో ఒరియా, కన్నడ మరాఠీ మూలాలు కల వాళ్ళు  కూడా వున్నారన్నది  అక్షర సత్యం.
 

మరొక విషయం - నామఫలకాలను తెలుగులో రాస్తేనో, సినిమాలకు తెలుగు పేరు పెట్టినంత మాత్రాన భాషాభివృద్ధి జరగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటినుండి త్రిభాషా సూత్రాన్ని(తెలుగు, ఉర్దూ మరియు హిందీ ) పాటిస్తుంది. కానీ తమిళనాడు వారు తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమె వారు ఆమోదించారు. మనమేమో ప్రాంతాలవారీగా కొట్టుకొని చస్తున్నాము. తెలుగులో ఆదికవి నన్నయ్యా లేక పాల్కురికి సోమనాదుడా అనే అప్రస్తుత వాగ్వివాదాలతో నిత్యం కొట్టుకుంటున్నాం. ఇది కేవలం దిన పత్రికల పుటలు నిన్డటానికి ఉపయోగ పాడుతుండే కానీ, భాషాభివృద్ధికి తోడ్పదు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం ఒకరు ఔనన్నది ఇంకొకరు కాదనడం. కాని ప్రక్క రాష్ట్రాలవారు పారిశ్రామిక అభివృద్ధితో ముందంజలో వున్నారు. ఇది కూడా మన భాష దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం. మన పిల్లలు ఇక్కడి కాలేజీల్లో తాంత్రిక విద్య (టెక్నికల్ కోర్సు) చదివితే ప్రాంగణ ఉద్యోగాలు చాలా తక్కువ. అదే తమిల్నాడులోకానీ కర్ణాటకాలో గాని చదివితే - BHEL-రెండు యూనిట్లు, తోళ్ళ పరిశ్రమలు, లోదుస్తుల పరిశ్రమలు, ఆటోమొబైల్ రంగంలో హ్యుండై, టఫే, లే లాండు, ఫోర్డ్, నిస్సాన్, టి వి ఎస్, కోనే, జాన్సున్ లిఫ్ట్లు .... లిస్టు రాయాలంటే చేయ్యినోప్పి పుడుతుంది. ప్రతి జిల్లా ఒక పారిశ్రామిక వాడా. ఇక కర్నాటక రాష్ట్రానికి వస్తే, టయోట, వోల్వో, అన్ని ప్రముఖ సాఫ్టువేరు కంపనీలు, బస్ బాడీ తయారీ, ఓటిస్ లిఫ్ట్లు, ఎ పి సి, కొత్తగా హీరో హోండా ఇంకా అనేక పరిశ్రమలు ఇక్కడే. ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ రెండవ తరం పిల్లలు చాలామంది ప్రక్క రాష్ట్రాల్లో స్థిరపడి ఆ రాష్ట్రంలోని వాడుక భాషను, బ్రతుకు తెరువుకోసం మరియు మనుగడ కోసం నేర్చుకుంటున్నారు. అక్కడి పాటశాలల్లో చేరే ఈ రెండో తరం పిల్లలు వేరే దారి లేక ఇతర భాషలను రెండవ మూడవ భాషలుగా నేర్చుకోవడం మూలాన మన భాష అంతరించి పోతుంది.
 

కాబట్టి, రాష్ట్రం రాజకీయంగా స్థిరత్వం లేకుండా ఆర్ధికాభివృద్ధి సాధించలేదు. చైనా వాడికి ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే ఇంగ్లీష్తో పనిలేదు. ఏం వాళ్ళు అభివృద్ధి సాధించట్లా? తమిళనాడులో ఏ రాజకీయ పక్షం అధికారంలో వున్నా స్వాతంత్ర్యానంతరం గణనీయమైన పారిశ్రామికాభివృద్దికి బాటలు వేసింది. ఈ కారణంగానే వాళ్ళల్లో వలసలు తక్కువ. పారిశ్రామిక, వ్యవసాయ పురోభివ్రుది లేకుండా, అన్నిరంగాలలో వలసలు అరికట్టకుండా మన భాషకు మనుగడ లేదు.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి