31, జులై 2013, బుధవారం

అంతర్ రాష్ట్ర సంబంధాలు - కొన్ని రక్షణలు


మంచి చెడులు ఆలోచించకుండా జరిగిన విభజన ఫలితాలు సామాన్యుడ్ని కోలోకోలేని దెబ్బ తీసే ప్రమాదం వుంది. చూడడానికి విషయాలు చిన్నవిగా కనిపించినా దాని దుష్పరిణామాలు అనంతం.    ఉదా : 


వాహనాల రిజిస్ట్రేషన్:   తెలంగాణా మరియు ఆంద్ర ప్రదేశ్ లోనే కాదు, ఒక రాష్ట్రంలో నమోదైన స్కూటర్ కూడా వేరే రాష్టంలోకి ప్రవేశిస్తే, పోలీస్  వెంటబడతాడు.   వాడిని తప్పించుకోవడాని పడే తిప్పలు వర్ణనాతీతం. దేశవ్యాప్తంగా వున్న ఈ చిన్న సమస్యను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. వాహన యజమాని కట్టే జీవితకాలపు పన్ను కేంద్ర ఖాతాలోకి తీసుకొని, జనాభా ప్రాతిపదికగా దామాషా పద్ధతిలో రాష్ట్రాలకు ఇవ్వాలి.   ఈ సవరణ కన్నా ముందు, అన్ని రాష్ట్రాలలో వున్న వాహన పన్నుల శాతాన్ని ఒకే రకంగా ఉండేట్లు చూడాలి.   గోవాలో రోడ్ టాక్స్ ఒక రకంగా వుంటే, పాండిచేరిలో మరో రకంగా వుంది.      


మొబైల్స్ : భౌగోళికంగా రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రోమింగుగా పరిగణించకుండా, దేశవ్యాప్తంగా రోమింగ్ చార్జీలను రద్దు చెయ్యాలి.  


నీటి ప్రాజెక్టులు : ఇప్పటికే కొంత మేర నిర్మాణం జరిగిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించాలి.   నీటి కేటాయింపులు, భవిష్యత్తులో ఎగువనున్న ప్రాంతంలో కట్టబోయే ప్రాజక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పూర్తి అనుమతితో మాత్రమే జరగాలి.   


ప్రాంతెతరులకు రక్షణ : 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు మాత్రమే (నాలుగున్నర కోట్ల అబద్ధాన్ని ఇప్పుడన్నా నిజం చెయ్యండి) .   ఇందులో కనీసం కోటి మంది వరకు తీర సీమాంధ్ర ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడిన వారు ఉండవచ్చు.   రాజధాని పూర్తిగా తరలించిన తరువాత ఈ కోటి మంది ప్రజలకు, వీరి ఆస్తులకు  ప్రమాదం ఏర్పడిన సందర్భంలో, హైదరాబాదును UT గా చేస్తామనే అంశం తప్పకుండా ప్రస్తావించాలి. ఎందుకంటే, ఒక ఉప ప్రాంతీయ పార్టీ గతంలో తెలంగాణా గ్రామ ప్రజలను మభ్య పెట్టి, రాష్ట్రం వస్తే ఆంధ్రోళ్ళ ఆస్తులు మనవే అయిపోతాయనే అపోహ కల్పించింది కాబట్టి.    ఇలాంటి సంఘటనలకు ససాక్షమైన ఉదాహరణ బాన్స్వాడ ఎం ఎల్ ఎ గా గెలిచినా పోచారం శ్రీనివాస్ ఆంధ్రా వాళ్ళు వోట్లు వెయ్యలేదు కాబట్టి తనకు తక్కువ మెజార్టీ వచ్చిందనీ, వాళ్ళ పని పడతామని బెదిరించడం .   


రాబోయే తెలంగాణా రాష్ట్రంలో కూడా, తీర సీమాన్ధ్రులు కనీసం 40 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలిగిన బలీయమైన వోటు బాంక్ ఉన్నదన్న సత్యాన్ని తెలంగాణా పాలకులు గుర్తుంచుకోవాలి.      

ఆంద్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలి


నష్టం జరిగిపోయింది.   దీనిని దిగమింగుకోవడానికి కనీసం రెండు దశాబ్దాలు పట్టవచ్చు.    ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలు ఈ చారిత్రాత్మక తప్పిదంలో భాగస్వాములే.   ఈ నిర్ణయం వెనుకకు తీసుకోవడం అసాధ్యం.  


తెలంగాణా ప్రజలు నాయకులను ఆటాడిస్తే, ఆంధ్రా నాయకులు ప్రజలను మభ్య పెట్టారు.   విచిత్రమేమిటంటే, ఇప్పటికీ, లగడపాటి వారు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని సెలవిస్తున్నారు.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తీవ్ర ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది.   ఇది అభినందించతగిన విషయం.  కేంద్రం నిర్ణయం తీసుకోదలచుకుంటే, ఆయన రాజీనామా చేసినా ఫలితం లేదు.     మోసపోయిన ప్రజలు, ఆవేశంలో ఆస్తులు ధ్వంసం చేసుకోవడం తగదు.   కనీసం కేంద్ర ప్రభుత్వానికి విధేయత చూపిస్తూ, నష్టపోయిన ప్రజలుగా ఎక్కువ మొత్తం నిధులకోసం, జల పంపిణీలో దిగువన వున్న రాష్ట్రాల హక్కుల  కోసం, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కోసం, కేంద్ర ఉన్నత విద్యా సంస్థల కోసం శ్రమించాలి.    
  

హైదరాబాదుపై  దృష్టి సారించి  అభివృద్ధి కేంద్రీకరణ జరిపిన పాలకులలో చంద్ర బాబు ముఖ్యుడు.   ఒక పెద్ద స్టేడియం కట్టినా, సమావేశ మందిరం కట్టినా అది హైదరాబాద్ లోనే కట్టారు.     తీర సీమాంధ్ర ప్రాంతంలో కనీసం కబడ్డీ ఆడుకొనే మైదానం కూడా నిర్మించ లేదు.   ఇది పాలకుల అనాలోచిత చర్య.     రాబోయే రాష్ట్రంలో అలా జరగకూడదు.   పరిపాలన వికేంద్రీకరణ జరిగాలి.  ఉన్నత న్యాయ స్థానం ఒకచోట వుంటే, దాని బెంచ్ ఇంకొక జిల్లాలో వుండాలి.  ఈ రకమైన వికేంద్రీకరణ వలన మరో విభజనకు తావులేదు.   


రాయలసీమలోని ఒక వర్గం వారు తీర సీమంధ్ర వాసులని దూషించడం మొదలు పెట్టారు.   కారణం, వాళ్లకు కూడా ప్రత్యెక రాష్ట్రం వస్తే, ఒక ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రి పదవులు వస్తాయని.   కానీ 4 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఏ రకంగా చూసినా నిలబడ లేదు.   ఈ విషయాన్ని నాయకులు తక్షణం చర్చించుకోవాలి.  లేదంటే మరో 610 జీ వో అని, మాది మాకు కావాలని అనవచ్చు.  లేదా   ఈ సారి రాహుల్ గాంధీ కొడుకో, కూతురో అధికారంలోకి రావడానికి లేదా వెంకయ్య నాయుడు మనమరాలు మంత్రి కావడానికో, నారాయణ లాంటి వారు ఒక గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు అయ్యేందుకో  మరో విభజనను ప్రోత్సహిస్తారు.   


విభజనను సాకుగా చూపించి జగన్ పార్టీని గెలిపిస్తే,  ఆంధ్రుల పరువు బజారున పడటం ఖాయం.   అసలే క్రైస్తవం అధికంగా వున్న తీర సీమాంధ్ర ప్రాంతంలో, జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది. ఉప ఎన్నికలలో గంప గుత్తగా ఆ పార్టీ వాళ్ళను గెలిపించడం వలననే, రాజకీయ పరమైన విభజనకు కారణమైంది.  దీనిని సాకుగా తీసుకొని భాజపా బలపడే ప్రమాదం కూడా వుంది.    హిందువులు ముస్లింల మధ్య వున్న ప్రేమ కొనసాగాలి.   


ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రిగా విద్యాధికుడు, అవసరమైతే సొంత ఆస్తిని కూడా దానం చేయగలిగి మరో ప్రకాశం పంతులు వారసుడు రావాలి.        




30, జులై 2013, మంగళవారం

తెలంగాణా గెలిచింది - తెలుగు జాతి వోడింది

తెలుగు జాతి దౌర్భాగ్యం
రగులుతున్న రావణ కాష్టం
వోట్లు, సీట్లు మాకే కావాలని
అన్ని పార్టీల పోరాటం
తెలుగు వాడి గుండె చీల్చే ఆరాటం

అరవోడు  పొమ్మన్నాడు
హైదరాబాదీ రమ్మన్నాడు
కర్నూలు వదులు కోమ్మన్నాడు
ఇప్పుడేమో తన్ని తరిమేస్తామంటున్నాడు

తెలుగు తల్లి విడివడుతోంది
ఇటలీ తల్లి వడివడిగా అడుగులేస్తోంది
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు
ఆ ఇటాలియన్ చేతిలో  బలైపోతున్నారు

అమాయకులను రెచ్చగొట్టి, అమరులని పేరు పెట్టి
పరులకు పుత్రశోకం మిగిల్చావు
నీ సంతానాన్ని నాయకులను  చేశావు
జాగో భాగో అంటూ  హా హా కారాలు చేశావు

ఉద్యమం ముసుగున
అరాచకం సృష్టించావు
ఎలక్షన్లు కలెక్షన్లకు  తెరలేపావు
బేర సారాలకు బరితెగించావు
అమాయక ప్రాణాలు బలిగొన్నావు

దొంగలన్నావు , దోపిడీ చేసారన్నావు
దోపిడీ దారుకు ప్రాంత విభేదాలు ఉండవని
అందుకు నువ్వే సాక్షమని రుజువు చేశావు
ఫాం హౌస్కు పరిమితమయ్యావు
గురివింద నలుపు సామెత గుర్తు చేశావు


చిన్న రాష్ట్రాలకి సై అంటారు
మూడు రాష్ట్రాలు మేమే చీల్చామంటారు
యు పి లో మాత్రం నై అంటారు
ఎ పి లో మాత్రం సై  అంటారు
ఇదే మా నైజం అని  చెప్పకనే చెప్తారు


రాయల సీమ బాబు గారు నింపాదిగా చూస్తున్నారు
బలి పీఠం ఎక్కుతున్న తెలుగుతల్లి వధను
తెలుగువాడు పడుతున్న వ్యధను
గుడ్లప్పగించి చూస్తున్నాడు, నాకు రెండు కళ్ళని
తన గుడ్లని తానే తినే పాముని గుర్తు చేస్తున్నాడు


సిక్కోలు సిన్నోడు
సారా పాటల రారాజు
అంతా అధిష్టానం అంటాడు
సొంత లాభం కొంత చూసుకొని
వి'భజన'కు  తోడ్పడతాడు


గోడ మీద పిల్లి, జైలులో పులి
ధనమే  సమస్తమని, అంతా నా ఇష్టమని
చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు
తండ్రి పేరు చెప్పి కాన్గిరేసును చీల్చావు
నిన్ను చీల్చి చెండాడుతారని మర్చిపోయావు
పిల్ల జగనుకేమి తెలుసు కాంగిరేసు  దెబ్బ


ఆంధ్రోడా భయపడద్దు  మేమున్నామంటారు
భయపడాలనే సంగతి మరి మరీ  గుర్తు చేస్తుంటారు
గాంధి గారి సాక్షిగా ఎమ్మెల్యేని కొట్టారు
టాంకు బ్యాండ్ మురికిలో వైతాళికులను ముంచారు
ప్రజల ఆకాంక్ష ఇదే అన్నారు
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని


నారాయణ వెంకయ్య సాంబశివ రావు
రావిపాటి, గరికిపాటి, లగడపాటి
పేర్లేమో భగవంతుడివి
దార్లేమో విభజనవి
వోట్ల కోసమొస్తే ఉప్పు పాతరేయ్
నోరులేస్తే,  టంగుటూరి ప్రకాశాన్ని గుర్తుచెయ్


తెలుగువాడా కళ్ళు తెరు
మోసపోవడం నీకు కొత్త కాదు
కష్ట పడటం తెలుసు నీకు
ధైర్యంగా అడుగేయ్
ఊరు  వాడ పునర్నిర్మాణం చెయ్
రాజకీయ భేతాళులని  పాతాళంలోకి తొక్కెయ్
తెలుగు తల్లి  మరోసారి తలెత్తుకోనేలా చెయ్








29, జులై 2013, సోమవారం

బాబు గారి ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది


చంద్ర బాబు నాయుడు గారి ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది.    రాష్ట్రమంతా గత నెల రోజులుగా టి వి లకు అతుక్కుపోయి కూర్చొనుంటే, ఈయన గారేమో అవేమీ తనకు పట్టనట్లు, రాష్ట్రంలో వున్న అతివృష్టి గురించి, పంచాయితీ ఎన్నికల గురించి అందులో జరిగిన అవకతవకల గురించి, పారిశుధ్యం గురించి, మురుగునీటి పారుదల గురించి  అనర్గళంగా పత్రికా సమావేశంలో వివరించారు.    


ఈయన ధైర్యం చూస్తుంటే, నాకు కాంగ్రెస్ పార్టీ మీద అనుమానమోస్తుంది.   ఉమ్మడి శత్రువైన వైకాపాను తెలంగాణా లో గంట కొట్టించారు.   తెలంగాణలో తెరాస ను రెండు జిల్లాలకు పరిమితం చేసారు.     రాయల తెలంగాణా పేరుతొ భాజపా ను అటకేక్కించారు.    ప్రస్తుతానికి ఇరు ప్రాంతాలలో బరిలో వున్నది కాంగ్రెస్ మరియు తెదేపా మాత్రమె.     


బహుశా రేపు జరగబోయే మీటింగ్లలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లుపెట్టాలని నిర్ణయం తీసుకొని శీతాకాల సమావేశాల దాకా నెట్టుకొచ్చి, ఎన్నికలకు పోవచ్చు.    ఎన్నికలలో ఈ ప్రాంతంలో వచ్చే గెలుపు వోటమిలను ఆధారంగా చేసుకొని తుది నిర్ణయం తీసుకోవచ్చు.       

     

27, జులై 2013, శనివారం

విభజనను అడ్డుకునే శక్తి వైకాపాకు మాత్రమే వుంది


నిజంగా తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా వుంచాలానే ప్రఘాడ వాంఛ  వైఎసార్ పార్టీకి వుంటే, రాజీనామా డ్రామాలు కట్టిపెట్టి, విజయమ్మ గారు స్వయంగా సోనియాగాంధీ గారిని కలిసి తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రతిపాదించాలి.    దీనివల్ల స్వామి కార్యం స్వకార్యం నెరవేరుతుంది.    కేవలం సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజనను ప్రతిపాదిస్తున్నది నిజమైతే, ఈ కలయిక వలన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది.   విజయమ్మ గారికి, షర్మిల గారికి కాళ్ళు నెప్పులు కూడా తగ్గుతాయి.   ఈ ప్రతిపాదన తక్షణం చెయ్యకపోతే, రాయల తెలంగాణా జైలులో జగన్ నానా కష్టాలు పడే ప్రమాదం వుంది.   నిజంగా జగన్ బాబు మీద ప్రేమ వుంటే, విజయమ్మ గారు తక్షణం తమ శాసన సభ్యులతో ధిల్లీకి ప్రయాణం కావాలి.    ఎలాగు కాంగ్రెస్లో చేరదామనుకుంటున్న ప్రముఖ తెలంగాణా నాయకులకు కూడా ఈ నిర్ణయం ఊరట కలిగించవచ్చు. 

ఆప్షన్ 2 

ఒకవేళ సోనియా గాంధీ కాదు, కూడదు అంటే, తక్షణం నరేంద్ర మోడీని కలిసి, మా మద్దతు మీకే అని చెప్తే చాలు, తక్షణం సీన్ రివర్స్ అయిపోతుంది.    

ఆలస్యం అమృతం - ఆంధ్రా విభజనం 

ఉద్యమం వలన జరిగిన మేళ్ళు


రాష్ట్ర  సమస్య పరిష్కరించబడినా, పడకపోయినా, లాభపడింది కేవలం 15 పై చిలుకు అందుబాటులో వున్న ప్రసార మాధ్యమాలు మరియు విమానయాన సంస్థలు మరియు నాబోటిగాళ్ళు  మాత్రమే.   టివి చర్చల్లో, పత్రికా వ్యాసాల్లో తెలుగు ప్రజలు ఒకరినొకరు విపరీతంగా దూషించుకుంటున్నారు.    చివరకు, నన్నయ్యను విశ్వనాథ వారిని కూడా వదిలిపెట్టడం లేదు.   అయితే, పత్రికా పఠనం వలన ఎన్నో 'నిఘూడ రహస్యాలు' తెలుసుకోవడానికి అవకాశం కలిగింది.   


తెలింగానము అంటే అర్ధం ఏమిటో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వరంగల్ జిల్లా పరకాల ముద్దుబిడ్డ, ఆంద్ర ప్రాంతానికి బ్రిటీష్ వారిచే 'నియోగి'న్చబడ్డ పరకాల వంశానికి చెందిన ప్రభాకర్ గారి ద్వారా తెలుసుకున్నా.  


టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర చదివి  ప్రేమ వివాహం, అందులోనూ భాషాంతర, కులాంతర వివాహం ద్వారా రాజాజీ గారు  గాంధీ గారిని మెప్పించి తమిళనాడుకు చేసిన మేలును అర్ధం చేసుకున్నాను. 


తెదేపా నాయకుల పుణ్యమా అని, చంద్ర శేఖర్ రావ్ గారు విజయనగరం నుండి బహు భాషా కోవిదుడు కె కె గారు రాజమహేంద్రవరము నుండి నిజాం రాష్ట్రానికి వలస వచ్చారని తెలుసుకున్నా. 


ఉండవల్లి గారి దయవల్ల తెలగాణ్య బ్రాహ్మణులు తెలంగాణా ప్రాంతం నుంచి వలస వచ్చారని, వీరిలో విశాఖ ఉక్కు కోసం నినదించిన వ్యక్తీ ప్రముఖుడనీ తెలుసుకున్నా. 
  

కంచె ఐలయ్య గారు తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ధైర్యంగా చెప్పగలిగిన మనిషి.   తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడితే సామాన్య ప్రజలను దొరలు, భూస్వాములు అణచివేస్తారని,   అణగారిన వర్గాల పిల్లలు ఆంగ్లము చదవడం ద్వారా మిగిలిన విద్యార్ధులతో పోటీ పడవచ్చని తెలుసుకున్నా.  


రెండు రోజుల క్రితం హటాత్తుగా మళ్ళీ తెరమీదకొచ్చి ఐతరేయ బ్రాహ్మణీయమ్ గురించి, ఆంద్ర అనే పదం గురించి అసలు ఆంద్ర ప్రదేశ్ పేరు పెట్టకపోతే ఈ గొడవ వుండేది కాదని వక్కాణించారు.     మరో పత్రికలో వ్యాసం రాసిన ఒక మహిళామణి, ఆంద్ర భాష వేరు, తెలుగు వేరు అని, యునెస్కో లెక్కల ప్రకారం ఆంద్ర భాష వచ్చే 50 సంవత్సరాలలో అంతరించిపోతుందని ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు.   ఆవిడ గారి ప్రకారం, తీర సీమాన్ద్రులంతా ఆర్యులని, వీరు ముని శాపం వలన కుక్క మాంసం తినే వాళ్ళని వ్రాశారు.    
   

మీరేమో తెలుగునాడు అంటారు.    తెలుగు బతకాలంటే 12 జిల్లాల తెలుగునాడు కావాలంటారు.   ఇంకొక తెలంగాణ కవయిత్రి తెలుగు వేరు ఆంధ్రం వేరు అంటుంది.    మీరు మాట్లాడే భాష నాకు నూటికి 99.99 శాతం అర్ధమౌతుంది.    బొత్స సత్యనారాయణ గారి మాట సోనియాజీకి అర్ధమైనప్పుడు మీ భాష మాకెందుకు అర్ధం కాదండి.    సి నారాయణ రెడ్డి గారి మీద ఆన - ఆయనను అడగండి చెప్తాడు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని.     సంస్కృత సమాసాలు, సంధులు దట్టించి రాసే కవి పుంగవులు మన ముద్దుల మేనల్లుడు నాయకత్వం వహించే మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఉన్నంత మంది, మిగిలిన తెలుగు ప్రాంతాలలో లేరన్న నిజాన్ని తెలుసుకున్నా .     


ఐలయ్య గారూ - మీరు పదే పదే ప్రస్తావించే మనుశాస్త్రం గురించి ప్రస్తుతమున్న  ఏ బ్రాహ్మణ కుటుంబంలోని వాళ్లకు పరిచయం ఉంటుందని అనుకోవడం లేదు.    ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మను ధర్మ శాస్త్రం ఆచరణ సాధ్యం కాదు.    కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాసిన పుస్తకాన్ని, అలాంటి పుస్తకం ఒకటుందని తెలీని నా బోటిగాళ్ళకు మీరు అనవసరంగా పరిచయం చేస్తున్నారు.  రాష్ట్ర జనాభాలో కనీసం 5 శాతం కూడా లేని కులాన్ని మీరు పదే పదే టార్గెట్ చేస్తుంటారు.     అల్లసాని పెద్దన విరచిత   స్వారోచిష మనుసంభవం మరియు మీరు పదే పదే హెచ్చరించే మనుశాస్త్రం ఒకటేనా అని సందేహం వుండేది.    మనుచరిత్ర చదివిన తరువాత ఇందులో కుల ప్రస్తావన లేదే, బహుశా అది ఇదీ వేరే అని అర్ధమైంది.   


ఈ ఉద్యమం వలన మీకు కూడా మంచే జరిగిందని నా ఉద్దేశం.     మీరు ఐతరేయ బ్రాహ్మనీయం, ఉపనిషత్తులు, ఋగ్వేదంలోని కొన్ని పనసలన్నా నేర్చుకొని వుంటారు.    వాదనకు పనికివచ్చే విషయాలకోసం, మీరు  ఇన్ని సార్లు  వేదాధ్యయనం చేయడం వలన మాకన్నా మీకే ఎక్కువ మంచి జరుగుతుంది.   


ఆంధ్రము, ఆంధ్రోళ్లు పేరుతొ మీరు రెచ్చగొట్టడం నాబోటిగాళ్ళకు ఒకరకంగా మంచే జరిగింది. ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం చచ్చీ చెడీ చదివాను.   ఆరుద్ర గొప్పతనం గురించి తెలిసింది.    ఎంత పరిశోధన చేశాడు.  కనిమళ్ళ శాసనం దగ్గరనుంచి అద్దంకి తరువోజ ఛందస్సులోని పండరంగడి శాసనం దాకా  ప్రస్తావించాడు.     


బహుశా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పుస్తకాలన్నీ చదివితే,   చిత్తూరు మినహా మదనపల్లె, కర్నాటక లోని తుమకూరు, పావగడ, కోలార్ జిల్లాలతో కూడిన 10 జిల్లాల రేగినాడు (రేగిస్తాన్ అనే పేరైతే కాస్త కొట్టచ్చినట్లుగా వుంటుంది) కోసం వుద్యమిస్తాడేమోనని భయపడుతున్నాను. 


అన్ని ప్రాంతాలలోని ఉద్యోగ, వ్యాపార, రాజకీయ నాయకులవలె నేను కూడా స్వార్ధంతో ఎంతో కొంత విషయ సేకరణ చేసి జ్ఞానాన్ని పెంచుకున్నాను. అందుకు నేను  సదా కృతజ్ఞుడ్ని.          

20, జులై 2013, శనివారం

కాకి నెత్తిపై వాలిందని ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్


23 సంవత్సరాల ఆనంద్ హిందూస్తాన్ ఏరో నాటిక్స్ లో గత 7 నెలల నుండి ట్రైనీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.   అతని సోదరుడు హంపన్నతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు.    ఆఫీసుకు వెళ్లి వచ్చేప్పుడు బస్ కోసం నిలబడి వున్న ఆనంద్ తలమీద కాకి ఒక్క క్షణం కాలు పెట్టి ఎగిరింది.   ఇలా రెండు సార్లు జరిగింది. మూఢ నమ్మకాలపై విశ్వాసం వున్న ఆనంద్ తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని కంగారుగా చెప్పాడు.   జ్యోతిష్యుడ్ని కలిసిన ఆ తల్లి, దగ్గరలో వున్న హనుమంతరాయ స్వామీ ఆలయంలో దీపారాధన చెయ్యాల్సిందిగా సూచించింది.    ఆ సమాధానంతో సంతృప్తి చెందని ఆనంద్, తనకు ఏదో కీడు జరగబోతోందని ఊహించుకొని, విషం సేవించి తన గదిలో వుండి పోయాడు.   దురదృష్ట వశాత్తు, సంఘటన జరిగిన రోజు  తన సోదరుడు వేరే వూర్లో వుండటం వలన ఈ విషయం ఆలస్యంగా తెలిసింది.    ఆనంద్ కోసం సోదరుడు ఫోనులో ఎంతగా ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో, అనుమానంతో బెంగళూరు వచ్చి తలుపు తెరిచి చూడగా, నోటిలో నురగతో అచేతనంగా పడివున్న ఆనంద్ కనిపించాడు.      మూఢ నమ్మకానికి  ఆనంద్ బలైపోయాడు.      




బెంగళూరు మిర్రర్ కధనం ఆధారంగా