16, సెప్టెంబర్ 2013, సోమవారం

పరిశ్రమల మంత్రి గారు కళ్ళు తెరవండి


ఎద్దు పుండు కాకికి ముద్దు  అనే సామెత ఆంద్ర ప్రదేశ్ లోని పరిస్థితులకు అద్దం పడుతోంది.  ఒక పక్క ఉన్నత విద్యావంతుడు, అమెరికాకు పొట్టకూటికోసం వలస వెళ్ళిన మన పొన్నాల లక్ష్మయ్య గారు ఉద్యమాల కాలంలో ఐ టి రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని చెప్తుండగా, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.    ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చిన పరిశ్రమల ప్రతినిధి ఇంటర్వ్యు చదవండి --- 


15, సెప్టెంబర్ 2013, ఆదివారం

భావ ప్రకటనా స్వేచ్చ అంటే కిషన్ రెడ్డి గారికి ఎంత ప్రేమో

భాజపా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ మధ్య ఒక విచిత్రమైన కల వచ్చింది(బహుశా ఆ కల పగటి పూట వచ్చి ఉండచ్చు).   ఆ కలయొక్క సారాంశం, ఇరు ప్రాంతాలలో భాజపా అత్యధిక పార్లమెంటు స్థానాలు, శాసన సభా స్థానాలు గెలిచినట్లు!      ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సొంత గ్రామంలో తన పార్టీ బలపరచిన అభ్యర్ధిని గెలిపించుకోలేని ఈయన గారు చెప్పే మాటలు వింటుంటే  ఒక సామెత గుర్తొస్తోంది -  ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే ఇదే మరి.    భాజపా శాసన సభ్యులందరూ (అప్పటికి ఉన్నది ఇద్దరే) రాజీనామా చేసి తెలంగాణా నినాదం మీద మళ్ళీ గెలుస్తామని బీరాలు పలికి తను మాత్రం అంబర్ పేట్ నుంచి మళ్ళీ గెలవలేమేమో అన్న సందేహంతో, తోక ముడిచిన ధీశాలి కిషన్ రెడ్డి గారు! 


ఆంద్ర ప్రదేశ్ లో కనీసం వోటు హక్కు కూడా లేని ప్రాస కోసం ఏడ్చే ఆంధ్రోడు  వెంకయ్య గారి శిష్యుడికి సడన్గా భావ ప్రకటన స్వేచ్చ గుర్తొచ్చింది. బాబూ కిషన్ రెడ్డీ - మీరు చెప్పే భావ ప్రకటన స్వేచ్చ కేవలం తీర సీమాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్తిస్తుందా ?  తెలంగాణాలోని లక్షలాది విశాలాంధ్ర వాదుల నోరు నొక్కినప్పుడు మీరు వల్లించే ఈ భావ ప్రకటనా స్వేచ్చ ఎక్కడికి పోయింది. అందరికీ సమాన హక్కులుండే రాష్ట్ర రాజధానిలో కనీసం విలేకరుల సమావేశం పెట్టుకొనే స్వేచ్ఛ వేరే ప్రాంతాల వారికి లేదా?  పత్రికా విలేకరుల ముసుగులో గుండాలు చేసిన దాడులు మీరు ఖండించనప్పుడు, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి గురివింద నీతులు చెప్పే నైతికత తమకేక్కడనుంచి వచ్చిందో సెలవిస్తారా?


ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల వారిగా ఏ పార్టీ అయినా చీలిపోతే మొదటి వరుసలో వచ్చేది భాజపా అనే నగ్న సత్యాన్ని వచ్చే సార్వత్రికలలోపు మీరు వెండి తెరపై చూడవచ్చు.   రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి కావలసిన సీట్లు దండుకొనే ఉద్దేశంతో తెలంగాణాను ప్రకటించిందని మీరు కాంగ్రెస్ ను తిట్టారు. అంటే తెలంగాణా వేర్పడితే కాంగ్రెస్కు లాభం కానీ మీకేమీ ఉపయోగం లేదన్న తత్త్వం  ఈ పాటికి మీకు బోధ పడే వుంటుంది.   ఈ దిశగానే మోడీ గారు తెదేపాతో జట్టుకట్టబోతున్నరానీ రాష్రం కోడై కూస్తున్నది.  భాజపా ఒక జాతీయ పార్టీ.  పొత్తులు ఎత్తులు అన్నీ కేంద్ర స్థాయిలో ఉంటాయే గాని మీ మాటకు కట్టుబడి కేంద్రంలో పీఠం వదులుకోరు.   సొంత గ్రామ పంచాయతీ కూడా మీరు  గెలుచుకోలేదు, మీ మాట మేమెందుకు వినాలి అనవచ్చు.  ఒక వేళ మీరు కాదు కూడదు అని మొండికేస్తే, మీకు అద్వానీ గారి అడ్రసు ఇస్తారు.   ఇక కోస్తా ప్రాంతంలో మీ పార్టీలో ఎదురు చెప్పే ప్రసక్తే లేదు, కారణం - అక్కడ జిల్లా అధ్యక్షులుగా చెప్పుకొనే ఉత్సవ విగ్రహాలలో ఎక్కువ మంది   మీ వెంకయ్య గారి సామాజిక వర్గానికి చెందిన వారే.   తెదేపాతో కలవడం వల్ల వారికి కొంత బృతి దొరికే అవకాశం  వుంది. కాబట్టి వారు వ్యతిరేకించరు. 


రాబోయే రోజులలో ఇదే నిజమైతే, మీరు మీ పార్టీకి రాజీనామా చేస్తారని, వాక్ స్వాతంత్ర్యమే ధ్యేయంగా (అన్ని ప్రాంతాలలో) పని చేస్తారని ఆశిస్తున్నాం.      

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

పోలీసు శాఖలో యూనియన్ను ప్రోత్సహిస్తున్న నేతలు


శని వారం జరిగిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఒక కానిస్టేబుల్ జై తెలంగాణా నినాదాలు చేసి తెరాస వారిచే కీర్తింపబడినాడు .   ఆయనకు ధనయోగం, నాయకుల దర్శనం, యూ ట్యూబ్ చిత్రాలు, కీర్తి ఖండూతి దక్కాయి. రాబోయే తెలంగాణలో ఆయనకు డబల్ ప్రమోషన్ ఇచ్చ్చినా ఆశ్చర్యం లేదు.    ఈ కానిస్టేబుల్ ఒకప్పుడు ఎం ఎల్ ఎ గారి అంగ రక్షకుడిగా కూడా పనిచేశారు.   ఇలాంటి మనస్తత్వం వున్న వ్యక్తి ఉన్మాదిగా మారే ప్రమాదం వుంది. నినాదాలు చేసినంత మాత్రాన ఆయనను ఆకాశానికి ఎత్తడం చూస్తే, కొంత మంది ఉన్మాదులు పెట్రేగే అవకాశం వుంది.      


యూనిఫాం సేవలలో వుండేవారు ముఖ్యంగా తెలంగాణా వారంతా కలిసికట్టుగా ఆంధ్రోళ్ళ దౌర్జన్యాలను అడ్డుకోవాలని మన బాగు కోసం చట్టాలు చెయ్యాల్సిన పార్లమెంటు సభ్యుడు సెలవిచ్చాడు.   ఇలాంటి అడ్డు అదుపు లేని మాటలతో రెచ్చగొడితే, పాపం అమాయకులైన యువత పక్కదారులు పడుతున్నారు.  ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులను ప్రోత్సహిస్తే, రాబోయే రోజులలో హింస-ప్రతి హింసలకు దారితీసి ఇది జాతుల మధ్య వైరంగా పరిణమించే ప్రమాదం వుంది.   ఉద్యమం ముసుగులో అరాచకాన్ని ప్రోత్సహించి వోట్లు దండుకొనే నాయకుల కుట్రలు సగటు ప్రజానీకం ఇప్పటికైనా పసిగట్ట కలరని ఆశిద్దాం. 

పిడమర్తి వారి బూతుల పంచాంగం


ప్రతి ఉగాదికి తెలుగు వాళ్ళు పంచాంగం కొనుక్కొనే అలవాటు చాలా ఇళ్ళల్లో ఇప్పటికీ ఉన్న సంప్రదాయం.     అందులోను పిడమర్తి వారి  పంచాంగం ప్రముఖమైనది.  పిడమర్తి వారు తెలఘాణ్యు బ్రాహ్మలు. కానీ అభినవ ఉస్మానియా పిడమర్తి వారు  పంచాంగం విప్పితే మాత్రం  తంతాం, చంపుతాం అని చెప్పే భవిష్యత్ బూతు పురాణం మాత్రమే దర్శనమౌతుంది.   ఎన్ జీ వో లు హైదరాబాద్ గడ్డపై అడుగుపెడితే  జరగబోయే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు వివరించగా దానిని లైవులో అన్ని తెలుగు చానళ్ళ వారు యధాశక్తి గంట గంటకు తుఫాను హెచ్చరికల తరహాలో  ప్రసారం చేశారు.    


కొన్ని పదుల కేసులను ఎదుర్కొంటూ, ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న అప్రధాన వ్యక్తులకు తెలుగు మీడియా  అనవసరమైన ప్రాధాన్యం  ఇస్తోంది.   నాలుగు సార్లు త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన నిరుపేద మాణిక్ సర్కార్ గురించి ఒక్క కార్యక్రమం కూడా వుండదు.   దేశంలోని ముఖ్య మంత్రులన్దరిలోనూ పేదవాడు ఆయన.   ఆయన సతీమణి ఇవ్వాల్టికి రిక్షాలో ప్రయాణం చేస్తుందే తప్ప ప్రభుత్వ కారు వుపయోగించుకోదు.    ఆయన కొచ్చిన జీతాన్ని సి పి ఎం పార్టీకి దానం చేస్తూ, పార్టీ వారు ఇచ్చే 5,000 బత్యంతో కాలం వెళ్ళ దీస్తున్న నిజాయితీ పరుడు.   ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు.     


ఇలాంటి వారి గురించి గంటకు ఒకసారి కధనం ప్రసారం చేస్తే, కనీసం జిల్లాకు ఒకరన్నా మారతారు.   పిడమర్తి వారి హెచ్చరికలో లేక కడప వారి కుత్తుకలు కత్తిరింపుల సౌజ్యలతో యువతరం నాశనమౌతుంది    



2, సెప్టెంబర్ 2013, సోమవారం

చెల్లని కాసు - మోగని గంట


పొడిచేస్తాం పొడిచేస్తాం అన్నారు, తడి చేశారు అని మహా కవి శ్రీ శ్రీ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి, ఈ రాజీ నామాలు చూస్తుంటే.   ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా గవర్నర్ గారు మంత్రుల రాజీనామాను అంగీకరించే ప్రశ్నే లేదు.   చట్టం గురించి కనీస అవగాహన వున్న ఎవరికైనా తెలిసిన విషయమే ఇది.   కానీ, ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో గవర్నర్ను కలవడం మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం చూస్తే ఇది ఒక ప్రహసనంగా కనపడుతుంది.


రాష్ట్ర విభజన ప్రకటన తరువాత, తీర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికలలో ధరావతు రావడం కష్టం అన్న విషయాన్ని కనిపెట్టి, మిగిలి వున్న రెండు పార్టీలలో ఎన్నికల నాటికి ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కోవడానికి చేస్తున్న  టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలలో భాగంగానే ఈ రాజీనామాలను చూడాల్సి వుంటుంది.   ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండూ ప్రాంతాలలో జరగబోయే రాజకీయ విన్యాసాలు వీనుల విందు కాగలవు.    

వై ఎస్ లేని లోటు తెలుస్తోంది


వై ఎస్ హెలికాప్టర్ కనుమరుగైన రోజు నేను మా బాస్ తో కలిసి యలహంకలోని ఒక రిసార్టులో భోజనం చేస్తున్నాను.    టి వి తెరపై వస్తున్న వార్తలను చాలా మంది గుంపుగా ఎగబడి చూస్తున్నారు.   ఉత్సాహం కొద్దీ నేనూ చూశాను.   జాడ తెలియని హెలికాప్టర్లో వై ఎస్ ఆర్ ఉన్నాడని, బ్రతికుండే అవకాశం తక్కువనీ ఆ వార్తా సారాంశం .   అప్పటికే ఆయనపై ఆయన గారి కుమారుడిపై చాలా అవినీతి ఆరోపణలు వున్నాయి.   వాటి ప్రభావం వలన నా మనసులో ఏ కోశానా  ఆయనంటే గౌరవం లేదు.   ఆయన చనిపోయిన తరువాత కూడా నేను ఒక్క క్షణం బాధ పడలేదు.   పైగా రోశయ్య గారు అత్యంత సీనియర్ మరియు అవినీతి అంటని నేత ముఖ్యమంత్రి అయ్యాడని సంతోషించాను.   కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల నుంచి రాష్ట్రం కోలుకోలేని దెబ్బ తగిలింది.   14ఎఫ్ రద్దుకై క చ రా ఆహార దీక్ష చేస్తే, ఏకంగా చిదంబరం రాష్ట్రాన్నే రాసిచ్చాడు.   ఇది అందరికీ (తెలంగాణా ప్రాంతం వారితో సహా) ఊహించని పరిణామం.       మొట్టమొదటి సారిగా అప్పుడు అనిపించింది ఒక సమర్ధుడు అంతర్దానమైతే ఇన్ని విపరీతాలా అని .  కనీసం కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి అయినట్లయితే, ఈ సమస్య ఇక్కడ వరకూ వచ్చి వుండేది కాదు.    అప్పటి వరకు వై ఎస్ ను  ఎదిరించింది కాంగ్రెస్ పార్టీలో కేవలం వి హెచ్, పి  జె ఆర్ (బ్రతికున్న రోజులలో), మరియు యాష్కీలు మాత్రమే.   కానీ రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది అన్నట్లు, అప్పటి వరకూ ఊరూ పేరు తెలియని వాళ్ళు చాలా మంది టి వి మీద ప్రత్యక్షం అయ్యారు.   ఆయనని, ఆయన అవినీతి పనులను దుమ్ము దులపడం మొదలు పెట్టారు.     ఇప్పడు నేను కూడా అనుకుంటాను తెలుగు ప్రజల దురదృష్టం వై ఎస్ చనిపోవడం అని.  


నా స్నేహితుడొకడు ఎప్పుడూ చెప్తుండే వాడు - ఎక్కడ అవినీతి జరుగుతున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్క అని, నిజమే కాబోలు !   ప్రస్తుతం పెద్ద స్థాయిలో అవినీతీ లేదు, అభివృద్ధీ లేదు.   

తెలుగు నేతలను ఎప్పుడూ లక్ష్య పెట్టని హై కమాండ్


స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నుంచి కూడా తెలుగు నేతలు ఉత్తర భారతీయుల చేతిలో అలక్ష్యానికి గురైనవారే. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గురించి తెలుగు వాళ్ళకి తెలిసినంత,  ఉత్తర భారత దేశంలో చరిత్ర చదివిన వాళ్లకు తెలియదు.   మనకి సంఘ సంస్కర్తగా ఆంగ్లం ధారాళంగా మాట్లాడే రాజా రామ్ మోహన్ రాయ్ గురించి తెలుసు కానీ, ఆయనకన్నా గొప్ప వ్యక్తి లేదా సరి తూగగల స్థాయి వున్న వ్యక్తి కందుకూరి వీరేశలింగం గురించి బయట ప్రపంచానికి తెలియదు.       


రెండు సార్లు చెన్న పట్నం ప్రావిన్స్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు తన సొంత ఆస్తి ధారపోసి పలు మార్లు జైలుకు వెళ్ళిన నిస్వార్ధ పరుడు.   భారత దేశంలో ఆయన చూడని జైలు లేదు.   సైమన్ వ్యతిరేక పోరాటంలో తమిళ నాయకులు జైలు భయంతో మారుమూల ప్రదేశాలలో ఎవరి కంటా పడకుండా ఉద్యమాలు చేస్తే, ప్రకాశం పంతులు గారు మద్రాస్ నడిబొడ్డున ఉద్యమం చేసి దమ్ముంటే కాల్చుకొండిరా అని బ్రిటిష్ వారికి సవాలు విసిరి  జైలుకు వెళ్ళిన ధీశాలి .   ఈయన పేరిట ఇతర భాషలలో, ముఖ్యంగా హిందీలో ఎక్కడా కనిపించదు. 


1945 ఎన్నికలలో పంతులుగారికి మద్దతుగా 148 మంది,  రాజాజీకి అనుకూలంగా కేవలం 38 మంది శాసన సభ్యులు మాత్రమే మద్దతు ఇస్తూ శాసన సభ్యుల మనోగతాన్ని  హై కమాండుకు తీర్మానం రూపంలో పంపారు.   రెండవ రెండవ సారి ఎలాగైనా రాజాజీని  ముఖ్య మంత్రిగా చెయ్యాలని హై కమాన్డులోని వారి  వియ్యంకుల వారు విశ్వ ప్రయత్నం చేశారు.   నాయకుని ఎంపిక ఆలశ్యం అయితే గవర్నర్ జోక్యం చేసుకుంటారని తెలిసినా, తన స్థాయి నాయకుడైన ప్రకాశాన్ని మాత్రం ఎంపిక చెయ్యకూడదనే మొండి పట్టుదల. తనకున్న యావదాస్తినీ స్వతంత్రం కోసం ధారపోసి పాడి కుండ లాంటి బారిష్టర్ ప్రాక్టీసును తృణప్రాయంగా వదిలేసిన   ఆయన మీదే బురద జల్లే ప్రయత్నం చేశారు.   


జాతీయ స్థాయిలో పిల్లలకు కావలసిన సిలబస్ తయారీ సంస్థలో వారే వుంటారు.    స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో దక్షిణ భారత దేశం నుండి ఎవరైనా అసలు వున్నారా అని ఉత్తర భారత దేశంలో చదువుకున్న వాడిని అడిగితే, వాళ్ళు ఒక్క పేరు చెప్పలేరు.   కానీ, మనకు మాత్రం నేతాజీ (అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈయనపై పోటీ చేసి అత్యల్ప వోట్ల తేడాతో వోడిపోయింది భోగ రాజు పట్టాభి గారు- ఈయన గురించి కూడా పొరుగు వాళ్లకు తెలియదు)   అతి తక్కువ సార్లు జైలుకు వెళ్లిన  జవహర్ లాల్ నెహ్రూ గారు , ఆంగ్లాన్ని తెగ పొగిడే రా.రా.మొ.రా, గోవింద్ వల్లభ పంత్ మాత్రం బాగా తెలుసు.  పైన ఉదహరించిన వాళ్ళ దేశ భక్తిని శంకించాలనేది నా ఉద్దేశం కాదు గానీ, తెలుగు వాడికి రావలసిన గుర్తింపు రాలేదనే నా బాధ.     తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న వామ పక్షాల గురించి తెలుగు వారి చరిత్ర పుస్తకాలలో లేకుండా భాజపా వారు, కాంగ్రెస్ వారు  జాగ్రత్త పడతారు.   దేశముఖ్లు, దొరలు నైజాము రజాకర్లతో  కలిసి చేసిన దాష్టీకాలను విద్యార్ధులు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ వారు కృషి చేస్తారు. ఎందుకంటే వారికి ఆ వర్గం వారి వోటు బ్యాంకుకు నష్టం వాటిల్లకుండా వుండాలని.     వామ పక్షాలు  నైజాం ప్రజలను చైతన్యం చేసి రజాకర్లను ఎదుర్కుంటే, దాని తాలూకా లబ్ధిని ఫినిషింగ్ టచ్ ఇచ్చిన పటేల్ ఖాతాలోకి భాజపా వారు జమ చేస్తారు (నా ఉద్దేశ్యం పటేల్ గారు అసలు ఏమీ చెయ్యలేదని కాదు, క్షమించాలి).  దక్షిణాదికి చెందిన పి వి గారు ప్రధాని అయితే వోర్వలేని ఉత్తర భారతానికి చెందిన కేసరి, అర్జున్ సింగ్, మరియు  తమిళ మానిల కాంగ్రెస్  నాయకులు  చేసిన విన్యాసాలు అంతా ఇంతా కాదు.   చివరికి హై కమాండు పి వి గారి పార్ధివ శరీరాన్ని కూడా  అగౌరవ పరచింది.   ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య గారు రాజీవ్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి బేగంపేట్ విమానాశ్రయానికి వెళితే ఆయనను ఘోరంగా అవమానించాడు . అప్పటికి రాజీవ్ ప్రధాని కూడా కాదు.       


ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండీ హై కమాన్డులో పెత్తనం ఉత్తరాది వారిదే.   వారి మనసులో వున్నది మాత్రమే చేసే మనస్తత్వం వారిది.  శివుడ్ని ప్రత్యక్షం చేసుకోవడానికి కఠోర దీక్ష చేసి పేగులు తెంచి వీణ వాయించిన  రావణాసురుడు వీళ్ళ పట్టుదల ముందు దిగదుడుపే. ఒక్కటే తేడా - రావణా బ్రహ్మ తన పేగులు తెంచి వీణ వాయిస్తే, మన మంత్రసాని మాత్రం తెలుగు వాడి పేగులు చీల్చి ఫిడేలు వాయిస్తున్నది. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో నడుస్తున్న గందరగోళానికి కూడా వారికి వారసత్వం వలన వచ్చిన  రాజకీయాలు, పిడి వాదనలు, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే మనస్తత్వం.   రాష్ట్రం విభజన జరిగినా, ఒకటిగా వున్నా అంతిమంగా తెలుగు వాడి కీర్తి మాత్రం నిస్సందేహంగా మసకబారింది.  42 మంది ఎంపీలతో, ఉత్తర ప్రదేశ్ తరువాత అతి పెద్ద సంఖ్య వున్న ఆంద్ర ప్రదేశ్ విభజన మనకెంత లాభమో తెలియదు కానీ, తమిళుల ఆధిపత్యం పెరిగే ప్రమాదం మాత్రం వుంది.   ఒకప్పుడు తెలుగు వాళ్ళని విభజించు పాలించు అనే రాజాజీ గారి సూత్రాన్ని ప్రస్తుత తమిళ నాయకులు కూడా హై కమాండు మద్దతుతో  కొనసాగిస్తున్నారు.   ఇదే హై కమాండు వారి 'చిదంబర' రహస్యం.