7, మే 2013, మంగళవారం

బెంగళూరు భా జ పా మానిఫెస్టోలో నైట్ లైఫు పెంపు పై హామీ


కళాశాల విద్యార్ధినులు  ధరించే దుస్తుల విషయంలో ఆంక్షలు పెట్టడం, పాశ్చాత్య పద్ధతులైన ప్రేమికుల రోజు జరుపుకోవడాన్ని వ్యతిరేకించడం, క్లబ్ పబ్ కల్చర్ మన భారత సాంప్రదాయానికి విరుద్ధం అని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడంలో భారతీయ జనతా పార్టీ పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది.  

శాస్త్రం చెప్పిన బల్లి కుడితి తొట్లో పడ్డట్టు - కర్నాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా యువకుల కోసం ప్రత్యేకించి మానిఫెస్టోలో ఒక వాగ్దానం చేసింది.     అదేమిటంటే, ఇప్పటిదాకా పబ్బులు , బారులు, హోటళ్ళు, క్లబ్బులు కేవలం  రాత్రి 11.30 దాకానే పనిచేస్తున్నాయని, తాము అధికారంలోకి వస్తే దానిని అర్ధరాత్రి ఒంటి గంట దాకా పొడిగించి యువతకు లాభం చేకూరుస్తామని ప్రమాణం చేసింది.   గతంలోనే భాజపా ప్రభుత్వం నైట్ లైఫ్ పెంచడానికి చేసిన ప్రయత్నాలను బెంగళూరు పోలీసు బాసు వ్యతిరేకించారు.     రాత్రి పూట నగరం 11 గంటలకల్లా ప్రశాంతంగా వుండాలని, సంఘ వ్యతిరేక శక్తులను అదుపులో ఉంచాలంటే ఇదొక మార్గమని  NDTV సాక్షిగా జరిగిన చర్చలో వివరించారు. 


ఒక్క బెంగళూరు నగరంలోనే 28 శాసన సభ క్షేత్రాలు వున్నాయి.  గతంలో 17 స్థానాలు భాజపా కైవశం చేసుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది.    ఇక్కడ పని చేస్తున్న ఐ టి. బి టి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా వుంది.    ఏమి చేస్తే వాళ్ళ వోట్లను ఆకర్షించవచ్చో పెద్దలు ఆలోచన చేసి, ఇలాంటి పనికి దిగజారారు.     ఇలాంటి పనుల వలన ఇతర పార్టీలకు తాము ఏమాత్రం తీసిపోమని చెప్పకనే చెప్పింది.    




పాపం వెంకయ్య నాయుడు


మన రాష్ట్రానికి చెందిన బి జె పి నాయకుడు, ఒకప్పటి జాతీయ పార్టీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు గారు కర్నాటక  నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.    కర్నాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఆయన తన వోటు హక్కు వినియోగించుకోవడానికి మల్లేశ్వరం నియోజకవర్గం లోని ఒక పోలింగు బూతుకు వచ్చి, క్యూ లైను ఖాతరు చెయ్యకుండా సరాసరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు.     వోటర్లలో వి ఐ పి వోటర్లు ఉండరనే సత్యాన్ని పాపం మర్చి పోయాడు పాపం .   కానీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేసి లైను లో రమ్మని క్లాస్ పీకారు.   నేను పార్లమెంటు సభ్యుడ్ని, వేరే కార్యక్రమం వుందన్నా, అక్కడ ఆయన్ని ఎవరూ గుర్తు పట్టలేదు, పత్తించుకొలెదు.   చివరకు, బుద్ధిమంతుడిలా వరుసలో నుంచిని ఆయన తన అమూల్యమైన వోటు హక్కు వినియోగించుకున్నాడు.    

అంత్య ప్రాసలతో, తనదైన శైలిలో నిరంతరం   టి వి ల ద్వారా పత్రికల ద్వారా మనకు  కనువిందు చేసే నాయుడు గారిని సామాన్య వోటరు గుర్తుపట్టక పోవడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.  


నిన్న డెక్కన్ హెరాల్డ్లో వచ్చిన కధనం ఆధారంగా 


6, మే 2013, సోమవారం

మళ్ళీ సచ్చీలతను నిరూపించుకున్న సి బి ఐ


కేంద్ర నేర పరిశోధక సంస్థ (సి బి ఐ) ప్రపంచంలోని గొప్ప పరిశోధక సంస్థలలో ఒకటి.  రైల్వే బోర్డు సభ్యుల నియామకాల్లో దళారిగా వ్యవహరిస్తున్న   రైల్వే మంత్రి బన్సాల్ మేనల్లుడుని అదుపులోకి తీసుకోవడం ద్వారా, తన సచ్చీలతను మరోసారి చాటి చెప్పింది.    కేంద్ర ప్రభుత్వానికి వరుస సమస్యలు తెచ్చిపెట్టిన బొగ్గు కుంభకోణం నిన్న జరిగిన రైల్వే సభ్యుల నియాకంలోను పాలకులకు తలవంచకుండా  తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. 


అధికారంలో వున్న వారి  మెప్పు పొందాలనే దురుద్దేశం సి బి ఐ కి వుంటే, ప్రభుత్వ పెద్దలకు ముందుగానే హెచ్చరించి యు  పి ఎ ప్రభుత్వానికి అవినీతి మారక అంటకుండా కాపాదగాలిగేది.     కానీ, పత్రికలూ ఈ విషయాన్ని మరుగున పడేసి, కేవలం అవినీతి జరిగిందనే విషయాన్ని భూతద్దంలో చూపించాయి.   


మేధావులు, విశ్లేషకులు, ఉన్నత న్యాయస్థానం  కోరుకున్నట్లు,  అతి త్వరలో సి బి ఐ కి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినట్లయితే, చాలా  వరకు రాజకీయ నాయకుల దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశం వుంది. 

4, మే 2013, శనివారం

బాధను దిగమింగి యు పి ఎస్ సి పరీక్షలో వికసించిన కోమల్


Deserted by husband just after marriage, Gujarat girl clears top UPSC exam


కోమల్ ప్రవీణ్  భాయ్  గణతార - గుజరాత్ లో  ఈ రోజు వార్తల్లోని వ్యక్తి.    నిన్న యు పి ఎస్ సి విడుదల చేసిన ఫలితాలలో దేశంలో 591 వ స్థానంలో, గుజరాత్ నుంచి సివిల్ సర్వీస్ కు ఎన్నికైన  11 మందిలోనూ ఒకరు.    చాలా మంది మహిళలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలో రాణిస్తున్నారు  ఇది గొప్ప విషయమేమీ కాకపోవచ్చు.   కానీ పెళ్ళైన పదిహేను రోజులకు కట్నం చాలలేదని భర్త వదిలేసిన వర కట్న బాధితురాలు ఈ మహిళ. 

భావనగర్ జిల్లాలోని ఒక కుగ్రామములో ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తన కష్టాన్ని దిగమింగుకుంటూ పట్టుదలతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలై  భారత రెవెన్యూ సేవలలో ప్రవేశించబోతోంది .  ఆమ్రేలి జిల్లాలోని సవరకుండ్ల గ్రామానికి చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడి కుమార్తె కోమల, న్యూజిలాండ్ లో స్థిరపడిన తన భర్త శైలేష్ పోపట్ పై న్యాయ పోరాటానికి సిద్ధమౌతోంది .    ఇప్పటి దాకా ఆర్ధిక పరిస్థితి సహకరించనందున  మరియు తన ముందున్న లక్ష్యాన్ని ఛేదించాలనే  తపనతో,  కట్నం కోసం తనను వదిలేసిన భర్తపై న్యాయ పోరాటానికి సిద్ధపడలేదు. "కేవలం నేను పేద కుటుంబం నుంచి వచ్చానని, కట్న కానుకలు తగినంతగా ఇవ్వలేదన్న కారణంగా  నన్ను వేధించిన నా భర్త, అత్తా మామలపై చట్ట పరంగా పోరాడుతాను" అంటున్నారు కాబోయే ఐ ఆర్ ఎస్ అధికారి కోమల.  తన భర్త శైలేష్ న్యూజిలాండ్లో ఎక్కడ వున్నారో, ఏమి ఉద్యోగం చేస్తున్నారో, అతని చిరునామా, ఫోన్ నంబర్  కూడా తనకు తెలియదని ఆమె వాపోయారు.  

"ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి దూరంగా వెళ్ళిన శైలేష్ తనను ఎప్పుడు సంప్రదించలేదని, ఇంత  వరకు విడాకులు కూడా కోరలేదని" ఆమె తెలిపారు 

 శైలేష్ ఎం ఎస్ సి (రసాయన శాస్త్రం) లో రాజ్ కోట్ నుంచి  స్నాతకోత్తర పట్టా కలిగి వుండగా,  కోమల్ రాజ్ కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో డిప్లోమో మరియు డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా బి ఎ ఆ తరువాత సవరకుండల నుంచి ఉపాధ్యాయ శిక్షణా వృత్తిలో సర్టిఫికేట్ను కలిగి వున్నారు. 

అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీసెస్లో చేరాలన్న ధృడ సంకల్పంతో 2008 లో యు పి  ఎస్ సి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే  అహమ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్  అఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో   చేరింది కోమల్.  జనరల్ విభాగం లో నాలుగో సారి చేసిన ప్రయత్నం ఫలించింది.   గుజరాతీ మాధ్యంలో ఇంటర్వ్యూ కు హాజరైన కోమల్, చరిత్ర మరియు గుజరాతీ సాహిత్యం అనే రెండు అంశాలు ఫైనల్ పరీక్షల కోసం ఎంచుకుని విజయం సాధించింది .     

ఇంత పెద్ద కష్టాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కొని లక్ష్యాన్నిముద్దాడిన    కోమల్ ప్రవీణ్ భాయ్ గణతార అభినందనీయురాలు మరియు మనందరికీ స్పూర్తి ప్రదాత. 

3, మే 2013, శుక్రవారం

ప్రయాణీకుల భద్రతతో ఆడుకున్న పైలెట్లు


అది ఏప్రిల్ 12, 2013.   ఎప్పటిలాగే, ఎయిర్ ఇండియా 333 విమానం బాంగ్ కాక్ నుండి ఉదయం 8.55 నిమిషాలకు 166 మంది ప్రయాణీకులతో  ఢిల్లీ విమానశ్రయానికి  బయలు దేరింది.   అరగంట ప్రయాణం తరువాత  విమానం 33,000 అడుగుల ఎత్తులో వున్నపుడు,  కాక్పిట్లో వున్న కో-పైలెట్ రవీంద్రనాథ్ సౌచాలయంకు వెళ్తూ "నిబంధనల ప్రకారం" రెండో వ్యక్తి తప్పకుండా కాక్పిట్లో ఉండాలన్న పద్దతిని పాటించి తన స్థానంలో  ఏర్ హోస్టెస్ జె భట్ అనే ఆవిడను కూర్చోబెట్టి వెళ్ళాడు.  ఇలా ఇద్దరు వ్యక్తులు కాక్పిట్లో ఎప్పుడూ ఉండాలన్న ఆంతర్యం ఏమిటంటే, ఏదైనా కారణాల వల్ల పైలెట్ విమానాన్ని అదుపు చెయ్యలేని పక్షంలో రెండవ వ్యక్తి తక్షణం సమాచారం అందివ్వడానికి.  


ఇది ఇలా వుండగా, ప్రయాణీకుల ప్రాణాలను  ఫణంగా పెట్టి, అప్పటి వరకు కెప్టన్ కుర్చీలో వున్న సోనీ అనే పైలెట్ కూడా, కనికా కళా అనే ఇంకో హోస్టేను తన స్థానంలో కూర్చోబెట్టి, ఆ ఇద్దరు మహిళలకు విమాన చోదనలో శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టాడు.   కొంచెంసేపు నేర్పిన తరువాత సదరు పైలెట్ సోనీ గారు కూడా కాక్పిట్ను వదిలి బయటకు వచ్చారు.    ఆటో పైలెట్ పద్ధతిలో పెట్టిన  విమానాన్ని పైలెట్, కో పైలెట్ స్థానంలో కూర్చున్న ఆ ఇద్దరు హొస్టెస్లు దాదాపు 30 నిమిషాల పాటు నడిపారు.  సాంకేతిక లోపాల కారణంగా  ఆటో పైలెట్ సౌకర్యం విఫలం కావడంతో తక్షణం విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు విమాన చోదకులు తిరిగి తమ స్థానాలకు చేరుకున్నారు.    ఈ తతంగం  మొత్తం,  ప్రయాణీకుల సేవల నిమిత్తం నియమించబడిన ఒక సీనియర్ వ్యక్తి కళ్ళెదుటే జరగడంతో, ఈ సంఘటనను అతను ఎయిర్ లైన్సు ఉన్నతాధికారుల ద్రుష్టికి  తీసుకొచ్చాడు.  


ఈ దుస్సాహసానికి బాధ్యులైన నలుగురిని, అధికారులు విధులనుంచి తొలగించడం జరిగింది.  మరిన్ని వివరాల కోసం అరుణ్ మిశ్రా,   పౌర విమాన యాన మహా నిర్దేశకులను  (DGCA) సంప్రదించగా ఆయన ఈ సంఘటనను   ధ్రువ పరుస్తూ    "భద్రతా నియమాలను ఉల్లంఘించిన కారణంగా వారిని విధులనుంచి తొలగించి తదుపరి విచారణకూడా నిర్వహిస్తునట్లు"  పత్రికకు తెలియ చేశారు.  


ప్రభుత్వం నియమించిన విమాన యాన భద్రతా కమిటీలో సభ్యుడైన కెప్టన్ మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ, తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలను కఠిన చర్యల ద్వారా ప్రయాణీకులకు భద్రత కల్పించడంలో విఫలమౌతూ నిర్లక్ష్య పూరిత ధోరణితో వ్యవహరిస్తున్న   పౌర విమానయాన అధికారులే బాధ్యత వహించాలని  చెప్పారు. 

(బెంగళూరు మిర్రర్ ఆంగ్ల దిన పత్రికలో ఈ రోజు మొదటి పుటలో  అచ్చైన కధనానికి తెనుగు అనువాదం) 

జైలు కెళ్ల నున్న "దాడి"


ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు అనేది సామెత.    మంచి మాస్టారుగా, నిజాయితీ పరుడుగా  పేరున్న దాడి వీరభద్ర రావు తెలుగు దేశంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ పార్టీతో బంధం తెంచుకున్నారు.   ఈ విషయంలో ఆయన తప్పు పెద్దగా లేనప్పటికీ, ఆయన జగన్ గూటికి చేరతారని వస్తున్నా వార్తలు ఆయన అభిమానుల్ని కలవర పెడుతున్నాయి.     నేడో, రేపో చంచల్గుడా జైలుకు వెళ్లి తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.   మంత్రిగా, మంచి వక్తగా, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా, నిజాయతీ పరుడిగా పేరున్న దాడి జైలు పార్టీకి వెళ్ళడం ఆత్మహత్యా సదృశం కాగలదు.   

2, మే 2013, గురువారం

ప్రత్యేక రాష్ట్ర కోరిక నాలుగున్నర కోట్ల ఆకాంక్ష కాదు


నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఆంద్ర ప్రదేశ్ జనాభా 8.46 కోట్లు కాగా అందులో హైదరాబాద్తో కూడిన తెలంగాణా ప్రాంత జనాభా 3.53 కోట్లు మాత్రమే.    ప్రతి టి వి చర్చల్లో, ఉపన్యాసాల్లో ఇహ నుంచి విభజన కోరే మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పి మభ్య పెట్టడం సమంజసం.    ఈ మూడున్నర కోటిలో పద్నాలుగు  సంవత్సరాల లోపల వయసు వున్న పిల్లలు 25% శాతం మంది అంటే 88 లక్షల మంది ఉన్నారు.   వీళ్ళకు ఆ'కాంక్ష' రావడానికి ఇంకొక  5-10 సంవత్సరాలు పడుతుంది.    అంటే, నికరంగా 2.65 కోట్ల మంది  ఆకాంక్ష. 


ఇందులో, తెలంగాణాను పూర్తిగా వ్యతిరేకించే ప్రజలు (అంటే బాన్స్వాడ ఎం ఎల్ ఎ  పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పినట్లు -  నాకు వోట్లేయ్యని సేటిలర్స్ పని పడతానని అన్నాడు చూడండి), సి పి ఎం, ఎం ఐ ఎం,  జగ్గారెడ్డి  లాంటి సమైక్యాంధ్ర మద్దతు దారులు  , జంట నగరాలు వాటి చుట్టు పక్కల ప్రాంతాలు, విభజన జరిగితే మరో గుజరాత్ అవుతున్దనుకొనే ముస్లింలు, వ్యవసాయ రంగంలో వలస వచ్చి స్థిరపడిన రైతులు, జంట నగరాలలో దశాబ్దాల వెనుక స్థిరపడిన వారు, పైకి విభజన కోరుతూ (రాజకీయ మనుగడ కోసం) లోలోపాల సమైక్యంగా వుండాలనుకొనే వారు, కంచె ఐలయ్య లాంటి మేధావులు, భద్రాచలం డివిజన్, మునగాల పరగణా ప్రజలు,మహబూబ్ నగర్ జిల్లాలో చేరిన కర్నూల్ ప్రాంతాల గ్రామాలు,   చందాదల దందాను మౌనంగా ఎదుర్కొంటున్న వారు, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని కోరుకొనే వారు,  -----  ఇలాంటి వారి  సంఖ్య కేవలం 25 నుంచి 30 శాతం వుందని అనుకుంటే, మిగిలేది కేవలం 2కోట్ల  మంది.     


చంద్ర బాబు నాయుడు చూపించే విక్టరీ గుర్తు (రెండు వేళ్ళు) కి అర్ధం బహుశా అదే కావచ్చు.     కాబట్టి, ఇహ నుంచి ఏ చర్చలు జరిగినా రెండు కోట్ల మంది ఆ'కాంక్ష' అనడం సముచితం.