27, అక్టోబర్ 2013, ఆదివారం

కిరణ్ కుమార్ కు ముఖ్యమంత్రి అర్హత లేదా?

విభజన రాజకీయాల నేపధ్యంలో కొంత మంది కాంగ్రెస్ వృద్ధ రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ వారు  పదే పదే ప్రస్తావించే విషయం కిరణ్ కుమార్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చి తంతే బూరెల బుట్టల పడ్డట్టుగా మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యాడని.    ఆయన ఎం ఎల్ ఎ గా 20 సంవత్సరాల నుంచి వున్నారు.   చీఫ్ విప్ గా వున్నారు, సభాపతిగా పనిచేసారు.   మరి 130 కోట్ల ప్రజలకు ప్రధాని అవుదామనుకునే రాహుల్ గాంధీ కేవలం 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా మాత్రమే అనుభవం వుంది.   ఇంత పెద్ద దేశానికి దశా దిశా  నిర్దేశం చేయగలడా?   మూలాయం సుపుత్రుడు ఎకాఎకిన దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి కాలేదా! రాజకీయ నేపధ్యం కూడా లేని ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రి కాలేదా!  పెద్ద పెద్ద ఆనకట్టల కాంట్రాక్టులు, సారా కాంట్రాక్టులు  చేసుకొనే కొంతమంది ఎం ఎల్ ఎ లు,  ఎంపీలు మంత్రులు కాగా లేనిది శాసన సభ సభ్యునిగా రెండు దశాబ్దాల అనుభవం కల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎలా అనర్హుడు.    


ఈ మధ్య సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అనే పదం ఎప్పుడూ మీడియాలో కనపడాలనే వృద్ధ నాయకులకు  కొత్తగా దొరికిన పదం. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన ఎవరైనా ఈ పదం ఉపయోగించరు.  ఎన్నికలు పూర్తైన వెంటనే శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ కేంద్ర నాయకత్వం పంపిన పర్యవేక్షకుడి ద్వారా (శాసన సభ్యుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా) తాము ఎవరి నాయకత్వంలో పనిచేయాలో సూచించాలని,  తమ హైకమాండ్ నిర్ణయం శిరోధార్యమని పంపడం ఆనవాయితీ.   కాబట్టి, బెజవాడ గోపాల రెడ్డి నుండి ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులైన అందరూ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే.   


ఆంద్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత సమాధి కట్టడానికి  కారణం కేవలం ఇరు ప్రాంతాలలోని ప్రజాదరణ లేని, ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనని, గెలవని   కొంత మంది వృద్ధ కాంగ్రెస్ నాయకులు మాత్రమే.   కాంగ్రెస్ పార్టీలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి నేతలకు కొదవ వుండదు.     


1 కామెంట్‌ :