12, డిసెంబర్ 2012, బుధవారం

హావేరి కావేరి నడుమ భా జ పా

 
అప్పుడెప్పుడో వచ్చిన మన బాలకృష్ణ గారి సినిమా టైటిల్ "నారీ నారీ నడుమ మురారీ" చూసి ఉత్తేజితుడనై  ఈ శీర్షికకు ఆ పేరు పెట్టాను.
 
ఈ మధ్య యడ్యూరప్ప గారు హావేరి అనే పట్టణంలో విజయవంతంగా తన సొంత పార్టీ కర్ణాటక జనత పక్ష (hereinafter called as క జ ప) అనే కుంపటి వెలిగించేసారు. ఈ కుంపటి సెగ భా జ పా కర్నాటక కొంప "కావేరి" అవడానికి సరిగ్గా సరిపోతుంది. అసలే కావేరి నదీ జలాల విడుదుల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానామ్ వారి మొట్టికాయలు, జయలలిత గారి చీత్కారాలు, స్థానికంగా వుండే రైతు, కన్నడ సంఘాల ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ షెట్టర్ గారికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు యడ్యూరప్ప గారు.   కర్ణాటకలో ప్రస్తుతంవున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో యడ్యూరప్ప నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదుగుతారు అని చెప్పడంలో సందేహం లేదు. తమాషా ఏంటంటే, తమిళ్ నాడు భా జ పా వారు కావేరి నీటిని విడుదల చెయ్యాలని ధర్నా చేస్తుంటే, కర్నాటక భా జ పా వారు నీళ్ళు ఇవ్వకూడదని గొడవ చేస్తున్నారు. ఎంతైనా జాతీయ పార్టీ కదా, ఆ మాత్రం విభేదాలు ఉండడంలో తప్పు లేదు.
 
భా జ పా జాతీయ అధ్యక్షుల వారు   వేల కోట్లు మెక్కారని దేశమంతా కోడై కూస్తుంటే అందులో ఫదోవంతు ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పని మాత్రం పదవినుంచి తొలగించటం ఏమి సబబు చెప్పండి. రెడ్డీ బ్రదర్స్ బాగా బతికిన రోజుల్లో "కర్ణాటక ఆడపడచు" క్రమం తప్పకుండా దేశ రాజధాని నుంచి అన్ని పండుగలకు పబ్బాలకు వచ్చేవారు. వీరు జైలుకు వెళ్ళాక, అచ్చం జగన్ గారి లానే ఆవిడకూడా నాకు బళ్ళారి  ఎక్కడో తెలీదు అనేశారు. అందుకే అంటారు బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి అని. పాడి కుండ లాంటి రెడ్డి బ్రదర్స్, మాస్ లీడర్ లాంటి యడ్డి గారు లేకుండా, కర్ణాటకలో భా జ పా కి "అశుభం" కార్డు త్వరలో పడబోతోంది.


 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి